ఎప్పటికీ కలవని బంధం!
Published Saturday, 26 October 2019కొన్ని బంధాలంతే
ఎప్పటికీ కలవవు
ఎక్కడో దూరాన
కలిసినట్టు కనిపిస్తాయంతే
పక్క పక్కనే వుండి
పలకరిస్తున్నట్టుగానే వుంటాయి
వత్తిళ్లతో పుటం పెట్టుకుంటూ
శ్రమైక జీవితమై పోతుంటాయి
మురిపంగా ఎదురుబొదురుగా కూర్చుండి
ముచ్చట పెడుతున్నట్టుగానే వుంటాయి
నీలాగే నేనూ...
నాలాగే నీవూ.. అంటూ
అపురూప ఆదర్శాలను వల్లిస్తున్నట్టుగా
ఆదర్శ నేస్తమై నిలుస్తుంటాయి
కరచాలనమైనా చేయలేని
ఈ బతుకు బందీలపై
ఎన్నో బంధాలు కదిలిపోతుంటాయి
గమ్యాలకు చేరుకుంటూ వుంటాయి
నిశ్చలమైన ఈ జంట మాత్రం
బ్రతుకు బోగీలను మోస్తూ...
మహాప్రస్థానమై అలాగే వుంటాయి
కొన్ని సందేశాలను మనకు వదిలేసి...! *