S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-28

సి.ఎం. చంద్ర పూర్తిగా మరో మనిషైన మరింత ఉత్సాహంగా ఉండడం గమనించిన నగరానికి సంబంధించిన వారు, ప్రతిపక్షాల వారే కాక కుటుంబ సభ్యులు కూడా విస్తుపోయారు అయినా అందుక్కారణం మాత్రం ఎవరూ రాబట్టలేక పోయారు. కానీ విషయం తెలియకపోయినా ధర్మారావు బృందంలో మాత్రం దడ పెరిగిపోయింది. చంద్ర తమని అరెస్టు చేయించి, పోలీసుల చేత చితకబాదించినట్టు ఊహించుకుని వణికిపోతూ మళ్లీ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని అనిల్ రప్పించారు.
ఎన్ని చెప్పినా ధర్మారావూ వాళ్లు నగలు, దేవతా విగ్రహాలు దాచిన చోటు మాత్రం అనిల్‌కి చెప్పలేదు. అనిల్ అడగనూ లేదు. వాళ్లని కలవడం అంత ఇష్టం లేదు. అంతేకాదు. ఇటీవల అతనికి దేని మీదా ఇంట్రస్ట్ ఉండడం లేదు. దానిక్కారణం, ఎంతో రిస్క్ తీసుకుని సంపాదించిన విలువైన నగలు చెయ్యి జారిపోయాయన్న దిగులు, వాటిని లూసీయే మాయం చేసిందన్న నమ్మకంతో, ఆమెని చంపైనా వాటిని స్వంతం చేసుకోవాలన్న ఆరాటం పెరిగిపోవడమే.
‘ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు అనిల్’ పొద్దుగూకిందంటే దడగా వుంది. ఎప్పుడేం జరుగుతుందో అని. ఎవరో ఆగంతకులు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని అనుమానంగా ఉంది. ఆనాడొచ్చిన దొంగ వెధవ తాలూకు వాడే అని నా అనుమానం. అయినా ఏనాడో పోయిన వాటి కోసం ఇప్పుడు వెతకడం ఏవిఁటి?’ అన్నాడు ధర్మారావు తపనగా నుదురు రాసుకుంటూ.
‘ఇప్పుడైనా విలువైన ఆభరణాలు, విగ్రహాలు దాచిన చోటుని గురించి చెప్తారా? చెప్పకపోయినా నాకొచ్చిన నష్టం ఏం లేదు. మీతో చేతులు కలిపి దోచిన సొమ్ము మరొకళ్లు దోచుకు పోయారు కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ మీరు దాచిన దైవ విగ్రహాలు, నగలూ ఆధారాలతో సహా దొరికితే ఏం జరుగుతుందో నేను మీకు చెప్పక్కర్లేదు. నా సహాయం కోరుతూనే నా దగ్గర విషయం దాస్తున్నారు. మీరు పేపర్ వగైరాలు చూస్తూనే ఉన్నారుగా. ఈ మధ్య పోయిన వస్తువుల గురించే కాక ఏనాడో పోయిన వస్తువుల కోసం గాలిస్తున్నారని మీడియా వాళ్లు చెప్తున్నారు. ఈ సి.ఎం. చంద్ర సామాన్యుడు కాదు. ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టగలడు. పాత నేరస్తులందర్నీ బైట పెట్టటానికి, విజయనాయక్ లాంటి వాళ్లతో ఓ టీమ్ ఏర్పాటు చేశాడని నా నమ్మకం. అయినా ఫరవాలేదనుకుంటారా. మీ ఇష్టం. నన్ను మాత్రం మీ ఊబిలోకి లాగకండి’ అన్నాడు అనిల్ కాస్త దూకుడుగా.
ఆ ధోరణికి ధర్మారావుకి కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు.
‘నీకు చెప్పకూడదని కాదు అనిల్! అవి తియ్యడానికే భయంగా ఉంది. ఇన్నాళ్లూ వాటిని గురించి నిశ్చింతగానే ఉన్నాం. కానీ, అనామకులు అర్ధరాత్రులు మా ఇళ్ల చుట్టూ తిరుగుతుంటే టెన్షన్‌గా ఉంది’ అన్నాడు కాంతారావు.
‘అంత టెన్షన్ పడడానిక్కారణం ఏవిఁటి? ఆ నగలు, విగ్రహాలు మీ ఇళ్లలో దాచారా?’ సౌమ్యాన్ని తెచ్చుకుంటూ అన్నాడు అనిల్.
‘అమ్మో! మా ఇంట్లోనా?’
‘మరి టెన్షనెందుకు?’
‘మొన్న ఆ వెధవెవడో పడేసిన పేపర్లో పాత నగలు అని ఏదో వుందిగా. వాళ్లు అవి మా దగ్గరే వున్నాయనుకునుండచ్చు’ అన్నాడు ధర్మారావు.
‘ఇంతకీ అవెక్కడున్నాయి?’ అన్నాడు అనిల్.
‘్భద్రంగానే ఉన్నాయి’ అన్నాడు ధర్మారావు నసిగినట్టు.
అనిల్‌కి చిరాకు పెరిగిపోయింది.
‘అంతే తప్ప వాటిని గురించి చెప్పరన్న మాట’ అన్నాడు విసురుగా.
‘అది కాదు అనిల్! అవి పురాతన వస్తువులు. వాటితో కనిపిస్తే మనమందరికీ ఉరిశిక్షే!’ అన్నాడు కాంతారావు భయంగా.
‘మనందరికీ కాదు. మీకు! మీ గురించి తెలియక మీతో చేతులు కలిపి నేనూ రిస్క్‌లో పడిపోయాను. లేకపోతే హాస్పిటల్ మరింత డెవలప్ చేసుకుని, గౌతమిని పెళ్లాడి హాయిగా వుండేవాణ్ని. కోట్లు సంపాయించుకుని మంచి డాక్టర్ పేరు తెచ్చుకునేవాణ్ని. దాంట్లోంచి బైట పడాలని చూస్తుంటే మీ మూలంగా మరిన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం నాకిష్టం లేదు. మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండి’ రుసరుసలాడాడు అనిల్.
‘పదేపదే నేను మంచివాణ్ని. మీరే దొంగలు, మీ మూలంగానే నేను దోషిగా మారాను’ అనడం ధర్మారావుకి ఆవేశాన్ని తెప్పించింది.
‘ఇదిగో చూడు డాక్టరూ! నీ చరిత్ర మాకు తెలియదనుకోకు. నీ చరిత్రంతా తెలుసుకునే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాం. నువ్వు మెడిసిన్‌లో చేరిన మొదటి సంవత్సరంలోనే ఓ అమ్మాయిని రేప్ చేసి చంపి, కాలేజీ బిల్డింగ్ మీంచి పడేసి ఆత్మహత్యగా చిత్రించి తప్పుకున్నావనీ, తల్లిదండ్రులు పోయిన నిన్ను తాత, బామ్మ చేరదీసి పెంచి పెద్దచేస్తే వాళ్ల ఆస్తి కోసం అమానుషంగా ఆ వృద్ధ దంపతుల్ని నది పాలు చేసి, ప్రమాదం అన్ని ఆధారాలు సృష్టించి ఆ ఆస్తిని హాయిగా అనుభవిస్తున్నావనీ.. ఇంకా చాలా విషయాలు తెలుసు ఇవన్నీ బైటపడితే నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు’ అన్నాడు ఆవేశంగా.
కొయ్యబారిపోయాడు అనిల్ తన చరిత్ర తెలిసిన వాళ్లున్నారని అతను ఊహించలేదు.
‘ఏవిఁటలా చూస్తున్నావ్? ఈ విషయాలన్నీ మాకెలా తెలిశాయనా? నీ గురించి తెలుసుకున్నాకే నిన్ను మా గ్రూప్‌లో చేర్చుకున్నాం. కోపంగా ఉంది కదూ? మమ్మల్నిద్దర్నీ కూడా చంపెయ్యాలని కూడా అనిపిస్తోంది అవునా? కానీ లాభం లేదు బాబూ! నీ సంగతి చాలామందికి తెలిసిపోయింది. మమ్మల్ని చంపినా, ఆ ప్రయాగ, నాయక్, ప్రభులు నిన్ను వదలరు. అంతెందుకు? ఆ సి.ఎం. చంద్ర నివురుగప్పిన నిప్పు. కనిపించకుండానే కాల్చేస్తాడు. నీ గురించి ఆ గౌతమి, లూసీ దగ్గర్నించి చాలా విషయాలు తెలుసుకున్నాడని కూడా మా చెవిన పడింది. ప్రస్తుతం అతని మానాలన్నీ మామీద కాదు, నీ మీదే! సమాధి అయిపోయిన నీ నేరాల్ని సైతం పునాదులతో సహా బైటికి లాగుతాడు’ అన్నాడు ధర్మారావు ఆవేశంగానే.
‘నువ్వేదో పెద్ద హీరో ననుకుంటున్నావేమో. నీ దగ్గర నర్స్‌గా చేరిన లూసీ.. అదే.. చందన నీ జాతకమంతా చరిత్ర పాఠంలా రాసుకుంది. ఇప్పుడు మమ్మల్ని కూడా దూరం చేసుకుంటే నీ గతి అధోగతే! బాగా ఆలోచించుకో. మనం ముగ్గురం కలిసుంటేనే అందరికీ మంచిది’ అన్నాడు కాంతారావు.
అతి తెలివిగల వాణ్ననుకుని మిడిసిపడే అనిల్‌కి కాళ్లలోంచి వణుకొచ్చేసింది. కటకటాలు, ఉరికంబం కళ్ల ముందు వికటాట్టహాసం చేశాయి. ఊసరవెల్లిలా రంగులు అతి తేలిగ్గా మార్చుకోగల అతను మొహం దీనంగా పెట్టి-
‘సారీ పార్ట్‌నర్స్! కష్టపడి సంపాదించిన నిధి చేజారిపోయిందనీ, ఎంతో ప్రేమించినట్టు నటించి నా కాళ్ల కిందే మంటపెట్టిన గౌతమినీ తల్చుకుంటే నాకు మతిపోయినట్టయింది. తొందరపడ్డాను. క్షమించండి’ అనేశాడు. అవసరార్థం ధర్మారావు వాళ్లు కూడా కూలవక తప్పలేదు.
‘సరే! ఇంక ఒకళ్ల గతాల గురించి చెప్పుకోవడం మానేసి ప్రస్తుతం చెయ్యాల్సిన దాన్ని గురించి ఆలోచిద్దాం’ అన్నాడు కాంతారావు.
‘నిజమే. నేనే తొందరపడ్డాను. నా పరిస్థితులకి తట్టుకోలేక...’ దిగులుగా అన్నాడు అనిల్.
‘కంగారుపడకు డాక్టరూ! నువ్వూ మాలో ఒకడిగానే మేం భావిస్తున్నాం. ఏం చేసినా ముగ్గురం ఆలోచించే చేద్దాం. పోయినదాన్ని గురించి బాధపడకు. మా నిధుల్లో నీకూ భాగం ఉంటుంది’ నవ్వుతూ అతని భుజం తట్టాడు ధర్మారావు.
అనిల్ మొహం వెలిగిపోయింది. అతనికి థాంక్స్ చెప్పి-
‘అయితే ఆ నగలు, విగ్రహాలూ...’
‘వాటిని చూసి కూడా చాలా కాలమైంది. అవి శతాబ్దాల కిందటి వస్తువులు. ఆ వస్తువుల్లో నరసింహస్వామి, హనుమంతుడి బంగారు విగ్రహాల్లో అపురూపమైన వజ్రాలు పొదిగి చాలా అందంగా ఉన్నాయి. కానీ వాటిని ముట్టుకోగానే కరెంట్ షాక్ తగిలినట్టు ఒళ్లు జలదరించింది. అవి విగ్రహాలే అయినా ఆ కళ్లు నిప్పులు చెరుగుతున్నంత భయంకరంగా ఉన్నాయి. గుండె ఆగినంత పనయింది. సూటిగా చూడలేకపోయాం. ఎందుకో చాలా భయం వేసింది. వాటిని సొమ్ము చెయ్యడానిక్కూడా భయం వేసి, అమ్మేదారి లేక బందీలుగా చేశాం. ఇనే్నళ్లుగా ఓసారి చూసుకుందామనుకున్నా ధైర్యం చాల్లేదు’ అనిల్ మాట పూర్తి కాకుండానే అన్నాడు కాంతారావు దాదాపు వణికిపోతూ.
‘అవును అనిల్! ఆ విగ్రహాలని చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మినట్టయింది. వాటిని గురించి దాదాపు మర్చిపోయాం కూడా. కానీ ఇంతకాలం తర్వాత వాటిని గురించి ఎలా తెలిసిందో’ అన్నాడు ధర్మారావు నెత్తిన చేతులు పెట్టుకుని.
‘ఇంకెవరు... ఆ సి.ఎం.గాడే గోతులు తవ్వించి ఉంటాడు. వాడున్నంత కాలం మనలాంటి వాళ్లకి ఫుడ్డే వుండేలా లేదు’ కసిగా అన్నాడు ధర్మారావు. వాళ్ల మాటలకి పెద్దగా నవ్వాడు అనిల్.
‘మీరే కాలంలో వున్నారు ధర్మారావుగారూ. అదంతా మన భ్రమ. ప్రాణం లేని విగ్రహాలేం చేస్తాయి. తప్పులు చెయ్యడం, దేవుడి మొక్కులు తీర్చడం. కొందరు దైవానికి మొక్కుతున్న వాళ్లే ఆ దేవుడి సొమ్ము కైంకర్యం చేస్తున్నారు. దైవభక్తి వున్నవాళ్లు ఆ దైవానే్న దొంగిలించి అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూస్తారా? పోనీ వాళ్లది దొంగభక్తే అనుకుందాం. కానీ లోకానే్న కాపాడే ఆ దేవుడు తనని తాను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాడు? అంతా మన ఆలోచనల్లోనే ఉంది. ఇలాంటి సెంటిమెంట్ వుంటే మనం ఒక్క అడుక్కూడా ముందుకెయ్యలేం’ అన్నాడు నవ్వుతూనే.
‘అంతేనంటావా?’
‘కచ్చితంగా అంతే’
‘మనం వాటిని తెస్తాం సరే. కానీ వాటినెక్కడ దాద్దాం. అసలే ఆ ప్రయాగా వాళ్ల చూపు మన మీదుందంటున్నావ్?’ అన్నాడు కాంతారావు.
‘నిజమే. ఎవరూ ఊహించని విధంగా ఎక్కడో పైన వున్న ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో దాచినవే మాయం చేశారు. అంతకన్నా భద్రమైన స్థలంలో దాచాలి’ అన్నాడు అనిల్.
‘ఎస్. ఎవరూ కనిపెట్టలేని ఓ ప్లేస్ ఉంది’ ఉత్సాహంగా అన్నాడు ధర్మారావు చిన్నపిల్లాడిలా. మిగతా ఇద్దరూ కుతూహలంగా చూశారు. ధర్మారావు చెప్పాడు.
‘వావ్! దటీజ్ బెస్ట్ ప్లేస్’ అరిచినట్టు అన్నాడు అనిల్. అయితే కాంతారావు మొహంలో అంతగా ఆనందం కనిపించలేదు.
‘నీ అయిడియా బానే ఉంది ధర్మా! కానీ బైట వాతావరణం ఎలా ఉందో చూశావా? కుంభవృష్టి పడేలా మేఘాలు ఆక్రమించాయి. ఇప్పుడు మనం తోటలోకెళ్లి వాటిని తెచ్చి ఆ భయంకరమైన చోటికెళ్లి క్షేమంగా రాగలమా?’ అన్నాడు.
‘ఏం పర్లేదు. నిశాచరుల్లా తిరగడం మనకలవాటేగా. ఏం అనిల్ నీకేం భయం లేదుగా’ అన్నాడు ధర్మారావు.
‘నో! నాకేం భయంలేదు. ఆ కొండ పరిసరాలన్నీ నా కలవాటైనవే’ అన్నాడు అనిల్ ఉత్సాహపడిపోతూ. కాంతారావు వౌనంగా వుండడం చూసి-
‘ఏంటి కాంతా! నువ్వు తాచుల గురించి భయపడుతున్నావా? లేకపోతే బావిలో దిగడానికి భయపడుతున్నావా?’ అన్నాడు ధర్మారావు.(ఇంకా వుంది)

-రావినూతల సువర్నాకన్నన్