S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగుల ‘గాలి’ వీస్తోంది..!

పెన్ను, పెన్సిల్‌తోనే కొందరు చిత్రకారులు తమ సృజనను, ‘సత్తా’ను చాటుతారు. అలాంటి వారిలో గాలి అర్చన ఒకరు. ఆమె వాటర్ కలర్స్, అక్రలిక్ రంగుల్తో బొమ్మలు సృజించినా బాల్‌పెన్నుతో, రంగు పెన్సిళ్లతో, ఆమె గీసిన చిత్రాలు, పొట్రేట్స్ వీక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. అందులో ఆమె నైపుణ్యం (క్రాఫ్ట్) స్పష్టంగా కనిపిస్తుంది.. అబ్బురపరుస్తుంది.
రంగు పెన్సిళ్లతో రసరమ్యంగా పొట్రేట్స్ వేయడం ఆమె ప్రత్యేకత. ఈ పద్ధతిలో ఓ లంబాడి మహిళను ఆమె అపురూపంగా కాగితంపై చిత్రించారు. ‘షేడింగ్’తో ఆ చిత్రాన్ని పూర్తి చేయడంతో అది అచ్చం ఆయిల్ పెయింటింగ్‌లా కనిపిస్తోంది. లంబాడీల ఆహార్యం అనేక రంగుల్లో కనిపిస్తుంది. అంతేగాక ఎంతో ఆకర్షణీయంగానూ ఉంటుంది. అందులో అద్దాలుంటాయి, వెండి వుంటుంది, ‘దంతం’తో చేసిన గాజులుంటాయి. ఇవన్నీ ఆమె రంగు పెన్సిళ్లతో సహజత్వం ఉట్టిపడేలా చిత్రించారు. చివరకు పుట్టుమచ్చను సైతం మరచిపోలేదు. అంత వివరంగా ఆభరణాలు.. తాయతు, నాసికాభరణం, తలపై వేసుకున్న వస్త్రం.. దాని నీడ.. ఇట్లా అన్ని వివరాలు చివరికి ఆ లంబాడి మహిళ చూపుల్లోని తీక్షణత వీక్షకుల గుండెలను తాకుతుంది.. గుచ్చుకుంటుంది. ఆ కళ్లలోని తడి, పొడిబారిన పెదాలు ఇట్లా సమస్తం రంగు పెన్సిళ్లతో చిత్రకారిణి ఆ బొమ్మకు జీవం పోశారు.
ఇదే శైలిలో ఓ పాఠశాల బాలుడి ‘పొట్రేట్’ కూడా వేశారు. అందులోనూ అమాయకత్వంతో పాటు పసితనం, పాలబుగ్గల మెరుపు, కళ్లల్లో ‘శూన్యం’, ఆ నవ్వులో బోళాతనం, పళ్ల మధ్య సందులు స్పష్టంగా కనిపిస్తాయి. తల వెంట్రుకలు దువ్విన తీరు, చర్మం రంగు, మెడ వద్ద కనిపించే చిన్నచిన్న మడతలు, చెవి దగ్గర ‘షేడ్’ ఇట్లా ఓ నైపుణ్యం గల ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోలా కనిపిస్తుంది. కానీ అది ఫొటో కాదు.. పోట్రేట్. అందులో చిత్రకళా నైపుణ్యం తొంగి చూస్తోంది. ఆ అబ్బాయి వేసుకున్న చొక్కా మడతలు.. షేడ్స్ గమనిస్తే చిత్రకారిణి ప్రతిభ బయటపడుతుంది. ఇది కూడా రంగుల పెన్సిళ్లతో మదిని దోచుకునే బొమ్మ.
ఇక మామూలు పెన్సిల్, బాల్‌పెన్నుతో గీసిన అనేక చిత్రాల్లో ఆమె ‘సత్తా’, సృజన, శైలి, సహజత్వం తేటతెల్లమవుతుంది. ఉదాహరణకు ఓ యువతి, ఇద్దరు ఆడపిల్లల పోట్రేట్స్ చూపరుల మనసులో ముద్ర వేస్తాయి. ఎంతో అలవోకగా, అబ్బురపరిచే విధంగా, నిరాడంబరంగా కాగితంపై మంత్రమేసినట్టు ఆ గీతలు వీక్షకుల చూపును ఆకర్షిస్తాయి. యువతి సౌందర్యం, సోయగం, కళ్లలో మెరుపు, కొంటెతనం, విరబోసుకున్న జుత్తు, చేతికి ‘టాటూ’, చెవులకు జుంకాలు ఇట్లా అన్నీ అతి చిన్న ‘స్పేస్’లో నలుపు తెలుపులో చూపటం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక చిన్న ఆడపిల్లల బాల్యం అతి స్పష్టంగా ఎలాంటి ‘రంగులు’ హంగులు లేకుండా కనిపిస్తుంది. ఆ అమాయకత్వం, స్వచ్ఛమైన చిరునవ్వు, లోకం తెలియని వైనం, అమ్మ కట్టిన తాయతు బిళ్ల, నుదుట దిద్దిన బొట్టు, కల్మషం అంటే ఏమిటో తెలియనితనంతో, వీక్షకులను చూసే ఆ చిన్ని పాపల పోట్రేట్స్‌కి వెల కట్టడం ఏ ‘షరాబు’కు వీలవుతుంది..?
మనుషులనే కాదు అర్చన ప్రకృతిని అమితంగా ప్రేమిస్తుంది. అందుకే ఆమె అసంఖ్యాక డ్రాయింగ్స్ నిండా పూల గుబాళింపు ఉంటుంది. రకరకాల పుష్పాలు (్ఫ్లరల్ వర్క్) అనేక షేడ్స్‌తో పెన్ను, పెన్సిల్‌తో ఆమె కాగితంపై సృజించారు. వీటితోపాటు కొన్ని డిజైన్స్ జత చేశారు. నీలం రంగు బాల్ పెన్నుతో, నలుపు రంగు బాల్ పెన్నుతో గీయడం వల్ల అవి రంగుల చిత్రాలన్న భ్రమ కలుగుతుంది. షేడ్స్ ఇవ్వడం వల్ల ఆ భ్రాంతి ఏర్పడుతోంది. వాస్తవానికి ఒకే రంగు ఉపయోగించి, అదీ పెన్నుతో ఇంతగా మనసు దోచే పుష్పాలను, ఆకులను, రేకులను, పుప్పొడిని, తీగలను చిత్రించి వీక్షకులు తన్మయం చెందేలా చిత్రించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ అర్చన సునాయాసంగా, ఎలాంటి శ్రమ లేకుండా గీసినట్టు కనిపిస్తుంది. పిల్లలు, పుష్పాలే గాక అనేక అలంకార సామాగ్రిని ఆమె చిత్రిక పట్టారు. చూపరులకు వైవిధ్యాన్ని, తాను చూసిన అలంకరణ వస్తువుల్ని గీతల్లో, పెన్ను, పెన్సిల్‌తో చిత్తాన్ని ఆకట్టుకునేలా గీసి తన నైపుణ్యం, ప్రతిభ, పనితనం ప్రదర్శించారు. కాన్వాసుపై అక్రలిక్ రంగులతో బ్రష్‌తోనూ అంతే మోతాదులో తనదైన ప్రతిభను ఆమె కనబరిచారు. బ్యూటీ ఆఫ్ సోల్ (ఆత్మ సౌందర్యం) పేర ఆమె ఓ మహిళ ధ్యానం చేస్తున్నట్టు చిత్రించారు. నేపథ్యంలో రంగు రంగుల ప్రపంచానికి ప్రతీకగా అనేక రంగుల త్రికోణాలను పొందుపరిచి వౌనంగా ధ్యానం చేస్తున్న మహిళ మనసులో ‘కమలం’ వికసించిన వైనాన్ని ఆమె చూపారు. వెలుపల ఎంత కాలుష్యం ఉన్నా, ఆకర్షణలున్నా.. మనసు మాత్రం నిర్మలంగా, స్వచ్ఛంగా, ఎలాంటి ప్రలోభాలకు, ప్రభావాలకు లోను గాకుండా ఉంటే మనసులో అందమైన కమలాలు ఆలోచనలు విరబూస్తాయని ఆ చిత్రం ద్వారా చెప్పదలచుకున్నట్టు చిత్రకారిణి వివరించారు.
అలాగే గత బతుకమ్మ పండుగ సందర్భంగా జరిగిన ‘ఆర్ట్ క్యాంప్’లో ఆమె ఓ రంగుల చిత్రాన్ని సృజించారు. ఆ క్యాంప్‌లో మిగతా చిత్రకారిణుల బొమ్మలకన్నా కొంత భిన్నంగా ఆమె గీశారు. ‘ఫ్రేమ్’లో పూల బతుకమ్మతోపాటు, బతుకమ్మను సంకేతంగా, ప్రతిరూపంగా భావించే స్ర్తి నుదుట బొట్టు పెడుతున్న చేతులు కనిపిస్తాయి. మొత్తం ఫ్రేమ్‌లో బతుకమ్మ, స్ర్తి తల, గాజులతో గల చేతులు మాత్రమే కనిపిస్తాయి. స్ర్తి నుదుట ఐదవ తనానికి ప్రతీకగా భావించే బొట్టు పెట్టి అలంకరించడమంటే గౌరమ్మ (బతుకమ్మ)ను అలంకరించడమేనని సింబాలిక్‌గా చిత్రకారిణి చూపారు. సృజనకారుల చాతుర్యం ఇలాంటి ప్రతీకలు, సంకేతాల ద్వారానే ప్రస్ఫుటమవుతుందనేది విదితమే!
ఇలా వైవిధ్యంగల చిత్రాలతో, స్కెచ్‌లతో, డ్రాయింగ్స్‌తో ఆకట్టుకుంటున్న గాలి అర్చన హైదరాబాద్‌లో 1981లో జన్మించారు. తొలుత గోల్కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడి కేంద్రీయ విద్యాలయలో ఐదవ తరగతి వరకు చదివారు. ఈ సమయంలో ఇంటి నుంచి పాఠశాలకెళ్లే దారిలో అనేక పూలచెట్లు, పొదలు కనిపించడం, వాటిని చూస్తూ ప్రకృతి పట్ల అనిర్వచనీయ ఆత్మీయత ఏర్పడిందని, అలాగే పాఠశాలలో ఢ్రాయింగ్ ఉపాధ్యాయుడి బోధన తనను ఎక్కువగా ఆకర్షించడంతో చిత్రలేఖనం వైపు సహజ రీతిలో మెలగానని ఆమె వివరించారు. బాల్యంలో బొమ్మలు గీయడమే ఆట - పాటగా ఉండేదని అలా చిత్రలేఖనం తనలో ఒక భాగమైందంటున్నారు.
పాఠశాల విద్య పూర్తయిన అనంతరం తనలోని నైపుణ్యాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు ఇతరుల సలహా మేరకు మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేర్పించారని ఆమె తెలిపారు. అక్కడ డ్రాయింగ్, మోడల్ పెయింటింగ్, స్కెచ్‌లు వేయడం, బహిరంగ ప్రదేశాల్లోకెళ్లి బొమ్మలు గీయడం, వాటర్ కలర్స్, అక్రలిక్ రంగుల మిశ్రమం తదితర ‘టెక్నిక్స్’ తెలుసుకోవడమే గాక ‘్థయరీ ఆఫ్ ఆర్ట్’ను లోతుగా అధ్యయనం చేశామని, అందులో తనకు మొఘలుల కాలంనాటి మినియేచర్ చిత్రకళ ఎంతో నచ్చిందని, అలాగే రవివర్మ బొమ్మలు ఎంతో ఆకర్షించాయని పాత సంగతులను ఆమె నెమరేసుకున్నారు. పాశ్చాత్య చిత్రకారుల్లో ‘పికాసో’ బొమ్మలు తనను ఆకట్టుకుంటాయని కూడా ఆమె తెలిపారు.
అలా 2000 సంవత్సరంలో బిఎఫ్‌ఏ కోర్సు విజయవంతంగా ముగించాక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని మాసాలు ఎంఎఫ్‌ఏ చేశాక ఊహించని విధంగా కుటుంబంలో పరిణామాలు చోటు చేసుకోవడంతో ఆ కోర్స్ పూర్తి చేయలేకపోయానని, అప్పుడే పెళ్లి కావడం, ఓ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా ఉద్యోగం రావడంతో తన ‘కెరీర్’లో కొంత ‘బ్రేక్’ వచ్చిందని అయితే ఇది తాత్కాలికమేనని, ఎదురైన ఆటంకాలను అధిగమించి, స్టైల్‌కన్నా థీమ్ ముఖ్యమని చాటి చెప్పేలా మరిన్ని బొమ్మలు అటు కాన్వాసుపై, ఇటు కాగితంపై వేస్తానని అర్చన హామీ ఇస్తున్నారు.
*
గాలి అర్చన 96403 15040
*

-వుప్పల నరసింహం 99857 81799