S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విషం నుంచి పుట్టిన ‘వైరస్’!

ప్రఖ్యాత నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షాకి ఒక హాలీవుడ్ నటి, ‘నువ్వు ఎంతో తెలివయిన వాడివి. నేను ఎంతో అందమయినదాన్ని. మనిద్దరం పెళ్లి చేసుకుంటే మనకి పుట్టే పిల్లలకి నీ తెలివితేటలు, నా అందం వస్తాయి కదా!’ అని ఉత్తరం రాసిందట. సభ్యత తెలిసిన వ్యక్తి కనుక జార్జ్ వెంటనే ‘మనకి పుట్టబోయే పిల్లలకి నా అందం, నీ తెలివి వస్తే వాళ్ల గతి ఏమవుతుందో ఆలోచించావా?’ అని సమాధానం రాసేడుట.
1918లో ఇన్‌ఫ్లుయెంజా అనే విషజ్వరం ప్రపంచం అంతటినీ ఒకసారి చుట్టబెట్టి వెళ్లింది. ఇలా ప్రపంచం అంతటినీ చుట్టబెట్టుకొచ్చే అంటురోగాన్ని ఇంగ్లీషులో ‘పేండమిక్’ అంటారు. గ్రీకు భాషలో ‘పేన్’ అంటే అఖిల అనిన్నీ ‘డెమోస్’ అంటే ప్రజలు అనిన్నీ అర్థం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి మీదా పడి చంపే రోగం కనుక దీనిని తెలుగులో ‘అఖిలమారి’ అందాం. ‘ఎపిడెమిక్’ అనేది ప్రాంతీయంగా ప్రజ్వరిల్లి వ్యాపించే అంటురోగం. దీనిని మహామారి అంటున్నాం కదా. అదే ధోరణిలో ‘పేండమిక్’ అంటే అఖిలమారి. ఈ ఇన్‌ఫ్లుయెంజా అఖిలమారి వల్ల ఒక్క 1918 సంవత్సరంలో దరిదాపు 50,000,000 (50 మిలియన్లు) చనిపోయారని ఒక అంచనా. అంటే అప్పటి ప్రపంచ జనాభాలో 3 శాతం చనిపోయారు. ఇరవైయవ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలలో చనిపోయిన వారి సంఖ్యతో పోల్చదగ్గ సంఖ్య ఈ అఖిలమారికి బలి అయిన వారి సంఖ్య.
ఇన్‌ఫ్లుయెంజా అఖిలమారి ఒక వైరస్ వల్ల వస్తుంది. ‘వైరస్’ అన్న మాట లాటిన్‌లోని ‘విషం’ అన్న మాట నుండి పుట్టింది. ఇది కంటికి కనిపించనంత చిన్నది. దీనిని తెలుగులో విషాణువు అందాం. శరీరంలోని జీవకణాల కంటె చిన్నది. బాక్టీరియం అనే సూక్ష్మజీవిత కంటె చిన్నది. అతి సున్నితమైన వడపోత పరికరాలగుండా కూడా వెళ్లిపోగలంత చిన్నది. ఇంత చిన్న వైరస్ రెండు ఘటక ద్రవ్యాలతో తయారవుతుంది. రైకామ్లం (డిఎన్‌ఏ) కాని అరైకామ్లం (ఆర్‌ఎన్‌ఏ) మొదటిది, దానిని చుట్టబెట్టి కవచంలా రక్షించే ప్రాణ్యం (ప్రొటీను) రెండవది. ఈ విషాణువులు వాటంతట అవి పిల్లలని కని తామరతంపరలా వృద్ధి పొందలేవు. ఆషాఢభూతికి ఆశ్రయం ఇచ్చినట్లు ఏదో ఒక అభ్యాగతి జీవకణం వీటికి ఆశ్రయం ఇచ్చినప్పుడే వీటి జనాభా పెరగగలదు. అంటే విషాణువులు తిష్ట వెయ్యటానికి స్థావరం ఉండాలి.
ఈ రకం విషాణువు శరీరంలో తిష్ట వెయ్యటం వల్ల వచ్చే వ్యాధులలో ఇన్‌ఫ్లుయెంజా ఒకటి. వైరస్ వైనం తెలియని రోజులలోనే ఇన్‌ఫ్లుయెంజాని తెలుగులో విషజ్వరం అన్నారన్న విషయం గమనార్హం. ఈ వైరస్ - ఈ విషాణువు - శరీరంలో తిష్ట వేసిన వారందరికీ ఫ్లు రావాలని లేదు. వచ్చిన వారంతా మరణించాలనీ లేదు. గణాంకాల ప్రకారం 1918లో ప్లు సోకిన వారిలో ఏ 3 శాతమో చచ్చిపోయారు. కనుక ఫ్లు ‘ప్రాణాంతకపు జోరు’ 3 శాతం అంటాం. గుడ్డిలో మెల్ల; ఫ్లు తగిలిన వాళ్లందరూ చచ్చిపోరు. ఈ లెక్కని ఫ్లు వైరస్ అంత దుర్మార్గమైనది కాదు. (1918లో ఫ్లు 50,000,000 మందిని చంపినా!)
వైరస్‌లలో రకాలు ఉన్నాయి. కొన్ని వైరస్‌లు శరీరంలో తిష్ట వేశాయంటే (వెనువెంటనే ఆధునిక వైద్య యంత్రాంగాన్ని రంగంలోకి దింపి చావుని తప్పించకపోతే) మరణం ఖాయం. అంటే ఈ విషాణువుల ప్రాణాంతకపు జోరు 100 శాతం. కుక్కవెర్రి (రేబీస్) అనే వ్యాఫి ఉంది. పిచ్చికుక్క కరిచినా, కొన్ని అడవి జంతువులు కరిచినా ఈ వ్యాధి వస్తుంది. ఆయా జంతువుల లాలాజలంలో ఉన్న రేబీస్ అనే విషాణువు వల్ల ఈ వ్యాధి సోకుతుంది. కాటు పడ్డ ఉత్తర క్షణంలో వైద్యం చెయ్యకపోతే చావు తప్పదు. అంటే కుక్కవెర్రి ప్రాణాంతకపు జోరు నూటికి నూరు!)
విజ్ఞానపరంగా చూస్తే కుక్కవెర్రిని పుట్టించే విషాణువు ప్రతిభ అనన్యాదృశ్యం అని చెప్పవచ్చు. తూటా ఆకారంలో ఉన్న ఈ విషాణువు కేవలం 180 నేనోమీటర్లు పొడవు, 75 నేనోమీటర్లు వెడల్పు ఉంటుంది. (నేనోమీటరు = మీటర్‌లో బిలియనో వంతు.) అయిదే అయిదు ప్రాణ్యాలని తయారుచెయ్యటానికి కావలసిన జన్యు సమాచారాన్ని 12,000 ద్వియాంశ అంకములలో లేదా ద్వింకములలో (బైనరీ డిజిట్స్ లేదా బిట్స్) ఇమిడ్చి పెట్టిన ‘టపాకాయ’ ఇది. ఇది శరీరంలోకి ప్రవేశించినది మొదలు ఏకాగ్ర చిత్తంతో పునరోత్పత్తి చేసుకుని పోతూ నరాల వెంబడి ప్రయాణం చేసి మెదడులో తిష్ఠ వెయ్యటం వల్ల పరాజితుడిలో దూకుడుతనం, మింగడం కష్టమవటం, నీరు అన్నా, నీటి పేరు విన్నా విపరీతమైన భయం వెయ్యటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. తాగలేక, మింగలేక బాధపడుతూన్న అభ్యాగతి చెయ్యగలిగేది ఆ నురుగలు కక్కుతూన్న విషపూరితమైన నోటితో మరొకరిని కరవటం! భయంకరమైన కుక్కవెర్రి ప్రతి ఏటా, ప్రపంచవ్యాప్తంగా 50వేల మందిని పొట్టపెట్టుకుంటోంది.
అయినా ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వాలు ఫ్లు అంటే భయపడాలి కానీ రేబీస్ అంటే భయపడనక్కర్లేదు. ఎందుకనిట? ఫ్లు ఒకరికొస్తే మరొకరికి అంటుకుని తాటేకుల మంటలా ప్రజల మీద పడి వ్యాప్తి చెందుతుంది. రేబీస్ రావాలంటే మని కుక్కో, కోతో, ఉడతో కరిచినప్పుడు తప్ప దానంతట అది గాలిలో ప్రసరించి ప్రజలలో విస్తరించదు.
ఫ్లులో రకాలు ఉన్నాయి. స్పేనిష్ ఫ్లు, హాంగ్‌కాంగ్ ఫ్లు, ఏష్యన్ ఫ్లు, పంది ఫ్లు.. పిట్ట ఫ్లు... ఇలా ఎన్నో పేర్లు పెట్టారు. ఇలా పేర్లు పెట్టేది అగ్రరాజ్యాల వారో, శే్వతవర్ణులో, అయినప్పుడు స్పేనిష్ వాళ్లకి, హాంకాంగ్ వాళ్లకి, ఆసియా వాసులకీ, పిట్టలకీ, పందులకీ కోపం వచ్చే ఆస్కారం ఉంది కదా. ఉండటమేమిటి? కోపం వచ్చింది. అమెరికాలో పంది మాంసం అమ్మే వర్తకులు ‘పంది ఫ్లు’కి అభ్యంతరం చెప్పారు. అందుకని ఈ ఫ్లు వైరస్‌లకి శాస్ర్తియమైన పేర్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు పంది ఫ్లు అనటానికి బదులు హెచ్1ఎన్1 అంటున్నారు. పిట్ట ఫ్లుని హెచ్5ఎన్1 అంటున్నారు. ఈ పేర్లు ఎలా వచ్చాయో చెబుతూ కూర్చుంటే దారి తప్పటం అవుతుంది.
ఇంతకీ ఈ కథ అంతా ఎందుకు చెప్పుకొచ్చేనంటే ఈ హెచ్5ఎన్1 ఉంది చూశారూ, దీని ప్రాణాంతకపు జోరు 60 శాతం. అంటే ఇది వంద మందికి సోకితే 60 మంది చచ్చిపోతారు. దీనితో పోల్చితే హెచ్1ఎన్1 అంత ప్రాణాంతకం కాదు. కానీ ఇది అతి జోరుగా విస్తరిస్తుంది. 1918లో వచ్చిన ఫ్లు లా!
ఈ రెండూ ఫ్లు వైరస్‌లే; ఒకటి మంచి సమర్థతతో వ్యాపిస్తుంది. మరొకటి మంచి సమర్థతతో చంపుతుంది. ఇప్పుడు ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఒకేసారి తిష్ట వేశాయని అనుకుందాం. అప్పుడు ఈ రెండూ ప్రేమలో పడి పిల్లలని కనటం మొదలుపెడితే ఆ పిల్లలకి ఒకరి నుండి ప్రాణాంతకత్వం, మరొకరి నుండి విస్తరణత్వం సంక్రమించి దాని ధాటికి ప్రపంచంలో ఏ 10 శాతం ప్రజలో (అంటే 700,000,000) చచ్చిపోతే మానవ జాతికి ఎంత అప్రతిష్ట!
అందుకనే కాబోలు జార్జ్ బెర్నార్డ్ షా హాలీవుడ్ తారకి అలా సమాధానం రాశాడు.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా