S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రంగుల’ రవళిని వినిపిస్తోన్న సరస్వతి

ఆమె ఆలోచనలు స్వచ్ఛమైనవి.. చిత్రాలు అంతే స్వచ్ఛమైనవి, స్వేచ్ఛాయుతమైనవి, సాహసోపేతమైనవి. వాటిలో నిజాయితీ నిండుగా ప్రతిఫలిస్తుంది. నికార్సైన వైనం కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు. లింగంపల్లి (ఎల్) సరస్వతి. రంగుల ఉపాసకురాలు. నాజూకుతనానికి పెట్టింది పేరు. నాణ్యమైన చిత్ర రచనకు కంకణం కట్టుకున్న చిత్రకారిణి.
శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరించి పాల క్యాన్లు వేసుకుని స్కూటర్‌ను తోలే దృశ్యాన్ని ఎవరైనా ఊహించగలరా?.. ఊహించడమే కాదు కాన్వాస్‌పై ఆక్రలిక్ రంగుల్లో అందంగా, రసరమ్యంగా ఆమె పొందుపరిచారు. చిత్రకారిణిగా తనకా స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఉందని ఆమె గట్టిగా విశ్వసిస్తున్నారు. సాహసంతో ప్రకటిస్తున్నారు. కృష్ణుడు తనవాడేనని ‘్భక్తి భావం’తో అంటున్నారు.
చిత్రకళా రంగంలో ‘వస్తువు’ను కాంటెంపరైజ్ (సమకాలీనత) చేయాలన్న ‘సూత్రం’ ఉంది. ఈ మాట తరచూ వినబడుతూ ఉంటుంది. ఆ సూత్రం ఆధారంగా సరస్వతి ‘్భక్తి సూత్రం’తో శ్రీకృష్ణుడిని స్కూటరెక్కించారు. ఆ చొరవతోనే శ్రీకృష్ణుడు ‘బడ్డీ కొట్టు’కు తన గోవుతోబాటు ‘షాపింగ్’కు వచ్చిన చిత్రాన్ని గీయగలిగారు. ఈ దృశ్యం కొంత ‘కొంటె’గా కనిపించినా చిత్రకారిణి స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుత భావన ముందు అదంతా బలాదూర్ అనిపిస్తుంది. పైగా ఆ ‘దృశ్యం’ హృదయాల్లో గిలిగింతలు పెట్టి తదేకంగా చూసేందుకు పురికొల్పుతుంది. ఏదైనా వర్ణచిత్ర ప్రాథమిక లక్షణం అదే కావాలి. దాన్ని చిత్రకారిణి తేలిగ్గా సాధించి మార్కులు కొట్టేశారు. పైగా శ్రీకృష్ణుడు నాలుగైదు పేపర్ బ్యాగులను పట్టుకుంటాడు. దీని పరమార్థం ప్లాస్టిక్ బ్యాగుల జోలికి వెళ్లరాదని ‘శ్రీకృష్ణుడి స్టేట్‌మెంట్’ అని చిత్రకారిణి తెలిపినప్పుడు పర్యావరణ ప్రియుల నుంచి మరిన్ని మార్కులను దక్కించుకున్నారు.
ఇక్కడే చిత్రకారిణి సరస్వతి తన విశ్వరూపం ప్రదర్శించారు. శ్రీకృష్ణుడి నేపథ్యంలో అసంఖ్యాక ఆకులు దర్శనమిస్తాయి. ఆ ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై.. అన్న చందంగా గోపికలు కనిపిస్తారు. ఒక్కో ఆకులో ఒక్కో గోపికను ఊహించడం.. ఆ ఊహను కళాత్మకంగా తీర్చిదిద్దడం, సృజనాత్మకంగా వ్యక్తం చేయడం, అందుకు సాక్ష్యంగా ‘గోవు’ మోర ఎత్తి చూడటం, ఆ గోవు సైతం కొన్ని కాగితాలను తన వీపుపై కప్పుకోవడం.. ఇది అనూహ్యమైన అంశంగాక ఏమవుతుంది?
శ్రీకృష్ణుడు కట్టుకున్న వస్త్రాలు, ధరించిన ఆభరణాలు సైతం చిత్రకారిణి రసజ్ఞతను తెలియజేస్తోంది. వర్తమాన ‘ప్యాట్రెన్స్’ గల వస్త్రాన్ని చుట్టుకోవడం, ‘చెక్స్’ గల మరో వస్త్రం దానిపై ధరించడం పూర్తిగా ‘సమ్మోహన’ రూపాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.
చిత్రకారిణి సరస్వతి ‘ఇదీ నా స్టైల్’ అని చిత్ర కళాలోకానికి బిగ్గరగా చాటి చెబుతోంది. ఆ శైలిలో తిరిగి స్వచ్ఛత.. సరికొత్తదనం, ఇతరులకు పూర్తి భిన్నమైన, ఎవరూ అందుకోలేని ‘ముద్ర’ స్పష్టంగా కనిపిస్తోంది.
అంతేనా?... కాదు పట్టు పీతాంబరం కట్టుకుని, చెట్టుకొమ్మకు ఇనుప తీగలతో కట్టిన టుంగుటూయలలో రాధ - గోపికలతో కలిసి శ్రీకృష్ణుడు ఊగుతుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఆ కాంపోజిషన్, ఫ్రేమ్, రంగుల ఒద్దిక, భావాల వ్యక్తీకరణ రసరమ్యంగా కనిపిస్తుంది. నేపథ్యంలో తిరిగి ఆమె తన విశ్వరూపం, వినూత్న శైలి.. ఆ సొగసు చూడతరమా అనిపించే వాతావరణం.. పసుపుపచ్చని ఆకుల్లో వొదిగిపోయిన అసంఖ్యాక గోపికలు ఆ ‘రాసలీల’ను తమకంతో చూస్తున్న వైనం వర్ణనాతీతం. గోపికలే కాదు రకరకాల జంతుజాలం, ‘దేవకన్యలు’ నమో వాక్కాలు పలుకుతూ కనిపించడం, ప్రకృతి (పూలు) వికసించి తదేకంగా తిలకించడం.. ఈ దృశ్యమంతా ఒక ‘ఫ్రేమ్’లో బంధించి చూపడం ఆమెకే చెల్లింది. కృష్ణుడు, రాధ, గోపికలు ధరించిన దుస్తులు తిరిగి వర్తమానానికి చెందినవి.. ఆ దుస్తుల్లోనూ కొన్ని బొమ్మలు కనిపిస్తాయి. ఆ బొమ్మలు సైతం గోపికలను తలపిస్తాయి. ఆ వర్ణ రంజితం, ప్యాట్రన్స్, ధరించిన ఆభరణాలు, తలలో పెట్టుకున్న కుప్పెలు, రవికెలపై అల్లికలు, అద్దాల లాంటి మెరుపులు.. ఆసాంతం అదో లోకంలోకి తీసుకెళ్లే తీరు వెనుక అవిశ్రాంత శ్రమ దాగుందన్న విషయం స్పష్టంగా అవగతమవుతోంది.
ఇట్లా రాధ-కృష్ణుడు, గోపికలు - గోవులు, పొదరిళ్లు, పసుపుపచ్చని ఆకులు - జింకలు, పక్షులు - పారవశ్యంలో దివోలోక సుందరీమణులు ఆమె వేసిన అసంఖ్యాక వర్ణచిత్రాల్లో దర్శనమిస్తారు. తనదైన శైలిని శక్తిమంతంగా, సరికొత్తగా అలా ఆవిష్కరిస్తున్నారు. చిత్రకళా రంగంలో రంగుల మురళీరావడం రసరమ్యంగా వినిపిస్తున్నారు. కనులకు ఇంపుగా శోభిల్లజేస్తున్నారు.
ఈ ప్రతిభావంతమైన ప్రజ్ఞగల చిత్రకారిణి పాత పాలమూరు జిల్లా నుంచి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఆమన్‌గల్ మండల కేంద్రంలో 1976లో సరస్వతి జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. కల్వకుర్తిలో ఇంటర్మీడియెట్ చదివారు. బాల్యంలో తన అక్క లక్ష్మీ బొమ్మలు వేస్తుండగా చూసి తానూ ఆకర్షితురాలై గీయడం ప్రారంభించానని, అనంతరం పాఠశాలలో యాదగిరి సార్ డ్రాయింగ్ ప్రాథమిక విషయాలు బోధించారని, తనకు తెలియకుండానే తనలోకి చిత్రకళ ప్రవేశించిందని, బాల్యంలో మట్టితో వినాయకుడిని చేశానని, తనతో పాటే ఆ ‘తృష్ణ’ పెరిగిందని ఆమె చెప్పారు.
తనకు పెళ్లయ్యాక 1998లో హైదరాబాద్‌లోని జెఎన్‌టియులో బిఎఫ్‌ఏలో చేరానని, అంతకు పూర్వం తాను చేసిన అభ్యాసం.. ఊహలు, చిత్రరచన, గీతలు ‘గుడ్డుసున్నా’గా మారాయని, కాలేజీలో సరికొత్తగా లైన్, షేడింగ్, కలర్ వర్క్, కాంపోజిషన్, ల్యాండ్‌స్కేప్స్, మెమొరీ డ్రాయింగ్, స్టిల్ లైఫ్, గ్రాఫిక్స్, మ్యూరల్స్ గూర్చిన ప్రాథమిక అంశాలను శాస్ర్తియంగా నేర్చుకున్నానని అక్కడే తన నిజమైన చిత్రరచన జీవితం ప్రారంభమైందని ఆమె అంటున్నారు.
బిఎఫ్‌ఏ చేస్తున్న సమయంలో, ఆ తరువాత కొంతకాలం తాను తన పరిసరాలను పరిశీలించి ఆ దృశ్యాలను కాగితంపై, కాన్వాసుపై చిత్రించానని, ఆ రకంగా తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని మహిళల - మట్టి మనుషుల బొమ్మలను అసంఖ్యాకంగా వేశానని ముఖ్యంగా ఆడవాళ్ల ముచ్చట్లు, వారు చేసే వివిధ పనులను చిత్రిక పట్టి చూపడంతో జీవితాన్ని తాజాగా పట్టి చూపిన వైనం ‘ఆర్ట్ లవర్స్’కు ఆ రోజుల్లో ఎక్కువగా నచ్చింది. తెలంగాణ ఉద్యమం సైతం అందుకు దోహదపడింది. ఈ ఆడవాళ్ల బొమ్మలతో పాటు గ్రామాల్లోని గొల్లవాళ్ల బొమ్మలు, పిల్లనగ్రోవి ఊదుతూ గోవులను కాసేవారి బొమ్మలు కొన్ని గీసి 2007 సం.లో హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తొలి ‘సోలో షో’ను నిర్వహించానని ఆ ప్రదర్శనకు మంచి స్పందన రావడంతో కుటుంబ ఒత్తిళ్లు ఉన్నా మరింత ఉత్సాహంతో బొమ్మలు వేయసాగానని ఆమె చెప్పారు.
అలా గొల్లవాళ్ల బొమ్మల్లోంచి శ్రీకృష్ణుడు ఉబికివచ్చి తనను పూర్తిగా ఆవహించాడని వర్తమానంలో తాను చేస్తున్న చిత్రరచన అంతా శ్రీకృష్ణుని చుట్టూ కొనసాగుతోందని, అందులో రాధా, గోపికలతోపాటు మీరా కనిపిస్తుందని, గోవర్థనధారి.. గోవులు ఇట్లా మొత్తం ‘కృష్ణతత్త్వం’ తొంగి చూస్తుందని ఆమె చెప్పారు. తానొక చోట ఒక ఆకుపై వేసిన బొమ్మను ఫ్రేమ్ కట్టి ఉండటాన్ని చూసి ఆ ప్రేరణతో శ్రీకృష్ణుని గోపికలను అసంఖ్యాక ఆకుల్లో నిగూఢంగా దర్శింపజేసే ఆలోచన వచ్చిందని ఆమె అంటున్నారు. చివరికి ఈ శైలి కారు - స్కూటర్‌ను సైతం అలంకరించే స్థాయికి వెళ్లిందని, ఆమె చెప్పారు. అంతటా తానే ఉన్నానన్న శ్రీకృష్ణుడి ‘గీతా సారాంశం’ ప్రేరణతో అన్నిట్లో శ్రీకృష్ణుడిని దర్శింపజేస్తున్నానని, అదీ తనదైన ప్రత్యేక శైలిలో సాక్షాత్కరింప జేస్తున్నానని ఆమె గర్వంగా, ముసిముసి నవ్వులతో వెల్లడించారు.
తాను ఏడు సోలో షోలను నిర్వహించానని, తన బొమ్మలు చెన్నై, బెంగళూరు, ముంబయ్, కోల్‌కతా తదితర చోట్ల గ్రూపు షోలలో ప్రదర్శితమయ్యాయని, అలాగే మ్యూజియం ఆఫ్ బెల్జియంలో మోహినీ అవతారంపై తాను గీసిన చిత్రం పెట్టారని, మరెన్నో ప్రతిష్ఠాత్మకమైన చోట్ల తన తాజా చిత్రాలు కనిపిస్తాయని, ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఎంతో ఇష్టపడి తన బొమ్మలను తీసుకున్నారని సరస్వతి సగర్వంగా చెప్పారు. ఆ రకంగా ఆమె రంగుల రవళి రసగంగలో ఎందరో తన్మయం చెందుతున్నారు. ఈ జన్మకిది చాలన్నంతగా సరస్వతి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఎల్.సరస్వతి 97052 34502

-వుప్పల నరసింహం 9985781799