S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజన్

ప్రిన్సిపాల్‌కు తను తన పిల్లలు, తన స్కూలే ప్రపంచం. వీటిలో ఏది ఎక్కువ, ఏది తక్కువ అనే వీలు లేదు. ఒక మనిషి తనకు తనను ఎంత ప్రేమించుకుంటాడో స్కూలును, పిల్లలను హెడ్‌మాస్టర్ అట్లనే ప్రేమించుకుంటాడు. అతను కేవలం పబ్లిక్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూడడు. తన దగ్గర చదువుకున్న విద్యార్థి ఏం సాధిస్తాడో వాటిని చూసి మురిసిపోతుంటాడు. హైస్కూల్ ప్రిన్సిపాల్ అయితే తన పిల్లలు ఏ కాలేజీలో చేరబోతున్నారో ఆ కాలేజీల్లోకి వెళ్లే మా పిల్లలు ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? వారి ప్రగతి ఏమిటి? వారి ప్రతిభ ఏమిటని అడుగుతాడు. ఆ కాలేజీ వాళ్ల కామెంట్స్ విని తన స్కూల్లో సరియైన మార్పులు తీసుకువస్తూ ఉంటారు. ఒక వైస్ ఛాన్సలర్ వివిధ శాఖల కామెంట్స్‌ను గుర్తు పెట్టుకుని తన యూనివర్సిటీలో మార్పులు తీసుకువస్తూ ఉంటారు. అంటే ఒక తండ్రి బిడ్డను అత్తవారింటికి పంపించి అభిప్రాయాలను పక్కింటి వారిని అడుగుతాడు. నా పెంపకంలో ఏమైనా లోపం ఉన్నదా అని ప్రశ్నించుకుని ఆత్మపరిశోధన చేసుకుంటాడు. అదే ప్రిన్సిపాల్ పబ్లిక్ పరీక్ష రిజల్ట్స్ కోసం చూడరు. మా దగ్గర చదువుకున్న విద్యార్థుల పనిపైన సమాజం కామెంట్స్ కోసం ఎదురుచూస్తూంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తన స్కూల్లో మార్పులు తీసుకువస్తారు. పిల్లలపై ప్రిన్సిపాల్‌కుండే నిష్కళంకమైన ప్రేమ గొప్పది. తన స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎప్పుడైనా వచ్చి కలిస్తే ఎలా పని చేస్తున్నావని అడుగుతుంటారు. తన దగ్గర చదువుకున్న పిల్లలు అపనింద పాలైతే నేను సరైన విలువలు ఇవ్వలేకపోయానా? ఇది నా తప్పేనా? అనుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఎలా ఆలోచిస్తారో ప్రిన్సిపాల్ తన పిల్లల భవిష్యత్తు గురించి ఆరాటపడుతుంటారు. ఇట్లాంటి ప్రిన్సిపాళ్లను, వైస్‌ఛాన్సలర్‌ను నేను చూసే అవకాశం కలిగింది.
ప్రిన్సిపాల్ లక్ష్యం ఫలితాలు. అందులో వచ్చే మార్పులు కాదు. సమాజానికి తన పిల్లలు చేసే సేవే తన కానుకగా భావిస్తాడు. అందుకే విద్యార్థులు జీవితంలో ఎక్కడ కనిపించినా గురువు కౌగిలించుకుంటాడు.
* * *
చిన్న పిల్లవానికి భావన మొలకెత్తగానే వచ్చీరానీ మాటలతో దాని పర్యవసానం కూడా తెలియని సహృదయంలో ప్రశ్నిస్తాడు. దాన్ని మనం చిన్నపిల్లవాని మాటలని చిదిమేస్తాం. ప్రపంచంలోనే ప్రశ్నించే ప్రశ్న అన్న భావన వస్తే ఇలాగే ఉంటుందనుకుంటా! చిన్నపిల్లలు తమ భావనలను ప్రశ్నలను చేసి ముందుకు వేస్తే వాటిని పెద్దలు చిదిమేస్తారని గ్రహించి వాటిని తనలోనే అణచుకుంటాడు. అదే అసమానతలకు దారితీస్తుంది. పెద్దవారికి హక్కులున్నట్లే చిన్నపిల్లలకు కూడా హక్కులుంటాయి. ఆ హక్కులను గౌరవిస్తే కొన్నిసార్లు కొత్త ఆవిష్కరణలు వస్తాయి. వాటినే మనం ప్రోత్సహిస్తే అవే మహావృక్షంగా మారి ఏ స్టీఫెన్ హాకింగ్ అవుతారు. చిన్నపిల్లల మాటలను తోసివేయకూడదు. కేజీ స్కూల్స్‌లో పిల్లలు అడిగే ప్రశ్నలకు తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఓపికతో వింటే మన స్కూలు కూడా ఐన్‌స్టీన్స్‌ని తయారుచేస్తాయి. దానికి బదులుగా అక్షరాలు పలక మీద రాసి దిద్దిస్తే పిల్లలు దిద్దేస్తారు. అదే అనుకరణకు మూలకారణం. కొత్త బాటలు ఏర్పడాలంటే కొత్త దృక్పథం మనలో రావాలి. ప్రతి వారిలో దాగివున్న ప్రతిభ ఉంటుంది. మనమిచ్చే ప్రోత్సాహంతోనే అది వెలుగులోకి వస్తుంది. పలక మీద పిల్లల్ని కొత్త గీతలు గీయనివ్వాలి. దాని నుంచి కొత్త కలలు ఏర్పడతాయి. కేజీ స్కూళ్లు పిల్లలను అదుపులో పెట్టడానికి కాదు. కొత్త భావాలను పుట్టించడానికి, పిల్లల భావనలు తెలియకపోతే వాళ్లు అడిగిన ప్రశ్నలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రాసిపెట్టండి. కేజీ స్కూళ్లు గతాన్ని పునరావృతం చేయటం కోసం కాదు. తెరవని తలుపునకు రేపటికి తాళం చెవులు అవుతాయి.
* * *
మేథస్సు పుట్టిన తొలి రోజుల్లోనే ఏర్పడుతుంది. విద్యతో మేథస్సు ప్రతిభగా మారుతుంది. చిన్నతనంలో విద్యార్థి చూపించే ఆసక్తిని గమనిస్తూ ఉంటారు. ఆ విద్యార్థికి ఏ మార్గంతో మార్గదర్శకత్వం కల్పిస్తే ఆ ప్రతిభ వికసించే అవకాశం ఉన్నదో గమనించాలి. కేజీ స్కూల్‌లో అక్షరాలు చెప్పటం కదా, విద్యార్థిలో దాగివున్న వివిధ శక్తులకు సరి అయిన వాతావరణం సృష్టించి వెలికితీయటం, కేజీ స్కూల్స్ లోపల రకరకాల అవకాశాలు కల్పిస్తారు. కొందరికి సంగీతంలో అభిలాష ఉంటుంది. కొందరికి ఆటల్లో అభిలాష. మరి కొందరికి నాట్యంలో అభిలాష. కొందరికి చిత్రలేఖనంలో. కొంతమంది తమలో వున్న భావాలను ఈ కళల ద్వారా అభ్యసిస్తారు. కేజీ స్కూల్స్ అక్షరం నేర్పేదానికైనా బిహేవియర్‌పైన ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఒకరు మాట్లాడుతుంటే ఆటంకాలు కలిగించకూడదనీ, చిన్నప్పుడు నేర్చుకోవాల్సిన విద్య అది. ఉద్రేకాలు అందరికీ ఉంటాయి. దానిని ఒక బాటలో పెంచటం అదే కేజీ స్కూల్స్ చేయవలసిన పని. మనిషి నడకను పోకడను నేర్పించవలసిన దశ అది. అక్షరం రాకుంటే నేర్పించవచ్చును కానీ చిన్నప్పుడు నేర్చుకోవల్సిన బిహేవియర్‌ను సరిచేయకుండా ప్రజాస్వామిక చిహ్నాలకు ఆటంకం కలుగుతుంది. స్కూల్‌కన్నా ఇంటికి సంబంధం ఉండాలి. ఇంటిలో ఏ విధమైన ప్రవర్తన ఉంటుందో, అదే ప్రవర్తన స్కూల్‌లో ఉండటం సహజం. అది బెత్తంతో కన్నా ప్రేమతోనే మార్చవచ్చును. లేత వయసులో కొమ్మను వంచవచ్చును. చెట్టయిన తర్వాత అది సాధ్యంకాదు. కేజీ స్కూల్స్ ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఊరిలో ప్రతి వీధిలో డిజిటల్ యుగంలో పెట్టవలసిన విద్యాలయాలు అవి. భార్యాభర్తలు పని చేయవలసిన దినాలలో బిహేవియర్ కన్‌స్ట్రక్షన్‌ను అది స్కూల్‌కు సంక్రమించబడింది. ఉపాధ్యాయుడు అపారమైన ఓపికతో, ప్రేమతో సాధించే సమస్యలను పూరించవలసి ఉంది. ఇది 21వ శతాబ్దం సవాల్.

-చుక్కా రామయ్య