S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అతి తెలివి (కథ)

గోపాలపురంలో వున్న సత్యం ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తెలివైనాడు.. చదువులో ముందు ఉండేవాడు. తమ ఊరిలో అయిదవ తరగతి వరకే ఉండడంతో ఊరిలో ఉండే మిగిలిన పిల్లలు సుబ్రహ్మణ్యం, నాగేంద్ర, అచ్యుత్, సుబ్బారావులతో కలిసి ప్రక్క ఊరు అయిన నరేంద్ర పట్నం వెళ్లి చదువుకునేవాడు.
సత్యం ఇంటిప్రక్కనే సుబ్రహ్మణ్యం ఇల్లుకూడా ఉండడం.. ఇద్దరూ బంధువులు కావడంతో.. సత్యం మరింత చనువుగా.. మనసులో మాటను దాచుకోకుండా అరమరికలు లేకుండా ఉండేవాడు.
సుబ్రహ్మణ్యనికే కాస్త భేషజం ఎక్కువ.
తండ్రి ఊరిలో మోతుబరి రైతు కావడంతో, దేనికీ లోటులేకపోవడం.. ప్రక్క ఊరిలో వున్న హైస్కూలికి వెళ్ళడానికి తండ్రి ఓ సైకిలు కూడా కొనివ్వడంతో, అతిశయం తోడై గర్విష్టిగా తయారయ్యాడు.
సత్యం తండ్రికి వున్న కొద్దిపాటి పొలంతో ఆర్థిక లేమితో సతమతమయ్యేవాడు.
పొలం పనులలో తండ్రికి సహాయం చెయ్యడంవలన స్కూల్‌కి కాస్త ఆలస్యంగా బయలుదేరాల్సి వస్తుండేది. అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యాన్ని బ్రతిమాలి అతని సైకిలు ఎక్కేవాడు. సత్యాన్ని సైకిలు ఎక్కించుకోవడం సుబ్రహ్మణ్యానికి అంత ఇష్టం లేకపోయినా.. తనని ఎక్కించుకుని తొక్కేవాడు కాబట్టి, వప్పుకునేవాడు.
ఒకసారి..
స్కూల్ నుంచి ఇంటికివచ్చిన సత్యం వాళ్ళమ్మని బ్రతిమాలుతున్నాడు. ‘‘అమ్మా! నా సీమెండి (అల్యూమినియం) టిఫిన్ డబ్బా చిలుంపట్టి బాగా పాడయ్యింది కదా! మా స్కూల్లో అందరూ స్టీలు డబ్బాలు తెచ్చుకుంటున్నారు. నేనూ అలాంటిది కొనుక్కుంటానే. మన ఊరి ‘బాపిరాజు’ కొట్లో ఒక డబ్బా వుంది. పదకొండు రూపాయలు చెబితే, తొమ్మిది రూపాయలకు బేరం ఆడాను. రేపు డబ్బులు తెచ్చి, తీసుకువెళతానని వచ్చాను.. తొమ్మిది రూపాయలు ఇవ్వవే’’ అని.
ఊరిలో వున్న బాపిరాజు కొట్లో దొరకని వస్తువు వుండదు. మందుబిళ్ళలు దగ్గర నుంచి పప్పు, బియ్యం వంటి కిరణా సరుకులతో పాటు స్టీలు వస్తువులూ, చిన్నపిల్లల బట్టలు కూడా దొరుకుతాయి. పల్లెటూరిలో అదోపెద్ద సూపర్ మార్కెట్.
‘‘ఇప్పటికిప్పుడు అంటే, ఎలాగరా? చేతిలో డబ్బులండాలి కదా! మీ నాన్నని అడుగు’’ చెప్పింది తల్లి బంగారమ్మ.
తండ్రి ముందే ఖర్చుని కాదంటాడు. అయినా అడిగాడు. కథ అంతా వినిపించాడు.
‘‘కొబ్బరికాయల తాత రావాలి. తీసుకెళ్లిన కొబ్బరి కాయల లెక్క ఇస్తే అపుడు చూద్దాం!’’ అన్నాడు తండ్రి కొండారెడ్డి.
ఆ కొబ్బరికాయల తాత రెండు మూడు రోజులకు ఓసారి వచ్చి ఊరిలో వాళ్ళ దగ్గిర కొబ్బరికాయలు కొని.. డబ్బులు ఇచ్చి వెళుతుంటాడు. అప్పుడే వాళ్ళ చేతిలో కాసిన్ని డబ్బులు కనిపిస్తాయి.
అప్పటివరకూ ఆగితే, ఆ ‘డబ్బా’ అక్కడ ఉంటుందా! అక్కడ ఒకటే ఉండడం అది తనకు ఎంతగానో నచ్చడంతో బాపిరాజుతో ‘‘రేపే వచ్చి కొనుక్కుంటానని మరెవ్వరికీ.. ఇవ్వద్దని’’ చెప్పి మరీ వచ్చాడు.
‘‘నువ్వు వచ్చే లోపు మరే బేరం తగలకుండా ఉంటే ఉంచుతాను’’ చెప్పాడు బాపిరాజు వ్యాపార ధర్మంగా.
తండ్రి అలా అనడంతో చేసేది లేక మిన్నకుండిపోయాడు.
తల్లి దగ్గర అస్సలు డబ్బులు ఉండక కాదు. ఇల్లు గడవడం కోసం కొద్దో గొప్పో ఉంటాయి. జీవితాన్ని అలా పట్టుకుంటే తప్ప నడవదని ముందు జాగ్రత్త.
ఆ రాత్రి సత్యం అలిగాడు. బంగారమ్మ ‘రెండు రోజులు ఆగు’ సముదాయించింది.
***
రెండు రోజుల తరువాత మధ్యాహ్నం పూట...
స్కూల్ పిల్లలందరూ ఎప్పటిలానే వేపచెట్టు చప్టామీద కూర్చుని కారేజీలు, టిఫిన్ డబ్బాలూ విప్పుకుంటున్నారు. సత్యం తన రంగు వెలసిన డబ్బా మూత తియ్యడానికి ఇబ్బంది పడుతుంటే, సుబ్రహ్మణ్యం తళతళలాడే తన కొత్త డబ్బా తీసి అందరికీ చూపించాడు.
అందరూ ‘చాలా బాగుంది, ఎంత’ అడిగారు.
ఆ మెచ్చుకోలుకి పొంగిపోయి ‘పది రూపాయలు’ చెప్పాడు ఉత్సాహంగా.
సత్యానికి నోట మాట రాలేదు. తను కలలు కంటున్నదానిలానే, నీలం రంగు స్టిక్కరుతో సరిగ్గా అలానే ఉంది. ఆశ్చర్యం నుంచి తేరుకుని ‘ఎక్కడ కొన్నావ్’ అడిగాడు.
‘బాపిరాజు కొట్లోనే’ కాలర్ ఎగరేశాడు.
అక్కడ తప్ప మన ఊరిలో సరుకులెక్కడ దొరుకుతాయి అన్నంత ధీమాగా. తను ఆ వస్తువు కొనాలనుకున్న విషయం సుబ్రహ్మణ్యానికి చెప్పాడు. కానీ రెండు రోజులైనా కొనలేకపోయాడు.
తమ ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని సుబ్రహ్మణ్యం అవకాశం తీసుకున్నాడు.
తనదనుకున్న వస్తువు చేజారిపోయింది. తనకన్నా ముందుగా వెళ్లి ‘అదే’ డబ్బాను.. ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి స్వంతం చేసుకున్నాడు.
జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పి బాధపడ్డాడు సత్యం.
స్నేహితుడు అలాంటి పని చేస్తాడని అనుకోలేదు. ఏదైనా ప్రక్కవాళ్ళతో పంచుకోవడం సత్యానికి అలవాటు. అదే మనస్తాపాన్ని తెచ్చిపెట్టింది.
కొడుకు బాధపడడం కొండారెడ్డిని కదిలించింది. బంగారమ్మ కూడా బాధపడింది.
‘‘పోతేపోయిందిలేరా! ఒక అవకాశం పోతే, ఇంకోటి వస్తుంది. మన చేతిలో డబ్బు ఉండాలేగానీ, అంతకన్నా మంచిదే కొనుక్కోవచ్చు. టౌనులో అయితే పెద్ద షాపులుంటాయి. రేపుమన చేలో కాసిన బీరకాయలు, బెండకాయలూ తీసుకుని మార్కెట్టుకి వెళుతున్నాను. వచ్చేటప్పుడు అంతకన్నా మంచిది తెస్తాలే’’ ఓదార్చాడు.
సత్యం ముఖంపై చిరునవ్వు వెలిసింది.
అన్నట్టుగానే ఇంకాస్త బాగున్న రెండు అరలు వున్న స్టీలు డబ్బా కొని కొడుక్కి ఇచ్చాడు. సత్యం చాలా సంతోషపడ్డాడు. తను ఇష్టపడిన దానికన్నా చాలా బాగుంది.
****
అదే పది రూపాయలకి.. సత్యం రెండు అరలు వున్న స్టీలు డబ్బా కొనుక్కోవడం.. మింగుడుపడలేదు సుబ్రహ్మణ్యానికి.
ఆ మరునాడే, తన బాపిరాజు దగ్గరకు వెళ్లి ‘తొమ్మిది రూపాయలు ఇస్తానన్నాడు’.
‘‘లేదు. బేరం అయిపోయింది. మీ సత్యమే అడిగాడు’’ చెప్పాడు బాపిరాజు.
‘‘వాడు రాలేదు కదా!’’
మాట్లాడలేదు బాపిరాజు.
‘‘పది రూపాయలు ఇస్తాను’’ అనడంతో.. తీసి ఇచ్చాడు. ఎంతైనా లాభం.. లాభమే కదా!
తనే భేషజానికి పోయి అతి తెలివిగా ప్రవర్తించాడు. అందుకే తోటి పిల్లలు ఈసారి సత్యం టిఫిన్ డబ్బాని మెచ్చుకుంటుంటే, వౌనంగా ఉండిపోయాడు.

-పి.ఎల్.ఎన్.మంగారత్నం