S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యువరాణి (కథ)

ఒక అడవిలో ఏనుగు ఉండేది. దానికి ఒక పిల్ల కూడా ఉండేది. పిల్ల ఏనుగును తల్లి అల్లారుముద్దుగా చూసుకొని దానికి ‘నళిని’ అని ముద్దు పేరు పెట్టింది. తల్లి ఏనుగు రోజూ నళినిని తనతో అడవికి తీసుకువెళ్లేది. ఇంతలో వేసవికాలం వచ్చింది. వేసవి అవడంచేత అడవిలో చాలా చెట్లు ఎండిపోయాయి. ఆహారం లభించడం కష్టమైంది. ఒకనాడు పిల్ల ఏనుగు ఆకలికి తట్టుకోలేక సొమ్మసిల్లిపోయింది.
నళినిని వేసవి తీరేవరకూ ఇంటి దగ్గరే ఉండి ఆడుకోమంది తల్లి. ఆడుకోడానికి తోడుండాలి కదా! ఆటకు ఎవరు దొరుకుతారా అని చూసింది. ఎవరూ తోడు లేకపోవడం చేత విసుగనిపించింది. ఇంతలో ఒక నక్క పిల్ల, కోతిపిల్ల, లేడిపిల్ల ఒక చెట్టు క్రింద ఆడుకోవడాన్ని చూసింది. వాటితో స్నేహం చేసింది. తల్లి ఏనుగు అడవికి వెళ్లిందే తడవుగా వాటితో ఆటకు వెళ్లిపోయేది.
ఇలా మూడు నెలల కాలం గడిచింది. వర్షాకాలం వచ్చింది. అడవంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. తనతో నళినిని అడవిలోకి రమ్మంది. తన స్నేహితులతో ఆటలు ఆడుకొనే అవకాశం పోతుందని భావించి తల్లితో అడవికి పోనంది. అడవిలో ఆహారం పుష్కలంగా లభిస్తున్నా తనతో ఎందుకు రానంటుందో తల్లికి అర్థం కాలేదు.
ఒకనాడు సాయంత్రం తల్లి ఏనుగు అనుకోకుండా అడవి నుండి ఇంటికి ముందుగా వచ్చేసింది. మార్గమధ్యంలో నక్కపిల్ల, కోతిపిల్ల, లేడి పిల్లతో కలిసి నళిని పెద్దగోతిని తవ్వటాన్ని చూసింది. కొంత దూరంలో చిన్నచిన్న చెట్లు, మొక్కలు వేళ్లతో సహా పెకలింపబడి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలా పడి ఉండడానికి తన కూతురు నళిని, నక్కపిల్ల, ఈ కోతిపిల్ల కారకులై ఉంటారని భావించింది. ఒకానొకప్పుడు ఆ ప్రాంతం ఎంతో అందంగా ఉండేది. ఆ ప్రకృతి అందాన్ని తమ భవిష్యత్తు జీవనాధారాన్ని చెడగొట్టేశారని తల్లి ఏనుగుకు చాలా కోపం వచ్చింది. ఇంతలో తల్లి ఏనుగును చూసిన నక్కపిల్ల అక్కడ నుండి మెల్లగా జారుకుంది.
ఏనుగు తన కూతురు నళినిని, కోతిపిల్లను, లేడి పిల్లను పిలిచి ‘మీరంతా కలిసి ఆ మొక్కలను పీకేసారు. చెట్లు మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. బ్రతికేటందుకు మంచి ప్రాణ వాయువు నిస్తున్నాయి. పెరగవలసిన చిన్నచిన్న మొక్కలను పీకి పారేసారు. అవి మీకు ఏం అపకారం చేశాయని? జ్ఞానం లేని, మాటలు రాని జంతువులకూ అడవులను పాడుచేసే జబ్బుంది. మేథాశక్తి కలిగున్న మనుషులకూ అదే జబ్బు. మనుషులు వారి అవసరాలకు అడవులను నరికేస్తున్నారు. ఇదేం పాడు బుద్ధో తెలియకుండా ఉంది.
అప్పటికే వాతావరణంలో పెను మార్పులొస్తున్నాయి. ఎండల వలన వేడిమి విపరీతంగా పెరిగిపోతుంది. వేడిమిని తట్టుకోలేక పోతున్నాం. వర్షాలు సకాలంలో కురవకుండా ఉన్నాయి. వాతావరణ సమతుల్యం లేకపోవడం వలన మనలాంటి జీవులు బ్రతకడం కష్టంగా ఉంది. ఈనాటి చిన్నచిన్న మొక్కలే ఎదిగి భవిష్యత్తులో మనకు ఆహారంగా ఉపయోగపడతాయి. వాటికి మనం అపకారం చేయకూడదు. వాటికి అపకారం చేస్తే మనకు మనం అపకారం చేసుకున్నట్టే!
ఇక ఆ నది ఒడ్డున గల ఇసుక తినె్నలపై ఆడుకోడానికి పెద్ద పెద్ద గోతులు తవ్వారు. ప్రస్తుతం మీకు సరదాగానే ఉంటుంది. వర్షాల కాలం వచ్చింది. నదులు పొంగుతాయి. నీరు అధికమైతే మీరు తీసిన గోతుల్లో మీరే వాటిలో పడి ప్రాణాలు కోల్పోతారు’ అని తల్లి ఏనుగు ఘీంకరించింది. పిల్ల ఏనుగు ఏడుపు మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న నళినిని చూసి ఇంకా కోపం వచ్చింది. ఇంకా కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది.
తల్లి ఏనుగు లేడిపిల్లను, కోతి పిల్లను, తన కూతురు నళినిని రమ్మంది. వారిచే గోతులు త్రవ్వించి పీకి పారేసిన మొక్కలన్నింటిని తెప్పించి ఆ గోతుల్లో తిరిగి నాటించింది. పని పూర్తి అయిన తరువాత లేడిపిల్ల, కోతిపిల్లలను ఏనుగు వారింటికి వారిని పొమ్మంది. తల్లి తనచే బలవంతంగా పని చేయించినందుకు నళిని కుమిలి కుమిలి ఏడ్చింది. అయినా తల్లి ఏనుగు ఏ మాత్రం చలించలేదు.
తల్లి ఏనుగు పిల్లను ఇంటికి తీసుకుపోయింది. ఇంటి దగ్గర పిల్ల ఏనుగును చేరదీసి ఎన్నో బుద్ధులు నేర్పింది. మన అడవిని మనం తగులబెట్టుకుంటే మన భవితను మనం తగలబెట్టుకున్నట్టేనమ్మా! మన స్నేహం ఎప్పుడూ మంచి వాళ్లతోనే ఉండాలి కానీ చెడ్డవాళ్లతో కాదు! నిప్పు కూడా చెడ్డదానివై పోతావు. అలా వారితో చేరి నువ్వు చెడ్డదానివై పోవడం నీకు ఇష్టమా చెప్పు. అందరి దగ్గరా మంచిగా మెలగాలి. అందరికీ పనికొచ్చే మంచి పనులు చేయాలి. మంచి పిల్లవనిపించుకోవాలి. ఈ అడవికి యువరాణివి అవ్వాలి’ అంటూ తల్లి ఏనుగు నళిని తలను గోముగా నిమిరింది.
‘అమ్మా! మంచి పనులు చేస్తే ఈ అడవికి యువరాణిని అవుతానా?’ అంటూ తబ్బిబ్బయింది.
‘తప్పకుండా అవుతావమ్మా!’
నళిని ఆ రోజు నుండే మంచి పనులు చేసి మంచిపిల్లగా మార్పు చెందింది. తరువాత కాలంలో అడవికి యువరాణి అయ్యింది.

-శివ్వాం ప్రభాకరం 701 3660 252