S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-26

‘మైగాడ్! ఆ వచ్చింది విజయ్ నాయక్‌కి సంబంధించిన వాళ్లు కాదు కదా? అతనికి మన ముగ్గురి మీదా అనుమానం ఉంది’ అన్నాడు అనిల్ భయంగా.
‘అతనికెలా తెలుస్తుంది? అతనెక్కడికో దూర ప్రాంతాల కెళ్లాడని విన్నాను’ అన్నాడు కాంతారావు.
‘ఎక్కడికీ పోలేదు. ఇదంతా సి.ఎం. ఆడిస్తున్న డ్రామా. అతను, ఆ ప్రభుగాడు, గౌతమి, లూసీ.. అందరూ తోడుదొంగలు. వాళ్లిక్కడే వుండి పరిశోధనలు చేస్తున్నారని నా అనుమానం. ఆ శంకరయ్య కూడా ప్రయాగ ఇంట్లో హాయిగా గడుపుతున్నాడు’ కసిగా అన్నాడు అనిల్. బిత్తరపోయిన రావులతో రహస్య చర్చలు జరిపి తెల్లవారుతూండగా లేచాడు అనిల్.
* * *
‘గుడ్‌మార్నింగ్ హీరోస్’ అంటూ కాఫీ సరంజామాతో వచ్చిన శకునిని చూసి కంగారుపడుతూ లేచారు. నిద్రలేచి దంతధావనం పూర్తి చేసుకుని దిక్కులు చూస్తూ కూర్చున్న ప్రభు, విజయనాయక్ చిన్నపిల్లల్లా కంగారుపడుతూనే విష్ చేశారు.
‘రండి.. కాఫీ తాగుదాం’ అన్నాడు శకుని ట్రే టేబిల్ మీద పెడుతూ. కాఫీ పేరు వినగానే ప్రభూ వాళ్లకి ప్రాణం లేచొచ్చినట్టయింది. గభాల్న టేబుల్ దగ్గరకొచ్చి-
‘అయ్యో కాఫీ మీరు తెచ్చారా?’ అన్నారు కోరస్‌గా.
శకుని నవ్వాడు. కాఫీ కప్పుల్లోకి వంచుతుంటే అతన్ని వారించి ప్రభు మూడు కప్పుల్లోకి కాఫీ వంచాడు.
‘ఇక్కడ కాఫీ కూడా దొరుకుతుందా?’ ఓ కప్పు శకునికి అందిస్తూ విస్మయంగా అన్నాడు నాయక్.
‘దొరకదు. మనమే చేసుకోవాలి’ మళ్లీ నవ్వాడు శకుని. ఎందుకో అతని మొహంలో తెలియని ఆనందం కనిపిస్తోంది.
‘అదే.. కాఫీ పొడి.. అదీ తెచ్చుకోవాలిగా’ అన్నాడు ప్రభు.
‘అవసరం లేదు. ముందు కాఫీ తాగండి. తర్వాత మీ అనుమానాలన్నీ తీరుస్తాను’ అన్నాడు శకుని. అతని మాటలోని మార్పు గమనించిన ప్రభూ వాళ్లకి ఉత్సాహం వచ్చేసింది. ఎలాగైనా అతన్ని మాటల్లో పెట్టి బ్లాక్‌టైగర్‌ని గురించి, పాతాళ స్వర్గంలో వున్న సంగతుల గురించి తెలుసుకోవాలనుకున్నారు.
నవ్వుతూ కబుర్లు చెప్తూ కాఫీ తాగటం పూర్తి చేశారు.
‘మిస్టర్ శకునీ! మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా?’ మెల్లగా అన్నాడు నాయక్.
‘ఒక్కటేం ఖర్మ. వందడుగు. తెలిస్తే చెప్తాను’ అన్నాడతను అదే ప్రసన్న వదనంతో.
‘అదే మీ పేరు..’
‘శకుని అని మీకు తెలుసుగా. అలాగే పిలుస్తున్నారు’
‘నిజమే. శకుని అన్నది మీ అసలు పేరు కాదని తెలుసు. కానీ మీ అసలు పేరు కావాలి’ వేడికోలుగా అన్నాడు నాయక్.
‘శకుని మొహం గంభీరంగా అయిపోయింది.
‘సారీ! నా అసలు పేరు నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నా పేరు శకుని. దట్సాల్!’ అన్నాడు క్లుప్తంగా.
‘మీ పాతాళ స్వర్గాన్ని
‘మీ పాతాళ స్వర్గాన్ని మరోసారి చూడొచ్చా?’
‘వైనాట్? రండి. స్వర్గంలోని నందన వనాల్ని కూడా చూడొచ్చు’ అంటూ వాళ్లిద్దర్నీ పాతాళ స్వర్గానికి తీసికెళ్లాడు శకుని. మునుపు చూసినదే కాక మరిన్ని విస్మయపరిచే దృశ్యాలు చూశారు ప్రభు, నాయక్.
‘ఎక్కడో పాతాళంలో వున్నట్టున్న ఆ ఇంటి బైట చిన్నచిన్న జలపాతాలు, సన్నని సెలయేళ్లు మళ్లు మళ్లుగా పచ్చని చేలు కన్నుల పండువగా ఉంది. ఆకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నచిన్న మళ్లని పరిశీలనగా చూస్తున్న నాయక్‌కేసి చూసి
‘నువ్వెంత పరిశీలనగా చూసినా గంజాయి లాంటి మొక్కలు కనిపించవు. నేను, నాలాంటి కాఫీగత ప్రాణుల కోసం కాఫీ, టీ, చెరకు లాంటి మొక్కల్ని పెంచుకుంటున్నాం. మీ జనారణ్యంతో సంబంధం లేకుండా మాక్కావలసిన కరెంటునీ మేమే తయారుచేసుకుంటున్నాం. ఇందులో దేశద్రోహ చర్య ఏమైనా ఉందా?’ అన్నాడు నవ్వుతూ.
‘ఓ! సూపర్బ్! నిజంగా ఇది మరో లోకంలా ఉంది. మీరు సైంటిస్టా?’ ఉత్సాహంగా అన్నాడు నాయక్.
‘ఏవో పిచ్చిపిచ్చి పరిశోధనలు చేస్తూంటాను. దానికి మా టైగర్ వాళ్లు నేనో అపరబ్రహ్మ అనుకుంటారు. అమాయకులు’
‘నోనో! మీరు నిజంగానే అపరబ్రహ్మే! మీలాంటి వారు ఈ అడవిలోకాక బైటి ప్రపంచంలో ఉంటే దేశానికి మరింత సేవ చేసిన వారయ్యేవారు’ అన్నాడు నాయక్.
‘అక్కడ చెయ్యడానికి మీలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మా టైగర్‌కీ, ఆటవికులకీ అడవి తల్లి తప్ప గుక్కెడు నీళ్లందించే వారు గానీ, గుప్పెడు గింజలిచ్చేవాళ్లు గానీ ఎవరూ లేరు. అందితే అంతం చేయాలనుకునేవాళ్లు తప్ప’ అన్నాడు శకుని భారంగా.
‘మీలాంటి మేధావుల అభిమానం సంపాదించుకున్నాడంటే ఆ బ్లాక్‌టైగర్ నిజంగా చాలా గొప్పవాడు. ఒక్కసారి అతన్ని చూడాలనుంది’ అన్నాడు నాయక్. నిజంగానే ఆ పరిసరాలు చూసి ముగ్ధుడైపోయాడతను.
‘తప్పకుండా చూద్దురుగాని. మీకు శిక్ష నిర్ణయించేది అతనే. ఆయన హెల్త్ బావుంటే తనే వచ్చేవాడు’ అదోలా నవ్వుతూ అన్నాడు శకుని. తర్వాత తోటలు, దొడ్లు అన్నీ చూపించి అక్కడ కరెంటు తయారుచెయ్యడానికీ, పశుసంపద పెంచడానికీ కాఫీ మొక్కల్లాంటివి పెంచడానికీ ఎన్ని అవస్థలు పడ్డారో, ఇప్పుడు ఎంత హేపీగా ఉన్నారో తనని తాను మరిచి పసివాడిలా చెప్పాడు.
‘నిజంగా మీరు చాలా గ్రేట్ అంకుల్’ వినయంగా చేతులు జోడించాడు ప్రభు. అంతకు ముందు రెండు మూడుసార్లు కరచాలనం చెయ్యబోతే, అతను వారించి నమస్కరించడం అతనికి గుర్తుంది. అయితే నాయక్ మాత్రం ఇంత మొహం చేసుకుని..
‘యూ ఆర్ గ్రేట్ మిస్టర్ శకునీ! హేట్సప్ టు యూ’ అంటూ ఉత్సాహంగా చెయ్యి చాపాడు. అప్రయత్నంగా అతని చెయ్యి అందుకున్నాడు శకుని. అయితే ఆ చేతిని వదల్లేదు నాయక్.
‘దొరికిపోయావ్ డాడీ!’ అన్నాడు ఉత్సాహంగా.
తుళ్లిపడి గభాల్న చేతిని లాక్కుని-
‘డేడీ ఏవిఁటి. దొరికిపోవటం ఏవిఁటి?’ అన్నాడు శకుని తడబడుతూ.
‘ఇంక బుకాయించకు డేడీ. నువ్వు కచ్చితంగా మా డేడీవే. నిన్ను చూసినప్పుడే అనుమానం వచ్చింది. షేక్‌హేండ్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంటే ఆ అనుమానం స్థిరపడింది. నిజం చెప్పు! ట్రైన్ కింద పడి పోయావనుకున్న నువ్వు ఇక్కడ కనిపించడం ఏవిఁటి? నీతి నిజాయితీలకి మారుపేరులా ఉండే నువ్వు ఈ దోపిడీ దొంగల దగ్గరికి చేరి అజ్ఞాతంగా గడపడం ఏవిటి? భార్య, లోకం తెలియని కొడుకు ఏమయ్యారో అన్న ఆలోచన కూడా లేకుండా ఈ గూండాల రాజ్యంలో స్వర్గాలు నిర్మించడం ఏవిఁటి?’ ఒకలాంటి ఉద్వేగంగా అన్నాడు నాయక్.
‘నీకు మతిపోయింది. నువ్వెవరో నాకు తెలియదు’ కంపరంగా అన్నాడు శకుని.
‘ఆ మాట నా కళ్లల్లోకి చూసి చెప్పు. చెప్పలేవు. చెప్పినా నీ కుడిచేతికున్న ఆరు వేళ్లు, ప్రమాదవశాత్తూ గన్‌పేలి చిటికెన వేలు చివరి భాగం లేకపోవడం లాంటివి నువ్వే మా డేడీవని చెప్పేస్తాయి...’ నవ్వాడు నాయక్. ప్రభు మతిపోయిన వాడిలా చూస్తూండిపోయాడు.
‘ఇదిగో నాయక్! నాతో వితండ వాదన చెయ్యద్దు. నాకూ నీకూ ఎలాంటి సంబంధం లేదు. ఇంకా ఆ విషయం మర్చిపో’ అన్నాడు శకుని కఠినంగా.
నాయక్ మొహం కూడా గంభీరంగా అయిపోయింది.
‘ఓ! నాకిప్పుడు అర్థమవుతోంది. ఓ సిన్సియర్ పోలీసాఫీసర్‌గా నటిస్తూ ప్రజల్ని ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. వచ్చే జీతం మీ విలాసాలకి చాలక, ధన వ్యామోహంతో ఈ బందిపోటు దొంగలతో చేతులు కలిపి, చచ్చిపోయినట్టు నాటకం ఆడి అందర్నీ నమ్మించి అరాచక పనులకి అంకితమై పోయారు. దేశద్రోహులు ఎవరో కాదు. మీరే అసలైన దేశద్రోహులు! నిజమే. ఎవరూ పిలవని విధంగా ఏకవచనంతో పిలుస్తూ మా డేడీ మెడకి చేతులు పెనవేసుకుని వూగుతూ కబుర్లు చెప్పే నాకెంతో ఇష్టమైన మా డేడీ మీరు కాదు. నేనే పొరబడి అతి చనువుగా సంబోధించాను. క్షమించండి’ అన్నాడు ఆవేశంగా.
అంతే! అతని చెంపలు శకుని కొట్టిన దెబ్బలతో కందిపోయాయి.
‘వాట్ నానె్సన్స్ యూ ఆర్ టాకింగ్. ఇప్పుడు నువ్వు మా బందీవి. ఏవో కథలు చెప్పి తప్పించుకోవాలని చూడకు. నాకీ అడవే తల్లి తండ్రి. ఇక్కడి వాళ్లే నా బిడ్డలు..’ అన్నాడు కఠినంగా.
అయినా నాయక్ తగ్గలేదు.
‘ఈ అడవి మనుషులు ఏదో మందు పెట్టి మీ చేత ఇలా మాట్లాడిస్తున్నారు. ఆ బ్లాక్‌టైగర్ నా కంటపడితే అతనే్న అడిగేస్తాను’ అన్నాడు మొండిగా.
‘అంత ఆవేశపడకు. నేనే చెప్తాను’ ఖంగుమంది బ్లాక్‌టైగర్ గొంతు. ఓ స్టూలు మీద కూర్చున్న వాడలా అప్రయత్నంగా లేచి-
‘నువ్వెవరు?’ అన్నాడు నాయక్ వ్యంగ్యంగా.
‘ఈయన.. ఈయన..’ ప్రభుకి అంతకన్నా మాట రాలేదు.
‘అంత కష్టపడకు.. నన్ను నేనే పరిచయం చేసుకుంటాను.. ఆఁ చూడు ఐ.జి. ఎవర్ని భయంకర వ్యక్తిగా చిత్రించి దేశద్రోహిగా భావించి అతని తలకో వెల కట్టారే.. ఆ బ్లాక్‌టైగర్‌ని నేనే’ కులాసాగా నవ్వుతూ అన్నాడు బ్లాక్‌టైగర్.
క్షణం నిశే్చష్టుడై పోయాడు నాయక్.
‘మీరా?’ అన్నాడు అప్రయత్నంగా.
‘అవును నేనే! నాకోసమేగా నువ్వొచ్చింది? ఇంక ఆలస్యం ఎందుకు బంధించు’ అన్నాడు దొర పెద్దగా నవ్వుతూ.
నాయక్ నోట మాట రాలేదు.
‘ఇక్కడి నువ్వెందుకొచ్చావ్ టైగర్?’ కంగారుగా అతని దగ్గరికొస్తూ అన్నాడు శకుని.
‘నేనెప్పుడో వచ్చాను. మీ తండ్రీ కొడుకులు గమనించలేదు గానీ’ ఓరగా చూస్తూ అన్నాడు దొర.
‘తండ్రీ కొడుకులా?’
‘అవును. నిన్ను ఈ ఐ.జి. డేడీ అంటున్నాడుగా?’
‘డేడీ అనే కాదు... దేశద్రోహి అని కూడా అన్నాను’ అన్నాడు నాయక్ మొండిగా.
అంతవరకూ ప్రసన్నంగా ఉన్న దొర మొహం కఠినంగా అయిపోయింది.
‘పిచ్చిపిచ్చిగా వాగకు! నాకు తిక్కరేగిందంటే మీ ఇద్దర్నీ చంపి ఇక్కడే పాతి పెట్టేస్తాను. ఏవిఁటి శకుని దేశద్రోహా? అసలు దేశభక్తి అంటే అర్థం తెలుసా నీకు? ఇన్ని జీతం రాళ్లు పడేస్తే మీ ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు. అందులో నిజం ఎంతుందో అనైనా ఆలోచించకుండా అమాయకుల్ని సైతం చిత్రహింసలు పెట్టి మరీ చంపుతారు. మీరనుకున్న వాళ్లని టపటప కాల్చేసి, ఎన్‌కౌంటర్ పేరు పెట్టి ప్రాణ రక్షణ కోసం కాల్చాం అని సమర్థించుకుంటారు. తిమింగలాల్ని వదిలేసి చేపపిల్లల్ని పట్టుకుని వెన్నువిరుచుకుంటారు. అలాంటిది దేశభక్తిని గురించి, మానవత్వం గురించి నువ్వు మాట్లాడతావా?’ అన్నాడు నిప్పులు కురిపిస్తున్నట్టు.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్