S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంపదే దేశ బలం

కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అంశం ఇటు ఇండియాలో, అటు పాకిస్తాన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండియాలో కన్నా పాకిస్తాన్‌లో ఎక్కువ చర్చ సాగుతోంది. ఏడు దశాబ్దాల పాటు కాశ్మీర్ పేరు మీదనే పాక్ పాలకులు, సైన్యం బతికేస్తుంది. అన్ని దేశాల్లో దేశం కోసం సైన్యం ఉంటుంది. కానీ పాక్‌లో మాత్రం సైన్యం కోసం పాక్ దేశం ఉంది అని ఒక విమర్శ. పాకిస్తాన్‌లో సైన్యందే అసలైన అధికారం. ప్రధాని కన్నా సైన్యాధ్యక్షుడే పవర్‌ఫుల్. సంపదకు పాక్‌కు సంబంధం ఏమిటో చెప్పుకుందాం.
కాశ్మీర్ పేరుతోనే బతుకుతున్న పాకిస్తాన్ ఆర్టీకల్ 370 రద్దుతో దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. చైనా మినహా పాకిస్తాన్‌కు ఏ ఒక్క దేశం కూడా అండగా లేదు. చైనా సైతం పాక్‌తో కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపడ్డం వల్ల అండగా నిలిచింది.
ఇండియా తీసుకున్న చర్యపై పాకిస్తాన్‌లో మేధావులు, ప్రజలు, వివిధ వర్గాల వారు ఏమనుకుంటున్నారు, వారి మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఆ దేశానికి చెందిన పలు వీడియోలు చూశాను.
యుద్ధం చేయాలి అని గర్జిస్తున్న వారూ ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ ఎంత దయనీయమైన స్థితిలో ఉందో వివరించిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇండియా ఆర్థిక పరిస్థితి ఎక్కడ? మనం ఎక్కడున్నాం అంటూ పలువురు పాక్ ఆలోచనా పరులు ఆ దేశ దుస్థితి గురించి గణాంకాలతో సహా వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు నాన్( రొట్టెలు)్ధర తగ్గించాలని దేశంలో సాగుతున్న ఆందోళన వివరించారు.
అదే సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీకి లభించిన ఆదరణ, ట్రంప్ మద్దతు ప్రపంచానికి భారత శక్తిని తెలిపింది. ఒక రోజు తరువాత పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వెళితే పెద్దగా పట్టించుకోలేదు.
***
సంపన్నులైన వ్యక్తులకు, సాధారణ వ్యక్తులకు లభించే ఆదరణలో తప్పకుండా తేడా కనిపిస్తుంది. అది వ్యక్తుల విషయంలో కావచ్చు దేశం విషయంలో కావచ్చు.
బంధువుల్లో కొందరు సంపన్నులు, కొందరు పేదవారుగా ఉన్నప్పుడు మనం ఇలాంటి చర్చలు వింటుంటాం.
దగ్గరి బంధువును ఐనా పేదవాడిని కాబట్టి పట్టించుకోరు. అదే దూరపు బంధువులు ఐనా డబ్బున్న వారు ఐతే చాలు వారు విలువ ఇస్తారు. డబ్బుకే విలువ కానీ బంధుత్వాలకు విలువ లేదు అంటూ ఇలాంటి ఏడుపు మాటలు మనం చాలా సార్లు వింటాం.
ఇందులో తప్పేముంది సంపన్నుడు తాను మరింత సంపన్నుడిని కావాలని కోరుకుంటాడు. నలుగురు సంపన్నులతో తిరిగితే వారి వ్యూహాలు తెలుస్తాయి. మనం వారిలా బాగుపడవచ్చు అనుకుంటాడు. అదే ఒక నిరుపేదతో తిరిగితే అప్పులు అడుగుతాడు అనే భయం ఉంటుంది. అందులోనూ పాత పరిచయం, బంధుత్వం ఉంటే ఇంకా ఎక్కువ భయం కలుగుతుంది. ఎక్కడ డబ్బులు అడుగుతాడో అనే భయం ఉంటుంది.
వ్యక్తుల విషయంలో మనం ఇలాంటి మాటలు ఎన్నోసార్లు విన్నాం. చిత్రంగా పాకిస్తాన్ గురించి వింటున్నప్పుడు ఆ దేశం వారి నుంచే ఇవే మాటలు వినిపించాయి. మన జాతీయ చిహ్నం చిప్పగా మారిపోయింది. మనం చిప్ప పట్టుకుని దేశాలు తిరుగుతున్నాం. ప్రపంచంలో మనల్ని ఏ దేశం పట్టించుకోదు. యుద్ధం అనే నినాదాలు పక్కన పడేసి ముందు మనం ఆర్థికంగా బాగుపడదాం అంటూ పాకిస్తాన్‌కు చెందిన ఆలోచనా పరులు ఆవేదనగా చెబుతున్నారు. తాహిర్ మాలిక్ అనే జర్నలిస్టు పాకిస్తాన్ సైన్యం ఆలోచనపై ఒక పుస్తకం రాశారు. ‘‘మనం యుద్ధ వీరులం అనుకుంటాం. ఒక పాక్ సైనికుడు పది మంది భారత సైనికులతో సమానం. ఇస్లాం సైనికులం. మనం యుద్ధం కోసమే పుట్టాం అనేది మన సైన్యం భావన. ప్రపంచం మారిపోయింది. మనం ఇంకా వేల సంవత్సరాల క్రితం నాటి భావనతో ఉన్నాం. ఈ ఆలోచనతోనే అప్పుల్లో కూరుకుపోయాం. ప్రపంచంలో ఎక్కడా మనకు విలువ లేదు. అదే సమయంలో ఇండియా ఆర్థికంగా దూసుకెళుతుంది. టర్కీ ఒకప్పుడు నిజంగానే వారియర్. ఇస్లాం వీరులు అనేక దేశాలతో యుద్ధాలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ ఆలోచన పూర్తిగా మారిపోయింది. యుద్ధం లేదు. శాంతినే నమ్ముకున్నారు. టూరిజం ఆ దేశాన్ని ఆర్థికంగా బాగా అభివృద్ధి అయ్యేట్టు చేసింది. పెద్ద సంఖ్యలో యూరప్ దేశాల టూరిస్టులు టర్కీకి వస్తున్నారు. వారియర్స్ అనే ఆలోచన నుంచి మనం మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు మనం ఎలా మారుదాం అనే ఆలోచన టర్కీని అభివృద్ధి దిశగా తీసుకెళితే మన ఆలోచన మనల్నీ ఆర్థిక సహాయం కోసం దేశాల చుట్టూ తిరిగేట్టు చేసింది’’ అంటూ పాక్ జర్నలిస్టు ఒక దేశం ఆర్థికంగా బలపడితేనే నేటి ప్రపంచంలో విలువ అంటూ చెప్పుకొచ్చారు. దేశాల విషయంలోనైనా, వ్యక్తుల విషయంలోనైనా అంతే. ఈ రోజు అమెరికా లాంటి అగ్ర దేశాధ్యక్షుడు సైతం ఇండియాకు విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా, సాంకేతికంగా భారత్ ఎదుగుదలే ప్రపంచంలో ఆదేశానికి గౌరవాన్ని పెంచింది.
నీ బలమే నీకు విలువను ఇస్తుంది. ఈ రోజుల్లో బలం అంటే ఆర్థికంగా సాంకేతికం అంశాలు కీలకం. అలానే వ్యక్తులు సైతం తమ బలం పెంచుకోవాలి. దగ్గరి బంధువులు, దూరం బంధువులు, ఆత్మీయులు అని చెప్పుకుని తిరగడం కాదు. వారు పట్టించుకోరు అని ఆవేదన చెందడం కాదు. నా బలాన్ని నేను ఎలా పెంచుకోవాలి అని ఆలోచించాలి. ముందు నుంచి దానిపై దృష్టిసారించాలి. ఆర్థిక సహాయం కోసం దేశాలు పట్టుకుని తిరిగే పాకిస్తాన్‌లా మన జీవితం ఉండాలా? అన్ని రకాల బలాలతో తలెత్తుకుని తిరిగే భారత్‌లా ఉండాలా? అనేది మన చేతిలోనే ఉంటుంది. పాకిస్తాన్‌లా ఉండాలి అంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇండియాలా బలపడాలి అంటే సరైన ప్రణాళిక అవసరం. ఏ రంగంలో మీకు ఆసక్తి ఉందో గుర్తించి, ఆ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలి. సంపాదనతో మీ బలాన్ని నిరూపించుకోవాలి. దేశానికి ప్రపంచంలో గౌరవం లభించాలి అన్నా, నలుగురు వ్యక్తుల్లో మీకు విలువ ఉండాలి అన్నా ఆర్థికంగా బలంగా ఉండి తీరాల్సిందే.

-బి.మురళి