S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంత సౌఖ్యమని నే చెప్పజాల..

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములన్న త్యాగరాజు
‘విదులకు మొక్కెద సంగీత
కోవిదులకు మ్రొక్కెద’ అనే కీర్తనలో దివ్యమైన సంగీతాన్ని ఆలంబనగా చేసుకున్న వారందర్నీ తలుచుకుని నమస్కరించాడు.
విదులు అంటే పండితులు, కోవిదులు అంటే ఇంకా పెద్ద పండితులు, సమర్థులైన విద్వాంసులు.
నాదమే తనువైన శంకరుడు, లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి, బ్రహ్మ, విష్ణువు, నారదుడు, దేవేంద్రుడు, భరతముని (నాట్య వేదం తెలిసినవాడు) సప్తర్షులలో ఒకడైన కాశ్యపుడు ప్రదోష కాలంలో (సంధ్యా సమయంలో) పరమ శివుడికెదురుగా సొగసైన మృదంగ తాళంతో సహకరించే నందీశ్వరుడు.
ప్రముఖులైన ఆంజనేయుడు, గణపతి, మార్కండేయుడు, ఆదిత్య హృదయంతో శ్రీరాముడికి సహాయపడ్డ అగస్త్యుడు, తుంబురుడు, సోమేశ్వరుడు, సంగీత రత్నాకరాన్ని అందించిన శారంగ దేవుడు మొదలైన ఎందరో ప్రముఖులకు, శిరసు వంచి నమస్కరిస్తాడు. వీరంతా సంగీతానికి లొంగిపోయేవారే.
సంగీతానికి మైమరచిపోవటమే కాదు సంగీత కోవిదులంటే సంగీత జ్ఞానంతో బాగా పాడగలిగినవారే.
అటువంటి వారికి నమస్కరించగలిగిన సంస్కారి కాబట్టే సంగీత లోకానికి త్యాగరాజును సద్గురువు స్థానంలో ఆరాధిస్తారు.
ఆ సమయానికి బుద్ధి కుదురుగా ఉన్నా లేకున్నా, తెల్లవారగానే పూజాగృహంలో కాస్సేపు కూర్చుని ఏవో చదువుకుంటే గాని, సాధారణంగా ఎవ్వరూ ఏ పనీ ప్రారంభించరు. ఏ దేవుడైనా కానివ్వండి. స్మరణ తప్పదు. సుఖ దుఃఖానుభవాలతో మిళితమైన చక్రభ్రమణంలో తిరిగే మనిషికీ, పుణ్య పురుషులకూ ఎంత తేడా చూడండి.
మేలుకొలుపు మొదలు పవళింపు వరకూ అన్ని సేవలూ క్రమం తప్పకుండా చేసుకున్న రామనామ ధ్యాన తత్పరుడైన త్యాగయ్య నిత్య విధిలో మేను మరచి చేసుకునే సంగీత సేవలో, రాగరత్న మాలికలతో పాడుతూ, ఎవ్వరికీ పట్టని ఆ భాగ్యం తనకే దొరికిందని పొంగిపోయాడు. ఈ అదృష్టానికి నోచని వారినీ, శ్రీరామ పద సేవ చేసుకోలేని వారినీ ఆ దైవంతో ఉన్నా, తనకు లభించిన ఆ భాగ్యం వారికి లేదనే కృతనిశ్చయ బుద్ధి ‘కొలువమరె గదా కోదండపాణి’ అనే తోడిరాగ కీర్తనలో కనిపిస్తుంది. సంగీతంలో తమ జీవితాలను ప్రతిబింబింప చేసిన వారు వ్రేళ్ల మీద లెక్కించవచ్చు. అలాంటి ఒకరిద్దరిలో త్యాగరాజు ముఖ్యుడు.
‘నలువకు పలుకుల చెలియకు రుక్మిణికి
లలితకు సీతకు లక్ష్మణునికరుదైన ॥ గద॥
వేకువ జామున వెలయుచు తంబుర
చేకొని గుణముల చెలువొంద పాడుచు
శ్రీకరునికి ఆశ్రీత చింతామణికి
ఆకలిదీర పాలారగింపను జేసే ॥ గద॥
ఈ కీర్తనలో త్యాగయ్యగారి ఉదాత్తమైన భావాన్ని చూడండి.
నిష్కల్మషమైన భక్తి పరిధి ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. కుశలవులిద్దరూ కలిసి, సంగీత రసికుడైన రామచంద్రుడి కొలువులో రామాయణ గానం చేస్తోంటే సింహాసనం మెట్లు దిగి, ఆ పిల్లలిద్దర్నీ సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు, శ్రీరాముడు. ప్రేక్షకులతో బాటు కూర్చుని విన్నాడు. అలాటి గానప్రియుడైన శ్రీరాముడి చెంత గానం చేస్తూ పాలారగింప చేసే భ్యాగం తనకు కలిగిందంటారు త్యాగయ్య. వీణాపాణియైన సరస్వతి వల్ల సామవేదం నుండి సంగీత శాస్త్రాన్ని సృజింపచేసిన బ్రహ్మకూ ఈ భాగ్యం కలుగలేదు. వేణుగాన లోలుడైన శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. అనన్య భక్తురాలైన రుక్మిణి సహితం తాను పాడుతూ ఆ స్వామికి చక్కగా పాలారగింపచేసే భాగ్యం దక్కలేదు. నీడలా రాముణ్ణి వెన్నంటే ఉన్న సీతకు కూడా ఆ అదృష్టం కలగలేదు.
ఆదిశేషుని అంశగా భావించబడే లక్ష్మణుడున్నాడు. నిరంతరం రామసేవలో తరించే ఆ లక్ష్మణుడికి కూడా ఈ భాగ్యం దక్కలేదు.
కానీ తనకు మాత్రమే లభించిన అరుదైన వరమనుకుంటాడు త్యాగయ్య. అన్నిటి కంటే మించి గాన యోగ్యమైన బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సంగీత సాధన వేకువ జామునే చేయాలి. అప్పుడు శరీరం, మనస్సు రెండూ శుచిగా, శుభ్రంగా ఉంటాయి. త్యాగయ్య చేసే సాధన అదే. నాదప్రియుణ్ణి, సుస్వరంతో నిండిన నాదంతో మేలుకొలుపు పాడే యోగం తనకు మాత్రమే దక్కినట్లు సంబరపడిన త్యాగయ్య గారి పూజ, పాట రెండూ ఒక్కటే. తోడిరాగ కీర్తన ఇది. కర్ణాటక సంగీతంలో ప్రధానంగా వినబడే రాగాలలో ‘తోడి’ ఒకటి. 8వ మేళకర్త రాగమైన ‘హనుమత్తోడికి’ జన్యం. 1990 ప్రాంతంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తిగారు విజయవాడలో ఉండే రోజుల్లో ఈ కీర్తన ఆయన దగ్గర నేర్చుకునే భాగ్యం కలిగింది. పాడిన సంగతులు పాడకుండా ఈ కీర్తన 10 రోజులపాటు పాడుకున్నాం. ఎంత పాడినా, ఏదో పాడవలసిన గమకాలు మిగిలిపోయాయేమో అన్న భావనే ఉండేది. ఎంతసేపు పాడినా తనివితీరేది కాదు. ఇదే కీర్తన రేడియో సంగీత శిక్షణ కార్యక్రమంలో ఆయన శిష్యుడిగా నేర్చిన కీర్తన. అలాగే శాశ్వతంగా నా మనసుకు హత్తుకుపోయి నిలబడిపోయింది.
చరణంలో నలునకు, సీతకు, రుక్మిణకి, లలితకూ, లక్ష్మణుడు అనే మాటలు, ఆ మాటలకు తొడిగిన స్వరాలు, ఆ స్వరాలకు అమర్చిన గమకాలు, అలా తంబురాతో లీనమై ఒళ్లు మైమరిచేలా పాడిన సన్నివేశం నేనెప్పుడూ మరిచిపోను.
ఉదయం 9 గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం 12 అయ్యేది. త్యాగయ్య రుణం తీర్చుకుంటున్నామనిపించేది. ‘లేవండి! భోజనం చేద్దాం’ అన్నప్పుడే గడియారం చూసేవాణ్ణి. పరమ నిష్టా గరిష్టుడై, రాముడే లోకంగా, రామనామ ధ్యానమే లక్ష్యంగా నాదోపాసనతో పునీతుడైన త్యాగయ్య ప్రక్కనే కూర్చున్న తన శిష్యులతో కలిసి పాడే దృశ్యం మరెంత రమణీయంగా ఉండి ఉండేదో ఊహించండి! నమ్ముకున్న దైవాన్ని మనసులో నిలుపుకుని కంఠం శ్రుతి పక్వంగా ఉండి, లయ జ్ఞానం తెలిసి భక్త్భివంతో పాడగలిగే వారెంత ధన్యులో? విన్నవారెంత అదృష్టవంతులో! అనిపించేదే నిజమైన సంగీతం.
ఏ ప్రయోజనం లేని కాలక్షేప సంగీతాన్ని గురించి చెప్పే కబుర్లు గాలిలో కలిసేవే. గాన రుచి తెలిసిన కుశలవుల తండ్రియైన రామచంద్రుణ్ణి తన పాటతో మైమరపించి ఆముష్మిక సుఖాన్ని అందుకున్న త్యాగయ్యకు దక్కిన నిత్యానందమే, ఆనందం.

- మల్లాది సూరిబాబు 90527 65490, 9182718656