S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రతిభాశీలి!

నగరాలు పెరుగుతున్నాయి, మెట్రో నగరాలు విస్తరిస్తున్నాయి. వాటి వైవిధ్యాన్ని, జీవన విధానాన్ని, శైలిని పత్రికలు - ఎలక్ట్రానిక్ మీడియా పట్టి చూపుతున్నాయి. మరి ‘పల్లె’ సంగతేమిటి?.. అన్న ప్రశ్న వేసుకున్నారు చిత్రకారిణి లాబిసెట్టి అనీశ. అలా పల్లెను ‘పత్రం’ పైకి తీసుకొచ్చి తన సృజనను, ప్రతిభను చాటారు. పల్లెలంటే, పచ్చదనమంటే, స్వచ్ఛత అంటే ఇష్టపడే చిత్రకారిణి తన తండ్రితో కలిసి తాతగారి దగ్గరకు కామారెడ్డి జిల్లా వెళ్లినప్పుడు సృజనాత్మక కోణం నుంచి, కళాత్మక దృష్టితో, రసాత్మకత ఉట్టిపడే రీతిలో ఫొటోలు తీశారు. అరకు వెళ్లినప్పుడు కొన్ని తీశారు. ఆ ఫొటోలను ముందు పెట్టుకుని కాన్వాసుపై తైల (ఆయిల్) వర్ణాలతో, అక్రిలిక్ రంగులతో వాస్తవికతకు అద్దం పడుతూ పల్లెను పట్నం ముందుకు ప్రతిభావంతంగా తీసుకొచ్చారు లాబిసెట్టి అనీశ.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, కానె్వంట్ చదువులు చదివి, ధనవంతులు నివసించే ప్రాంతంలో నివాసముంటున్న అనీశ తనకు ప్రకృతి.. పల్లెలంటే ఇష్టం.. చెట్లు చేమలంటే మరీ ఇష్టమంటున్నారు. అంతకంటె ఎక్కువ చిత్రకళ ఇష్టమంటున్నారు. అందుకే రెండు ఇష్టాలను ఒకటిగా చేసి సృజనాత్మకతకు - కల్పనకు, కళాత్మకతకు పెద్దపీట వేసి పల్లెను ఆమె కాన్వాసుపైకి తీసుకొచ్చారు. పట్నం వీక్షకులు అబ్బురపడేలా చేశారు.
పచ్చదనమంటే ఇష్టపడే అనీశ పల్లెలోని నీటికాలువ ప్రక్కన విశాలంగా పరచుకుని అందాలొలికే పొలాలను, సమీపంలోని చెట్లను, నీలాకాశాన్ని, నీటి ప్రవాహాన్ని, గట్టు మీది పొదలు, గడ్డి.. వాటి కొసల మెరుపుదనం, ఆ పక్కనే ఈత, తాటి చెట్లు.. దూరంగా మరిన్ని చెట్లు పూర్తి తాదాత్మ్యంతో తన కిష్టమైన ప్రకృతికి ప్రణమిల్లి రంగుల నైవేద్యంతో పూజించినట్టు చిత్రిక పట్టారు. ఇందుకోసం ఎంపిక చేసుకున్న ‘యాంగిల్’తో రస హృదయాల్ని ఆమె కొల్లగొట్టారు. సాంకేతికంగానూ ‘సై’ అనిపించుకున్న చిత్రమది.
పొలాలు దాటి పల్లెలోకి అడుగిడితే.. కొన్ని పూరిళ్లు - గుడిసెల మధ్య చెట్టు.. దాని చుట్టూ అరుగు.. దానిపై కూర్చున్న తండ్రి - కూతురు. వారి పేదరికం, దీనత్వం ఆ రంగుల్లో ద్యోతకమవుతోంది. చెట్టు పచ్చగా ఉన్నా ఆ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి జీవితం పచ్చగా లేదు.. ఆ జెక్‌స్టా పొజిషన్ స్పష్టంగా కనిపిస్తోంది. నేపథ్యంలోఉన్న పూరిళ్లు ఆ గ్రామ ఆర్థిక స్థితిని తెలియజేస్తున్నాయి.
అక్కడి నుంచి ఓ వీధిలోకి నడిస్తే ఓ పూరి గుడిసె పక్కన ఓ మహిళ వంట చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె తలకు ఓ తువ్వాలు కట్టుకుని పని చేయడం, పక్కనే ఓ మేక.. ఆ పక్కన నీళ్లతొట్టి.. మట్టి గోడలు.. ఆ గోడకు ఓ గూడు, పైన గడ్డితో వేసిన కప్పు - వానకు తడిసి, ఎండకు ఎండి విచిత్రమైన రంగులోకి మారిన వైన్యాన్ని చిత్రకారిణి సహజత్వానికి దగ్గరగా చిత్రిక పట్టారు. మరి కొంత ముందుకెళితే.. ఆ పల్లె వీధి దర్శనమవుతుంది. ఆ ఇళ్ల తీరు, పరిగెడుతున్న బాలుడు, గోడవార నవారు మంచం. దూరంగా చెట్టు.. నేలపై బండరాళ్లు.. ఇది పల్లెలోని మరో పార్శ్వం.
ఇంకొంచెం పక్కకు కదిలితే ఇద్దరు గ్రామస్తులు దారిలో కూర్చొని ముచ్చటించడం, నేపథ్యంలో శిథిలమైన ఇల్లు.. ఇలా పల్లెను పదిలంగా పట్టుకుని పది మంది ముందుకు ఆమె తీసుకొచ్చి వీక్షకులు తమ జ్ఞాపకాలను, జీవితాలను నెమరేసుకునేందుకు ఆస్కారమిచ్చారు.
ఈ చిత్రాలకన్నా ముందు అనీశ లాండ్‌స్కేప్స్ బొమ్మలు గీశారు. అవి కూడా ప్రకృతికి అద్దం పడతాయి. కళాత్మకత, సృజనాత్మకత ఉట్టిపడుతుంది. వాటితోపాటు మరికొన్ని బొమ్మలను ఆమె గ్రూపు ఎగ్జిబిషన్లలో ప్రదర్శించారు. 2014 సం.లో ఐదుగురు హైదరాబాద్ నగర వర్తమాన చిత్రకారులు కలిసి, మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తమ చిత్రాలు ప్రదర్శించారు. అందులో అనీశ ఒకరు. చందనాఖాన్ తదితర ప్రముఖ చిత్రకారులొచ్చి వీరిని అభినందించారు. తొలి గ్రూప్ షో విజయవంతం కావడంతో మరుసటి సంవత్సరం ‘ఆంటెరో ఆర్ట్ గ్రూప్ ఇండియా’ వారు ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు అనీశను ఆహ్వానించారు. వర్ధమాన చిత్రకారులను ప్రోత్సహించే ఈ సంస్థ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాకిస్తాన్, మాల్దీవులు, ఢిల్లీ, బెంగుళూరు, నాగపూర్, ముంబై, చెన్నై, పుణె తదితర నగరాలకు చెందిన చిత్రకారుల సరసన అనీశ సృజించిన బొమ్మలు ప్రదర్శితమయ్యాయి.
పిన్న వయసులో, ఎలాంటి డిగ్రీ లేకుండానే బొమ్మలు చిత్రించి ప్రముఖుల ముందు ప్రదర్శించడం, అవి ఎంతోమంది మన్ననలు అందుకోవడంతో తన నైపుణ్యాన్ని, శైలిని మరింత మెరుగుపరచుకునేందుకు గాను 2018 సం.లో ఆమె జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బిఎఫ్‌ఏలో చేరారు. బిఎఫ్‌ఏలో చేరక ముందే రెండు గ్రూపు చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొనడమంటే చిత్రకళ పట్ల ఆమెకు గల అంకిత భావాన్ని తెలియజేస్తోంది. నేర్చుకోవాలన్న తపనను పట్టి చూపుతోంది. మంచి చిత్రకారిణిగా ఎదగాలన్న ఆలోచనను తెలుపుతోంది.
కళాశాలలో చేరాక వాటర్ కలర్స్‌తో బొమ్మలు వేయడం ప్రారంభించడమే గాక తన ‘లైన్’ మెరుగుపడిందని అనీశ అంటున్నారు. అధ్యాపకులిచ్చే అసైన్‌మెంట్స్ వల్ల సాధన పెరిగిందని, పక్షి, జంతు, మనిషి అనాటమీ పై మంచి అవగాహన ఏర్పడిందని నైఫ్ (కత్తి)తో చేసే ఇంఫాస్టో టెక్నిక్ అబ్బిందని, రియలిస్టిక్ పెయింటింగ్, డ్రాయింగ్‌పై మరింత మక్కువ పెరిగిందని ఆమె అంటున్నారు. ఇటీవల ‘బిశ్వాల్’ అనే చిత్రకారుని రియలిస్టిక్ చిత్రాలు చూశాక తాను ఎంచుకున్న శైలి.. విధానం సరైనదేననిపిస్తోందని, రాజా రవివర్మ బొమ్మలు తిలకిస్తే ఒళ్లు తెలియదని, అంతలా అవి నచ్చుతాయని ఆమె అంటున్నారు.
తన కళాశాలలో ఇతర చోట్ల చాలామంది విద్యార్థులు డిజిటల్ ఆర్ట్స్ వైపు, గ్రాఫిక్స్ వైపు వెళుతున్నా తాను మాత్రం ఆయిల్, అక్రిలిక్ రంగులతో కాన్వాసుపై, వాటర్ కలర్స్‌తో కాగితంపై రియలిజం.. ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ వేస్తానని అటువైపే తన మనసు పరుగెడుతుందని నిజాయితీగా చెబతున్నారు. రియలిస్టిక్ శైలిలో కోసిన ఆపిల్ పండును, ఆకుపచ్చ ఆకులను, కోసిన కాయను చిత్రించిన డ్రాయింగ్స్‌ను ఆమె చూపారు. స్టిల్ లైఫ్ డ్రాయింగ్, పెయింటింగ్స్ సైతం ఆమె ఎన్నో వేశారు. అనేక స్కెచ్‌లు ఆమె ‘బుక్’లో దర్శనమిస్తాయి.
చిత్రకళకు ఇంతలా అంకితమైన అనీశ 1999 సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్ రమేష్, తల్లి కుట్లు అల్లికలతోపాటు ఫ్యాబ్రిక్ పనిలో తీరిక లేకుండా గడుపుతారు. తల్లి నుంచి స్వతహాగా అబ్బిన సృజన.. చిత్రరచనను సొంతంగా మెరుగుపరచుకున్నారు. సమ్మర్ క్యాంప్‌లో కొన్ని మాసాలు ప్రాథమిక అంశాలు నేర్చుకుని సాధన చేశారు. ఆ అభ్యాసం అనంతరం తన మనసు పలికిన పద్ధతిలో రియలిస్టిక్‌గా లాండ్‌స్కేప్స్ గీయడం మిత్రుల చిత్రకారుల మెప్పు లభించడంతో ఇక అదే జీవితమైంది. చిత్రరచన తప్ప మరో అంశం గూర్చి ఆలోచించే అవకాశమే లేదని అనీశ అంటున్నారు. బిఎఫ్‌ఏ పూర్తయ్యాక ఒక స్టూడియో ఏర్పాటు చేసుకుని తనదైన పద్ధతిలో చిత్రకళా రంగానికి అంకితమవుతానని, ఇంతకు మించిన లక్ష్యం మరొకటి లేదని పల్లె- ప్రకృతి బొమ్మల సాక్షిగా ఆమె ప్రకటించారు.
*లాబిసెట్టి అనీశ.. 79894 83677

-వుప్పల నరసింహం 9985781799