S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగుల ఊహలు నైరూప్య చిత్రాలు

వాస్తవికత, అధివాస్తవికత (రియలిజం - సర్రియలిజం) దారుల్లో చాలామంది చిత్రకారులు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఇదిగాక నైరూప్యం (అబ్‌స్ట్రాక్ట్) అనే మరో దారిలో నడిచేందుకు మరి కొందరు చిత్రకారులు ఇష్టపడతారు. తమ సృజనను ఆ విధానంలో వ్యక్తీకరిస్తారు. ఈ మాధ్యమంలో రంగుల విస్ఫోటనం, వైవిధ్యం దర్శనమవుతుంది. వీక్షకుల ఊహలకు ‘ఉత్తేజం’ కలుగుతుంది... ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. ‘రంగుల విద్వత్’ తెలుస్తుంది. ఇందులో రూపంకన్నా నైపుణ్యం, రంగుల పొందిక, రసాస్వాదనకు అధిక ప్రాధాన్యత కనిపిస్తుంది. ఈ ‘నైరూప్య’ దారిలో పయనించేవారు అరుదు... తెలుగు రాష్ట్రాల్లో మరీ అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో చిత్రకారిణి దండెం (డి) సుభాషిణి ఒకరు.
తాను గీసిన అనేకానేక నైరూప్య వర్ణ చిత్రాల్లో తన మానసిక స్థితి కనిపిస్తుందని ఆమె అంటున్నారు. కాగితం ముందు రంగులు - బ్రష్ - పాలెట్‌తో కూర్చున్నప్పుడు తన మానసిక స్థితి, మెదడులో చోటు చేసుకునే రసాయనిక చర్యకు ప్రతిరూపం నైరూప్య చిత్రం వెలుగు చూస్తుందని చెబుతున్నారు.
ఈ మాధ్యమంలో చిత్రకారుడి/ చిత్రకారిణి వైయక్తిక భావ ప్రసరణ తప్ప భౌతిక ప్రపంచంతో సంబంధం అసలు కనిపించదు. బొమ్మ గీస్తున్నప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని, పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకుండా లీనమై (ట్రాన్స్) రంగులు అద్దుతామని కూడా ఆమె అంటున్నారు.
నాలోని బాధ, ఆగ్రహం, దుఃఖం, విచారం, భయం, సంతోషం, ప్రశాంతత.. ఇట్లా అనేక భావోద్వేగాలు రంగుల్లోకి తర్జుమా అవుతాయని ఆమె అభిప్రాయ పడుతున్నారు.
తాను వాటర్ కలర్స్, ఫొటో కలర్స్‌తో కాగితంపై ఎక్కువగా నైరూప్య (అబ్‌స్ట్రాక్ట్) బొమ్మలు గీస్తున్నానని, అవి వివిధ రూపాల్లో, ఆకారాల్లో (షేప్స్), టెక్చర్‌తో, రంగుల్లో వెలుగు చూస్తాయని కూడా ఆమె అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన ‘చిత్రాన్ని’ చిత్రిక పట్టేవే తన బొమ్మలు.. సృజన.. వర్ణాలు.
సుభాషిణి కొన్ని చిత్రాలకు శీర్షిక పెడతారు. ఉదాహరణకు ఉమెన్ (మహిళ) అన్న శీర్షికతో గీసిన నైరూప్య చిత్రంలో మహిళ రూపం కనిపించదు. లీలగా కొన్ని రేఖల్లో ఆకారం వెతుక్కోవాలి.. ఫ్రేమ్ నిండా వివిధ గీతలు, త్రికోణాలు, చతురస్రాలు.. ఇట్లా దర్శనమిస్తాయి. లేత గులాబీ రంగు, కొంత పసుపు రంగు అక్కడక్కడ కనిపిస్తుంది. అంతిమంగా ఆ ఫ్రేమ్‌లో చిత్రకారిణి ఏం చెప్పదలుచుకున్నారు?.. అన్న కుతూహలం, జిజ్ఞాస వీక్షకుల్లో రేకెత్తిస్తుంది.. ఆ ఉత్కంఠ కుతూహలం వీక్షకుల్లో కల్పించడమే ‘నిజమైన ఆర్ట్’ లక్షణమని ఆమె అంటున్నారు. ఆ వర్ణ చిత్రంలో చిత్రకారిణి మానసిక స్థితిని పట్టుకోవాలని అప్పుడే ‘ప్యూర్ ఆర్ట్’ (స్వచ్ఛమైన చిత్రకళ) లోతుల్ని అవగాహన చేసుకునే అవకాశముందంటున్నారు. ఎరుపు కూడిన గులాబీ రంగు బాధకు, క్షోభకు చిహ్నంగా భావిస్తే పసుపు రంగు ప్రశాంతతకు సంకేతంగా భావించవచ్చని ఆమె అంటున్నారు. అలాగని అన్ని వేళలా ఈ సూత్రం వర్తించదని కూడా ఆమె హెచ్చరిస్తున్నారు. ‘ప్యూర్ ఆర్ట్’ను ప్యూర్ ఆర్ట్‌గా ఆస్వాదించాలన్నది ఆమె నినాదం. ఈ సిద్ధాంతం ఆధారంగానే ఆమె బొమ్మల నేపథ్యం కనిపిస్తోంది.
‘నా భావనలు, భావోద్వేగాలు, మానసిక స్థితి, మానవ సంబంధాలు నాపై చూపిన ప్రభావం, ఒత్తిడి ఇట్లా అనేకం తన బొమ్మల్లో మిళితమై కనిపిస్తాయ’ని కూడా ఆమె చెబుతున్నారు.
పీస్ (శాంతి) అన్న శీర్షికతో గీసిన మరో వర్ణ నైరూప్య చిత్రం తాను ప్రశాంతంగా, మనసులో ఎలాంటి కల్లోల పరిస్థితులు లేని సమయంలో గీశానని అంటున్నారు. ఈ చిత్రంలో రంగులు మారాయి, గీతలు మారాయి, ఫ్రేమ్ స్వరూపమే మారింది. అందులో బ్రౌన్ (కాఫీ రంగు)తోపాటు కొంత పసుపు రంగు దర్శనమిస్తుంది. తెలుపు గీతలు అగుపిస్తాయి. ఆ బొమ్మ శాంతికి చిహ్నం.. సంకేతం... అనుభూతి.. అభిప్రాయంగా ఆమె భావిస్తున్నారు. వీక్షకులు దాన్ని ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. అది వారివారి వైయక్తిక ఆసక్తి, అభిరుచిపై ఆధారపడి ఉంటుందనేది ఆమె అభిప్రాయం. ‘నా మానసిక స్థితిని రంగుల రూపంలో కాగితంపై పరిచాను.. ఆ స్థితిని వీక్షకులు ఎలా అర్థం చేసుకున్నా ‘ఇబ్బంది’ ఏమీ లేద’ని కూడా ఆమె అంటున్నారు.
మరో నైరూప్య చిత్రం శీర్షిక పేరు కన్‌ఫ్యూజన్ (గందరగోళం - అగమ్య గోచరం) చిత్రం పరిస్థితి సైతం ఇలాంటిదే తన వ్యక్తిగత జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు చేసిన ‘నా స్టేట్‌మెంట్’ ఈ చిత్రం అని ఆమె పేర్కొన్నారు. ఇలా ప్రతి బొమ్మ ఆమె స్టేట్‌మెంట్‌గా రంగుల ప్రహేళికగా, నైరూప్య వాహినిగా, చిత్రకారిణి చిత్త స్థితికి దర్పణంగా కనిపిస్తోంది.
ఇక అన్‌టైటిల్డ్ (శీర్షిక పేరు లేనివి) బొమ్మలు అనేకమున్నాయి. వాటిని వీక్షకులు తమ స్వేచ్ఛానుసారం అర్థం చేసుకోవచ్చు. రంగుల రసగంగలో తేలియాడవచ్చు. తమ అవగాహన ప్రతిభకు పరీక్ష పెట్టి తామే మార్కులు వేసుకోవచ్చు. ‘ప్యూర్ ఆర్ట్’ ప్రాథమిక లక్షణాల ఓనమాలు దిద్దవచ్చు.. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనశక్తి, స్పందించే గుణం, రసాస్వాదన లక్షణం తప్పక ఉంటుంది. అలా ఎవరి స్థాయి మేరకు వారు నైరూప్య చిత్రాల లోతులను, నిగూఢ అంశాలను, రంగుల పొందికను, ‘ప్యొట్రెన్స్’ను అవగతం చేసుకుంటారని చిత్రకారిణి గట్టి నమ్మకం. ఆమెనే కాదు నైరూప్య చిత్రాలు గీసే ప్రతివారి ‘స్టేట్‌మెంట్’ ఇదే కావడం విశేషం.
సుభాషిణి గీసిన అన్‌టైటిల్డ్ చిత్రమొకటి రంగుల కాంతిపుంజంలా దర్శనమిస్తుంది. ఓ ‘వజ్రం’లా మెరుస్తుంది. వజ్రానికుండే అనేక కోణాలు కాంతివంతంగా కనిపిస్తాయి. బొమ్మ విశిష్టమైనదిగా, విశేషమైనదిగా అగుపిస్తుంది. మిగతా బొమ్మలోని శైలి, రంగుల పోహళింపు, టెక్చర్ - ఇందులోనూ కనిపిస్తున్నా కంటికి నైరూప్యంలా కాక, ఒక ‘వజ్రం’లా దర్శనమిస్తుంది. చిత్రకారిణి ఏ ఉద్దేశంతో గీసినా, ఏ మానసిక ఇస్థతిలో రంగుల కూర్పు చేసినా అంతిమంగా అదొక ఉత్తేజకర, రంగుల విస్ఫోటనంగా ఉబికి వచ్చింది. వీక్షకుల హృదయాలను ఎలాంటి గందరగోళం పరచకుండా హత్తుకుంటుంది. ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. ఇలా కొన్ని బొమ్మలు ఆమెలోని రంగుల ఝరిని, రసాత్మకతను, సృజనను, తనదైన ‘సిగ్నేచర్ శైలి’ని తెలియజేస్తాయి. ఈ తరంలో ఇలాంటి చిత్రకారిణులూ ఉన్నారని లోకానికి ఈ బొమ్మలు చాటి చెబుతాయి.
నైరూప్య చిత్రకారిణి సుభాషిణి 1978 సంవత్సరంలో జన్మించారు. అమీర్‌పేట సమీపంలోని ఎస్.ఆర్. నగర్‌లో చదువుకున్నారు. మాసాబ్ ట్యాంక్‌లోని జెఎన్‌టియులో 2010 సంవత్సరంలో చేరే వరకు చిత్రరచనపై, ‘లైన్’పై, రంగులపై అవగాహన లేదు. కేవలం సైన్స్ డయాగ్రామ్స్, గ్రాఫ్ బొమ్మలకు పరిమితమైంది. స్నేహితురాళ్లతో ఓసారి ఆర్ట్ గ్యాలరీకి వెళ్లి రంగుల బొమ్మలు, డ్రాయింగ్స్ చూశాక, ఆ సృజన - ఆకర్షణకు వశురాలినయ్యానని అంటున్నారు.
ఆ తరువాత తన ‘్ధ్యస’ అంతా చిత్రరచన, రంగుల లోకంగా మారిందని, ‘గూగుల్’లో వెతికి, వివిధ పుస్తకాలు చదివి రంగుల ప్రపంచంలోకి ప్రవేశించానంటున్నారు. ప్రాక్టికల్‌గా బిఎఫ్‌ఏ కోర్సులో చేరాక డ్రాయింగ్ ప్రారంభించాననని అదే కళాశాలలో 2015 సంవత్సరంలో ఎంఎఫ్‌ఏ కోర్సులో చేరాక తన అధ్యాపకుల ప్రోత్సాహం, సహకారంతో సరికొత్త శైలిని (సిగ్నేచర్ వర్క్) అలవర్చుకుని పేపర్‌పై ఫొటో కలర్స్, వాక్స్‌తో సరికొత్త ‘ప్రయోగం’తో నైరూప్య మాధ్యమంలో వర్ణ చిత్రాలు గీస్తున్నానన్నారు. ఢిల్లీకి చెందిన శీలా మకజిని, మీతూసేన్ చిత్రకారిణుల సృజనను, వ్యక్తీకరణను ఆదర్శంగా తీసుకుని తనదైన పద్ధతిలో ముందుకు సాగుతున్నానని ఆమె అంటున్నారు. కాగితం.. కాన్వాసు ఆవల సైతం ఎంతో ‘ఆర్ట్’ ఉందని విశ్వసించే సుభాషిణి ప్రస్తుతం ఓ గురుకుల పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్నారు.

దండెం సుభాషిణి 78937 63386

-వుప్పల నరసింహం 99857 81799