S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతుచిక్కని మనస్తత్వం

చిన్న గరిటెతో సొరంగం తవ్వేసి జైలు నుండి తప్పించుకున్నాడనే వార్త విన్న తర్వాత చార్లెస్ శోభరాజ్ తెలివి విని అంతా ఆశ్చర్యపోయారు. ఎక్కడికి వెళ్తే అక్కడే హత్యలు చేయడానికి అలవాటు పడ్డ చార్లెస్ రికార్డుల్లో 20 మందికి పైగా హతమయ్యారు. వీరిలో ఎక్కువ మంది సముద్ర తీరాల్లో హత్యకు గురైన వారే, విచిత్రమైన చార్లెస్ మానసిక స్థితిపై అధ్యయనం చేసిన వారికి సైతం ఆయన తత్వం అర్థం కాలేదు. దక్షిణాసియాలోని చాలా దేశాల్లో హత్యలకు పాల్పడి, భారతీయ పోలీసులకు దొరికిపోయిన చార్లెస్ న్యూఢిల్లీలోని కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఉంటుండగా చిన్న గరిటెతో సొరంగం చేసుకుని పారిపోయాడు. మరో సందర్భంలో చార్లెస్ తన స్నేహితుడి ద్వారా స్వీట్లు పంపించి, వాటిని జైలు సిబ్బందికి పంపిణీ చేశాడు. కొద్ది సేపటిలో వారంతా స్పృహకోల్పోయారు, ఈ క్రమంలో తప్పించుకుందామని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చార్లెస్ శోభరాజ్ తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగినా, కరడుగట్టిన నేరాలకు పాల్పడిన ఆయన క్రూరత్వం, పారిపోవడానికి చేసిన కుట్ర విన్నవారంతా దిగ్భ్రాంతి చెందారు. వియత్నాం హోచిమన్ సిటీకి చెందిన ఈ పెద్ద మనిషి 60 ఏళ్ల ప్రాయంలో నేపాల్ జైలులోని మరో కరడుగట్టిన నేరస్థురాలితో చెట్టాపట్టాలు వేసుకుని వివాహం పేరుతో ఖట్మండులో సెటిల్ అయ్యానని సాకుగా చూపి తనపై ఉన్న ఉరిశిక్ష నుండి తప్పించుకోవాలని ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు. చార్లెస్ జైలు నుండి విడుదలైతే థాయిలాండ్ ప్రభుత్వం ఆయనను అదుపులోకి తీసుకోవడం ఖాయం. కొన్ని క్రూరమైన హత్యలకు సంబంధించి థాయిలాండ్‌లో ఆయనకు ఇప్పటికే ఉరిశిక్ష పడింది. బయటకు వస్తే సక్రమంగా జీవిస్తాడో, మరికొంత మంది ప్రాణాల ఉసురు తీసుకుంటాడో ఎవరికీ తెలీదు. మొత్తం మీద చార్లెస్ నేడు నేపాల్ ఖట్మండు జైలులో ఉన్నాడు.
ఈ మధ్య జరుగుతున్న నేరాలు చూస్తే ఔరా అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిన సంఘటనలు చూసిన తర్వాత ఇంతగా తెగిస్తారా అనిపిస్తుంది. అంతవరకూ నాజూగ్గా, సౌమ్యంగా, ఏమీ తెలియనట్టు పక్కింటి అమ్మాయిలా ఉన్న ఆమె అకస్మాత్తుగా ఎంతో క్రూరంగా వ్యవహరించడం వింటే ఒళ్లు జలదరిస్తుంది. ప్రియుడి కోసం భర్తను చంపేసి, ప్రియుడిపై దాడి చేసి , ఆయనను చూసి అంతా ఆమే భర్తే అనుకోవాలని భావించేలా ప్లాస్టిక్ సర్జరీకి తెగబడిన అమ్మాయి గురించి వింటే ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ అనిపించకమానదు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కోవలో చాలా మంది విచిత్రమైన రీతిలో దారుణాలకు పాల్పడిన వారున్నారు. కొంత మంది నేరగాళ్లు ఒకరిద్దరిని హతమార్చడంతో సరిపెట్టుకోలేదు, వరసపెట్టి హత్యలు చేసుకుంటూ పోయారు. అలా ఎందుకు చేశారు? వారి మనసులో ఉన్నది ఏమిటి? ఎందుకిలాంటి నేరాలకు పాల్పడుతున్నారో ఎవరికీ అంతుచిక్కదు. నేరగాళ్లు గుంపుగా చేసే హత్యల వెనుక ఏదో అర్ధం కాని మనస్తత్వం కనిపిస్తుంటాది. హత్యలకు ఏదో తెలియని కసి వారు అవతలివారిని హతమార్చిన తీరులో కనిపిస్తుంటాది.
నిన్నగాక మొన్న అమెరికాలో సీరియల్ కిల్లర్ శామ్యూల్ లిటిల్ అరెస్టయ్యాడు. ఇతగాడు ఏకంగా 93 హత్యలు చేశాడు. 50 హత్యలకు సంబంధించి కచ్చితమైన ఆధారాలను అమెరికా పోలీసులు సంపాదించారు. 1970 నుండి 2005 మధ్య చేసిన హత్యలకు ఆధారాలు దొరికినా, హత్యకు గురైన వారి ఆనవాళ్లు మాత్రం లభించడం లేదు.
మానవ పరిణామ క్రమంలో ఆధునిక యుగంలోనే నేరాలు ఎక్కువయ్యాయి. అయితే ఏది తప్పు, ఏది ఒప్పు అనే వర్గీకరణ , స్పష్టత లేకపోవడంతో విచక్షణారహితంగా నేరస్థులకు శిక్ష విధించేవారు. 1775 నుండి నేరాలను నిర్వచించడం, గుర్తించడం మొదలైందని చెప్పాలి. 1830లో కార్టోగ్రాఫిక్ స్కూల్, 1850లో సోషలిస్టు స్కూల్, 1875లో ఇటాలియన్ స్కూల్, 1905లో సైకియాట్రిక్ స్కూల్‌గానూ, అనంతరం సోషియాలజికల్ స్కూల్‌గా నేరాలను నిర్వచించారు. అంటే అన్ని ఆరోగ్యకరమైన సమాజాల్లో నేరస్వభావం, నేరస్థులు అంతర్భాగంగానే ఉంటారని , ఇది సహజమైన చర్యగా గుర్తించారు. అంటే మన మధ్యనే మనకు తెలియకుండానే నేరస్థులు తిరుగుతూ, మనతో పాటు సహజీవనం చేస్తూ ఆకస్మిక చర్యలకు పాల్పడుతుంటారు. అప్పటివారు వారు నేరస్థులనే విషయం మనకు అర్థం కాదు.
నేరస్వభావానికి సంబంధించిన క్రమబద్ధమైన నియమనిబంధనలు రూపుదిద్దుకోకముందే, దేశంలో నేరవిచారణ ప్రక్రియకో స్మృతి రూపుదిద్దుకోకముందే, భారత శిక్షా స్మృతి రూపొందకముందే భారతదేశంలో అతి పెద్ద సీరియల్ కిల్లర్ టగ్ బెహరమ్ హల్‌చల్ చేశాడు. 1765 నుండి 1840 మధ్య జీవించిన ఈయన 900 మందిని చంపేశాడు. చివరికి 1840లో ఉరితీయడంతో బెహరమ్ రక్తచరిత్రకు ముగింపు పడింది.
1977లో ఎం జైశంకర్(ఆటో శంకర్) గురించి వింటే చాలు తమిళనాడులో గజగజ వణికిపోయారు. 30కి పైగా అత్యాచారాలు, హత్యలు, దోపిడీలకు పాల్పడ్డాడు. చంద్రకాంత్ ఝా కూడా అదే కోవకు చెందిన వాడు, అకారణంగా ఏడుగుర్ని చంపేశాడు. పూనేలో జోషి అభయంకర్ వరసగా పది మందిని హతమార్చాడు. చివరికి ప్రభుత్వం ఆయనను 1983 నవంబర్ 27న ఉరితీసింది. ఇక కేడీ కెంపమ్మ అంటే ఎవరో కాదు, సైనైడ్ మల్లిక ఆరుగురికి సైనైడ్ ఇచ్చి చంపేసింది. తర్వాత రెండు కేసుల్లో ఆమెకు ఉరిశిక్ష విధించినా దానిని యావజ్జీవంగా సవరించారు. బెంగళూరులో గుడి దగ్గర వేచి ఉండి నిరాదరణకు గురైన మహిళలను మచ్చిక చేసుకుని వారి సమస్యల పరిష్కారానికి పూజలు నిర్వహిస్తానని చెప్పి వారిని ఊరుచివర గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకువెళ్లి సైనైడ్ ఇచ్చి చంపేయడమేగాక, వారు వేసుకున్న బంగారం, ఆభరణాలను కొల్లగొట్టేది. 2017లో మరో మారు ఆమె వార్తల్లోకి వచ్చింది. జయలలిత సహచరి శశికళ జైలులో ఉన్నపుడు ఆమెకు భోజనాన్ని సైనైడ్ మల్లిక తీసుకువెళ్లేది, అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోనని మల్లికను జైలు నుండి తరలించారు. ఇక ఢిల్లీ నొయిడాలో వ్యాపారవేత్త మణీందర్ సింగ్ పాంథర్ ఇంట్లో పనిచేసే సురేందర్ కోలీ 16 మంది బాలల హతమార్చాడు. ఇందుకు సంబంధించిన కొన్ని కేసుల్లో ఇరువురికీ ఊరిశిక్ష పడగా, కొన్ని కేసుల్లో ఉరిశిక్షను యావజ్జీవంగా కోర్టు మార్చేసింది. వారు చేసిన హత్యలు ప్రపంచానికి తెలిసినవే. ఇప్పటికీ కోలీ ఆ హత్యలు ఎందుకు చేశాడో అంతుచిక్కడం లేదు. బాలలతో అశ్లీల చిత్రాలు నిర్మించాడని, వారిపైన అత్యాచారానికి పాల్పడ్డాడని, వారి శరీర అంగాల కోసమే హతమార్చాడని చెబుతున్నారు. సైనైడ్ మోహన్‌దీ అదే తీరు, 20 మంది మహిళలను హతమార్చాడు, 2013లో మంగుళూరు కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. నిరాదరణకు గురైన మహిళలను మభ్యపెట్టి వివాహం చేసుకుంటానని చెప్పి వారితో శృంగారంలో పాల్గొన్న తర్వాత సైనైడ్‌ను ఇచ్చి చంపేయడం అలవాటు చేసుకున్నాడు. అలా ఎంత మందిని చంపేశాడో ఆయనకే తెలీదు. రామన్ రాఘవ్, ఉమేష్‌రెడ్డి, రిప్పర్ జయనందన్, సతీష్, దర్బారా సింగ్ , అక్కుయాదవ్‌లు చేసిన హత్యలు గమనించినా వీరందరిలో ఏదో కసి కనిపిస్తుంది. వారి చిన్న చిన్న అవసరాలకు హత్యలు చేయడం గమనిస్తాం.
తాజాగా కోజికోడ్ సమీపంలోని కూడతై గ్రామానికి చెందిన జాలీ అమ్మ జోసఫ్ (47) చేసిన హత్యలు విని అందరికీ దిమ్మదిరిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర్ని సైనైడ్ ఇచ్చి హతమార్చేసింది. వరుసగా జరుగుతున్న హత్యలకు ఏదో ఒక సంబంధం, అన్ని మరణాల వెనుక ఒకే పాత్ర ఉందనే విషయాన్ని అర్ధం చేసుకోవడానికి 14 ఏళ్లు పట్టింది. 1997లో జాలీ రాయ్ థామస్‌ను పెళ్లి చేసుకుంది. 2011లో రాయ్ థామస్ బాత్‌రూమ్‌లో పడి చనిపోయాడు. ఎలా చనిపోయాడో అప్పట్లో ఎవరికీ తెలీదు. పోలీసులు పోస్టుమార్టం చేశారు. అప్పట్లో ఆయన శరీరంలో విషపదార్థాలున్నాయని గుర్తించారు. అయితే రాయ్ విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అంతా భావించారు.
రాయ్ థామస్ చనిపోయిన తర్వాత ఆమె రాయ్ దగ్గరి బంధువు సాజును జాలీ వివాహం చేసుకుంది. అప్పటికే సాజుకి పెళ్లయింది. సాజుకు భార్య సిలి, కుమార్తె ఉన్నారు.
రాయ్ థామస్ మరణంపై అనుమానం ఉన్న ఆయన సోదరుడు రోజో పోలీసులకు ఆనాడే ఫిర్యాదు చేశాడు. రోజో అమెరికాలోనూ, ఆయన సోదరి రంజీ కొలంబోలోనూ ఉంటున్నారు. రాయ్ చనిపోయిన వెంటనే ఆయన తల్లి అన్నమ్మ థామస్ 2002 సెప్టెంబర్ 22న, తండ్రి టాం థామస్ 2008 సెప్టెంబర్ 28న చనిపోయారు. జాలీ అత్త అన్నమ్మ థామస్ మరణంపై అనుమానం వచ్చి ఆమె బంధువు మాథ్యూ మంజిడియల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే మాథ్యు మరణించాడు. 2014లో ఆయనకు జాలీ ఇచ్చిన కాఫీలో సైనైడ్ కలిపిందనే విషయం ఇన్నాళ్లకు వెలుగు చూసింది. 2016లో సిలి సాజును, ఆమె కుమార్తె ఆల్పైన్‌ను కూడా జాలీ మట్టుబెట్టింది. జాలీ తీరుపై కనే్నసి ఉంచిన సునీష్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా, సోదరుడు వినె్సంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ చావులు అన్నింటికీ ఏదో ఒక సంబంధం. చిట్టచివరికి పోలీసులు జాలీని అరెస్టు చేశారు. ఇన్నాళ్ల తర్వాత వారందరినీ సైనైడ్ ఇచ్చి చంపేసినట్టు చెప్పింది. హత్యలకు సహకరించిన ఎంఎస్ మాథ్యు, పీ ప్రజికుమార్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల మృత దేహాల అవశేషాలను సమాధుల నుండి వెలికితీస్తున్నారు. ఆధారాలుమైనా దొరుకుతాయేమోనని పోలీసులు తపన పడుతున్నారు. ఇప్పటి వరకూ కథ అర్ధమైనా, ఇంతకీ ఆమె ఎందుకు హతమార్చింది అనేది పోలీసులకు సైతం అంతుచిక్కడం లేదు. డబ్బు కోసమా....అదీ ఆమె దగ్గర లభించడం లేదు.. మరెందుకు ఏదో తెలియని విచిత్రమైన మానసిక ప్రవర్తన. ఎందుకిలా మారింది. ఆమె బాల్యంలో ఏమైనా జరిగిందా? లేదా అనూహ్యమైన సంఘటనలను ఎదుర్కొందా...ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు పోలీసులు.... చూడాలి కథ ఎటు మలుపుతిరుగుతుందో...ఒక్కటి మాత్రం నిజం..అందరికీ కమల్ హసన్ నటించిన ఎర్రగులాబీలు సినిమా గుర్తుంది కదా... భారతీరాజా నిర్మించిన ఈ చిత్రం సీరియల్ కిల్లర్ రామన్ రాఘవన్‌ను దృష్టిలో ఉంచుకుని తీసిందే. చిన్నతనంలో తనకెదురైన మానసిక సంఘర్షణలు ఆ వ్యక్తి ప్రవర్తనలను ఏ దారికి తీసుకువెళ్తాయో అందులో భారతీరాజా కాస్తా కమర్షియల్‌గా చూపించారు. సామాజిక మానసిక సంఘర్షణలే నేరాలకు కారణం అనేది ప్రపంచం అంగీకరిస్తున్న నిజం. ఈ సంఘర్షణలకు కారణం ఏమిటి? ఈ విషయం తెలిసినా దానిని సవరించే దిశగా సమాజం పయనించడం లేదనేది ముమ్మాటికీ నిజం. -

ప్రసాద్