S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-31

పాత నేరాలతో సహా బైటకపడ్డ ధర్మారావు, అనిల్, కాంతారావులకి యావజ్జీవం, వాళ్ళకి సహకరించిన కొందరికి తగిన శిక్షలు పడి కటకటాల వెనక్కి వెళ్లిపోయారు. టీవీలు, పేపర్లు గౌతమి, చందన సాహసాలని అభినందిస్తూ ఆకాశానికెత్తేశాయి. ప్రభు, విజయనాయక్, ప్రయాగలని పట్టువదలని విక్రమార్కుల్లా దొంగలూ, నగలూ, అపురూప విగ్రహాలు దొరికేదాకా వదలకుండా విజయం సాధించినందుకు ప్రశంసించాయి. ఎంతో రహస్య పథకాలు వేసి, ‘దొంగలు నగలు దొరికేదాకా నిద్రపోనని శపథం చేసిన చంద్రని ప్రతిపక్షాలవారు సైతం భళా భళా చంద్రా’ అంటూ మెచ్చుకున్నారు.
ఓమంచి రోజున గుళ్ళోని అమ్మవార్లు, అయ్యవార్లు మళ్లీ ఆభరణాలన్నీ ధరించి వెలిగిపోయారు. ఆలయానికి పూర్వవైభవం వచ్చేసింది. బ్లాక్ టైగర్‌ని ఓ రాక్షసుడిలా భావించిన జనాలు అతని త్యాగబుద్ధిని గురించి విని ముక్కున వేలేసుకున్నారు. ఒకసారి అతన్ని చూడాలని కూడా ఆశపడ్డారు. అయితే అటుకేసి వెళ్ళరాదనే ఆంక్ష విని ఆ ఆశని చంపుకున్నారు.
చంద్రక్కూడా ఒకసారి అతన్ని కలిసి, కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ, ఆటవికులకి ఏదైనా సహాయం చేద్దామని అనిపించినా ప్రభు, విజయనాయక్‌ల మాట మీద ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
శంకరయ్య ఆరోగ్యం బావుండడంతో కన్నతల్లి నీడలా భావించే కొండమీదికి చేరిపోయారు. కూతురు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఓ దుర్మారుడైపోయాడే అన్న బాధ వున్నా, పెళ్లికాకముందే అతని విషయం బైటపడినందుకు ఆనందించాడు. అయితే కూతురి మనసులో ఏముందో ఆ తండ్రికి అర్థంకాలేదు.
గౌతమి కూడా అంతకుముందు ఏం జరగనట్టు కొండకిందికి, కొండమీదికి చెట్ల కిందికి వెళ్ళొస్తూనే వుంది. తరచూ విజయనాయక్, ప్రభు, ప్రయాగ లాంటివారిని కలిసి కబుర్లు చెప్తూనే వుంది. ఓ మంచి డాక్టర్ అలా గడపడం బాధగా అనిపించింది చంద్రకి. ఆమె అనిల్‌ని ప్రేమించిందనీ, ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారనీ అతనికి తెలుసు. అందుకే పెళ్లి మాట ఎత్తకుండా చక్కని పరిసరాల్లో ఓ హాస్పిటల్ కట్టించి ఆమెకి ప్రెజెంట్ చేశాడు. గుడికి మరింత సెక్యూరిటీ ఏర్పాటుచెయ్యడమే కాక శంకరయ్య ఇంటిక్కూడా తగిన పనివాళ్ళని ఏర్పాటుచేశాడు. గౌతమి, శంకరయ్య ఆనందంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. గౌతమి మొహంలో దిగుల్లాంటిది కనిపిస్తుందేమో అని చూశాడు. కానీ అలాంటిదేం ఆమె మొహంలో కనిపించలేదు. ఎప్పటిలా నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతోంది.
‘‘చాలా గుండె నిబ్బరం గల యువతి’’ అని మెచ్చుకున్నాడు కూడా. అయితే ప్రభుని గురించే అతనికి అయోమయంగా వుంది. అతనిలో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదు. ఏం చెప్పినా యాంత్రికంగా చేసుకుపోతున్నాడు. అది చాలా బాధగా వుందతనికి.
ఆ రోజు తనతోపాటు భోజనానికి కూర్చోపెట్టుకుని అడవిలోని విషయాల గురించి ఎత్తాడు. అడవిని గురించి ఎత్తగానే ప్రభు కళ్ళముందుగా మెదిలిన వ్యక్తి శకుని.
‘‘మీరంతా వాదించారుగానీ ఇంత సహయం చేసిన ఆ బ్లాక్ టైగర్ వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బావుండేది ప్రభూ! కనీసం కొన్ని పశువుల్ని మేకలు కోళ్ళలాంటితో ఆ ఆటవికులు వాటితోనైనా కాస్త హాయిగా బతుకుతారు’’ అన్నాడు చంద్ర. అడవి సంపద గురించి పెద్దగా చెప్పలేదతనికెవరూ.
‘‘వాళ్లకి పాడి పంటలకేం కొదవ చంద్రా! మిస్టర్ శకుని ఏర్పాటుచేసిన భూతల స్వర్గం వాళ్లకుంది’’ అప్రయత్నంగా అన్నాడు ప్రభు.
తృళ్ళిపడ్డాడు చంద్ర.
‘‘మిస్టర్ శకుని?.. అతనెవరు? అతను స్వర్గం తయారుచెయ్యడం ఏమిటి?’’ అన్నాడు విస్మయంగా.
అప్పటికి స్పృహలోకొచ్చాడు ప్రభు.
‘‘అదే.. ఆ ఆడది.. నిజంగా భూతల స్వర్గంలాగే వుంటుంది చంద్రా. పచ్చని చెట్లు, సెలయేళ్ళు..’’ అన్నాడు బలవంతంగా నవ్వుతూ. అతనేదో అబద్ధం చెప్తున్నాడనిపించింది చంద్రకి.
‘‘ప్రభూ! అడవికెళ్ళొచ్చిందగ్గర్నించి నువ్వు మారిపోయావురా! అంతకుముందు, ఏ చిన్న విషయమైనా నాతో చెప్పకుండా తిండే తినేవాడివే కాదు, నాకన్నా ఆత్మీయులు ఎవరూ లేరనేవాడివి. ఇపుడు పెద్ద విషయాలే నాదగ్గర దాస్తున్నావనిపిస్తోంది. అంటే నేను ఆత్మీయుణ్ణి కాదనుకొనవచ్చా?’’ అన్నాడు గంభీరంగా.
కంగారుగా చూశాడు ప్రభు!
‘‘చెప్పు! ఎవరా శకుని?’’ మళ్లీ అన్నాడు చంద్ర. చదువు, సంస్కారం నేర్పాడు. దొంగతనాలు మాన్పించి మానవత్వం నూరిపోశాడు. కొన్ని సౌకర్యాలు కూడా ఏర్పరిచాడు. ఆనాటి సంపద ఇవాళ మన పరం అయిందంటే అది ఆయన దయే’’ అన్నాడు ప్రభు.
‘‘విద్యాధికుడు, అంటే నగరవాసే అయుండాలి. కానీ శకుని పేరేవిటి? అంత చదువుకున్నవాడు ఆ బ్లాక్ టైగర్ దగ్గర వుండడం ఏవిటి?’’ప్రశ్నలతో వుక్కిరిబిక్కిరి చేసేశాడు చంద్ర.
ప్రభు నోట మాట రాలేదు.
‘‘అసలీ విషయాలేం నాకు చెప్పలేదేం. అదే ఆ శకునివల్లే టైగర్ దోచిన సొమ్ము మనకప్పగించాడని నిలదీసినట్టు అన్నాడు చంద్ర.
‘‘సారీ చంద్రా! నీకు చెప్పకూడదని కాదు. కానీ మిస్టర్ నాయక్, ఆ శకుని కూడా విషయం చెప్పద్దన్నారు’’ అన్నాడు ప్రభు మెల్లగా.
‘‘నాయక్ చెప్పద్దన్నడా?’’ చంద్ర గొంతులోకి తీక్షణత వచ్చేసింది. మరింత కంగారుపడి పోయాడు ప్రభు- అతని పరిస్థితి అర్థం చేసుకున్న చంద్ర.
‘‘్ఫర్వాలేదు, చెప్పు! నేను నాయక్కి చెప్పను. అతనికే కాదు ఎవరికీ చెప్పను. చెప్పు! ఆ శకుని ఎవరు? అతను అక్కడెందుకున్నాడు?’’ అన్నాడు అనునయంగా.
‘‘ఆ.. శకునిగాడు.. ఓ పోలీసాఫీసర్’’
‘‘వ్వాట్?’’ అరిచినట్టు అన్నాడు ప్రభు.
‘‘అంతేకాదు.. ఆయన.. ఆయన మన నాయక్ గారి కన్న తండ్రి’’ మరో బాంబ్ పేల్చాడు ప్రభు.
నిజంగానే నెత్తిన పిడుగు పడ్డట్టయింది చంద్రకి.
‘‘నీకు మతిపోయిందా? విజయ నాయక్ తండ్రి పోలీసాఫీసరే. కానీ ఆయన పోయి ఇరవై ఏళ్ళయింది’’ అన్నాడు చిరాగ్గా.
‘‘లేదు చంద్రా! ఆయన బతికే వున్నాడు’’ అంటూ, తప్పనిసరిగా శకుని, దొర కలిసి చెప్పినవి, శకుని నిర్మించిన పాతాళస్వర్గం గురించి, నగలని ఎలా కాపాడిందీ, ఆటవికులకి ఎన్ని సౌకర్యాలు కలిగించిందీ అన్నీ చెప్పేశాడు ప్రభు. ఎన్ని సౌకర్యాలు కలిగించిందీ అన్నీ చెప్పేశాడు ప్రభు.
‘‘మైగాడ్! సిఐ రామచంద్ర బతికే వున్నాడా? శకునిగా పనులు చేస్తున్నాడా? నిజంగా గర్వపడాల్సిన విషయం. అంత గొప్ప వ్యక్తిని గురించి నాయక్ ఎందుకు చెప్పద్దన్నాడు, ఏదో ఆలోచిస్తూ అన్నాడు చంద్ర.
‘‘లేదు చంద్రా! తండ్రిని రమ్మని ఎంతో బతిమాలాడు మిస్టర్ నాయక్. కానీ ఆయన ఒప్పుకోలేదు సరికదా, తన గురించి చెప్పద్దనీ, మళ్లీ తనని చూడ్డానికి రాకూడదనీ ఆంక్షలు పెట్టాడు’’ అంటూ శకుని హెచ్చరింపులన్నీ చెప్పాడు ప్రభు.
‘‘ఓ.. అందుకేనా, నాయక్ మొహంలో కూడా ఏదో బాధ కనిపిస్తోంది. అడవిలో అష్టకష్టాలూ పడిరావడంవల్ల అలా వున్నాడేమో అనుకున్నాను. అవును మరి, ఇన్నాళ్ళ తర్వాత తండ్రి కనిపించి, పరాయివాడిలా ప్రదర్శిస్తే ఎవరి మనసైనా దెబ్బతింటుంది. కానీ ఇంతకాలానికి కొడుకు కనిపించినా చలించని ఆ తండ్రేం తండ్రి?’’ అన్నాడు చంద్ర.
‘‘లేదు చంద్రా కొడుకుని చూసినపుడు ఆయన కళ్ళలో కనిపించిన వెలుగు నేనింకా మర్చిపోలేదు. వీడ్కోలు ఇస్తూ ‘చింటూ’ అంటూ అతన్ని గుండెలకి హత్తుకున్నాడు. ఆయన కళ్ళు ధారాపాతమయ్యాయి. ఆ కొడుక్కన్నా ఆటవికుల క్షేమం చూడ్డమే అతని ధ్యేయం అనుకున్నట్టున్నాడు. ఇంకమీదట మనం కలుసుకోలేం అన్నపుడు ఆ తండ్రీ కొడుకులిద్దరి మొహాల్లో ఎంత బాధ వుందో కళ్ళారా చూసిన మా అందరి కళ్ళలోనూ నీళ్ళూరాయి’’ అంటూ అంతా చెప్పేశాడు ప్రభు. అంతేకాదు ఈ విషయం తను చెప్పినట్టు నాయక్‌గారికి తెలియవద్దని బతిమాలాడా ప్రభు.
‘‘సరేలే.. ఇంక నీ విషయం చెప్పు’’అన్నాడు చంద్ర.
‘‘నా విషయమా?’’
‘‘అదే నువ్వు అడవినించి వచ్చిందగ్గర్నించీ చూస్తున్నాను. నువ్వు చాలా డల్‌గా వుంటున్నావ్. ఇది కేవలం ఆ శకుని గారి గురించే అనుకోను. ఎనీ ప్రాబ్లమ్? అన్నాడు చంద్ర అతనికేసి పరిశీలనగా చూస్తూ.
‘‘నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. అంత మంచివాడిలా కనిపించే అనిల్ ఇన్ని నేరాలెలా చేశాడా అని ఆలోచిస్తున్నాను- పరధ్యానంగా అన్నాడు ప్రభు.
‘‘నిజమే. కానీ దానికి నువ్వంత టెన్షన్ పడ్డనికి అవకాశం లేదే’’
‘‘అబ్బే టెన్షనేం వుంది. అడవిలో జరిగిన అనుభవాలన్నీ కళ్ళముందు కదిలి వాటిని గురించే ఆలోచించకుండా నీకలా అనిపిస్తోందంతే’’ నవ్వేశాడు ప్రభు.
‘‘గుడ్! అన్నీ చెప్పావుగానీ అసలైన విషయం చెప్పలేదు’’ ఓరగా అతనికేసి చూస్తూ అన్నాడు చంద్ర.
‘‘ఏ విషయం?’’’ అర్థం కానట్టు చూశాడు ప్రభు.
‘‘అదదేంటి మిస్టర్ ఎవిడెన్స్! అడవిలో నీకూ, మీ క్లూకి మధ్య జరిగిన సంఘటనలేమైనా వుంటే చెప్పు. హేపీగా ఫీలవుతాను’’ నవ్వుతూ అన్నాడు చంద్ర.
‘‘్ఛ! ఛ! నేను ఎవిడెన్స్ ఏమిటి?’’ కంగారుగా అన్నాడు ప్రభు.
మన క్లూ.. తన భర్త ఎవిడెన్స్ అని చెప్పింది. ఆ అనిల్‌గాడిని అండని అనుకుందామంటే వాడు జైలుకెళ్లినా ఆమె దిగులుపడడంలేదు. అసలు అతను జైలుకెళ్ళడానికి ముఖ్య కారకురాలు కూడా ఆమె. కాబట్టి ఆమె ఎవిడెన్స్ అతను కాదని తేలిపోయింది. ఇపుడు నువ్వే ఎవిడెన్స్ ఎందుకవకూడదు?
‘‘్ఛ! ఛ! నేను ఎవిడెన్స్ ఏంటి?’’ కంగారుపడిపోయాడు ప్రభు.
‘‘తన భర్త ఎవిడెన్స్ అని చెప్పింది. నినే్న ఊహించి ఆ పేరు పెట్టుకుని వుంటుంది. ఓసారి అడిగి చూడకూడదూ?’’
‘‘ఏమిటి చంద్రా నీ మాటలు. పెళ్ళికాని పిల్ల అంటే బావుండదని, తన క్లూ పేరిట, ఎవిడెన్స్ అని ఓ పేరు తగిలించుకుంది. పెళ్ళయిన వాళ్ల వెంట ఎవరూ పడరుగా. అందుకే తన జాగ్రత్తలో వుంది’’ అన్నాడుప్రభు.
‘‘అయితే గౌతమిమీద నీకెలాంటి అభిప్రాయం లేదన్నమాట!’’

‘‘సదభిప్రాయమే’’
‘‘అయితే ఆమెని నువ్వే ఎందుకు పెళ్లిచేసుకోకూడదూ?’’
‘‘్ఛ! ఆమెని నేను చేసుకోవటం ఏమిటి? తను అనిల్‌ని ప్రేమించింది’’ అన్నాడు. అతని గొంతులోని దిగులుని గమనించాడు చంద్ర.
‘‘నువ్వు కూడా ఆమె పట్ల మనసు పారేసుకున్నానని నాకు తెలుసు’’ అన్నాడు ఓరగా చూస్తూ.
‘‘ఆమె అంటే ఇష్టం ఏర్పడిన మాట నిజమే చంద్రా, కానీ ఆమె అనిల్‌కి మనసిచ్చింది’’ అన్నాడు ప్రభు.
చంద్ర మొహం గంభీరంగా అయిపోయింది.
‘‘ఓ! ఆమె ఎపుడో, ఎవర్నో ప్రేమించిందని ఎవర్నో ప్రేమించినదాన్ని చేసుకోవడం ఏవిటని ఆలోచిస్తున్నావా?’’ అన్నాడు.
‘‘్ఛ! ఛ! అదికాదు’’ కంగారు పడిపోయాడు ప్రభు.
‘‘మరి తనని చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి?’’
‘‘...’’
‘‘ఒక్క మాట చెప్పుప్రభూ! నువ్వు క్లూగా చూసినప్పటినుంచి నువ్వామెని ఇష్టపడుతున్నావని గమనిస్తూనే వున్నాను. అది నా భ్రమ అని ఇప్పుడనిపిస్తోంది. ఒక్క మాట అడుగుతాను చెప్పు. నువ్వామెని ప్రేమించలేదా?’’ అన్నాడు చంద్ర.
‘‘ప్రేమించడమా? మామూలుగా కాదు ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను’’.
‘‘ఆమె అనిల్‌ని ప్రేమిస్తోందని తెలిసే ఆమెని ఆరాధించావ్ కదూ?’’
‘‘అవును. క్లూగా ఆమెని ప్రేమించాను. ఆమె అనిల్ గురించి చెప్పినపుడు నిరాశపడిపోయాను. అలా అని నా ప్రేమని వదులుకోలేదు. నా ప్రేమారాధనలని నా గుండెల్లోనే పదిలంగా దాచుకున్నాను. కానీ అతన్ని గురించి అనుమానాలు చెప్పినపుడు, ఆమె అతన్ని హేట్ చేసినపుడు నాలోని ఆశ మళ్లీ వూపిరిపోసుకుంది. అంతేకాదు, ఆమె మనసులో నాకు చోటుందని తెలిశాక హిమాలయాలెక్కినంత సంబరపడిపోయాను. కానీ ఆమె దగ్గరికెళ్లి చెప్పడానికి మాత్రం ధైర్యం చాలడంలేదు’’ తనని తాను మర్చిపోయి మనసులోనిదంతా చెప్పేశాడు ప్రభు.

ప్రభు మాటలకి పకపక నవ్వేశాడు చంద్ర.
‘‘ద గ్రేట్ ఐఎఎస్ ఆఫీసర్ ప్రభుదేవ ఓ ఆడపిల్ల ముందు మాట్లాడ్డానికి భయపడడమా.. షేమ్! నీకే కాదు నాక్కూడా అవమానమే’’ అన్నాడు అల్లరిగా.
‘‘తనగురించి నీకు తెలియదు చంద్రా. సరదాగా మాట్లాడుతూనే సీరియస్ అయిపోతుంది. అంతలోనే నవ్వేస్తుంది.
‘‘అసలామె నిన్ను ప్రేమిస్తోందని నీకు తెలుసా?’’ అన్నాడు చంద్ర ఏదో ఆలోచిస్తూ.
‘‘తెలుసు. అడవిలో ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. ఒకళ్ళకొకళ్ళం తోడున్నాం. ఒకరికొకరం ఓదార్చుకున్నాం. నన్ను సేవ్ చెయ్యడానికే అనుకో. నన్ను తన వుడ్‌బిగా వాళ్లకి పరిచయం చేసింది.
‘‘అదే ప్రేమ అనుకుంటున్నావా? పిచ్చి ప్రభూ! ఆపదలో ఆగర్భ శత్రువులు సైతం ప్రేమగా, చనువుగా మాట్లాడుకుంటారు. అదే ప్రేమ అనుకుంటే ఎలా? అడవినుంచి వచ్చాక అలా మాట్లాడిందా?’’ అతని మనసులోని విషయాన్ని రాబట్టాలన్నట్టు అన్నాడు చంద్ర.
‘‘కాదు చంద్రా! ఆమె నన్ను ప్రేమిస్తోందని నాకు బాగా తెలుసు. నాకు ఆడవాళ్ళని గురించి అంతగా తెలియకపోయినా గౌతమి విషయంలో మాత్రం నేను పొరపడలేదు’’ అన్నాడు ప్రభు స్థిర స్వరంతో
‘‘గుడ్! మంచి ప్రోగ్రెస్ వుంది. ఆమె నిన్ను ప్రేమిస్తోందని ఎలా కనిపెట్టావ్? అడవిలో ప్రణయగీతాలూ, ఏటి స్నానాలూ వెనె్నల విహారాలూ లాంటివన్నీ అయిపోయాయా? పర్లే చెప్పు.. రేపు మీ పెళ్లి చేయాల్సింది నేనే’’ అన్నాడు చంద్ర మరింత ఉత్సాహంగా.
‘‘్ఛ! అలాంటివేం జరగలేదు కానీ ఓ చిన్న సంఘటన జరిగింది’’.
‘‘ఏవిటది? కొంపతీసి పెళ్లికాకుండానే...’’
‘‘్ఛ! ఛ! అది కాదు’’ కంగారుపడిపోయాడు ప్రభు.
‘‘మరి ఏవిటి సంఘటన?’
‘‘అది ముఖ్య విషయమే అనుకోవాలి. నీకు చెప్పాలనుకున్నాను గానీ.. కాస్త మొహమాటపడ్డాను.
‘‘నా దగ్గర విషయాలు దాచడం నీకలవాటేగా.. చెప్పు’’ అన్నాడు చంద్ర కుతూహలంగా.

‘‘మా మాటలు ప్రవర్తన చూసి మేమిద్దరం నిజంగానే ప్రేమికులం అనుకుని, మీ పెళ్లికి మేమెలా రాలేంకదా అంటూ అక్కడివాళ్ళంతా కలిసి మా ఇద్దరిచేతా దండలు మార్పించి, విందు భోజనాలు పెట్టి డాన్సులు చేసి చాలా హంగామా చేశారు.’’ తల దించుకుని మెల్లగా చెప్పాడు ప్రభు.
చంద్ర మొహంలోకి వుత్సాహం వచ్చేసింది.
‘‘వావ్! అయితే మీ ఇద్దరికీ పెళ్ళయిపోయిందన్నమాట, మనలో మనమాట. పెళ్ళి మాత్రమేనా.. లేక శోభనం కూడా జరిపించేశారా?’’ ఎప్పుడూ లేనంత అల్లరిగా అన్నాడు చంద్ర.
‘‘ఇదిగో! నువ్వలా అంటావనే నీకు చెప్పలేదు.’’ అలిగినట్లు అన్నాడు ప్రభు.
‘‘లేదు లేదు. చెప్పు తర్వాతేమయింది?’’
‘‘ఏం కాలేదు. కానీ నేనామె మెడలో దండవేస్తున్నప్పుడు ముందు నిర్ఘాంతపోయినా, తర్వాత ఆమె కళ్ళు మెరవడం, చెంపలు కందిపోవడం, వాలిపోతున్న కళ్ళతో నా మెడలో దండవెయ్యడం చూశాక ఆమె కూడా నన్ను ప్రేమిస్తోందనిపించింది.’’అన్నాడు ప్రభు నసిగినట్టు.
చంద్రమొహంలోకి మరింత వుత్సాహం వచ్చేసింది.
‘‘మరింక నసుగుతావెందుకు. వెంటనే శంకరయ్యగారి దగ్గరికెళ్ళి లగ్నాలు పెట్టించక’’ అన్నాడు అతనికి అభినందనలు చెప్పి.
‘‘అది నీ పని’’ గోముగా అన్నాడు ప్రభు.
‘‘ఏవిఁట్రా మరీ ఆడపిల్లకన్నా సిగ్గుపడి పోతున్నావ్. సరే.. ఇంక అంతా నాకొదిలెయ్. నేను చూసుకుంటాను. అయినా ఇంత మంచి విషయాన్ని చెప్పడానికి ఇన్నాళ్ళు పట్టింది. ఇంక ఆ క్లూ దగ్గరికెళ్ళేసరికి నీకు మాటేరాదెమో. అసలే ఆ పిల్ల డేరింగ్ పర్సన్. ఆమెదగ్గర కాస్త జాగ్రత్తగా వుండు.’’
‘‘పో చంద్రా! మరీ నన్ను చేతకానివాడి కింద తీసిపడేస్తున్నావ్. అయినా గౌతమి నువ్వనుకున్నంత రాలుగాయి కాదు. రహస్య సంఘటనలని రాబట్టడానికి క్లూలా వ్యవహరిస్తుందంతే, అదీ ప్రజాసేవకోసం, దేశ రక్షణకోసం తాపత్రయ పడుతుంది’’ అన్నాడు ప్రభు.
‘‘నిజమే. ఆమె డాక్టరుగాకాక ఏ పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనే వుంటే ఇంకా రాణించేది.’’
‘‘నేనూ అదే అనుకున్నాను’’ నవ్వాడు ప్రభు.
***
సి.ఎమ్. కబురందుకున్న విజయనాయక్ వున్న పాటున వూడిపడ్డాడు. మళ్ళీ ఏం కొంప మునిగిందా అని అనుమానిస్తూనే అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించి తన పర్సనల్ రూమ్‌లోకి తీసికెళ్ళాడు చంద్ర.
‘‘ఏంటి సర్’’ ఎనీ ప్రాబ్లమ్?’’అన్నాడు నాయక్ కంగారుగా.
‘‘పెద్ద ప్రాబ్లమే’’ నవ్వాడు చంద్ర.
‘‘ఏవిఁటి సార్? మిస్ క్లూ మళ్ళీ ఏమైనా క్లూ అందించిందా? తనూ నవ్వుతూనే అన్నాడు నాయక్.
‘‘క్లూ కాదు. క్లూ ఎవిడెనే్స ఓ మంచి క్లూ అందించాడు’’
‘‘క్లూ ఎవిడెన్సా?’’
‘‘అదే మిస్టర్ నాయక్స్, మిస్టర్ ఎవిడెన్స్! అంటే మన ప్రభు...’’
‘‘ఓ! అర్ధమయింది. తనకి, గౌతమికీ అడవి పెళ్ళిచేశారని ప్రభు చెప్పారా?’’ నవ్వుతూ అన్నాడు నాయక్.
‘‘ఎస్! మీరంతా పెళ్ళిపెద్దలై ఆశీర్వదించారుగా?’’
‘‘అదే... ఆ దొర కూతురు చిన్నీవాళ్ళు ముందువెనక ఆలోచించకుండా ఏదో దండలు మార్పించారు. ‘నసిగినట్టు అన్నాడు నాయక్’.
‘‘అదే మనం నిజం పెళ్ళిచేసి వాళ్ళిద్దర్నీ ఒకటి చెయ్యాలి!’’
‘‘చెయ్యచ్చు, కానీ...ఆ గౌతమి...’’
‘‘అనిల్‌ని ప్రేమించిందంటారు. అంతేనా? ఆమెలో గౌతమికాక ‘క్లూ’అనే ఓ సాహస యువతి దాగుంది. ఆ క్లూయే ధర్మారావు వాళ్ళ ప్లాన్స్‌ని, వాళ్ళద్వారా చేరి ప్రేమ నటించిన అనిల్ వుద్దేశాన్నీ కనిపెట్టి వాళ్ళకి తగిన విధంగా నటించి అతని హాస్పిటల్లో చేరి ఎన్నో రహస్యాలు కనిపెట్టింది. తన ఫ్రెండైన చందనని లూసీ పేరుతో నర్స్‌గా పంపింది. తాము దాచిన నగల్ని బ్లాక్ టైగరే దొంగిలించి వుంటాడన్న నమ్మకంతో అడవిలో ప్రవేశించి, విజయం సాధించడమేకాక బ్లాక్‌టైగర్ మీదున్న అపోహలన్నీ తుడిచేసింది. అఫ్‌కోర్స్ మీరంతా ఆమెకి అండగా నిల్చోరనుకోండి. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఆ అనిల్‌మీద అనుమానంతో అతన్ని ప్రేమించినట్టు నటించిందే కానీ నిజంగా అతన్ని ప్రేమించలేదు. అతను దోషిగా నిరూపించి తేలిగ్గా వూపిరి తీసుకుంది. ఇదంతా నేను వూహించిందికాదు నాయక్. స్వయంగా ఆమె నోటినించి విన్నవే. ప్రభు చెప్పింతర్వాత ఆమెతో నేను మాట్లాడాను’’ నవ్వుతూ చెప్పాడు చంద్ర.
నాయక్ మొహంలోకి వుత్సాహం వచ్చింది.
(ఇంకావుంది)

-రావినూతల సువర్నాకన్నన్