S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగుల సూర్యోదయ ‘లక్ష్మి’

సూర్యోదయమంత సుందరంగా, లేలేత కిరణాల్లాంటి రంగుల మిశ్రమంతో, ఆకట్టుకునే అలంకరణతో, ఆకర్షణీయ ‘ఫ్రేమ్’లో పరవశింపజేసే చిలువేరు ఉదయలక్ష్మి వర్ణచిత్రాలు అందరిని అబ్బురపరుస్తాయి.
సుకుమారం, సున్నితత్వం, సౌందర్యం- స్ర్తి హృదయం నిండుగా ఆమె బొమ్మల్లో రాశీభూతమై ఆవిష్కృతమవుతుంది.
సాధారణ వ్యక్తిగాని, గృహిణిగాని చిత్రకారుల బొమ్మలు చూడగానే హృదయం ఉప్పొంగి, కళ్ళల్లో సంతోషపు మెరుపులు మెరవాలన్నది ఉదయలక్ష్మి ఫిలాసఫీ. చిక్కనైన ఈ దృష్టికోణంతో ఆమె అనేక మాధ్యమాల్లో మంత్రముగ్దుల్ని చేసేట్టు రంగుల ‘రసగంగ’ను ప్రవహింప జేస్తున్నారు. కాన్వాసుపై, కాగితంపై, కర్రపై, గ్లాసుపై, ఆక్రలిక్ షీట్‌పై ఆమె ‘రంగుల నర్తన’మాడుతున్నారు. ఎల్లలు లేని తన సృజనను వ్యక్తీకరిస్తూ వీక్షకుల్ని విభ్రమకు గురిచేస్తున్నారు. రంగురాళ్ళను, బంగారాన్ని, వెండిని రంగుల్లో పొదిమి, కళాత్మకతను సరికొత్త ఎత్తుల్లోకి తీసుకెళుతున్నారు. అందాన్ని, అలంకార ప్రియత్వాన్ని అణువణువునా పొదిమి పట్టుకున్న ఆడపిల్లలు వెనె్నల్లో మరింత సింగారించుకునే వైనం ఆమె రసజ్ఞతకు పరాకాష్ట.
పూల రెక్కలు... తేనె చుక్కలు... కర్పూర గుళికలు రంగరించిన మిశ్రమంతో బుజబుజ రేకుల పెళ్లికూతురు రూపాన్ని చిత్రించారా?... అన్నంత అద్భుతంగా గ్లాసుపై ఆమె బొమ్మ గీశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే... ఇది ‘రివర్స్ పెయింటింగ్.’ అపసవ్య దిశలో గీస్తే సవ్య దిశలో వీక్షకుల గుండెల్లో గిలిగింతలు పెడుతుంది. దీనికి ఎంతో నైపుణ్యం, ఏకాగ్రత, దార్శనికత అవసరం. ఇవన్నీ చిత్రకారిణిలో దండిగా కనిపిస్తాయి. అందుకే ‘సిస్టర్స్’శీర్షికన సౌందర్యాన్ని, స్ర్తి హృదయాన్ని రంగుల మేళవింపుతో ‘గ్లాసు’పై చిత్రికపట్టారు. ఆ సోదరీమణుల ‘వర్చస్సు’కు పరవశించి పోతున్నట్టుగా నేపధ్యంలో లతలు... పూలు... ప్రకృతి దర్శనమిస్తుంది. అందులో కమలం (లోటస్) తప్పక కనిపిస్తుంది. ఎక్కడో అక్కడ పిసరంత బంగారం మెరుస్తుంది. సహజసిద్ధమైన ఆ మెరుపు చిత్రానికి సంపూర్ణత్వం తీసుకొస్తుంది. ఇది తన ‘‘సిగ్నేచర్ వర్క్’’అని ఉదయలక్ష్మి వినమ్రంగా చెబుతారు. ఈ సిగ్నేచర్ వర్క్‌తోనే ఆమె తంజావూరు శైలి చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇందులో దేవతల రూపాలను తీర్చిదిద్దుతున్నారు. అందులో ఖరీదైన రంగురాళ్లు, ఆభరణాలు వాడుతున్నారు. ‘టెంపుల్ జ్యువెలరీ’గా అభివర్ణించే నగల పొందికను, కొట్టొచ్చినట్టు కనిపించే ప్రత్యేక ‘రంగుల స్కీం’తో దేదీప్యమానంగా వెలిగే ఆ రూపాలను తిలకిస్తే నాస్తికులు సైతం రెండు చేతులు జోడిస్తారు.
వర్తమానంలో ప్రాచుర్యంలో ఉన్న ‘్ఫ్యషన్’ దుస్తులను, డిజైన్లను తన బొమ్మల్లో కనిపించేలా చూస్తారు. అలాగే తన ‘పాత్రలు’ ధరించే చీరలు ‘ప్రత్యేక పెయింటింగ్’ మాదిరి కనిపించేలా శ్రద్ధకనబరుస్తారు. ఒకప్పటి బుట్టపూసలు, కాసుల పేరు, మామిడి పిందెల, నెమలి బొమ్మల ‘మోటిఫ్స్’ను ఎక్కువగా పొందుపరిచి అందులో బంగారు ‘్ఫయిల్’ను జత చేయడం విస్మరించరు. దీనివల్ల సహజమైన, మెరుపుదనం వస్తుందని ఆమె అంటారు. బంగారంతోపాటు ‘కమలం’ పూవు కనువిందు చేస్తుంది.
ఉదయలక్ష్మి పూల మీదనే ప్రత్యేక ‘సీరీస్’బొమ్మలు గీశారు. ఆమె సృజనకు, సున్నితత్వానికి, సౌందర్య పిపాసకు, ఎల్లలులేని కళాత్మతకు, రంగుల పోహళింపునకు పెట్టింది పేరుగా ఆ బొమ్మలు నిలిచాయి. జపాన్‌కు చెందిన ‘ఎక్‌బన్’ పుష్పాలంకరణ ప్రియులు ఏర్పాటుచేసిన సహజ పుష్పాలతోపాటు ఉదయలక్ష్మి తన చిత్రాలను ప్రదర్శించారు. ఇదో కొత్త రకం ప్రయోగం... జుగల్‌బందీ వ్యవహారం. ఈ పోటీలో... ప్రదర్శనలో లిల్లీ, గులాబీ, ఐరీస్, మందారం, పాపి తదితర పుష్పాల చిత్రాలను పెట్టారు. సహజంగానే పెద్ద ఫ్రేమ్‌లో సహజ రంగుల్లో ‘బ్లోఅప్’ పద్ధతిలో ఆమె చిత్రాలే మనసును దోచుకున్నాయి. ఆ చిత్రాలపైనే తుమ్మెదలు వచ్చి వాలుతాయేమోనన్నంత అద్భుతంగా అవి చూపరుల చిత్తాన్ని ఆకట్టుకున్నాయి.
ఆ పూల రేకులు సాదాసీదాగా గాకుండా అక్కడా అనేక ఆకృతులు దర్శనమిస్తాయి. ఓ పుష్పానికున్న మూడు రేకుల్లో ఆ కామధేనువు, రుషి, రావి చెట్టును లేత రంగుల్లో దర్శింపజేసి దివ్యత్వాన్ని తీసుకొచ్చారు. ఇలా అనేక పుష్పాల రేకుల్లో, నేపథ్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. డిజైన్లు పొందుపరిచారు. అవసరమైనచోట ‘ఎంబోజింగ్’ శైలిని అవలంబించారు.
ఇంతటితో ఆమె విశ్వరూప సృజన ఆగిపోలేదు. అందమైన- అద్భుతమైన స్ర్తి లావణ్యాన్ని ‘మాస్క్’ల రూపంలోనూ పరిచయం చేస్తున్నారు. అక్రలిక్ షీట్‌తో రూపొందించే ఈ మాస్క్ (ముఖ తొడుగు) పెద్ద సైజులో తీర్చిదిద్ది స్ర్తి సౌందర్యమంతా మెరిసిపోయేలా ‘బంగారు పూత’తో సహజ సౌందర్యాన్ని దగ్గరగా మలచడం, తిరిగి ఆ మాస్క్‌ను కాన్వాసుగా భావిస్తూ అనేక ఆకృతులను పొందుపరిచి తనదైన శైలిలో ‘మోటిఫ్స్’ అద్ది చూపరులను ఆశ్చర్యపరుస్తారు. విలాసవంతమైన పార్క్‌హయత్ లాంటి హోటళ్ళలో ఉదయలక్ష్మి సృజనాత్మక- సుందరమైన, ‘సిరి’గల మాస్క్‌లు కనిపిస్తాయి. అంజుపొద్దార్ లాంటి ప్రముఖ ఆర్ట్ కలెక్టర్స్ దగ్గరా ఇవి కనిపిస్తాయి. ‘ఆర్ట్‌ఎట్ తెలంగాణ’అన్న భారీ పుస్తకంలో ఆమె రూపొందించిన ‘మాస్క్’ను ప్రత్యేకంగా ముద్రించారు. మిక్స్‌డ్ మీడియంలో తయారుచేసిన ఆ మాస్క్ మధురమై జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకున్నదా?...అనిపిస్తుంది. స్ర్తితత్వమంతా, సింగారమంతా అందులో ఒదిగిపోయింది. బంగారంలా మెరిసిపోయింది.
అక్కడితో ఆగారా?...లేదు ‘కొలాజ్‌వర్క్’తో మనసులను కొల్లగొట్టారు. కాగితం, గోల్డ్ఫాయిల్, రంగులతో ఆమె చిలుకలు, ఆలుమగలు, పుష్పాలు రూపొందించి తన నైపుణ్యాన్ని, సృజనాత్మకతను, కళాత్మకతను కాగితం మాధ్యమం ద్వారా మదిని దోచారు. ‘‘కొలాజ్‌వర్క్ బాగుందని పది మంది మెచ్చుకుంటె అందులోనే మునిగిపోను మరో మాధ్యమంలోకి వెంటనే మారిపోతా’’నంటున్నారు ఆమె.
ఆ మాటలకు రుజువుగా ఉడ్‌కట్ బొమ్మలు ఆమె ముందు కనిపిస్తాయి. 8ఎం.ఎం. టీకు కర్రను అందమైన ఆడపిల్ల ఆకారంలో (తల మాత్రమే) మలిచి దానిపై అవసరమైన రంగులు అద్ది, అలంకరించి ఆకట్టుకున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఒకవైపు కనె్నపిల్ల రూపముంటే రెండో వైపు ఓ పడతి అందం అబ్బురపరుస్తుంది. అంటే ‘కర్ర’ను కాన్వాసుగా భావించి రెండువైపులా రంగుల రసజ్ఞతను పొందుపరిచారు, ఇదొక ప్రయోగం. తిరిగి అందులో తనదైన ‘సిగ్నేచర్ శైలి’ తప్పక కనిపిస్తుంది.
అలాగే ఉదయ కళాకేంద్రాన్ని ఏర్పాటుచేసి మహిళలకు తంజావూరు చిత్ర కళలో శిక్షణ ఇస్తున్నారు. ఎంటర్ ఫ్యూచర్‌గా రాణిస్తున్నారు.
ఇంతేనా ఇంకేమైనా ఉందా?... అవును ఉందనే సమాధానమొస్తుంది. ముచ్చటైన మ్యూరల్స్‌ను సైతం ఆమె ఆవిష్కరించారు. తాను చిత్రకారిణే కాదు స్కల్‌ప్టర్‌నని చాటుతున్నారు. మ్యూరల్స్‌తోపాటు ‘బస్ట్‌సైజ్’ విగ్రహాలను రూపొందించారు...
ఇంకా ఎన్నో విద్యలు, నైపుణ్యాలు, రంగులను ఔపోసన పట్టిన అపురూప చిత్రకారిణి ఉదయలక్ష్మి తల్లిది భువనగిరి, తండ్రిది వరంగల్. 1978లో ‘ఉదయించి’న ఈ ‘సూర్యబింబం’ హైదరాబాద్‌లో చదువుకుంది. సికిందరాబాద్‌లోని వెస్లీ గరల్స్ హైస్కూల్‌లో చదివేప్పుడు వివిధ వస్తువులతో గ్రీటింగ్ కార్డ్స్ రూపొందించి స్నేహితులకు, బంధువులకు ఇచ్చేది. అనంతరం బొమ్మలు తయారుచేయడంలో, ఎంబ్రాయిడరీలో నైపుణ్యం సాధించింది. ఆభరణాల డిజైన్లు, వస్త్రాలపై డిజైన్ల రూపకల్పన చేసింది... దీన్ని గమనించిన ఆమె తండ్రి మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజిలో 1994లో చేర్పించారు. అక్కడ బి.ఎఫ్‌ఏ. కోర్సు పూర్తిచేశారు. కాలేజీలో గ్రీటింగ్ కార్డ్స్, డిజైన్లుగాక సరికొత్త రంగుల ప్రపంచం పరిచయంకావడంతో తన భావాలు... ఆలోచనలు విస్తృతమయ్యాయి. 1999లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎఫ్.ఏ. పూర్తిచేశాక ప్రింట్ మేకింగ్‌తో సహా అన్ని విభాగాల్లో పట్టు దొరికింది. ఆ తర్వాత ఆమెను పట్టుకోవడం ఎవరితరం కాలేదు. ఫ్లవర్ అరేంజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇట్లా అనేక డిప్లొమాలను చేసి తన సృజనకు మరింత వనె్నలద్దింది. ముఖ్యంగా తంజావూరు చిత్రకళకు ఈ కాలపు మెరుగులద్ది తీర్చిదిద్దిన చిత్రాలకు ప్రాముఖ్యతనిచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కమలాన్ని, బంగారు ఛాయను తన ట్రేడ్‌మార్క్‌గా పెట్టుకున్నారు. బహుముఖ ప్రజ్ఞ ఆమె అపురూప చిత్రాలు హైదరాబాద్‌లోనేగాక ముంబాయి, కొల్‌కత్తా, చెన్నై, లండన్ నగరాల్లో ప్రదర్శితమయ్యాయి. సృష్టి ఆర్ట్ గ్యాలరీలో మూడు సోలో షోలను నిర్వహించారు. ఆ విధంగా ఆమె హైదరాబాద్ చిత్రకళారంగంలో కొత్త తరంగంలా రంగుల సూర్యునిలా ఉదయించారు.
చిలువేరు ఉదయలక్ష్మి 91008 21497

-వుప్పల నరసింహం 9985781799