S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతర్విచారం

సీ॥ కమనీయ భూమి భాగములు లేకున్నవే
పడియుండుటకు దూది పఱుపులేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే
భోజన భాజన పుంజమేల?
వల్క లాజిన కుశావళులు లేకున్నవే
కట్ట దుకూల సంఘాతమేల?
గొనకొని వసియింప గుహలు లేకున్నవే?
ప్రాసాద సౌధాది పటలమేల?

తే॥ ఫల రసాదులు గురియవే పాదపములు
స్వాద జలముల నుండవే సకల నదులు
బొసగఁ భిక్షయుఁ బెట్టరే పుణ్యసతులు
ధనమదాంధుల కొలువేల తాపసులకు.

ప్రతి మనిషీ సుఖమే కోరుకుంటాడు. దుఃఖాన్ని తట్టుకోలేడు. కష్టాన్ని భరించలేడు.
సుఖ జీవనం కోసమే పుట్టాననుకుంటాడు. రక్తమాంసాదులతో పైకి కనిపించే శరీరం ఒకటైతే కనిపించని సూక్ష్మ శరీరం లోపలే మరోటి ఉంది. వేదాంతులు దీన్ని ‘లింగ శరీర’మని పిలుస్తారు. దీన్ని ఆశ్రయించుకునే ప్రాణం, మనస్సు, బుద్ధి ఉంటాయి. దుఃఖం, కోపం, తాపం, మదం, మాత్సర్యం మొ.అన్నీ. దీనికే. కానీ బయట పది మంది కోసం కనిపించే శరీరానికి చేసే సేవలతో లోపలి శరీరానికి ఏ సంబంధమూ లేదు. అదే విచిత్రం.
భాగవతంలో ఈ పోతనగారి పద్యంలోని భావం తెలుగు కాస్త అర్థం చేసుకునే ఎవరికైనా బోధపడ్తుంది. జీవన సారాన్ని ఇంత సరళమైన తెలుగు భాషలో అందించిన మహనీయుడు లేడు.
సుఖమనేది శారీరకమా? మానసికమా?
దీనికి లభించే సమాధానమే ఆలోచనీయం.
సుఖం బాహ్య శరీరం మీద ఆధారపడి లేదు. అంతశ్శరీరం మీదే ఆధారపడి ఉంది.
బయట పదిమందిలో తిరిగేప్పుడు శుభ్రమైన వస్త్రం, ముఖానికి సౌందర్యం ఇనుమడించే అలంకారాలెన్ని చేసినా, ప్రయోజనం సున్నా. లోపల జరిగే మాయ ఎవరికి తెలుస్తుంది?
పెళ్లిచూపులకు వధువును నానాలంకార భూషణాలతో నింపి కూర్చోపెట్తారు. వచ్చిన పెళ్లి వారు కాఫీ టిఫిన్లు బాగా సేవించి, చూసి వెళ్లగానే ఒక్క ఫోన్ చేసి సంబంధం కుదరదని చెబితే లభించేది సుఖమా? దుఃఖమా? గొంతెమ్మ కోరికలు పుట్టి వివాహ ప్రయోజనం ఏమిటో తెలియనివారు అంతరంగ శోధన చేయలేరు. గూఢంగా ఆలోచించరు. ఈ లోకంలో ప్రవేశించిన ప్రతి మనిషీ కోరుకునే శారీరక సుఖం కంటే ఆనందాన్నిచ్చేదేదో ఉంది. ఆ రహస్యం మనసుకు సంబంధించినది. ఆ అంతరంగ శుద్ధిలోని పరమార్థం తెలియాలి. మన కళ్లెదుటే ఇక్కడే పుట్టి పెరిగిన యోగ పురుషులు కొద్దిమందే ఈ రహస్యాన్ని ఛేదించగలిగారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అరబిందో లాంటి మహనీయులు ఈ కోవలోనివారే. అరుణాచలంలో భగవాన్ రమణులు సంచరించిన ప్రదేశాలు చూసిన వారికి ఈ విషయం బాగా బోధపడ్తుంది. ఆ పుణ్యక్షేత్రాన్ని ఆశ్రయించుకుని ఏయే గుహలో, ఆ యోగి ఎంతకాలం ఉండేవారో ఆయన దైనందిన కార్యక్రమం ఎలా ఉండేదో ఆయన చరిత్ర తెలిసినవారు చెప్తారు.
‘దేహాభిమానం లేకపోతే దైవంతో సమానమే అనేందుకు సాక్షి భగవానే.
‘సొరిది సంసారంబు సుఖమా ఇందరికి
తెర వెఱంగగ లేక తిరిగేరుగాక
దేహములు తలుపు సుస్థిరములా ప్రాణులకు
నూహింప లోభ మార్కొండుగాక
మోహంబుచే వెనుక ముందెరుగలేక తమ
దేహ సుఖములు మరిగి తిరిగేరుగాక ॥
మెఱయు విభవములెల్ల నిజములా యిందరికి
కొఱమాలి యున్న తమ గుణముగాక
ఎఱుకతో తిరు వేంకటేశు కొలువగ లేక తమ
తెఱగుమాలిన బుద్ధి తిరిగేరుగాక
సొరిది సంసారము సుఖమా అంటాడు అన్నమయ్య. సంసారంలో ఉంటూనే సారాన్ని గ్రహించాడు.
అన్నం తినేవాడికి తనకన్నీ తెలుసుననే భావన రావటమే పెద్ద ప్రమాద హేతువు. అందుకే పెద్దల మాట చద్దిమూట అన్నారు.
ఎందరు యోగులు చెప్పినా ఇదే మాట.
సత్యం ఒక్కటే. రకరకాలుగా చెప్తారంతే. అయినా అర్థమైతేగా?
అయినట్లు కనిపిస్తుంది.
సుఖ జీవితానికి అలవాటు పడిన కొద్దీ ఆలోచనా విధానంలో మార్పులొస్తూంటాయి. లోపలి వాడు వద్దని గుర్తు చేస్తూనే ఉంటాడు. చిరునవ్వుతో సరిపెట్టుకుని తిరిగేసే వారికి సీరియస్‌నెస్ ఉండదు. కోరికలు ఎలా పుట్తాయో చెప్పేందుకు కంచి పరమాచార్యుల వారో కథ చెప్పారు.
స్థూల శరీరానికీ సూక్ష్మ శరీరానికీ గల అవినాభావ సంబంధాన్ని ఇంతకంటే చక్కగా ఎవరూ చెప్పలేరేమో!
ఓ ముని తపోనిష్టలో ఉన్నాడు. ఆకాశంలో ఒక కాకి నోటి నుండి జారి ఎలుక పిల్ల ఒకటి ఆ ముని ఎదురుగా పడింది.
ఆ మునీశ్వరుడికి దయ కలిగింది. జడ భరతునికి తమ్ముడై యుంటాడేమో. కాసిని ధాన్యపు గింజలు ఎదురుగా పోసి ఆ ఎలుకను జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఎక్కడి నుంచో పిల్లి దాన్ని చూసి వెంటబడుతోంది.
ఆ మునీశ్వరుడు సకల గుణ సంపన్నుడు. తిమ్మిని బమ్మిగ చేయగల సమర్థుడు.
ఆ ఎలుకను క్షణంలో పిల్లిగా చేసేశాడు. కొన్నాళ్లకు ఆ పిల్లి వెంట కుక్క వెంటబడసాగింది. మునీశ్వరుడు పిల్లిని కుక్కగా మార్చేశాడు.
నాలుగు రోజులు గడిచిందో లేదో ఎక్కడి నుంచి ఊడిపడిందో, కుక్క ఒక్కసారిగా ఓ పెద్దపులి వెంబడిస్తోంది. ఇదా సంగతీ? అని ఈ మునీశ్వరుడు ఆ కుక్కను క్షణంలో పులిగా మార్చేశాడు. రోజూ ఆశ్రమంలోని పులిని మిగతా మునులు ‘ఎందుకలా ఖంగారు పడతారు? అది నిజంగా పులి అనుకుంటున్నారా? కాదు. మన మునీశ్వరుడు రక్షించి పెంచుతున్న ఎలుకే అది’ అని నచ్చజెప్పి ధైర్యం చెబుతున్నాడు. ఆ మాట చెవుల పడిన ఈ ఎలుకకు అవమానంగా తోచింది. తుంటి మీద కొట్తే నోటిపళ్లు రాలిపోయినట్లు దిక్కుమాలిన ఆలోచన పుట్టింది దానికి. దీనంతటికీ కారణం, ఈ మునీశ్వరుడే ఈ మునిని కడతేరిస్తే గానీ ఈ అవమానం పోదని భావించింది. మునీశ్వరుడు కనిపెట్తూనే ఉన్నాడు. దాని మనసులో ఆలోచన గ్రహించిన మునీశ్వరుడు గతుక్కుమన్నాడు. ఎరక్కపోయి ఇలా ఇరుక్కున్నా నేమిటని తలబాదుకుని ఉత్తర క్షణంలో ఆ పులిని యధావిధిగా ఎలుకగా మార్చేశాడు. చిన్న కథే అయినా, దీనివల్ల తెలియవలసినది పెద్ద విషయమే.
ఎలుక ఎలుక రూపంలో ఉన్నప్పుడు మునీశ్వరుడు పరమ శాంతమూర్తిగాను, ఉదార హృదయుడుగానూ కనిపించాడు. మునిని చంపాలనే కోరిక పుట్టలేదు. ఎప్పుడైతే పులిగా మారిపోయిందో దాని ఆలోచనలో మార్పు వచ్చింది. అలాగే మనిషికి కలిగే కోరికలన్నీ ఆ స్థూల శరీరం వల్లే. వీటికి అడ్డుకట్ట వేయగలిగేది మనమే.
పువ్వు పుట్టగనే పరిమళించినట్లుగా అందుకే బాల్యం నుంచే బాహ్య స్మృతి లేకుండా అంతరంగంలోని ఆత్మారాముణ్ణి దర్శించిన యోగిపుంగవులైన మహనీయులు లోకానికే ఆదర్శప్రాయులై సాత్వికగుణ సంపన్నులై మనో మనోఫలకాల్లో నిలిచిపోయారు. వారిని చదవగా చదవగా జ్ఞానోదయం కలగకపోతుందా?

- మల్లాది సూరిబాబు 90527 65490