S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యావంతుడు (కథ)

ఒక ఊరిలో గుణవర్మ అనే వ్యక్తి నివసించే వాడు. అతనికి విజ్ఞానం అనంతంగా గడించాలనీ తనంత గొప్పవాడు లేడనీ అనిపించుకోవాలనీ తపన వుండేది. అందువల్ల ఆ ఊళ్లో ఉన్న మహాపండితుడు రామశాస్ర్తీ వద్ద శిష్యరికం చేస్తూ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అయితే అంతటితో అతని విద్యాభ్యాసం పూర్తి కాలేదు. దేశాలు పట్టి తిరుగుతూ ఎంతోమంది గురువులనూ, మేధావులనూ కలుసుకుని వారి వద్ద నేర్చుకుంటూ అపూర్వమైన విజ్ఞానం సంపాదించుకున్నాడు.
అప్పటికే అతనికి నలభై సంవత్సరాలు వచ్చేశాయి. ఈనాడు అతను గొప్ప విజ్ఞానవంతుడు. మేధావి. తనకు విద్య నేర్పిన గురువుల కంటే ఘనుడు. అనేక కళలలో ఆరితేరిన ధీమంతుడు. అంత గొప్ప ప్రతిభా పాటవాలు అతనిలో క్రమంగా అహంభావాన్ని రేకెత్తించాయి.
అయితే తనవంటి విద్యావంతుడు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరిక కల్గింది.
ఆ ప్రయత్నంలో పడ్డాడు.
కానీ అతని గురించి పట్టించుకున్న వారే కనపడలేదు. పైగా కృష్ణశాస్ర్తీ అనే అతని గురించి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు. అది అతనికి చాలా బాధ కల్గించింది.
ఇంతకాలం తాను పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైనట్లు భావించాడు. పైగా ప్రజల్లో కృష్ణశాస్ర్తీకి వున్న పేరు ప్రతిష్ఠలు చూసి అసూయ కూడా కల్గింది. కృష్ణశాస్ర్తీని కలిసి విద్యలో అతణ్ణి ఓడించి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశించాడు. ఆ మరునాడే కృష్ణశాస్ర్తీ నివసిస్తున్న రామగిరికి బయలుదేరాడు.
అతణ్ణి కలుసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అతనో పూరిపాకలో ఉంటున్నాడు. చుట్టూ పిల్లలు అతను చెబుతున్న పాఠాలు వల్లె వేస్తున్నారు.
కృష్ణశాస్ర్తీ చెబుతున్న పాఠాలు ఆలకించిన గుణవర్మకి నవ్వు వచ్చి ఆపుకోలేక ఫక్కున నవ్వాడు.
అప్పుడు కృష్ణశాస్ర్తీ గుణవర్మను చూసి వినయంగా నమస్కరించి వివరాలు అడిగాడు. గుణవర్మ తన పాండిత్యం బయటపెట్టి, నీ గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటుంటే నిన్ను ఓడిద్దామని వచ్చాను. తీరా చూస్తే నువ్వు చెబుతున్న పాఠాలు సాధారణమైనవి. ఇలాంటి సామాన్య పండితుడికి ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయో మరి? అన్నాడు హేళనగా.
కృష్ణశాస్ర్తీ ఆ అవహేళన పట్టించుకోకుండా వినయంగా, ‘ఆర్యా! మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నదీ అనేది ప్రశ్న కాదు. ఎంత విజ్ఞానం ఉచితంగా దానం చేశామన్నదే ప్రశ్న. పిల్లికి బిచ్చం పెట్టని కోటీశ్వరుడి గురించి ప్రజలు పట్టించుకోరు. పది మందికి తనకున్న దానిలో పెట్టే పేదవాడికే పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. బహుశా నా గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవడానికి అదే కారణం అనుకుంటాను’ అన్నాడు.
దాంతో గుణవర్మ తల తిరిగిపోయింది. జ్ఞానోదయం కలిగింది. తన స్వగ్రామం వెళ్లిపోయి విద్యాదానం చేస్తూ అనతికాలంలోనే ప్రఖ్యాతి పొందాడు.

-వులాపు బాలకేశవులు 9704527928