S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీపారాధన ప్రాశస్త్యం

భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే ‘దీపం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తూ ఆరాధిస్తారు. ‘వెలిగించడం’ సనాతన భారతీయ సంస్కృతి. ‘ఆర్పడం’ మ్లేచ్ఛ్భావ కలుషితమైన దానవ ప్రకృతి. ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు. చీకటిని నింపరాదు. ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి. కాంతులను పంచాలి. ఇదీ వేద మార్గం. దీపం వెలుగుకు సాధనం. వికాసానికి సంకేతం. అందుకే-
‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ; దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే’ అన్న ప్రాచీన శ్లోకం మనిషి చేసే ప్రయత్నాలకు అక్షర రూపం. దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం. మనిషి కూడా దీపంలాంటి వాడే. ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచానే్న వెలిగించగల శక్తి ఉన్నవాడు. * * *
అందుకే భారతీయులు జరుపుకునే పండుగలన్నింటి కంటే విలక్షణమైన పండుగ దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపం వెలుగునిస్తుంది. వెలుగు లేక జగతి లేదు అన్నారు పెద్దలు. నిజానికి వెలుగులేని ప్రపంచాన్ని ఊహించలేము.
శుభం కరోతు కల్యాణం, ఆరోగ్యం ధన సంపదాం
శతృబుద్ధి వినాశాయ, దీపరాజా నమోస్తుతే అంటారు.
అందుకే మనసుల్ని ఆనంద డోలికల్లో ఉంచే దీపావళి అందరికీ ఆనందదాయకమే. ప్రతీ పండుగ ఆనంద దాయకమే అయినప్పటికీ ఆనందానికి కేటాయించిన పండుగే దీపావళి. భయం, దుఃఖం, దారిద్య్రం, ఈ మూడు లేని జీవితమే ఆనందం. ఈ మూడింటినీ దూరం చేసే దేవతారాధన దీపావళి పర్వంలోని ప్రత్యేకం. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే సంబరంతో జరుపుకునే పర్వం. అమావాస్య చీకట్లను చీల్చుకుంటూ, వెలుగులు పంచే ఈ పండుగలో ధన త్రయోదశితో మొదలుపెట్టి, లక్ష్మీ పూజలతో కళకళలాడుతూ ఉంటుంది. మంత్రశాస్త్ర ప్రకారం ‘సాక్షాత్ దీపం దర్శయామి’ అనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది.
దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దైవీశక్తులున్న ఇంటిలో రోగాలు, నిరుత్సాహం, కలహాలు, దరిద్రం మొదలైన బాధలుంటాయి. దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది అంటారు. షోడశోపచారాలలో దీప సమర్పణ కూడా ముఖ్యం. అందుకే చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూచోవడం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని వెలిగించడం మేలంటారు. అందుకే ప్రతిరోజూ దీపాలను వెలిగిద్దాం. జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం.

-కె.రామ్మోహన్‌రావు 9441435912