‘‘తీపి జ్ఞాపకాలు- చేదు నిజాలు’’
Published Saturday, 14 September 2019అందంగా, చూడముచ్చటగా అలంకరించిన సభాప్రాంగణం... విద్యుద్దీపాల కాంతితో శోభాయమానంగా తీర్చిదిద్దిన వేదిక ఆ వేదికపై నాదానుభవం పండిన సంగీత విద్వాంసులు. వారి వెనుక శృతి చేసిన తంబురా స్వయం భూధ్వనుల ఆహ్లాదకర సంగీత వాతావరణంలో సుస్వర సునాద సంగీత ధారామృతం గ్రోలడానికి సిద్ధమై కూర్చున్న రసిక జనం. మొదటి రెండు వరుసలలోనూ ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన అతిథులు.
ఆ వేదికపై మధ్యలో నిర్మల మనస్కుడై వాయులీన వాద్యాన్ని శృతి చేసికుంటున్న వాయులీన నాద తనువుతో, స్వర రాగ సుధారస యుతుడై రూపుదాల్చిన స్వరావతారుడు...
నాదమాధురీ గురుద్వారమైన ద్వారం వెంకట స్వామినాయుడు. దశాబ్దాల క్రితం జరిగిన సన్నివేశం. ఆకాశవాణి కేంద్రం ఉత్తర, దక్షిణ భారతదేశంలో అగ్రగణ్యులైన సంగీత విద్వాంసులను ఆహ్వానించి ప్రేక్షకుల సమక్షంలోనే తొలి కచేరీలను వినిపించే జాతీయ సంగీత కార్యక్రమాలలో భాగంగా జరిగిన నాయుడుగారి సంగీత వైభవాన్ని మీముందుంచే ప్రయత్నమే యిది.
ఆరోజుల్లో ఆకాశవాణి నిర్వహించే బాహి రాంగణ ప్రసారాలకు ఎంతో ఉన్నత స్థానం కల్పించబడేది. తండోపతండాలుగా ఆ కార్యక్రమాలు జనం వినేవారు.
ఔట్‌డోర్ బ్రాడ్‌కాస్ట్ అన్నమాట.
యిప్పుడు దాదాపు లేనట్లే.
జాతీయ సంగీత కార్యక్రమాలు, ఆయా రేడియో కేంద్రాల్లో రికార్డుచేసి ఢిల్లీకి పంపిస్తారు. ఢిల్లీనుంచి ప్రసారమయ్యే ఆ కార్యక్రమాలన్నీ ప్రతి రేడియో కేంద్రం రిలే చేస్తుంది.
సంగీత సమ్మేళనం కూడా జాతీయ సంగీత కార్యక్రమంతో సమానమే.ఈ కార్యక్రమం మాత్రం యింకా యిప్పుడూ కొనసాగుతోంది.
ప్రసార మంత్రిత్వశాఖలను నిర్వహించే ఏ మంత్రికైనా సంగీత సాహిత్యాల పట్ల అభిరుచి ఉండాలనే నియమం లేదు. కాస్తోకూస్తో రుచి కలిగిన అధికారులే సాధారణంగా అజమాయిషీ చేయటం కద్దు.
నాకు తెలిసినంతవరకూ మన బెజవాడ గోపాలరెడ్డి సమాచార మంత్రిత్వశాఖకు మంత్రిగా, రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన చాలామంది సంగీత విద్వాంసులతోనో, పండితులతోనో సాహిత్య విద్వత్కళా బంధుత్వం ఉండటం ఎరుగుదును. మిగిలిన సమాచారశాఖా మాత్యులుగానీ, రాష్ట్ర గవర్నర్లుగానీ తాము ఏ రాష్ట్రంనుంచి వచ్చారో ఆ రాష్ట్రానికీ, వారి భాషకు చెందినవారితో మాత్రమే పరిచయం కలిగి ఉండటం, మిగిలిన భాషలకు చెందిన వారిని పెద్దగా పట్టించుకోకపోవడం సహజం. జరిగేది కూడా. గోపాలరెడ్డి మాత్రం కాశ్మీర్ వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, కేరళ, కర్ణాటక వెళ్ళినా ఆయా రాష్ట్రాల సంగీత సాహిత్య సంగీత విద్వాంసులను, పండితులనూ గుర్తించి ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటుచేసేవారు. ఎప్పుడు వారిని కలిసినా వారిని పలకరించే సంస్కారముండేది. అందుకే ఆయన పేరు ఆరోజుల్లో చాలా ప్రసిద్ధం. యింక అసలు విషయానికొద్దాం.
రాత్రి 9.30 నుండి 11వరకూ జరిగిన ఆహుతుల సమక్షంలో ఢిల్లీలో జరుగుతున్న నాయుడిగారి కచేరీ ప్రత్యక్షంగా చూస్తున్న శ్రోతలు ఒకవైపు తన్మయత్వంలో మునిగిపోయి వింటూండగా, అంతలో ఎక్కడినుండో ఒక్కసారి కారు దూసుకొచ్చి సభాప్రాంగణంలోకి వచ్చేసింది. అందులో ఉన్నది అప్పటి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖామాత్యులైన కేష్కర్. సంగీతాభిరుచి కలిగిన మంత్రులుంటారా? అనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. దానికి నిదర్శనమే, నాయుడిగారి కచేరీ రేడియోలో వింటున్న ఆయనకు తనివితీరక, ప్రత్యక్షంగా ఆ విద్వాంసుణ్ణి చూసి, అభినందించాలనే భావంతో సభాస్థలికి వచ్చేశారు. ఆహ్వానితులతోబాటు ఆయన కూడా కూర్చుని వినటంతో రాత్రి 11 అయ్యింది సమయం అయ్యింది. నిజానికి కచేరీ ముగిసినట్లు ఎనౌన్సర్ ప్రకటించాలి. హిందోళ రాగంలో యిపుడు రాగం, తానం, పల్లవి వింటారనే ఎనౌన్సుమెంట్ రాగానే జనం నివ్వెరబోయారు. రేడియోలో ఇది అసాధారణం. ఎంతటి సుప్రసిద్ధుడైనా గంటంటే, గంటే. ఒక నిమిషం దాటే అవకాశముండదు.
ఆ వేళ నాయుడిగారి కచేరీ అర్ధరాత్రి ఒంటి గంట వరకూ సాగింది. అటు కూర్చున్న ప్రేక్షకులూ, వారితోపాటు మంత్రిగారూ అలాగే మంత్రముగ్ధులై విన్నారు. ఆ గౌరవం నాయుడుగారికే దక్కింది.
మళ్ళీ అటువంటి సందర్భం రేడియోలో జరిగిన దాఖలా లేదు.
రసికులుంటేనే రాగానికర్థం.
వినాలనే ఆసక్తి ఉంటేనే ఆ ఉపన్యాసానికర్థం. ‘‘అరసిక జన రంజనం శిరశి మావిఖ’’ అన్నాడు కాళిదాసు.
అనుభవించి ఆనందించలేని వాడిముందు కవిత్వం చెప్పటం ‘చెవిటివాడికి శంఖమూదినట్లే.’
సంగీత కళానిధి ‘ద్వారం నాయుడిగారి జీవితంలో కొన్ని సంఘటనలు ఆయన సంగీత యాత్రను ఓ మలుపు తిప్పి ఆయనకు మరింత కీర్తి కారకమయ్యాయని చెప్పే మరో విషయం మీకు గుర్తుచేస్తాను.
అప్పుడూ యిప్పుడూ సంప్రదాయానికి పెద్దపీట వేసేది మద్రాసే.
నాయుడిగారి పేరు బాగా ఉన్న రోజుల్లో జరిగిన సంగతి.
కర్ణాటక సంగీత కచేరీకి వయొలిన్, మృదంగం, ఘటం, లేదా యితర ఉప పక్క వాద్యాలుంటాయి.
ప్రధాన గాయకుణ్ణి సహకరి వయొలిన్, యిటు మృదంగం తప్పనిసరిగా ఉంటాయి.
సంగీతంలో ‘‘అలౌకికమైన ఆనందం’’ఒకటుంది. అంటే మాటల్లో మరొకరితో పంచుకోలేనిదీ, ఎవరికి వారే అనుభవించే ఆనందమే అలౌకికం.
నిశ్శబ్దంలో కూడా సంగీతముంది. అది అనుభవించే వారికే తెలుస్తుంది.
తారస్థాయిలో కీర్తి కలిగిన విద్వాంసులకు ప్రక్కవాద్యం వాయించినా, ప్రధాన విద్వాంసుడి కంటే తక్కువగానే వుంటూ ఎంతో వినయంగానే ఉండేది.
నాయుడిగారి వాద్యం- తనకు విడిగా వాయించే అవకాశంవస్తే మాత్రం అద్భుతమైన ఒక నిశ్శబ్దబద్ధ సంగీత విజృంభణతో ఏదో ఓ విద్యుత్ స్పర్శలా ఒంటికి ప్రవేశించి ఆహా అనిపించేది. ప్రధాన విద్వాంసుడు 10,12 నిమిషాలసేపు పాడిన రాగం, నాయుడుగారు కేవలం 3 1/2 నిమిషాలు వినిపించి ‘శభాష్’ అనిపించుకునేవారు.
కరతాళ ధ్వనులతో హాలు మారుమ్రోగేది. రహస్యంగా పిలిచి ‘‘అయ్యా! నాయుడుగారూ? రేపు నా కచేరీకి మీరు వయొలిన్‌పై సహకరించటం నా భాగ్యం.
ఒక్క విజ్ఞప్తి. దయచేసి నాకంటే ప్రతిభావంతంగా వాయించి నున్న కించపరచవద్దు.’’
పది మందిలోనూ తలెత్తుకోలేను అని ప్రాధేయపడిన విద్వాంసులూ ఉన్నారు.
మరో సందర్భంలో ఓసారి బాగా పేరున్న విద్వాంసుడు రాగం తానం పల్లవి పాడేందుకు సిద్ధమయ్యాడు. సంగీత కచేరీలో కళాకారుని ప్రజ్ఞకు గీటురాయిగా భావించే అంశం ‘రాగం, తానం, పల్లవి’. వేదిక ఎక్కేముందు సాధారణంగా ఏ విద్వాంసుడైనా తనకు సహకరించే వయొలిన్ విద్వాంసుడికి తాను పాడే పల్లవి ఏ తాళంలో పాడతాడో పాడి వినిపించటం అలవాటు. కొంత ప్రయత్నంచేసి పాడ వలసిన ప్రక్రియ, ఈ అంశం. కానీ ఆ వేళ ఆ విద్వాంసుడు పల్లవి పాడతానని నాయుడుగారికి చెప్పలేదు. చెప్పకపోగా ఆయనకు కనిపించకుండా తాళం వేసే కుడిచేతిపై రుమాలు అడ్డం బెట్టుకుని పాడటం ప్రారంభించేసరికి నాయుడుగారు కాస్త యిరకాటంగా భావించారు. కారణం ఆయనకున్న దృష్టిమాంద్యమే. అయినా- ఎక్కడా తొట్రుపాటు లేక అసలు విద్వాంసునికి చెమటలు పట్టేలా వాయించి ఒక్కసారిగా కరతాళ ధ్వనులందుకోవటంతో ప్రధాన గాయకుడి నోట మాట (పాట) లేదు.
ఆరోజునుంచి నాయుడుగారు పక్క వాద్య సహకారం విరమించారు.
సోలోగా వాయించటానికి సిద్ధపడి అంతకంటే ఎక్కువ ఖ్యాతిని సొంతం చేసుకున్నారు.
దృష్టి లోపాన్ని ఖాతరుచేయకుండా సంగీతాన్ని తపస్సుగా భావించి ఉపాసించిన ఆ నాదమూర్తికి లభించిన అఖండమైన అవార్డులు, రివార్డులు, సన్మాన సత్కారాలు అత్యంత సహజమై లభించినవే. ఆశ్చర్యమేముంది?
***