S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అద్భుతః

మాది చాలా పోష్ లొకాలిటీ అని ఛాతీ మీద చెయ్యి వేసి చెప్పుకోగలరందరు. అంతా కాంక్రీట్ జంగిల్ అని కూడా చెప్పుకోవడం కూడా వింటుంటాం. అప్పుడప్పుడు కొందరి నోట, ఆ చోట.. ఈ చోట.. ఆ పూట ఈ పూట.. వాళ్లంతా ఛాందసులు అనుకోని సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడిప్పుడే కోట్లకి.. గేటెడ్ కమ్యూనిటీలకి, విల్లాలకి అలవాటైన యువత నోట. ఏదైనా తలో మాట ప్రతినోట.
ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, ఆ కాంక్రీట్ జంగిల్‌కి కూతవేటు రూపంలో ఓ ఎకరం భూమి మాత్రం సస్యశ్యామలంగా.. హరితవనంలా.. అలరారుతు కనుపిస్తోంది. దాన్ని గ్రీన్ పార్క్ హోటల్‌గా చేసి హాట్ హోటల్ నడుపుతున్నాడు సుందరయ్య - ఆయన్ని అందరూ గుడిసె హోటేలు సుందరయ్య అని అంటుంటారు. అందరం వింటుంటాం. తృప్తిగా టిపినీలు తింటుంటాం.. తృప్తిగా తేన్చుతూ వుంటుంటాం.
ఆ సుందరయ్యకి ఓ చక్కటి భార్య.. ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరు చక్కగా ఫ్రెషయి పొద్దుటే హోటల్ తెరుస్తారు.. మంచి సాంబ్రాణి వాసనలు చుట్టుపక్కల విస్తరిస్తాయి.. సాంబారు వాసన ఆకలికి తెర తీస్తుంటాయి అక్కడి కాపురస్తులకి. కొందరికి పార్సిల్స్ ఇళ్లకి వెళ్తాయి, న్యూస్ పేపర్ పారాయణులు.. నాలాటి హస్కురాయుళ్లు.. రిటైరయి ఇంట్లో కుర్ర మనస్కులకు అడ్డుగా ఎందుకని ఆ హస్కర్ సెంటర్‌కి చేరుతుంటారు. రాజకీయాలు, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ విధి విధానాలు, సినీ ముచ్చట్లు.. ఇలా కచేరీ కూడా నడుస్తుంది, ధూపపానాసక్తులకు.
సుందరయ్య గానీ, ఆయన భార్య కానీ విసుగు, విరోధం లేకుండా అన్ని భావాల వారిని ఆదరిస్తారు.. అవసరాలు చూస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు.
అచ్చు గుద్దినట్టు దాగుడుమూతలు సినిమాలో ఎన్.టి.ఆర్.లా ఉంటాడు ఈ సుందరయ్య. మాటామంతీ, అప్పులు, పద్దులూ పద్ధతులూను. కాకుంటే సినిమాలోలా పద్దులు వసూలు కావన్న దిగుల్లేదు. ఎంచేతంటే ఇక్కడి వారందరు ఎగువ తరగతి, మధ్యతరగతి వారే.. బాగా ఇ.ఎం.ఐ.లకి (నెలవారీ కటింగ్‌లకి) అలవాటుపడ్డవారే కాబట్టి చెడ్డవారు కారు.. బకారుూలు పెట్టని దొడ్డవారు.. పెనాల్టీలు అస్సలు కట్టరు. హోటల్లో పెనాల్టీలు ఏముంటాయి అనుకోవచ్చు కానీ ‘అప్పు చెల్లించక.. మరుసటి నెలకి అప్పు కొనసాగించక..’ ఇలాటి చురకలు, హెచ్చరికల బోర్డులు గోడలకి వేళ్ళాడ్తుంటయ్.
అక్కడి వాసితులకి హోటల్ ఆవశ్యకత ఎంత వున్నదో స్థానిక బిల్డర్స్‌కి దృష్టి ఆ జాగా మీదనే వున్నది. దాన్ని మంచి కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఎన్‌క్లేవ్స్, స్క్రీన్స్, షాపింగ్ మాల్స్‌తో వ్యాపార కూడలి చేసి.. టౌన్‌షిప్.. ఇంకా డబ్బు సంపాదించే ఆలోచన. కానీ అది ప్రయాసగానే ప్రయాణిస్తోంది కాలంతో. అనేకానేక యాడ్స్ చూపిస్తూ అరగంటలో అర్ధ్భాగం, టీవీ సీరియల్స్ దశాబ్దాలుగా మెగా చేస్తున్నట్లు.. సుందరయ్యని మార్చి తమ్ముడు మేయర్ శ్రీకాంత్‌ని.. వాళ్లిద్దర్ని మధ్యవర్తులు ద్వారా.. అనేక ఆకర్షణ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రయత్నించారు.. విఫలమయ్యారు. చివరాఖరికి శ్రీకాంత్, సుందరయ్య చెప్పేశారు. ఈ విషయమైతే కనుక తమని కలవద్దని, వత్తిడులు, ఆకర్షణలు చేయవద్దని.
ఒకరోజు శ్రీకాంత్ సుందరయ్య హోటల్‌కి వచ్చాడు మేయర్ బందోబస్తుతో, మందీ మార్బలంతో అందరు నివ్వెరపోయి చూస్తున్నారు. ఎంత చక్కటివాడు.. మంచి అందగాడు, స్ఫురద్రూపి అచ్చు ఆనాటి హీరో హర్‌నాథ్‌లా ఉన్నాడు శ్రీకాంత్. అక్కడ ఉన్న వారందరినీ చిరునవ్వుతో పలకరిస్తు సుందరయ్యని సమీపించాడు. తన కూడా వచ్చిన ఇంజనీర్లు టేప్ పుచ్చుకుని జాగా మొత్తం కొలతలు వేస్తున్నారు.. కాగితాల మీద డ్రాయింగ్స్ వేస్తున్నారు పొడుగు, వెడల్పు, అంకెలతో నింపేస్తున్నారు. అంతా చకచకా ఎవరు ఏమి చెప్పకనే ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు ఓ గంటసేపు. సుందరయ్య, శ్రీకాంత్ దంపతులు ఒకరినొకరు వదలకుండా మాటా మంచి సాగిస్తున్నారు. హోటల్ పనికి ఏ ఇబ్బందీ లేకుండా సిబ్బంది చూసుకుంటున్నారు.
ఆ స్థలం తమ తండ్రికి పూర్వీకంగా వచ్చిన స్థిరాస్తి - అందులోనే వ్యవసాయము, హోటల్ వ్యాపారము ఒంటిరెక్క మీద నడిపించి సుందరయ్యని తనకి వారసుడిని చేసి హోటల్ అప్పగించాడు తండ్రి.. శ్రీకాంత్‌ని బాగా చదివించి కార్పొరేషన్ మేయర్ స్థాయికి చేశాడు తండ్రి. అందువల్ల అన్నదమ్ములిద్దరు ఆ స్థలాన్ని తండ్రిగానే చూస్తారు - తండ్రి ఆశయానే్న పండిస్తారు. ప్రతిపాదిస్తారు. కానీ చుట్టుపక్కల జనానికి ఇవేవీ అర్థం కావు. సింపుల్‌గా డెవలప్‌మెంట్ కిచ్చుకుంటే ఎంతైనా వచ్చును. లేదా స్వంతంగా పెంచుకుంటే మేయర్ స్థాయిలో ఎంతైనా చేయవచ్చును ఆ స్థలంలో.. ఇది ప్రజా నివేదిక.
ఎవరేమనుకున్నా.. ఎంతలా అనుకున్నా.. అది తండ్రి జ్ఞాపకంగా.. సుందరయ్య వ్యాపకంగా.. ఉండిపోవలసిందే అన్నది మేయర్ ఆకాంక్ష. అయితే తన ఆకాంక్షకి రూపుదిద్దాడు తన కొడుకు సుస్మిత్, ది గ్రేట్ వాస్తుశిల్పి - అతనికి ఫారెన్‌లో మంచి నేముంది, ఫేముంది. అందుకే హుటాహుటిన మేయర్ శ్రీకాంత్ స్థలాన్ని కొలిపిస్తున్నాడు.. తన ఆలోచనలకి అంచెలంచెలుగా తండ్రి జ్ఞాపకాల స్మారకంగా.
కానీ అక్కడి వాసితులకి మాత్రం వాస్తవం ఏమిటో? ఏమై ఉంటుందో అయోమయమై ఎవరికి తోచిన విధంగా వారు మలుపునకు కారణాలు వెతుకుతున్నారు.. ఏవో కారణాలని అతుకుతున్నారు.. కథనాల నల్లుతున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దినం మొదలైన దగ్గర నుండి.. సాయంత్రం స్నాక్స్ వరకు ఆధారిత కాపురస్తులు విలవిల్లాడిపోతున్నారు. హోటల్‌కి అర్థాంతరంగా మూతపడిపోతుందేమో... కాలేజీ విద్యార్థులే కాకుండా, పెళ్లి కాని.. పెళ్లైన ఫోర్స్‌డ్ బ్యాచ్‌లర్స్ కాకుండా.. చాలామంది కుటుంబీకులు కూడా సామాన్య ధరలకి.. మంచి మంచి రుచులకి అలవడి.. సోమరితనం తమలో చొరబడి.. ఈ హఠాత్ పరిణామానికి కారణాలను వెతకడం మొదలయి, ప్రత్యామ్నాయాలని అనే్వషిస్తున్నారు.
ఆ అనే్వషణలోనే.. సుందరయ్య హోటల్ కాంపౌండ్‌లో చకచకా కట్టుబడి పనులు మొదలై... త్వరితగతిన ఓ రూపు దిద్దుకోడానికి యుద్ధ ప్రాతిపదికగా సాగుతున్నాయి - త్వరలో ఆవరణలో అనేక విధాల ఆధునిక సదుపాయాలతో, సౌకర్యాలతో భవన నిర్మాణాలకు.. పునః ప్రారంభాలకు దారులు ఏర్పడుతున్నయ్. ఇదంతా సుందరయ్య, శ్రీకంత్‌ల సంకల్పం.. సంకల్ప బలం స్వచ్ఛమైనది, ప్రజామోద యోగ్యమైనది, ప్రజావసరమైనదిగా కొందరు.. డబ్బు సంపాదనకై ఆదర్శాలను, ఆశయాలను అన్నదమ్ములిద్దరు ప్రక్కన పెట్టేశారని మరి కొందరు తర్కించుకుంటున్నారు. వీలైతే కొంతమంది బెట్లు కడ్తున్నారు, ఒట్లు పెడ్తున్నారు వాళ్లవాళ్ల అనుభవాల మేరకు. వారివారి మేథకు తోచిన విధంగా.
ఎందరు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఓపెన్ అవని సెల్‌ఫోన్ పాస్‌వర్డ్‌లా.. ఐ.డి. కోడ్ నెం. తెలియని ఏ.టి.ఎం డెబిట్ కార్డులా.. అందర్ని.. ఆలోచనల్ని.. అంతు తెలియని ఉద్దేశంతో, ఊపుతో చకచకా యుద్ధ ప్రాతిపదికని నిర్మాణం జరిగిపోతోంది. తక్కువ వ్యయంతో.. ఎక్కువ సదుపాయాలతో ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. అక్కడి వారు, పక్కపక్కని వారు మక్కువగా ఎదురుచూస్తున్న సుదినం, అదే శుభ దినం రానే వచ్చింది. మరుసటి రోజు ఉదయం అనగా వీరందరి ఊహలకి అంచనాలకి తెరదించేస్తూ ఆగస్టు 15వ తారీఖు, ఆ ప్రాంతాన పెద్ద, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సత్యవాది శ్రీ మరిడయ్య గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. ఊరు వాడా ఫ్లెక్సీలు పెట్టేశారు మేయర్, సుందరయ్యలు.
ప్రారంభోత్సవానికి అందరు ఆహ్వానితులే. మా ఈ సంకల్పానికి దోహదపడే వారందరు సన్నిహితులే. మీ రాకయే మాకు ఓ కానుక - ఇత్యాది ‘క్యాప్షన్స్’ ఫ్లెక్సీలల్లో చోటు చేసుకున్నాయి. అందరు వింతగా అనుకుంటున్నారు అన్నదమ్ములిద్దర్ని. ఏదో పెద్దపెద్ద మంత్రుల చేతనో.. సినీ తారలతోనో ప్రారంభోత్సవాలు జరిపిస్తున్న ఈ రోజుల్లో ఇలా సింపుల్‌గా, అందరి అంచనాలకి తలవంపుల్‌గా చేస్తున్నారు అన్నదమ్ములిద్దరు చాదస్తంగా అని వాపోతున్నారు, కొందరు. వాళ్లకి ఎంత తోస్తే అంత.. అంటున్నారు మరి కొందరు. ఇంతకి వెనుకటిలా సుందరయ్య హోటల్ ఉంటుందో లేక కాంటినెంటల్ లేదా స్టార్ హోటల్స్ వస్తాయో అంటూ అయోమయంలో ఊగిసలాడ్తున్నారు. ఏదైనా చూడబోతున్నందుకు ఆత్రపడ్తున్నారు అందరు.
జాతీయ గీతం ‘వందేమాతరం’ ప్రార్థన గీతంతో మువ్వనె్నల జెండా ఎగిరింది సుందరయ్య కాంప్లెక్స్‌లో మరిడయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు స్వహస్తములతో -
మరిడయ్యని అనుసరిస్తు అందరు చిన్నా పెద్ద, ముసలి ముతక ఆవరణలోకి అడుగుపెట్టారు. పచ్చని చెట్ల మధ్య ‘వృద్ధాశ్రమము’ అత్యంత ఆధునికంగా కళకళలాడుతోంది వృద్ధ మహిళామణుల సాక్షిగా.. వృద్ధుల (మగవారి) మనోభీష్ట మీడేర్చగా. దానికి ఆ పక్క ఈ పక్క విశ్రాంతికి బెంచీలు, వైద్య శిబిరాలు, వంటశాల అన్నీ అందిబుచ్చుకున్నట్లుగా వున్నాయి.
దాన్ని దాటుకు ముందుకు వెళ్తే వెనకటి మాదిరిగా ‘సుందరయ్య హోటల్’ కనులకు విందు చేస్తూ ఆహ్వానిస్తోంది అల్పాహారం ఆహ్వానితులకి, ఆహూతులందరకు. మర్యాదపూర్వకంగా సర్వ్ చేస్తున్నారు పేరు పేరున పిలిచి పెళ్లివారి లెక్క - అన్నిటికి ఓ లెక్కుంటుంది అన్నదమ్ములిద్దరికి - కానీ ఎక్కడ తేలరు సరికదా వెలితీ చేయరు ఎవరికీ.
అంతా బాగానే వుంది - ఈ ప్రాంగణం ఇలా.. ఇంత యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటవడానికి కారణమే అర్థం కావడంలేదు ఎంత ఆలోచించినా - ఇంకా చాలా భాగం నిర్మాణంలో వుంది. ఇంకో దారిన టౌన్‌షిప్ మరోలా ఉంది. ఇంటికి ఆవశ్యకమైన నిత్యావసర వస్తువులు పాలు, పెరుగు, కూరగాయలు, కిరాణా సామాన్లతో సుందరయ్య షాపింగ్ మాల్స్ - సహకార పరపతి సంఘ ప్రాతిపదికన క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. వేరుగా ఉద్యోగస్తులు లేరు.. అందందరు యాజమాన్యమే. స్వంత లాభం కొంత మానమన్న బాపూ సిద్ధాంతాలకి అద్దంపడ్తూ ఆదర్శంగా సాగుతున్న వ్యవస్థకు సుందరయ్య, శ్రీకాంత్‌లు కేవలం ధర్మకర్తలు మాత్రమే.
ఎంతో తృప్తిగా తమ పని తాము చేసుకుపోతున్న అన్నా వదినల్లో తొంగిచూస్తున్న సంతోషపు పొంగు.. నిగర్వమైన అంతరంగపు అంచుల్ని చూడగలుగుతున్న శ్రీకాంత్ వదనం ప్రశాంత సదనమైంది. తల్లిదండ్రులకు ప్రతీకగా అన్నా వదినలు ఎలా బ్రతికున్నన్నాళ్లు ఎలాటి ఒడిదుడుకులు లేకుండా జలజల గలగల సాగే సెలయేరులా సాగిపోవాలి. అన్నావదిన తనని ఏనాడు సోదర సమానంగా చూడలేదు - ఒక బిడ్డలా మమతానురాగాలనే చమురుగా పోసి ఆరే వెలుగై, కళ్లల్లో వత్తులయ్యారు. తను పక్కనున్నన్నాళ్లు వాళ్లకి ఎలాటి చీకటి నీడలు సమీపించరాదు. అదే నా తల్లిదండ్రులకి.. అన్నా వదినలకి.. నేనిచ్చే అవ్యాజ అనురాగ కర్తవ్య ఉద్దీపం.
చెమరని కళ్లని కర్చ్ఫీతో అద్దుకుంటున్న శ్రీకాంత్ భావోద్వేగానికి లోనయి కారుని ముందుకి నడిపించుకు వెళ్తూ.. ఈ ఆనందాని కంతటికి కారణభూతుడైన సుపుత్రుడు సుశ్మిత్‌కి.. అతనికి అత్యంత సన్నిహితుడైన శ్యామ్‌కి ఫోన్‌లోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ గతంలోకి తొంగి చూశాడు శ్రీకాంత్.
అది మరిడయ్యగారి కాంపౌండ్.. కబురందగానే కారు వేగంతో ఆయన ముందు హాజరయ్యాడు శ్రీకాంత్. సామాన్యంగా శ్రీకాంత్‌ని అందరు వచ్చి కలుస్తారు. కానీ శ్రీకాంత్ తను పనులన్ని పక్కనపెట్టేసి మరిడయ్యగారు కబురంపిన మరుక్షణం ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు, కారణం మరిడయ్యగారు తన తండ్రికి సహాధ్యాయి, ఇద్దరూ స్వతంత్ర భావాలతో స్వాతంత్య్ర సముపార్జనాభిలాషులు.
‘ఏమప్పా.. నీ గురించి చాలా వింటున్నాము..’ అంటూ పలికారు కొంచెం మందహాసంతో. దాంతో తన వల్ల పెద్దాయనకి ఏమైనా ఇబ్బంది కలిగిందా అన్న ఆలోచనలో శ్రీకాంత్ తటపటాయిస్తున్నాడు కంగారుగా. ‘అదేనప్పా! మంచి పనులతో నూటికి నూరు మార్కులిస్తా ఉన్నారు మా పిల్లకాయలు నీ పరిపాలనకు’ అంటూ కుర్చీ చూపించారు. శ్రీకాంత్ కొంచెం తెరిపిన పాడి అందించిన నీళ్లు తాగి తెప్పరిల్లాడు.
‘నీకు కబురంపిన కారణం ఏమంటే మీ జాగా వుంది కదా..’ అంటుంటే శ్రీకాంత్ కొంచెం ముందుకి వంగి శ్రద్ధపెట్టాడు మరిడయ్యగారు ఏం చెప్పబోతున్నారో అని ‘అది మాకిప్పిచ్చమంటె చాలా వత్తిళ్లు వస్తున్నాయి... నేను కాదంటె.. ఇంకొకరి దగ్గరకు పోయే ప్రమాదం ఉంది. అందుకని మీరు ఎంత తొందరగా దాని మీద శ్రద్ధ వహిస్తే అంత మంచిది కదా..’ అంటూ ‘మీ నాయన నాతో కలిసిన ప్రతిసారి దాన్ని పదిమందికి ఉపయోగించాలంటుండేవాడు. మరి దాని సంగతి ఏం ఆలోచించావ్...’ అంటూ కదిలించారు.
‘ఒక పని చేస్తావా..’ అంటుంటె మరిడయ్యగారి మాటని సమర్థిస్తూ ‘చెప్పండి నానాజీ.. మీ సలహా మేరకు ముందుకు పోదాం... మీ ముందుచూపు మాకు శ్రీరామరక్ష..’ అన్నదే తడవుగా శ్రీకాంత్, మరిడయ్యగారు తనకు తెలిసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫండింగ్ చేయించారు, భవన నిర్మాణానికి. దానికి జతగా కన్‌స్ట్రక్షన్ ప్లానింగ్ అంతా సుశ్మిత్, తన చిన్ననాటి స్నేహితుడు.. మరిడయ్యగారి మనవడు శ్యామ్, బిల్డర్స్‌లో ప్రముఖుడు నిర్వహించారు.. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి కృతకృత్యుడ్ని చేశారు తనని - కబ్జాదారులు, అతి తీవ్ర ఉగ్రవాదులకన్నా భయంకరమైన భూ బకాసురుల కబంధ హస్తాల్నించి తండ్రి ఆశయాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచారు. ఇదీ సామాన్యంగా ఆలోచించే ప్రజానీకానికి అంతుచిక్కని అద్భుత రహస్యం.. ఇవేవీ తెలియని సుందరయ్య వదనంలో చెక్కుచెదరని లాస్యం కళ్ల ముందు కదలాడ్తోంది శ్రీకాంత్‌కి - అద్భుతం అనిపిస్తోంది బస్తీ జనానికి.. చౌక ధరలకి వారందిస్తున్న నాణ్యత లోపంలేని వస్తు విక్రయాలకి..

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505