S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కుంభకోణం అప్రతిష్ఠ

కుంభకోణం అనగానే వంచన, కపటం, మోసం, చేతివాటం, దగా అనే అర్థాలు తెలుగులో రూఢమైనాయి. కుట్ర అనే అర్థంలో కూడా విరళంగా వాడుక ఉంది. ఈ అర్థాలు ఈ పదానికి అంతా నూరేళ్ళనుంచే తెలుగులో వాడుకలోకి వచ్చాయి. ఆధునిక తెలుగు నిఘంటువే లేదు. కాబట్టి ఈ మాట రుూ అర్థాలలో తెలుగులోకి ఎక్కిందో లేదో తెలియదు.
కుంభకోణం గొప్ప పుణ్యక్షేత్రం. అత్యంత ప్రాచీనమైన పవిత్రస్థలమని స్థలపురాణాలు చెపుతున్నాయి. గొప్ప విద్యాక్షేత్రం. ధూర్జటి మహాకవి కాళహస్తి మహాత్మ్యంలో ఈ పుణ్యక్షేత్రాన్ని గొప్పగా ప్రసక్తం చేశాడు. పాపనాశిని అన్నాడు. గొప్ప నదులకు కుంభమేళా పవిత్రోత్సవాలు జరిగినట్లే కుంభకోణంలోని ఒక పవిత్ర సరస్సుకు కుంభమేళా ఉత్సవం ద్వారా తంజావూరు మహారాజు రఘునాథ నాయకుడు కుంభకోణంలో చిన్న ఊరంత గుడి కట్టించాడు. ఈ దేవాలయంలో రఘునాథ నాయకుడు విజయ రాఘవ నాయకుడికి శిలాప్రతిమలున్నాయి. వీళ్ళు వైష్ణవ దీక్షాపరులు. అయితే అద్వైత తత్త్వ పరినిష్ఠితులు. కుంభకోణం రఘునాథ నాయక నిర్మిత దేవాలయంలో అర్చాదైవం శారపాణి. అంటే మహావిష్ణువు. అయితే జనుల వాడుకలో ఆయన కాస్త సారంగపాణి అయినాడు. సారంగపాణి శివుడు. ఇది విషయాంతరం. ఆ రోజుల్లో చెన్నపట్నం తరువాత గొప్ప విద్యా కేంద్రం కుంభకోణమే. ప్రాచీన తమిళ భాషా పరిశోధనలన్నీ ఇక్కడే జరిగాయి. కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో గొప్ప తమిళ విద్వాంసులుండేవారు. నగరంలో కావేరి నది కాలువ ప్రవహిస్తుంది. శిలప్పదగారం, మణిమేఖల తమిళులకు కాశీ, రామేశ్వరాలకన్నా ప్రీతిపాత్రమైనవి కదా! ఈ రెండు ప్రాచీన మహా కావ్యాల ఉనికి, పరిశోధన, పాఠ నిర్ణయం, తాళప్రతుల అధ్యయనం కుంభకోణం ద్వారానే వెలుగుచూశాయి.
ఉత్తమదానపురం వెంకట రామస్వామి నాథ అయ్యర్‌కు తెలుగు బాగా వచ్చి ఉండాలి. ఈయన స్వీయ చరిత్ర పేరు నా చరిత్ర (కథ). వీరు కుంభకోణం గవర్నమెంటు కళాశాలలో చాలా సంవత్సరాలు పనిచేశారు. వీరి స్వీయచరిత్రలో చాలా కుతూహలం రేకెత్తించే ఆసక్తిరమైన విషయాలు రాశారు ఉ.వై. స్వామి నాథ అయ్యర్. ఈయన మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.
మరి తెలుగువారికి కుంభకోణం గొప్ప యోగ విద్యా కేంద్రం. మాస్టర్ సి.వి.వి అనే పేరు మీరు ఎప్పుడో ఎక్కడో విని ఉండవచ్చు. తెలుగువారికి ప్రాతఃస్మరణీయులైన వేటూరి ప్రభాకరశాస్ర్తీ మహోదయుల స్వీయ చరిత్ర చదివితే తెలుస్తుంది. ప్రపంచ చరిత్రలోనే గొప్ప యోగవిద్యనాయన ఆవిష్కరించారు. వారి నామాక్షర సంపుటయే యోగసాధన ధ్యాన, ధారణ మంత్రం. ఆ మహానుభావుడి పేరు కంచుపాటి వెంకాసామి వెంకటరావు (సి.వి.వి.) దక్షిణ భారతదేశంలో తెలుగువారికి సి.వి.వి. యోగ విద్యా దైవత వౌళిమణి. తక్కిన దాక్షిణాత్య రాష్ట్రంలో వీరి ప్రభావం అంతగా ఉన్నట్లు లేదు. కావేరి కాలువ ఒడ్డున వీరి ఇల్లు. ఇంటిముందు పెద్ద యోగశిక్షణ ఆవరణ స్థలం ఉన్నాయి.
కుంభకోణం పవిత్రత గూర్చి ఇంకా చెప్పాలంటే నగరానికి శివారులో స్వామి మల అని కుమారస్వామి పుణ్యక్షేత్రం చిన్న ఎతె్తైన కొండమీద ఉంటుంది. ఈయనను తగప్పన్ స్వామి అంటారు. చాలా మహిమాన్వితమైన క్షేత్రం. తండ్రికే ఉపదేశం చేసిన దేవుడట ఈయన. మరి ఇటువంటి కుంభకోణానికి తెలుగులో ఇంత అప్రతిష్టాకరమైన చెడ్డ పేరు ఎలా వచ్చింది? ఈ నూరేళ్ళలో వేలసార్లు దురర్థాలలో ఎందుకు ప్రయుక్తమైంది?
1919కి ముందు మద్రాసు రాష్ట్రంలో తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు ప్రాంతాలు సంయుక్తంగా ఉండేవి. శాసనసభ ఒకటేగా ఉండేది. 1918 ప్రాంతంలో సంయుక్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం కుంభకోణంలో జరిగింది. ఈ సమావేశంలో తెలుగువారి నోరు నొక్కి, మచ్చుపొడిజల్లి, తెలుగువారి ప్రయోజనాలకు అత్యంత హానికరమైన తీర్మానాలు తమిళ రాజకీయ ధూరృహులు నెగ్గించుకున్నారు. రాజాజీ కూడా ఉన్నాడేమో తెలియదు. మా ఇంటికొస్తే మాకేమి తెస్తావ్, మీ ఇంటికొస్తే మాకేమిస్తావ్!! అనే ధోరణిలో తెలుగువారికి గొప్ప అన్యాయం తలపెట్టారు తమిళ తంబులు.
తెలుగు కాంగ్రెస్‌వారు లబలబలాడారు. అప్పట్లో భారత స్వాతంత్రోద్యమంలో మేరునగం వంటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మహాశయుడు కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గ సమావేశాలలో పట్టుబట్టి తెలుగువారికి ప్రత్యక ప్రాదేశిక కమిటీని ఏర్పాటుచేయించారు. (1918-1919).
లోకమాన్యుడి పుణ్య జీవిత శతవర్థంతి, ఈ సంవత్సరం. తెలుగువారు కృతజ్ఞతతో వారికి మొక్కాలి. గూడూరి నమశ్శివాయ గారిపేరు మీరెప్పుడైనా విన్నారా? విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నగరంలోకి వెళ్ళే దారిలో మృత్యుంజయ ఆయుర్వేద ఫార్మశీ ఉండేది. వీరి తండ్రి వియ్యన్నపంతులు. వీరి షాపుకి ఆనాటి సారస్వతీయులంతా వచ్చి ఇష్టాగోష్టి చేసేవారు. ఈ నమశ్శివాయ ఈ విషయాలు చెప్పారు.

-అక్కిరాజు రమాపతిరావు