S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ద్విమిత్ర

భవేష్ స్కూల్ నించి ఇంటికి వస్తూనే పుస్తకాల బ్యాగ్, లంచ్ బాక్స్ పక్కన పడేసి, ‘నాన్నమ్మా! నాకు మేథ్స్ ఒలింపియాడ్‌లో ప్రైజ్ వచ్చింది కదా. ఆ ప్రైజ్ ఇవ్వటానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తారుట. రేపు శనివారం సాయంత్రం 4.00 గంటలకి మా స్కూల్‌లోనే. నువ్వు కూడా తప్పకుండా రావాలి’
అలాగే వస్తాను గానీ, ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, పేరు కనుక్కున్నావా?’
‘ఆ ఆవిడ పేరు కూడా చాలా తమాషాగా ఉంది నాన్నమ్మా! ఆవిడ పేరు ద్విమిత్ర అట. కొత్తగా ఈ మధ్యే ఈ ఊరు ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చారుట.’
ఆ పేరు వినగానే వందనకి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేయి.
వందన వంటింట్లో పని చేస్తూ ఆలోచిస్తోంది. రెండు రోజుల నుండి మంగమ్మ రావడం లేదు. ఎందువలనో? చాలా సంవత్సరాల నుండి ఈ ఇంట్లో పని చేస్తోంది. ఏ రోజూ మానెయ్యలేదు. లేటుగా వచ్చినా, రాలేకపోయినా అది ముందే చెబుతుంది. పిల్లలకు బాక్స్ సర్ది, బ్రేక్‌ఫాస్ట్ పెట్టి స్కూల్ బస్ వస్తే ఎక్కించింది. భర్తకు టిఫిన్ పెట్టి, తను తిని ఆఫీసుకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి ఉసూరుమని మరలా పని చెయ్యడం మొదలుపెట్టింది. మరుసటి రోజు మంగమ్మ వచ్చింది. తన పని చేసుకుని పోతోంది. మనిషి చాలా బాధ పడుతున్నట్లు తనని చూస్తే తెలుస్తోంది. ‘ఏమైంది? రెండు రోజుల నుండి రావడం లేదు’ అని అడిగా.
ఏమీ మాట్లాడలేదు.
‘సాయంత్రం తీరుబడిగా చెబుతానమ్మా’ అని అంది.
‘సరే’ అని ఆఫీసుకి వెళ్లిపోయా. సాయంత్రం వచ్చిన తరువాత టీ ఇచ్చి, మంగమ్మ చెప్పడం మొదలుపెట్టింది.
‘మీకు తెలుసు కదమ్మా! నా చిన్న కూతురికి కష్టపడి పెళ్లి చేశాను. రెండు కానుపులు కూడా అయ్యాయి. మొగుడు తాగుబోతు. అదే పనిచేసి పిల్లలని, సంసారాన్ని నెట్టుకొస్తోంది. ఈ మధ్యన దాని నుండి కబురూ కాకరకాయా లేదు. ఏం అయ్యిందా? అని దాని ఊరెళ్లాను. అది చాలా బాధపడుతోంది. దానిని, పిల్లలని తీసుకుని వచ్చాను. అది వచ్చిన తరువాత చెప్పింది. అది పనిచేసే ఇంట్లో అమ్మగారికి చాలా ఏళ్ల నుంచీ పిల్లల్లేరు. వాళ్ల అమ్మ దీనితో నా కూతురికి పిల్లని కని ఇవ్వు. నీకు డబ్బు ఇస్తాను అందిట. ఇది సరే అని దాని పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఒప్పుకుంది. దాన్ని వాళ్లు డాక్టర్‌కి చూపించి మంచి మందులు ఇప్పించి, బలానికి పాలు, పళ్లు ఇప్పించి కావలసిన సదుపాయాలు అన్నీ చేశారు. కానుపులో దానికి ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల చాలా నల్లగా ఉంది అని వాళ్లు తీసుకోలేదు. డబ్బులు కూడా ఇవ్వలేదు. మరో పిల్లని పెంచి పోషించగలిగే స్తోమత దానికి లేదు అమ్మగారు. దాని మొగుడు కూడా పిల్లని పెంచడానికి ఒప్పుకోవడం లేదు. ఆ పిల్ల విషయమై వాళ్లిద్దరూ గొడవ పడుతున్నారు. అందుకని దానిని, పిల్లలని ఇక్కడికి తీసుకుని వచ్చాను. దానికీ నాకూ ఏం చెయ్యాలో పాలుపోవడం లేదమ్మగారు. మీరే పెద్ద మనసు చేసుకుని ఏదైనా దారి చూపండమ్మా!’
‘నేను ఏం చేయగలనే, సరేలే తరువాత నిదానంగా ఆలోచిద్దాం’ అని సముదాయించి పంపించింది. మరుసటి రోజు ఆఫీసులో, లంచ్ టైమ్‌లో తన సీనియర్ కొలీగ్ సరళగారితో మంగమ్మ కూతురి సంగతి చెప్పింది.
‘ఏమైనా సలహా చెబుదురూ. పాపం మంగమ్మ మొహం చూస్తే జాలేసింది. మనం ఏమైనా చెయ్యగలమా?’ అంది. సరళ చూద్దాములే అని అంది. లంచ్ ముగించి ఆఫీసు పనిలో పడ్డారు. ఆ తరువాత ఆ సంగతి మరుగున పడింది.
కొద్ది రోజుల తరువాత సరళ తనంతట తానే ‘వందనా! మంగమ్మ కూతురి సంగతి ఏమైనా తేలిందా?’ అంది. అప్పటికిగాని మళ్లీ నాకు గుర్తుకు రాలేదు. ‘లేదు అనుకుంటానండీ. మళ్లీ మంగమ్మని అడగలేదు. ఏం? మీకేమైనా ఆలోచన తట్టిందా?’
‘అవును. నా పెద్ద కొడుకు, కోడలికి పిల్లలు లేరు అన్న సంగతి నీకు తెలుసు కదా. నిన్న ఆదివారం కదా అని వాళ్ల ఇంటికి వెళ్లాము. మాటల మధ్యలో మంగమ్మ కూతురి సంగతి వచ్చింది. నా కోడలు మనమే పెంచుకుంటే ఎలా ఉంటుంది అత్తయ్యా? అని అంది. తరువాత అంతా ఈ మాటలతోనే సరిపోయింది. మా వారు, మా అబ్బాయి, మిగిలిన కుటుంబ సన్యులు దీనికి సమ్మతించారు. నువ్వు, మంగమ్మ, దాని కూతురు, అల్లుడితో మాట్లాడి దత్తతకి ఒప్పించు’ అని ముగించింది.
కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఈ శుభకార్యాన్ని నా చేతుల మీదుగా పూర్తి చెయ్యగలగడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. వందన సరళ గారితో ఆ పాప పేరు విషయమై చాలా తర్జన భర్జన పడ్డారు. చివరకు ‘ద్విమిత్ర’ అని పేరు పెడితే ఎలా ఉంటుంది అని సరళగారితో అంది. ఆ పేరు వాళ్ల ఇంట్లో కూడా బాగుంది అన్నారు. తరువాత కొద్ది రోజులకు సరళగారి అబ్బాయికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఆవిడ కూడా భర్తతో కూడా కొడుకు దగ్గరకు వెళ్లిపోయారు. కొద్దిరోజులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. క్రమంగా పలుచబడీ ఆగిపోయాయి. తరువాత ఏ సంగతీ తెలియలేదు.
ఇన్ని రోజుల తరువాత ఆ పేరు విన్న వెంటనే గతం గుర్తుకు వచ్చింది. నేను కూడా చాలా ఆసక్తిగా స్కూల్ ఫంక్షన్ అటెండ్ అయ్యాను.
ద్విమిత్రను చూసి ఆశ్చర్యపోయాను. నల్లగా ఉంటుంది అనుకున్న పిల్ల చక్కని కనుముక్కు తీరుతో, చామనచాయగా, ఆరోగ్యంగా చూసిన వెంటనే ఆకర్షణీయంగా ఉంది. ఫంక్షన్ ముగిసిన తరువాత వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని వివరాలు అడిగాను. సరళగారి మనవరాలు అని నిర్ధారణ అయ్యింది. సరళగారు, ఆవిడ, భర్త కాలం చేశారు అని తెలిసి బాధ పడ్డాను. నా ద్వారా ఒక పిల్ల భవిష్యత్ బాగుపడినందుకు చాలా సంతోషం వేసింది.

-బులుసు అన్నపూర్ణ 70931 95548