S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారతీయుల దృష్టి

విశ్వంలాగే భూమి కూడా ప్రాచీనమయినదని చైనా వారు నమ్మారు. కనుకనే మొక్కలు, జంతువుల అవశేషాలు గట్టిపడి దొరికితే అవి ఒకనాటి జీవులని గుర్తించడానికి వారికి ఏ రకంగానూ అనుమానం లేకపోయింది. రాళ్లను కూడా గట్టితనం, రంగు ఆధారంగా వారు విభజించగలిగారు. జేడ్‌ను వారు విలువయినదిగా గుర్తించారు. ఆ రాతితో అందమయిన విగ్రహాలను, వస్తువులను మలుచుకున్నారు. చైనాలో తరుచుగా భూకంపాలు వచ్చేవి. ఎందుకు అన్న ప్రశ్నకు మాత్రం జవాబు దొరకలేదు. క్రీ.శ.2వ శతాబ్దంలోనే భూకంపం ప్రభావాలను కొలత వేయడానికి జాంగ్ హెంగ్ అనే పండితుడు ప్రయత్నించినట్టు చైనా రికార్డులలో తెలిసింది. భూమి కదలికలను గుర్తించడానికి ఇప్పుడు సీస్మోగ్రాఫ్ అనే యంత్రాన్ని వాడుతున్నారు. దానికి తొలి రూపం చైనాలో వచ్చిందంటే ఆశ్చర్యం కాదు. చైనా వారు అయస్కాంతాలను కూడా వాడుకుని ఎన్నో ప్రయోజనాలు సాధించారు. కరిగిన ఇనుమును చల్లబరుస్తూ అయస్కాంతాలను తయారుచేశారు. పడమటి వారి అయస్కాంతాల గురించి చాలా తరువాత తెలిసింది. అయితే చైనా వారు అయస్కాంతాలను నీటిలో ఉంచి వాడేవారు. అయస్కాంత ఉత్తరాన్ని చూపిస్తుందని అందరూ అంటారు. కానీ చైనా వారు మాత్రం దక్షిణాన్ని చూపుతుంది అనేవారు. దాని చివరలు రెండు వేపులా ఉంటాయి కనుక ఈ రెండు మాటలూ నిజమే.
చైనాలో రసాయన శాస్త్రం కూడా బాగా అభివృద్ధి చెందింది. లావో త్సూ ప్రారంభించిన టావో మతం వారు రసాయన శాస్త్రంలో బాగా కృషి చేశారు. టావో అంటే మార్గం. కన్ఫూషియస్ లేదా బుద్ధుని పద్ధతులు కూడా అక్కడి ప్రజలు మార్గాలుగా అవలంభించారు. ఒక్కొక్క మతం వారి పరిశీలన విధానాలు వేరువేరుగా ఉండేవి. చైనాలో అప్పటికే ఆల్కహాల్ తయారీని బాగా వాడుకునేవారు. రాగి లోహాన్ని తయారుచేయడం కూడా వారికి తెలుసు. బొగ్గు పొడి, గంధకం, పొటాషియం నైట్రేట్‌లను కలిపి వారు తుపాకి మందును తయారుచేశారు. పర్వదినాలలో వాడుకునే బాణసంచాతోపాటు ఈ మందు యుద్ధాలకు కూడా సాయం చేసింది. రసాయన ప్రపంచంలోని ఇన్, యాంగ్ శక్తులు తుపాకి మందులో కనిపించాయని చైనా వారు అన్నారు. యిన్ ప్రకారం రంగురంగుల బాణసంచా వీలయితే, యాంగ్ పద్ధతిలో తుపాకులు, ఫిరంగులు వీలయ్యాయి. తుపాకి మందు ఫార్ములా మిగతా ప్రపంచానికి చేరిన మార్గం తెలియదు.
చైనాలో రస విద్య కూడా బాగా నడిచింది. మనిషిని ఎక్కువకాలం బతికించే విధంగా జీవామృతాన్ని తయారు చేయాలని వారు ప్రయత్నించారు. చిరంజీవులను చేయాలన్న ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇవేవీ ఫలించలేదు. నిజానికి ప్రయోగాల కారణంగా చాలామంది ప్రభువుల చిన్న వయసులోనే పోయారు కూడా. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా మిగతా రోగాలకు ఉపకరించే మరెన్నో మందులు అందుబాటులోకి వచ్చాయి. మొక్కల నుంచి మందులను తీసే పద్ధతి వచ్చింది. గంధకం, పాదరసాలకు అప్పట్లో ప్రాముఖ్యత ఉండేది. ఆర్టెమీసియా అనే మొక్కతో కషాయం కాచి జ్వరాలకు మందుగా ఇచ్చేవారు. ఆ మొక్కను ముద్దగా చేసి శరీరం మీద కొన్ని ప్రాంతాలలో కాల్చేవారు. 1800 సంవత్సరాల నాడు రాసిన ఒక పుస్తకంలో ఈ వైద్య పద్ధతుల వివరాలు ఈ మధ్యన బయటపడ్డాయి. పద్ధతి మలేరియా వంటి వ్యాధుల మీద బాగా పని చేస్తుందని ఆధునిక పరిశీలనశాలలో తేల్చి చెప్పారు. క్రీ.పూ.2వ దశాబ్ది నాడే చైనాలో వైద్యం గురించి పుస్తకాలు రాసుకున్నారు. ప్రాచీన చైనా వైద్య పద్ధతులను ప్రస్తుతం ప్రపంచమంతటా వాడుతున్నారు. శరీరంలో సన్నని సూదులను గుచ్చి చేసే ఆక్యుపంక్చర్ వైద్యం బాగా పేరు పొందుతున్నది. శరీరంలో శక్తి కొన్ని మార్గాలలో ప్రవహిస్తుందని వాటిలో అడ్డు ఏర్పడిన చోట సూదులు పొడిస్తే ఆరోగ్యం మెరుగవుతుందని చైనా వారు నమ్మారు. మొత్తానికి సాంప్రదాయ చైనా వైద్యానికి ప్రపంచమంతటా ఈనాటికీ ఆదరణ కనిపిస్తున్నది.
భారతీయ వైద్య విధానానికి కూడా ఇదే రకంగా ప్రచారం ఉన్నది. దాన్ని ఆయుర్వేదం అంటారు. ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు సంస్కృత భాషలో ఉన్నాయి. అవి క్రీ.పూ.200 నుంచి క్రీ.శ.600 సంవత్సరాల మధ్య రాసినవి. శరీరంలో మూడు రకాల దోషాలు ఉంటాయని ఆయుర్వేద విధానం చెపుతుంది. వీటిలో మొదటిది కఫం. అది చల్లగా ఉంటుంది. బరువుగా, తీపిగాను ఉంటుంది. రెండవది వాతం. ఇది పొడిగా, చల్లగా, తేలికగా ఉంటుంది. మూడవది పిత్తం. ఇది వేడిగా, పులుపుగా, ఘాటు వాసనను కలిగి ఉంటుంది. శరీరం సక్రమంగా పని చేయాలంటే ఈ మూడు దోషాలు సరయిన మోతాదులో ఉండాలి. వీటిలో ఏది తగ్గినా లేక పెరిగినా ఆరోగ్యం చెడుతుంది. అవి ఉండవలసిన చోటు కాక, మరొక చోట పెరిగితే వ్యాధి కలుగుతుంది. చర్మాన్ని పరీక్షించి, నాడిని చూచి వ్యాధి గురించి నిర్ణయం చేయగలగడం భారతీయ వైద్యంలోని చాలా ముఖ్యమయిన అంశం. మందులతోబాటు మర్దన, ప్రత్యేక ఆహారాలు, పత్యం అంటే తిండిలో పద్ధతులు ఆధారంగా శరీరాన్ని మళ్లీ ఆరోగ్యంలోకి మరల్చడం వీరి పద్ధతి.
వైద్య గ్రంథాలలో శుశ్రుతుడు రాసిన గ్రంథంలో శస్తచ్రికిత్స వివరాలు కనిపిస్తాయి. ప్రాచీన కాలంలోనే ఎంతో సున్నితమయిన శస్తచ్రికిత్సలు చేయడం ఈ గ్రంథాల ఆధారంగా తెలిసింది. కళ్లలో వచ్చిన శుక్లాలను తొలగించే ఆపరేషన్‌లను కూడా ఆనాడే చేసినట్లు శుశ్రుతుడు తెలియజేశాడు. సన్నని సూదులను కనుగుడ్డులో గుచ్చి శుక్లాన్ని ఒక పక్కకు లాగినట్టు వివరం రాసి ఉంది. శరీరంలోని మరొక ప్రాంతం నుంచి చర్మాన్ని తీసి గాయం తగిలిన చోట అమర్చడం కూడా శుశ్రుతుడు, మరి కొందరు వైద్యులు తమ రచనలలో వివరించారు. భారతదేశంలో ఇస్లాం వ్యాప్తి తరువాత కొత్త వైద్య పద్ధతులు అమలులోకి వచ్చాయి. యునాన్ అంటే గ్రీసు దేశం. అక్కడి నుంచి వచ్చిన వైద్య విధానాన్ని యునానీ వైద్యం అన్నారు. ఈ పద్ధతి మన దేశంలో ఈ మధ్యన బాగా సన్నగిల్లింది.
పదార్థ నిర్మాణానికి పంచభూతాలు ఆధారమని భారతీయులు నమ్మారు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నవి పంచభూతాలని వీరు గుర్తించారు. భారతీయ వైజ్ఞానిక విశేషాలను ప్రత్యేకంగా గమనించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా గణితం, ఖగోళ శాస్త్రాలలో వీరి పరిశోధనలు ఎంతో ప్రభావవంతంగా అంగీకరింపబడ్డాయి. నక్షత్రాలు, సూర్య చంద్రుల కదలికలను గురించి భారతీయులు కచ్చితమైన లెక్కలు వేశారు. ఉజ్జయినిలోని నక్షత్ర పరిశోధనశాల ఆనాడే ఎంతో నిశితమయిన పరిశోధనలు చేయగలిగింది. సుమారు క్రీ.శ.505 నాడు వరాహమిహిరుడు ఈ రంగంలో ఎంతో కృషి చేశాడు. ప్రాచీన సమాచారాన్ని సేకరించి కృషి కొనసాగించి ఎన్నో కొత్త అంశాలను కనుగొన్నాడు. తర్వాతి కాలంలో దిల్లీలోను, జైపూర్‌లోనూ ఏర్పాటు చేసిన ఖగోళ పరిశోధన నిర్మాణాలు ఈనాటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భారతీయుల పంచాంగ పద్ధతి కూడా ఎంతో నిశితమయినదని ప్రపంచమంతా అంగీకరించింది. గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రుల కదలికలను ప్రాచీన కాలంలోనే భారతీయులు కచ్చితంగా గుర్తించగలిగారు. మన దేశంలో ఇప్పటికీ కాలగణనం కొరకు చాంద్రమానం, సౌరమానం అనే రెండు పద్ధతులూ అమలులో ఉండడం తెలిసిందే.
భారతీయుల దృష్టిలో కూడా విశ్వం, భూమి ఎంతో పురాతనమయినవి. నక్షత్ర శాస్త్రంలో 4,320,000 సంవత్సరాల క్రమం ఒకటి ఉందని అలనాటి భారతీయులు గుర్తించారు. మహాభారత పురాణంలో ఇందుకు ఆధారాలు కనిపిస్తాయి. భారతదేశంలో కూడా చిరాయువును కలిగించే జీవామృతం కొరకు ప్రయత్నాలు జరిగాయి. ఇతర లోహాల నుంచి బంగారాన్ని తయారుచేసే రస విద్య గురించి కూడా భారతదేశంలో ఒకప్పుడు పరిశోధనలు జరిగినట్టు తెలుసు. అయితే గణిత రంగంలో భారతీయులు చేసిన కృషి మాత్రం నేటికీ ప్రపంచమంతా అంగీకరించి గుర్తిస్తున్నారు.
ప్రస్తుతం అరబిక్ అంకెలుగా గుర్తింపు పొందిన 1,2,3 పద్ధతి అంకెలు భారతదేశానివే. మధ్యప్రాచ్యం గుండా అవి ప్రపంచానికి అందాయి. ఒకటి ఉన్నది, ఒకటి లేదు అన్న భావాలకు మధ్యన ఏమీ లేదు అన్న భావం ఒకటి ఉండాలని ఆలోచించినది భారతీయులే. అంటే 0 అనే శూన్యాన్ని ప్రపంచానికి అందించినది మన దేశమే. అంకెలకు స్థానాన్ని బట్టి విలువ ఉంటుందని భారతీయులు గుర్తించి ప్రపంచానికి తెలియజేశారు. ఉదాహరణకు 116 అన్న అంకె అంటే చివరలో ఉన్న ఆరు ఒకట్లను, అటు నుంచి రెండవ స్థానంలో ఉన్న ఒకటి పదులను, మూడవ స్థానంలో ఉన్న ఒకటి వందలను సూచిస్తుందని భారతీయ పరిశోధకులు ఏనాడో గుర్తించారు. ప్రపంచమంతటా అలవాటుగా వాడుతున్న ఈ పద్ధతి ఇవాళ కొత్తగా వినిపించక పోవచ్చు. కానీ గణితంలో ఈ పద్ధతికి గల స్థానం గొప్పతనాన్ని ప్రపంచమంతా అంగీకరించింది. స్థానాల విలువ పద్ధతి లేకుంటే అంకెలను రాయడం చాలా గజిబిజి అయ్యేది. ఏడవ శతాబ్ది నాటి వాడయిన భారతీయ గణిత నిపుణుడు బ్రహ్మగుప్తుడు గణితంలో సంచలనాన్ని సృష్టించాడు. ఆకారాలలోని పరిమాణాన్ని గుర్తించడానికి సులభ మార్గాలను సూచించినది బ్రహ్మగుప్తుడే. సున్నాను మొట్టమొదటిగా లెక్కలలో వాడిందీ ఈయనే. సున్నను సున్నాతో హెచ్చవేస్తే వచ్చేది శూన్యమే అని కూడా భారతీయులు సూచించారు. శూన్యం నుంచి శూన్యాన్ని తొలగిస్తే కూడా శూన్యం మిగులుతుందని భారతీయులు చెప్పారు. ఈ లెక్కకు గణితంలోనే కాక తత్వశాస్త్రంలో కూడా ఎంతో ప్రభావం వుంది. బ్రహ్మగుప్తుని తర్వాత 500 సంవత్సరాలకు భాస్కరాచార్యుడు, లీలావతి వంటి వారు గణితంలో విప్లవాత్మకమయిన మార్పులు తెచ్చారు. వీరు సూచించిన సిద్ధాంతాలు లేకుంటే ప్రపంచంలో ఈనాడు ఆధునిక గణితం అభివృద్ధి వీలయ్యేది కాదు.
చైనా, భారతదేశాల వైద్య పద్ధతులు పడమటి వైద్యం ముందు బలహీనపడ్డ మాట వాస్తవం. అయితే విజ్ఞానశాస్త్రంలో మాత్రం ఈ పరిస్థితి లేదు. ఈ రెండు దేశాల వారు కూడా మిగతా ప్రపంచంలో వారి పద్ధతులలోనే తమ పరిశోధనలను సాగించారు. కనుకనే విజ్ఞాన శాస్త్రంలో పడమటి లేదా తూర్పు తేడాలు లేవు. అది విశ్వజనీనమయినది.
పుస్తకం చదువుతున్నాము అన్నా, అందులో పేజీలను లెక్కపెడుతున్నాము అన్నా చైనా, భారతదేశాల చలువ అని మనం అనుక్షణం గుర్తుంచుకోవాలి.

-కె.బి.గోపాలం