S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎండలు మండిపోతున్నై

గుడిసెలు కాలిపోతున్నై అన్నారు బోయి భీమన్నగారు ఒకప్పుడు. ఎండలు మండిపోతున్నై అంటున్నారు అందరూ ఇప్పుడు. ఎండల గురించి ముచ్చటించే ప్రతి సందర్భంలోనూ విసుగు లేకుండా నేను ఒక సంగతి చెపుతూ ఉంటాను. ప్రతిసారి మళ్లీ ఎండలు మండే సమయానికి మన వయస్సు ఒక సంవత్సరం పెరిగి ఉంటుంది. కనుక బహుశా ఎండలను భరించే ఓపిక కొంచెం తగ్గుతుంది. పెద్ద వయస్సు వాళ్లకయితే ఈ కష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. నేను పట్నం అనే, భాగ్యనగరం అనే హైదరాబాదుకు వచ్చి నలభయి సంవత్సరాలు దాటింది. మొదటి నుంచి పత్రికలు, రేడియో ద్వారా వాతావరణంలోని శీతోష్ణ స్థితి వివరాలను నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ నగరంలో ఎండలు ఏనాడూ నలభయి నాలుగు డిగ్రీలు దాటి పెరిగినట్టు నాకయితే కనిపించడం లేదు. కానీ ఒక్క తేడా మాత్రం నేను నిక్కచ్చిగా చెప్పగలను. వాతావరణం గురించి చెప్పడానికి కొంత పరిశీలన ఉంటే చాలు. ధర్మామీటర్లు, అధర్మామీటర్లు అవసరం లేనేలేదు.
డెబ్బయి దశకం చివరలో అంటే ఉస్మానియాలో పరిశోధన విద్యార్థిగా ఉన్నప్పుడు ఒకనాడు నేను 93 నెంబరు బస్సెక్కి క్యాంపస్‌కి తిరిగి వస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నీళ్లు బాగా తాగడం అలవాటు. పైగా శరీరతత్వం కూడా అలాంటిదేమో నాకు ముచ్చెమటలు లేదా దిగచెమటలు పోస్తున్నాయి. నాకు బాగా జ్ఞాపకం ఉంది. కాచిగూడ చౌరస్తాలోని వైశ్య హాస్టల్ ముందుగా బస్సు పోతున్నది. నేను నిలబడి చెమటలు కక్కుతూ ఆపసోపాలు పడుతున్నాను. పాపం నేనున్నచోట సీట్లో కూచున్న ఒక పెద్దమనిషి జాలిగా నావేపు చూచి ‘బాబూ, కూచో, చాలా కష్టపడిపోతున్నావు’ అన్నాడు. నాకు కళ్లలో నుంచి కూడా నీళ్లు వచ్చాయి.
చెప్పదలుచుకున్నది చెమట గురించి కాదు. వాతావరణంలోని తేమ గురించి. ఉష్ణోగ్రత మనుషులను ప్రభావితం చేసే తీరు తేమ మీద కూడా ఆధారపడుతుంది. వేడితోబాటు తేమ కూడా ఎక్కువగా ఉంటే బాగా చెమటలు పడతాయి. చెమట శరీరం మీద వస్తున్నప్పుడు గాలి తగిలితే తడి ఆవిరిగా మారి శరీరం చల్లబడుతుంది. కానీ ప్రస్తుతం జంట నగరాలలో నేల లోతులలో కూడా నీళ్లు లేవు. చెమటలు గుర్తుకు కూడా రావడం లేదు. బాణలిలో వేసిన వేరుసెనగ గింజలలాగ మనుషులు ఎక్కడికక్కడ ఎండిపోతున్నారు. చెమటగా రావలసిన తేమ ఏకంగా ఆవిరిగా గాలిలో కలుస్తున్నది. ఇది నేను గమనించిన గొప్ప తేడా. నగరం వెడల్పు పెరిగింది. నిలువుగానూ పెరిగింది. వాహనాలూ, ఎయిర్ కండిషనర్‌లు ఎక్కువయ్యాయి. వాహనాల్లో ఎయిర్‌కండిషనింగ్ తప్పనిసరి అయ్యింది. ఒకచోట గాలి చల్లబడిందంటే అందుకు సరిపడా మరొక చోట వేడి కూడా ఉండాలి. మనకు తెలియకుండానే ఇది జరుగుతున్నది. ఆ వేడి గోడల మధ్యన కొట్టుకుంటూ నగరంలోనే పట్టుబడిపోతున్నది. కనుక వేడి నలభయి రెండు డిగ్రీలు చేరేసరికే మన ప్రాణాలు అరచేతిలోకి వచ్చేస్తున్నాయి.
నీళ్ల గురించి ఆలోచిస్తే, పల్లెల పరిస్థితి ఏ మాత్రం వేరుగా లేదు. అప్పట్లో అంటే నేను పల్లెలో బతుకుతున్న కాలంలో చదువు కోసం పాలమూరు వెళ్లవలసి వచ్చేది. ఎవరికి పుట్టిన ఆలోచన అన్న సంగతి తెలియదుగానీ, ఒంటిపూట బడి అని ఒక పద్ధతి ఉంది. పొద్దునే్న చేతనయింది తిని ఎండ పెరగకముందే బడికి వెళ్లడం బాగానే ఉంటుంది. కానీ ఒంటిగంటకు ఇక బడి ముగిసింది, ఇక వెళ్లిపొండని పంపించేవారు. మాలాంటి పల్లె పిల్లలకు ఆ ఎండనపడి ఇంటికి పోక తప్పదు. పాలమూరు నుంచి బయలుదేరితే మా పల్లె ఏనుగొండకు చేరేలోగా మాకెన్నడూ కష్టంగా తోచినట్టు నాకు గుర్తులేదు. దారి పక్కన కావలసినన్ని చెట్లు. వాటి నీడలో ఆడుకుంటూ, కబుర్లాడుకుంటూ ఇంటికి చేరడం సరదాగానే కనిపించేది. అమ్మ మాత్రం ఇంటికి చేరిన నా కళ్లను చూచి ‘జోతులయినయి’ అనడం గుర్తుంది. మజ్జిగలో దూది తడిపి కళ్ల మీద పరిచేది అమ్మ. అప్పుడు కలిగే సుఖం, ఉపశమనాల ముందు ఏ మందూ పనికిరాదు. ఈ కాలంలో కలిగిన వారు అనుభవిస్తున్న ఏ కూలరూ, ఏసీ అటువంటి సుఖాన్ని ఇవ్వదు. కళ్లలో అనుభవించే చల్లదనం ఒళ్లంతా పాకేది. వెంటనే మళ్లీ మామిడికాయ ఆవ, అనగా ఆవకాయతో భోజనానికి రెడీ. దానితో కళ్లు మళ్లీ ఎర్రబడతాయి.
వేసవి వచ్చిందంటే ఎవరికీ భయం లేదు. రకరకాల రూపాలలో మామిడి అందించే రుచులు నిజంగా సమ్మర్ స్పెషల్. ఎండనబడి మిట్టమధ్యాహ్నం బడి నుంచి ఇంటికి చేరే సమయంలో మామిడి పిందెల వేట ఒక పెద్ద పాస్‌టైమ్. కొంతమంది పిల్లలు ఉప్పు, మిరపకారం కలిపి పొట్లం గట్టుకుని జేబులో పెట్టుకుని వచ్చేవారు. ఒక మామిడికాయ దొరుకుతుంది. అంటే అదెవరో పోగొట్టుకుంటే మనకు దొరుకుతుందని కాదు. దారి పక్కన ఉన్న ఊరుమ్మడి ఆస్తులయిన చెట్ల మీదికి రాయి విసిరితే కాయ దొరుకుతుంది. పది కాయలు సంపాయించి అప్పుడు తిందామన్న ఆలోచన లేదు. దొరికిన ఒక్క కాయను చితకకొట్టాలి. అవును మరి. కత్తులు వాడకూడదు. ఇనుము తగిలితే కాయ పులుపు పెరుగుతుందని ఒక అనుభవం. అదేమో కానీ మామిడికాయ తగిలితే కత్తి తళతళలాడుతుందని, దాని పదును పెరుగుతుందని నా అనుభవం. చితకకొట్టిన కాయను ముక్కలు పంచుకోవాలి. ఉప్పు, కారం నలుచుకుని కరకర నమిలి తినాలి. పళ్లు పులుస్తాయి. కబుర్లు అవసరం లేదు. ఈ మాటలు చెపుతుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మీకూ అలాగే జరిగితే బాధ్యత నాది కాదు, జరగకుంటే పచ్చి మామిడికాయ రుచి మీకు తెలియదని అర్థం.
మామిడి కాయలను చెక్కుతీసి, ముక్కలు తరిగి, ఉప్పు, పసుపు పట్టించి వరుగులుగా చేసుకోవడం అదొక పెద్ద విద్య. అంతకన్నా పెద్ద కార్యక్రమం. మామిడి చెట్లు ఉన్నవాళ్లందరూ సీజన్ ముగిసేలోపల కుండెడు వరుగు కనీసం తయారుచేసుకునే వారు. సంవత్సరమంతా చింతపండులాగే మామిడికాయ వరుగులను కూడా వాడుకునేవారు. మామిడికాయ చెక్కు తీయడానికి కౌచిప్ప అనే ఆల్చిప్పను బండ మీద అరగదీసి తయారుచేసే పీలర్ గురించి ఎంతమందికి తెలుసు.
నీళ్ల గురించి మొదలుపెట్టి నోట్లో ఊరే నీళ్ల దగ్గరికి వచ్చాను. మామిడికాయ బలం అలాంటిది. నిజంగా నీళ్ల గురించి ఆలోచిస్తే నాకు నిజంగా కళ్లలో నీళ్లు వస్తాయి. గుండె బరువెక్కుతుంది. పల్లె సోదరుడు కవితాత్మకంగా ‘పుడమి తల్లి సన్ను ఎండిపోయింది’ అన్న మాటలు బరువుగా గుర్తుకు వస్తాయి. నేలలో నీళ్లు లేవు. గొట్టంబావులు తప్ప దిగుడు బావులు లేవు. చిన్ననాడు వేసవిలో బావులలో గడిపిన గంటలపాటు కాలం కలలాగ గుర్తు వస్తుంది. ఇప్పటి పిల్లలకు ఈదడం అంటే బతుకనే బావిలో ఈదడం వరకు మాత్రమే. నీళ్లుండే బావిలో వాళ్లు తొంగి చూచింది కూడా లేదు. మునగ చెట్టు నుంచి ఒక లావుపాటి కొమ్మను సంపాదించి దాన్ని ఆరిపోయేదాకా దాచుకునేవాళ్లం. మునగకర్ర నీళ్లలో తేలుతుంది. దాన్ని నడుముకు తాటితో కట్టుకుంటే ఆ మనిషిని అది నీళ్లలో తేల్చి ఉంచుతుంది. ఈత నేర్చుకోవడానికి ఈ ‘మునగ బెండు’ అనే పరికరాన్ని మోసుకుని బావులకు వెళ్లడం నాకు మరపురాని ఒక మధుర జ్ఞాపకం.
పట్నంలో మా అమ్మాయి కూడా ఈత నేర్చుకున్నది. అందుకుగాను ప్రత్యేకంగా దుస్తులు, టోపీ, కళ్లజోడు లాంటి సరంజామా బోలెడు కొన్నది. మా అబ్బాయి కూడా ఈత నేర్చుకున్నాడు. కానీ వాళ్లకు ఈత ఎంతగా వచ్చునన్నది నా కళ్లతో చూడలేదు. మండే ఎండల గురించి నిజానికి ఒక పుస్తకమే రాయవచ్చునని నాకనిపిస్తున్నది. కానీ ఇప్పుడు ఇది చాలు.

కె.బి. గోపాలం