S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నమస్తే! సదా వత్సలే మాతృభూమి...

త్వరలో ‘శత వసంతాలు’ జరుపుకునే సంస్థ..
వ్యక్తులతో సంబంధాలు నెరపుతూనే వ్యక్తి ఆరాధన లేని వ్యవస్థ..
ప్రతిరోజూ దేవుణ్ణి దేశంగా భావించి ప్రార్థించే దేశభక్తులు
కార్యనిష్ఠతో క్షణక్షణం తల్లి భారతిని అర్చించే కర్మయోగులు
మఖలో పుట్టి పుబ్బలో మాయమయ్యే మామూలు శక్తికాదు
నిరాడంబరతకు నిలువెత్తు అద్దం! రాష్ట్రీయ స్వయం సేవక సంఘం!

అది నాగపూర్‌లోని నీల్‌సిటీ సైస్కూల్.. భారత్ ఆంగ్లేయ ప్రభుత్వ పద ఘట్టనల క్రింద నలిగిపోతున్న రోజులు.. బ్రిటీషువాళ్ల ప్రాపకంకోసం పాటలు, స్తోత్రాలు ఎక్కువైపోయి తల్లి భారతిని మరచిన వైనం.. 7వ తరగతి విద్యార్థులకు హౌసే మాస్టర్ ఓ పాటను బాలగేయంగా నేర్పిస్తున్నారు. విద్యార్థులంతా ఈ పాటను కంఠోపాఠంగా ఉంచుకోవాలన్నాడు. అందరూ బ్లాక్‌బోర్డుపైనున్న గీతం కంఠస్థం చేస్తున్నారు.
‘‘విక్టోరియా ధన్యసతీ అవతరిలియా జగతి / భరతఖండీ జన మన్హతి సీతాదేవీతీ .... విక్టోరియా ధన్యసతీ! అవతరించే ఈ జగతీ!’’- ఇలా సాగే ఈ గీతం అందరూ కంఠస్థం చేసినా ఒక్క బాలుడు మాత్రం తిరస్కరించాడు. 12 ఏళ్ల వయసున్న ఆ బాలుడిలో జగన్మాత సీతతో ఈ విక్టోరియాకు పోలికా? అన్న ప్రశ్న ఉదయించింది. ఛీ.. ఛీ.. జగన్మాతను ఈ రాక్షసితో పోల్చడమా అనుకున్నాడు. స్వాభిమానం రగిలింది. స్వతంత్రత అతడిని తట్టింది. ఇదే ధిక్కారంతో బ్రిటీషు వారి పీడనే కాదు, భారత జాతి అనుభవిస్తున్న వందల ఏళ్ళ బానిస మనస్తత్వానికి ముగింపు పలికే విధంగా అన్నట్లు ఆ గీతాన్ని కంఠస్థం చేయలేదు. ఆ 12 ఏళ్ల బాలుడే అహరహం శ్రమించే దేశభక్తులు దేశమాతను అర్చించే దేశభక్తి సంస్థను స్థాపించిన కేశవ బలీరాం హెడ్గేవార్!
క్రీ.శ. 1 ఏప్రిల్ 1889లో రేవతీ మాయి, బలీరాం పత్ పుణ్య దంపతులకు జన్మించిన కేశవ బలీరాం హెడ్గేవార్‌ను ‘సంఘ్’ ముద్దుగా డాక్టర్జీ అని పిలుచుకుంటారు. ఈ బాలుడే భవిష్యత్తులో అపూర్వమైన సంస్థకు శ్రీకారం చుడతాడని అనుకోలేదు. విక్టోరియా మహారాణి పట్ట్భాషేకం సందర్భంగా పంచిన మిఠాయి పొట్లం విసిరి చెత్తకుప్పలో వేసి, బ్రిటీషు పాలనను కూడా అలా తిరస్కరించాలన్న ఆలోచన అతనిలో మొదలైంది. తాను యువకుడేయ్యసరికి దేశంలోని రాజకీయ పరిణామాలు వేగంగా మారసాగాయి. ఇదంతా నిశితంగా పరిశీలించిన డాక్టర్జీ పులిన్ బీహారీదాస్ నేతృత్వంలోని ‘విప్లవకారుల అనుశీలన సమితి’లో చురుగ్గా పనిచేశారు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘కోకెన్’ అనే రహస్యమైన పేరుతో అనేక ఆందోళనల్లో పనిచేశాడు. కలకత్తా నేషనల్ మెడికల్ కళాశాల నుండి వైద్య శాస్త్రంలో పట్ట్భద్రుడై 1914లో తిరిగి నాగ్‌పూర్‌కు వచ్చాడు. అప్పటికే దేశంలో అనేక విప్లవ కార్యక్రమాలు స్వాతంత్య్రం కోసం జరుగుతున్నాయి. బెంగాల్ విభజన, కర్బన్ రాజనీతి, ముస్లింలీగ్ స్థాపన, మత ఘర్షణలు, సంతుష్టీకరణ రాజకీయాలు.. అన్నీ నిశితంగా యువ కేశవుడు గమించాడు. బ్రిటీషు ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు కాంగ్రెస్‌లో చేరిన హెడ్గేవార్ ‘టర్కీ ఖలీఫా’ను పునఃసింహాసనంపై కూర్చోబెట్టాలని 1920లో ఇక్కడి కాంగ్రెస్ చేసిన ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. అప్పటికే కాంగ్రెస్‌లోని ఒక వర్గం ముస్లిం లీగ్‌కు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా 1921లో బ్రిటీషువారికి వ్యతిరేకంగా ‘రాజద్రోహ ప్రసంగాలు’ చేస్తున్నాడని హెడ్గేవార్‌ను ఆంగ్లేయ ప్రభుత్వం ఒక సంవత్సరం కఠిన కారాగారశిక్షను గురిచేసింది. అలాగే 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కూడా డాక్టర్జీ అరెస్టయ్యారు. ఆదివాసులకు వ్యతిరకేంగా ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఉల్లంఘించి లోహారా అడవికి వెళ్ళే ‘యెట్మాల్’ అనే ప్రాంతంలో డాక్టర్జీ తనతోపాటు కొందరిని తీసుకెళ్లి అడవిలో గడ్డికోశారు. ఈ చట్టవిరుద్ధమైన చర్యకు బ్రిటీషు ప్రభుత్వం హెడ్గేవార్‌కి 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇలా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నపుడే జరిగిన కొన్ని ఘటనలు డాక్టర్జీని క్రొత్త పంథాను ఎన్నుకొనేట్లు చేసింది.
ఖిలాసత్ ఆందోళకు గాంధీతో సహా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం హెడ్గేవార్‌ను ఇబ్బందికి గురిచేసింది. అలాగే 1923లో కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అందులో విష్ణుదిగంబర్ పురస్కార్ వందేమాతరం ఆలపిస్తుంటే నాటి సభకు అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న వౌలానా మహ్మద్ అలీ తన నిరసన వ్యక్తం చేస్తూ సభనుండి వెళ్లిపోయాడు. అప్పటికే సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, మహమ్మదాలీ జిన్నా వంటి ముస్లిం నాయకులు ‘తాము ప్రత్యేకం’ అంటూ బ్రిటీషువారితో రాసుకుపూసుకు తిరిగేవారు. కలకత్తా జాతీయవాద ఉద్యమ కేంద్రంగా ఉన్నందున బ్రిటీషువారు 1904-05లోనే వైస్రాయ్ లార్డ్ కర్జన్, హాబర్ట్ హచోప్‌రిస్లే వంటివాళ్లు ముస్లిం సంస్థలతో కుమ్మక్కై బెంగాల్ విభజన చేశారు. 1907 మింటో మార్లే సంస్కరణలు మొదలుకొని దేశంలోని సంతుష్టీకరణ రాజకీయాలకు బీజం పడింది. 1923 వరకు ఇది పరాకాష్టకు చేరింది. ఇవన్నీ చూసాక ‘్భరత్‌కు తాత్కాలిక స్వాతంత్య్రం కన్నా ఎప్పుడూ స్వేచ్ఛగా జీవించే స్వాతంత్య్రం కావాలని’ ఆయన మనసులో సంకల్పం కలిగింది. 1925 విజయదశమినాడు భావుజీ కావరే, అణ్ణా సొహని, విశ్వనాధరావు కేల్కర్, బాలాజీ హుద్దార్, బాపూరావ్ భేది వంటి కొంతమందితో ‘సంఘ’ రూపకల్పన చేశాడు డాక్టర్జీ. దాంతో 17 ఏప్రిల్ 1926న ఆర్‌ఎస్‌ఎస్‌కు నామకరణం జరిగింది. శాఖా కార్యక్రమాల కోసం కేంద్ర సంఘస్థాన్ ఏర్పాటుకు నాగపూర్‌లోని రేషంబాగ్‌లో స్థలం కొన్నారు. ఆ తర్వాత మెహితివాడకూడా సంఘ్ అధీనంలోకి వచ్చింది. అదే ఈనాడు ‘హెడ్గేవార్ భవన్’గా పిలువబడుతున్నది.
సంఘ్ వ్యవస్థాపకుడి
పూర్వీకులది తెలంగాణే.
కేశవ బలరాం హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణ ప్రాంతంలో ఋగ్వేద పండితులు. గోదావరి, మంజీర, హరిద్రా నదుల త్రివేణీ సంగమం వారి అధ్యయన కేంద్రం. తెలంగాణ - మరాఠా సరిహద్దుల్లోని నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకాలోని కందకుర్తి వారి స్వగ్రామం. ఈ ప్రాంతం నిజాం పాదుషాల ఆధీనంలో ఉండేది. అక్కడ కందకుర్తీశ్వరుని దేవాలయం ఉండేది. శిథిలమైన ఆ దేవాలయం గ్రామస్థులు నిర్మించాలనుకుంటే నిజాం ప్రభుత్వం నియమాలు ఆటంకం కలిగించాయి. మసీదు శిఖరంకన్నా మందిర గోపురం ఎత్తుగా ఉండవద్దనే నియమం ఆ హెడ్గేవార్ కుటుంబాన్ని తరలి వెళ్లేలా చేసింది. సుమారు 1800వ సంవత్సరంలో డాక్టర్జీ ముత్తాత ప్రముఖ నిష్ఠాపరుడు నరహరి శాస్ర్తీ హెడ్గేవార్ కందకుర్తి వదిలి నాగపూర్ వెళ్లిపోయారు. అక్కడే అంతకు ముందు స్థిరపడ్డ అన్నంవారు, సోమలవారు, ఎరకుంట వారు వెళ్లిన మార్గంలోనే వెళ్లి భోంస్లే రాజుల వేద పరిరక్షణకు ముగ్ధులయి, అక్కడి దేవాలయ ఎతె్తైన శిఖరాలను చూసి మురిసిపోయి స్థిరపడ్డారు.
పిడికెడుమందితో ప్రారంభమైన సంఘ శాఖ ఇవాళ వటవృక్షమైంది. అనేక సేవా ప్రకల్పాలు సంఘం ఒంటి చేత్తో చేయగలుగుతోంది. స్వాతంత్య్ర కాంక్ష ఉన్న ఎందరో దేశభక్తులు, యువకులు డాక్టర్జీ వెంట నడిచారు.
ఇదిలా ఉండగానే హిందూ ఐక్యతకోసం స్వామి శ్రద్ధానంద భగవధ్వజాన్ని చేతబట్టి దేశమంతా తిరుగుతున్నాడు. కానీ 23 డిసెంబర్ 1926నాడు అబ్దుల్ రషీద్ అనే ఉన్మాది ఆయనను కాల్చి చంపాడు. ఈ విషయం డాక్టర్జీని బాగా ఆలోచింపజేసింది. హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీ చేస్తున్న ప్రయత్నాలు అమాయకంగా తోచాయి. హిందువులు తమ రక్షణ తామే చేసుకొనే సామర్థ్యం కలవాళ్లుగా తయారుకావాలని డాక్టర్జీ భావించాడు. దానికోసం సంఘాన్ని బలోపేతం చేశాడు. అది జాజ్వల్యమానంగా ముందుకు సాగింది. ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. 1934 డిసెంబర్ వార్థాలో జరుగుతున్న సంఘ్ హేమంత శిబిరానికి మహదేవ్ భాయ్ దేశాయ్‌తో కలిసి వచ్చారు. ‘ఈ జాతి భేదాలనే దయ్యాల్ని ఎలా పారద్రోలారు. మేం దానికోసం ఎంత ప్రయత్నం చేసినా ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఈ శిక్షణ మీకు ఎవరిచ్చారు? అన్నారు బాపూ. దానికి అప్పాజీ జోషి అనే శిబిర అధికారి ‘మేం అందరం హిందువులం, అందరం సోదరులం. ఈ భావం మాలో డాక్టర్ హెడ్గేవార్ జాగృతం చేశారు’ అన్నాడు.
అలాగే 1939లో పూణేలో సంఘ శిక్షావర్గకు భావ్‌రావ్ అభ్యంకర్ డా. బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను ఆహ్వానించాడు. 21 ఏప్రిల్ 1939న బాబా సాహెబ్ శిక్షావర్గకు డాక్టర్జీతోపాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘దళితులు-ఉద్ధరణ’ అన్న అంశంపై డా. అంబేడ్కర్ ప్రసంగించారు. చివరకు బాబా సాహెబ్ వాళ్లలో ఎవరిలోనైనా కులభేదం ఉందా అని ఆరా తీశాడు. కృత్రిమత లేకుండా ప్రతిఒక్కరూ ‘నేను హిందువును’ అన్నారు. అదేవిధంగా 1933 నవంబర్ 17న వార్థా రామమందరం నుండి 2000 కి.మీ ‘హరిజన యాత్ర’ గాంధీజీ మొదలుపెడితే డాక్టర్జీ మద్దతు ప్రకటించారు.
మహనీయుడైన డాక్టర్జీ సృష్టించిన ఈ విప్లవం నిశ్శబ్దంగా దేశమంతా వ్యాపించింది. అనంతర కాలంలో జనసంఘ్ అధ్యక్షులై బచ్‌రాజ్ వ్యాస్ లాంటి వారితోపాటు ఓ మహామనిషి ఎం.ఎస్.గల్వల్కర్ డాక్టర్జీకి దగ్గరయ్యాడు. ఎందరికో అఖండమైన స్ఫూర్తిని అందించిన డాక్టర్ కేశవ బలీరాం హెడ్గేవార్ 21 జూన్ 1940న దేహత్యాగం చేశాక ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్‌గా మాధవ సదాశివ గోల్వాల్కర్ బాధ్యతలు చేపట్టారు. అఖండ మేధో సంపద, అపారమైన ఆధ్యాత్మిక అనుభవమున్న యం.ఎస్.గోల్వల్కర్ సంఘ్‌ను బహుముఖంగా విస్తరింపజేశారు. ఈయనను అందరూ గురూజీ అని పిలుస్తారు. 30 జనవరి 1948నాడు గాంధీని నాధూరాం గాడ్సే కాల్చి చంపడంతో సంఘ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. హిందూ మహాసభలో పనిచేసిన గాడ్సే తప్పును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం సంఘ్‌పై మోపింది. 1948 ఫిబ్రవరి 4న సంఘ్‌పై నిషేధం విధించింది. నిర్బంధంలోనే సంఘ్ మరింతగా విస్తరించింది. గురూజీని అరెస్టు చేశారు. ఆరునెలల తర్వాత 1948 ఆగస్టు 5న గురూజీని విడుదల చేశారు. తర్వాత 11 జూలై 1949న సంఘ్‌పై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. 1950లో పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. నెహ్రూ పాకిస్తాన్‌పై మెతకవైఖరితో ఉంటూ ఉండడం నాటి ప్రముఖ నాయకుడు డాశ్యామాప్రసాద్ ముఖర్జీకి నచ్చలేదు. అంతేగాకుండా కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్, నెహ్రూ

విధానాలు ఆయనకు ఇబ్బంది కలిగించాయి. కాశ్మీర్ యాత్ర చేసిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ కుట్రకు బలయ్యారు. ఇదంతా భారతదేశంలో హిందూ ప్రజల అస్తిత్వానికి ప్రమాదంగా పరిణమించింది. సంఘ్ ప్రోత్సాహంతో 21 అక్టోబర్ 1951లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఘ్ ఆవిర్భవించింది. అదే తదనంతరకాలంలో భారతీయ జనతాపార్టీగా రూపుదాల్చి, ఈరోజు భారతీయ రాజకీయ యవనికను మార్చివేసింది. ఇదంతా సంఘ్ తన జాతీయవాద అస్తిత్వంతో నిర్మాణం చేసిందే. దీనివెనుక ఎందరో త్యాగధనుల నిస్వార్థసేవ, నిరాడంబరత, కార్యదీక్ష, క్రమశిక్షణ దాగి ఉంది. అదంతా సంఘ్ శాఖ నుండి, సంఘ పెద్దలనుండి పొందిన స్ఫూర్తే. అనేకరకాల ఉద్యమాల చైతన్యమే ఈ రోజు సంఘ్ విరాడ్రూపం.
* గురూజీ సంఘ్‌ను వటవృక్షంగా మలిచారు
1952లో ఆరెస్సెస్ గోరక్షణం ఉద్యమం చేసి ఒక కోటీ 75 లక్షల సంతకాలతో ప్రభుత్వంలో చలనం కలిగించింది. 1962 చైనా మన దేశంపై దురాక్రమణ చేసినపుడు సైన్యానికి మద్దతుగా ఆరెస్సెస్ నిలిచింది. అంతేగాక 26 జనవరి 1963లో జరిగిన రిపబ్లిక్ పెరేడ్‌లో పాల్గొనేందుకు నెహ్రూ స్వయంగా సంఘ్‌ను ఆహ్వానించాడు. 1965 పాక్ యుద్ధంలో నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ స్వయంగా సర్ సంఘ్ చాలక్ గురూజీని అఖిలపక్ష సమావేశానికి పిలిచారు. అలాగే 1971 యుద్ధంలో సంఘ్ సైనికులకు సేవలు అందించింది. ఇక తెలుగునాట సంభవించిన దివిసీమ ఉప్పెనలో మరణించిన వారి శవాలను స్వయంసేవకులు ఖననం చేశారు. ఇవేగాక సంఘ్ నీడలో ఎన్నో సేవా సంస్థలు నిర్మాణం అయ్యాయి. వనవాసీ ప్రజల బాగోగుల కోసం ‘వనవాసీ కళ్యాణ్’ కుల భేదాల నిర్మూలనకు సామాజిక సమరసతా వేదిక, హిందువుల ఐక్యతకు విశ్వహిందూ పరిషత్; విద్యార్థుల్లో జాతీయ భావాల నిర్మాణానికి అఖిలభారత విద్యార్థి పరిషత్, రైతుల అభివృద్ధికి భారతీయ కిసాన్ సంఘ్, కార్మికుల చైతన్యానికి భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయతను చిన్నారుల్లో నింపేందుకు శిశుమందిర వ్యవస్థ.. ఇలా అనేక కొమ్మలతో సంఘ్ విస్తరించింది. బహుశా ప్రపంచంలోనే కోట్లాది మంది సభ్యులున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ ఆరెస్సెస్ మాత్రమే కావచ్చు. ఇతర సంస్థలు ఎన్ని ఉన్నా ఇంత ప్రభావవంతంగా ఏదీ లేకపోవచ్చు. ఈ విస్తరణ ఎక్కువగా గురూజీ కాలంలో జరిగింది. ఆయన రచించిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ స్వయం సేవకులకు కరదీపిక లాంటిది. కాబట్టే ఆయన వ్యక్తిత్వం ఎందరినో ప్రభావితం చేసింది. 5 జూన్ 1973లో గురూజీ మరణిస్తే భారత పార్లమెంట్ ఆయనకు నివాళి ప్రకటించడం విశేషం.
* గురూజీ తర్వాత బాధ్యతలు తీసుకొన్న
బాలాసాహెబ్ దేవరస్ (తృతీయ సర్ సంఘ్ చాలక్)
సంస్కృత - తత్త్వశాస్త్ర పండితుడు. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వానికి ఏబివిపి పని చేసింది. అలాగే జెపి ఆధ్వర్యంలో నడిచిన ఉద్యమంలో సంఘ్ పాల్గొని ఇందిర ఆగ్రహానికి గురైంది. 1971 జులై 4న సంఘ్‌ను ప్రభుత్వం మరోసారి నిషేధించి దేవరస్‌ను అరెస్ట్ చేసింది. తర్వాత జనతా ప్రయోగం జరిగింది. దేవరస్ నాయకత్వంలోనే కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, ఉమ్మడి పౌరసత్వం, మైనారిటీ కమీషన్ స్థానంలో మానవ హక్కుల కమీషన్ ఉండాలనీ, అయోధ్య హిందువులదనే నాలుగు అంశాలపై సంఘ్ స్పష్టమైన వైఖరి తీసుకుంది.
అలాగే కులం విషయంలో దేవరస్ ఇచ్చిన పిలుపు సామాన్యమైనది కాదు. ‘అంటరానితనం పాపం కాకపోతే ప్రపంచంలో మరేదీ పాపం కాదు’ అన్న ఆయన మాటలు స్వయం సేవకులు ఈనాటికీ తారకమంత్రంగా భావిస్తారు. బాలాసాహెబ్ అకుంఠిత దీక్ష వల్లనే భారతీయ జనతా పార్టీ పాలంపూర్ సమావేశాల్లో ఈ నాలుగు అంశాలపై తీర్మానం చేసి భుజాలపైకి ఎత్తుకుంది.
దేవరస్ తర్వాత సంఘ్ బాధ్యతలు తీసుకున్న రాజేంద్ర సింగ్ గొప్ప భౌతికశాస్త్ర అధ్యాపకుడు. సి.వి.రామన్‌కు శిష్యుడు. మురళీమనోహర్ జోషీకీ గురువు. ఈయన కాలంలో సంఘ్‌ను రాజకీయ పక్షాలు అంటరానిదిగా చూసేవి. అయినా మొక్కవోని ధైర్యంతో భారతీయతపై రజ్జ్భూయ్యా నిర్దేశం చేశారు. పాఠ్యాంశాల్లో భారతీయత విషయంలో రజ్జూ భయ్యాది అసమాన వైఖరి. అలాగే చరిత్ర విషయంలో మనల్ని బానిసలుగా మార్చవద్దని ఆయన వాదించారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దీని అమలుకు ఆయన జోషీ లాంటి వారిని ప్రోత్సహించాడు.
రాజేంద్ర సింగ్ తర్వాత బాధ్యతలు కుప్పనహళ్లి సీతారామయ్య (కె.ఎస్.సుదర్శన్) చేపట్టారు. అనేక వివాదాస్పద అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు ఆయన అభిప్రాయం చెప్పేవారు. స్వదేశీ, విద్యా విధానం, అమర్‌నాథ్ యాత్ర, అస్సాం చొరబాట్లు, కుల వివక్షత ఇలాంటి అంశాలపై నేరుగా ప్రభుత్వానికే సవాలు విసిరారు. ఈయన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కె.ఎస్.సుదర్శన్ తర్వాత ఆరవ సర్ సంఘ్ చాలక్‌గా మోహన్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. డాక్టర్జీలా ఉండే ఆయన స్ఫురద్రూపం ఇట్టే అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయన బాధ్యతలు చేపట్టిన వేళా విశేషమేమో తెలియదుగాని కేంద్రంలో రెండవసారి కూడా జాతీయ వాద ప్రభుత్వం ఏర్పడింది. మృదుభాషి, సౌమ్యుడు, సరళమైన వాగ్ధాటితో అందరినీ మెప్పించగల మేధావిగా, సేవ నందించే స్వయం సేవకులకు ప్రేరణగా ఆయన కన్పిస్తారు. బహుశా 2014, 2019 ఎన్నికల్లో జాతీయవాద ప్రభుత్వం కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో ఏర్పడినా ‘సంఘ్ జోక్యం’పై పెద్దగా ఆరోపణలు రానివ్వలేదు. ప్రణబ్ ముఖర్జీ లాంటి కరడు గట్టిన కాంగ్రెస్ వాదికి ‘సంఘ్ శిబిరం’లో మాట్లాడేందుకు వేదిక ఇచ్చారు. ముఖ్యంగా కుల తత్వాన్ని సమన్వయంతో ఎలా తగ్గించాలో, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలి. విశ్వవిద్యాలయ ఆచార్యులు, మేధావులు ఎలా ఒప్పించి మెప్పించగలరో సాధారణ స్వయం సేవక్‌ను వారు అలాగే మనసు దోచుకుంటారు. సాత్విక మనస్తత్వంతో, సరళమైన వేషధారణతో జాతీయ వాదాన్ని ప్రబోధిస్తారు.
గత బీహార్ ఎన్నికల సమయంలో ‘రిజర్వేషన్ల’ పట్ల ఆయన వ్యాఖ్యలు మీడియా, పార్టీలు వక్రీకరించాయి. కుల తత్వం తగ్గించాలనే విషయంలో ఆయనకున్న నిబద్ధత ఎవరూ కాదనలేరు. ఇపుడు భారతదేశంలో ఆయన ఏ మూలకు వెళ్లినా ఘన స్వాగతమే. ఇపుడు వారి సహచర్యం, యోజన, భావ వినిమయం కోరుకునేవారు ఎందరో ఉన్నారు. అలాంటి అఖండ మేధావి, సాత్వికుడు, అకుంఠిత దేశభక్తి గల మోహన్ భగవత్‌గారు ఈ నెల హైద్రాబాద్ పక్కనున్న భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే హేమంత శిబిరంలో రాబోయే కాలంలో సంఘ్ కార్యకలాపాలపై ముఖ్యమైన బాధ్యతలున్న వేలాదిమంది స్వయం సేవకుల మధ్యలో గడపనున్నారు. శత వసంతంలోకి అడుగుపెడుతున్న ‘సంఘ్’ విస్తరణకు ఎలా పని చేయాలో నిర్దేశించనున్నారు. భారతీయ విద్యను పేద ప్రజలకు ఎలా అందించాలో అనే యోజన వారితో చేసి మార్గనిర్దేశం చేస్తారు.

-డా. పి. భాస్కరయోగి