S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీతోపాటూ నలుగురూ..

నల్లని తారురోడ్డు మీద కారు సాఫీగా సాగిపోతోంది. ఆ ప్రయాణం ఎంతవరకూ అలా సాగుతుందో ఎవరికి తెలుసు? కాసేపటికి రోడ్డు మీద గతుకులు రావచ్చు. డ్రైవర్ రెప్పపాటు కునుకు వేస్తే అర్థాంతరంగా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోవచ్చు. జీవితం అంటే అంతే గదా!
క్షణక్షణం ఉత్కంఠతతో కూడిన పజిల్. పరిష్కరించుకుంటూ వెళ్లటమే పని. కష్టమైనా సుఖమైనా బాధైనా సంతోషమైనా ఒకే రీతిలో సాగాలి. అది అంత సులభం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమేగా మనిషికి గొప్పతనం!
* * *
కారు ముందుకు వెళుతున్నా వెనక్కు వెళుతున్న చెట్లలా గతంలోకి జారుకున్నాడు రఘురామ్. డ్రైవర్ సలీం నాలుగు వైపులా చూసుకుంటూ జాగ్రత్తగా కారు నడుపుతున్నాడు. అతని చిన్ని కళ్లు చురుకుగా పని చేస్తున్నాయి. పాతిక సంవత్సరాలుగా తన దగ్గర పని చేస్తున్నాడు. చిన్న గీత కూడా కారుకు పడనివ్వడు. అంత పనితనాన్ని తానెక్కడా చూడలేదు. అందుకే అతను ప్రక్కన ఉంటే ప్రయాణం గురించి చూసుకోనక్కర్లేదు. కారలో అందరూ నిద్రలోకి జారుకున్నారు.
వెనె్నల వెలుగులో చెట్ల నీడలు దోబూచులాడుతున్నాయి. చిన్నతనంలో ఆటలు గుర్తుకొచ్చాయి. అలాగే తను రెంచులు పట్టడం కూడా. ఎంత చదువుకోవాలని ప్రయత్నించినా అది ఏ మాత్రం బుర్రకెక్కలేదు. కానీ రోజుకో రంగు కారు షెడ్‌లోకి చేరే ‘జగన్నాథం షెడ్’ మాత్రం తన కలల భవనంలా అనిపించేది. ఎప్పుడూ అక్కడే మకాం. ఖాళీగా తన చేతులు ఎప్పుడూ ఉండేవి కావు.
‘నాకూ నేర్పించు బాబాయ్!’ అని అడిగేశాడు ఒకసారి.
‘చిన్నవాడివి. చక్కగా చదువుకోక’ అని కేకలేశాడు.
అయినా తను పట్టు వదలలేదు. వాటితోనే ఆటలాడేవాడు. అక్కడే కబుర్లు పంచుకునేవాడు.
అది చూసి కరిగిపోయి తనే పిలిచి పని నేర్పించటం ప్రారంభించాడు. అప్పటికే అన్నీ గమనిస్తూ ఉండటం వలన పనిని బాగా పట్టేశాడు. ఏ కారునయినా అరగంటలో బాగుచేసి షెడ్ ననుంచీ బయటకు పంపేసేవాడు.
రామ్ వల్ల షెడ్‌కి గిరాకీ పెరిగిపోయింది.
ఊర్లో ఇద్దరు ముగ్గురు మెకానిక్‌లు ఉన్నా ఎవరయినా తమ కారును రిపేరుకి ఇక్కడికే తీసుకువచ్చేవారు.
‘ఒరేయ్! ఇదంతా నీ వల్లే’ అని ఆయన అంటే
‘పో! బాబాయ్’ అని సిగ్గుపడేవాడు.
తను సంపాదించిన డబ్బులో కొంత బాబాయి దగ్గర దాచేవాడు.
మొదటిసారి తను సంపాదించిన డబ్బులతో మల్లెపూలు కొనుక్కెళ్లాడు అమ్మకి. పొట్లంలో పూలన్నీ తన దోసిట్లో పోసుకుని అమ్మ ముందు నిలబడ్డాడు. అప్పుడే విచ్చుకుంటున్న మల్లెమొగ్గలని చూసి అమ్మ ఎంత సంబరపడిందో? ఆ వెలుగు ఆమె కళ్లల్లో కొట్టవచ్చినట్లు కనిపించింది. కానీ అంతలోనే డిమ్ అయిన బల్బులా మారిపోయింది.
అది ఎందుకో తనకు తెలుసు. బడికి వెళ్లటం లేదని.
అంతే! అమ్మ ఒడిలో చేరిపోయాడు.
‘అమ్మా! ఇష్టమైన పనిలో ఆనందం దొరుకుతుందని అన్నయ్య బడిలో గురువుగారు చెబుతుండగా విన్నాను. క్యారేజీ పట్టుకెళ్లినప్పుడు వింటూంటానుగా. నేను చదువుకోకపోయినా అన్నయ్య చదువుకు ఉపయోగపడతాను. ఇద్దరం పనులలోకి వెళ్లేకంటే ఇది నయమే కదా. నవ్వమ్మా! నువ్వలా ఉంటే బాగోదు నాకు’ అని నవ్వించేవాడు.
అమ్మ నవ్వు మనసుకు ఎంతో హాయినిచ్చేది.
ఆమె పెదాల మీద చిరునవ్వుల మల్లెలు విరబూసేవి.
వాటిని ఏరుకోవటమే తన పని.
ముద్దులు సుద్దులూ అన్నీ అమ్మ దగ్గరే.
ఊహ తెలిసినంత వరకూ నాన్నకు తన మీద కోపమే ఎక్కువగా ఉండేది. చెప్పిన మాట వినలేదని. చదువుకోలేదని.
అలాంటప్పుడు నాన్నకు ‘చదువురాని వాడివని దిగులు చెందకు..’ పాట వినిపించాలనిపించేది. మళ్లీ కోపం ఇంకా పెంచిన వాడినవుతానని దాన్ని ఊహగానే తన ఆలోచనలలో దాచేశాడు. ఆ ఆనందాన్ని కూడా మనసులోనే అనుభవించేవాడు.
ఒకరోజు ‘జగ్గన్నా! జగ్గన్నా!’ అంటూ పరుగెత్తుకొచ్చాడు అఖిలేష్.
‘ఏమైందిరా?’
‘అమ్మకు గుండె నొప్పి వచ్చిందన్నా. హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలి’
ఆ మాట వినగానే కారు తెచ్చి షెడ్ ముందు పెట్టాడు తను.
సమయానికి వైద్యం అందటంతో ఆమె బ్రతికి బయటపడింది.
‘ఏరా రామ్! కారు కొనడానికి దాచుకున్న డబ్బులు అలా ఆవిడకు ఖర్చు పెట్టేసావేంటిరా?’ అని బాబాయ్ అడగటంతో
‘బాబాయ్! కారు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అమ్మ ప్రాణం ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదుగా. వాడు అమ్మ లేని వాడయిపోతాడు. అమ్మ లేకపోవటమంటే దేవత లేని గుడిలా తయారవ్వటమేగా. అందుకే ఇచ్చేసా. అయినా డబ్బు ఎవరిదయితేనేం అవసరానికి ఉపయోగపడాలి కానీ’
‘నువ్వు చదువుకోలేదన్న వాడిని కొట్టాలిరా. నీ మాటల్లో చేతల్లో వారికి ఏమీ తీసిపోవురా. ఇంకా చెప్పాలంటే ఎక్కువే’ అంటూ దగ్గరకు తీసుకునేవాడు బాబాయ్.
అది నాన్న ప్రక్కన చేరినట్లే ఉండేది. మరి నాన్న నన్ను ఎప్పుడూ అలా దగ్గరకు తీసుకోలేదు. ఇలాంటప్పుడే అది గుర్తుకు వస్తుంది.
అన్నయ్య ప్రతిరోజూ బడిలో చెప్పిన మంచి విషయాలన్నీ తనకు చెబుతూ ఉండేవాడు. అందుకే తను ఇలా ఉన్నాడేమో? అలా అన్నీ చెబుతూ ఉండటం వలన తనకూ బడిలో చదువుకోలేదన్న బెంగ ఉండేది కాదు.
ఆడుతూ పాడుతూ పని చేసుకోవటంలోనే ఆనందం ఉండేది. తనకు తోడుగా రేడియో.
కాలక్షేపం, విజ్ఞానం కూడా.
ఎనె్నన్నో విషయాలు దాని ద్వారానే తను తెలుసుకునేవాడు. దాన్ని తన సంపాదనతోనే కొనుక్కున్నాడు.
ఇప్పటికీ అది తన జ్ఞాపకంగా ఎదురుగానే!
‘రామ్’ అచ్చిగాడికి ఫీజు కట్టావట’ అన్నం తినేటప్పుడు అడగనే అడిగాడు.
ఏ విషయమూ ఆయన దగ్గర దాగదు. ఎలాగైనా ఆ చెవికి చేరాల్సిందే.
‘ఈసారి పంటలలు సరిగా పండలేదు కదా బాబాయ్. వాళ్లింట్లో తిండికే ఇబ్బంది పడుతున్నారు. దాని వలన వాడు చదువు ఆపేసి పనిలోకి వెళుతున్నానని అన్నాడు నా దగ్గర. నా మనసు మెలిపెట్టినట్లయింది. ఆడూ నా తమ్ముడు లాంటోడే కదా? మనకి మనం సాయం చేసుకోకపోతే మనుషులం ఎలా అవుతాం? అందుకే ఫీజు కట్టా. ఇక నుంచీ నేనే వాడి ఫీజు కడతానని మాట ఇచ్చా.’
‘నీ బుద్ధికి చేతులెత్తి మొక్కాలనిపిస్తోందిరా. ప్రతివాడూ నీలా ఆలోచిస్తే దేశం ఎంత బాగుపడిపోతుందో?’ అన్నాడు లేచి చెయ్యి కడుక్కుంటూ.
ఆ మాటలే నన్ను ముందుకు నడిపించేవి.
మరింత మందికి సాయం చేసేలా ప్రోత్సహించేవి.
సెకండ్ హాండ్ కారన్నా కొనాలన్న కోరిక ఇలాంటి వాటితో దూరంగా జరిగేది. తొందరేముంది కొందాములే అని మనసుకు సర్ది చెప్పుకొనేవాడు.
బోలెడు డబ్బులు సంపాదిస్తే బోలెడు మందికి ఇలా సాయం చెయ్యవచ్చుగా అనిపించింది ఓసారి.
‘అలా సంపాదించాలంటే ఏదో ఒకటి కనిపెట్టాలిరా’ అన్న బాబాయ్ మాటలు అతని మెదడులో ముద్రింపబడిపోయాయి.
ఇంకెప్పుడూ అదే ఆలోచన.
పెట్రోలు ధర రోజు రోజుకూ పెరిగిపోతోంది. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి.
నీళ్లతోనే కారు నడపగలిగితే బోలెడు డబ్బు కలిసి వస్తుందిగా అనుకున్నాడు.
ఆ ఆలోచన రావటమే తరువాయి కాస్త ఖాళీ దొరికితే ఆ పనిలో పడేవాడు.
మొత్తానికి కొన్ని సంవత్సరాల వ్యవధిలో దాన్ని సాధించాడు.
మంచి చేద్దామంటే అన్నీ అడ్డంకులే.
పేటెంట్ దగ్గరే ఆగిపోయేలా ఎందరో అడ్డుకున్నారు.
మంచి పనికి చేయూత నివ్వాల్సింది పోయి ఇలా అడ్డుకోవటమేమిటి? ఏం మనుషులు? అని మొదటిసారి తోటి మనిషి మీద విసుక్కున్నాడు.
అనుకోకుండా అక్కడికి ఓ నిజాయితీ పరుడు ఆఫీసరుగా రావటంతో రామ్ పని సానుకూలమయ్యింది.
ప్రభుత్వమే పెట్టుబడి పెట్టింది.
దానితో ఒక్కసారిగా రామ్ దశ మారిపోయింది.
ఇప్పుడు చేతి నిండా డబ్బు.
చుట్టూ కార్లే!
‘రామ్’ పేరుతోనే కార్లు ఉత్పత్తి చేయటం ప్రారంభించాడు.
విదేశాలలో కూడా అతని కార్లకు గిరాకీ పెరగటంతో అక్కడకు కూడా ఎగుమతి చేయటం ప్రారంభించాడు.
దానితో దేశంలోని సంపన్నుల లిస్టులోకి చేరిపోయాడు.
ఒకరోజు అనుకోకుండా మనోజ్ ఎదురుపడ్డాడు.
‘బాగున్నావా?’ అంటూ అతన్ని నవ్వుతూ పలకరించాడు రామ్.
‘ఆఁ బాగున్నా! నీ దయ వలన. ఆ రోజు నన్ను నవ్వులపాలు కాకుండా కాపాడావు. ఈ రోజు పరువుగా బ్రతుకుతున్నాను.’
‘నాదేముంది. అంతా భగవంతుడి దయ’
వస్తానంటూ అతను వెళ్లిపోయాడు. కానీ ఆ సంఘటన తనని వదల్లేదు. పల్లెటూరి అమాయకత్వం, మంచితనం కలబోసిన వల్లి’ తనను ‘అన్నా!’ అని ప్రేమగా పిలిచేది.
తమింట్లో ఆడపిల్లలు లేరేమో ఆ ముచ్చట ఆమెతో తీరేది.
తన మాయమాటలతో ఆ అమ్మాయిని వలలో వేసుకున్నాడు మనోజ్. అనుకోకుండా అది తన కంట్లో పడింది.
అంతే! దండించాడు. ‘రేపు నీ చెల్లిని ఎవరన్నా ఇలాగే చేస్తే నీకేమనిపిస్తుంది? తెలిసి తెలిసి ఎవరికీ అన్యాయం చెయ్యకూడదు. చెయ్యగలిగితే న్యాయం చెయ్యాలి కానీ. అయినా ఈ సెల్‌లూ, కంప్యూటర్లు వచ్చేసి మీ మనసులని చెడగొట్టేస్తున్నాయి. ప్రతి వాడికీ ‘సెక్స్’ అరచేతిలో చేరిపోతోంది. దానితో వెర్రెక్కిపోతున్నారు. దేనినయినా వాడుకునే విధానంలో ఉంటుంది. కత్తిని పీక కొయ్యటానికి కాదు వాడాల్సింది. పండు కోసుకోవటానికి అని తెలుసుకోకపోతే ఎలా? ప్రతి పనిలో మంచి చెడూ రెండూ ఉంటాయి. మనం మంచే తీసుకోవాలి. చదువుకున్నోడివి. నీకు చెప్పేంత చదువు నా దగ్గర లేదు’ అని కాసిని మాటలు చెప్పాడు.
వాడికేమనిపించిందో ఇంట్లో వాళ్లతో చెప్పి వాళ్లు కాదన్నా ఒప్పించి ‘వల్లి’ని భార్యను చేసుకున్నాడు.
‘కలలో కూడా ఇలాంటి సంబంధం రాదన్నా! నీ వల్లే నాకింత సౌఖ్యం’ అని ఆనందపడిపోయింది వల్లీ. వాళ్లింట్లో వాళ్లు కూడా అలాగే సంబరపడ్డారు.
తనేం గొప్ప పని చెయ్యలేదు.
జరగబోయే అన్యాయాన్ని అడ్డుకున్నాడంతే.
సరైన మార్గం చూపించాడు.
చెప్పేవాళ్లు ఎందరో ఉంటారు. వినేవాళ్లు ఉండాలిగా.
అది మనోజ్ గ్రహించాడు.
తన తప్పును సరిదిద్దుకున్నాడు.
ఈ దేశంలో ఏ ఆడపిల్లా ఇలా అన్యాయం అయిపోకూడదు.
అలా జరగనిస్తే మన సంప్రదాయాన్ని మనం పోగొట్టుకున్నట్లేగా!
* * *
తన అదృష్టం కొద్దీ ఓ రోజు ‘సౌశీల్య’ ఎదురుపడింది.
తమ యూనిట్‌లో పనిచేసే వర్కర్ కూతురు అని తెలుసుకున్నాడు.
ముద్దబంతి పువ్వులాంటి సొగసు, వినయం ఆభరణంగా, ఉదారం ఆమె సొత్తులా కనిపించింది. వెంటనే ఆమె అంగీకారం తెలుసుకుని మెడలో మూడు ముళ్లు వేశాడు. దానికి పెద్ద బాబాయే! నాన్న తనకు ఉన్నా తన జీవితంలో ఆ స్థానం బాబాయ్‌దే. తనకు గురువూ, తండ్రీ కూడా బాబాయే!
అలాగని నాన్నని ఏనాడూ దూరం పెట్టలేదు.
ఆయన తన నైపుణ్యం, విలువ తెలుసుకున్నాక కొడుకును దగ్గరకు తీసుకున్నారు. కానీ అప్పటికే బాల్యం అంతా గడిచిపోయింది. దానిని మళ్లీ తను తిరిగి తీసుకురాలేడుగా!
ఎన్నోసార్లు ఆయన ఒళ్లో కూర్చోవాలనుకునేవాడు. ఆ చిన్ని కోరిక కూడా తీర్చుకోలేక పోయాడు. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. అందుకే ఆ కోరిక తన కొడుకు ‘చిన్నీ’తో తీర్చుకోగలిగాడు.
* * *
ఎప్పుడూ హుషారుగా ఉండే బాబాయ్ ఆ రోజు ఎందుకో దిగులుగా కనిపిస్తున్నాడు.
ఎందుకని అంటే ‘ఏం లేదురా’ అంటున్నాడు.
ఏదో ఉంది. ఎలా తెలుస్తుంది?
తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచీ తన ఆలనా పాలనా తన దగ్గరే జరిగింది. అతనికేమైనా కష్టం వస్తే అది తనది కాదా?
ఆలోచిస్తూనే బాబాయ్ ఇంటి వైపు వెళ్లాడు.
పిన్ని కూడా దిగులుగానే కూర్చుని ఉంది.
‘విషయం ఏమిటని’ ఆమె చెంత చేరాడు.

ఏమీ లేదని ఎన్నోసార్లు చెప్పినా తను వదలలేదు.
ఇంతలో కోడలు ‘నన్ను అడుగు చెబుతాను. సాయంత్రం మా వారు వాళ్లిద్దరినీ వృద్ధాశ్రమంలో చేరుస్తామని చెప్పారు. అంతే. ఏదో కొంప మునిగిపోయినంత దిగులు పడిపోతున్నారు’ అంటూ వ్యంగ్యంగా విషయాన్ని తెలియజేసింది.
‘అవునా? అదా సంగతి. ఆ కష్టం కూడా మీకెందుకండీ? పిన్నినీ, బాబాయ్‌ని నేను తీసుకెళ్లి చేర్చేస్తా’ అని చెప్పి వచ్చేశాడు.
సాయంత్రం చెప్పిన విధంగానే అక్కడికి వెళ్లాడు.
లోకంలో ఉన్న దిగులంతా ఆ దంపతులలోనే కనిపించింది అతనికి.
బాబాయ్ అయితే రామ్ కళ్లల్లోకి చూడలేక దించేసుకున్నాడు.
‘రండి బాబాయ్! రా పిన్నీ’ అంటూ తన కారులోకి ఎక్కించుకున్నాడు.
వారి కళ్లలోంచి కన్నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి.
ఒకరివి ఒకరికి కనిపించకూడదని ప్రక్కకు తిరిగి తుడుచుకుంటున్నారు.
అద్దంలోంచి రామ్‌కి ఇదంతా కనిపిస్తూనే ఉంది.
చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించే ఓపిక వారిద్దరిలో లేదు.
కారు ఎటు వెళుతోందో గమనించే స్థితిలో కూడా లేరు.
ఇంత బ్రతుకూ బ్రతికీ ఈ చివరి దశలో వృద్ధాశ్రమంలో గడపాల్సిన దుర్దశ ఆ భగవంతుడు తమకు ఎందుకు రాసేడనే వారి చింత.
ఉన్నదానిలో అందరినీ అపురూపంగా కాకపోయినా బాగానే పెంచాడే. ఎవరికీ ఏమీ తక్కువ చెయ్యలేదు. ఉన్నదంతా హారతి కర్పూరంలా వాళ్లకే కరిగించాడు. అలా కాకుండా తనకంటూ కాస్త దాచుకుని ఉంటే ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లో తను ఉండేవాడు కాదు.
తనదేమిటి, వాళ్లదేమిటి, అందరూ ఒకటే కదా అనుకున్నాడు. ఇలా వాళ్లు తమని వేరు చేస్తారని కలలో కూడా ఊహించలేదు.
అందరి విషయాలూ చూస్తున్నా తమ బిడ్డలు అలాంటి వాళ్లు కాదనుకున్నాను. తన పెంపకాన్ని తాను తప్పుపట్టలేను అనుకున్నారు ఇన్నాళ్లూ.
ఇప్పుడు ఏమైంది? అదే జరిగింది. తనలాంటి తల్లిదండ్రులకు ఇలాగేనా జరగాల్సింది? గుండెల్లోంచి తన్నుకు వస్తోంది ఆయనకు బాధ.
* * *
ఇంతలో కారుకు బ్రేక్ పడింది.
వృద్ధాశ్రమం వచ్చేసిందా అని ఇద్దరు ఉలిక్కిపడి తమ ఆలోచనలలోంచి బయటకు వచ్చారు.
ఆవిడ మనసు అయితే సముద్రంలా ఘోషిస్తోంది.
వాళ్ల కిష్టమైనవి అందివ్వటానికి తమ ఇష్టాలెన్నింటినో వదులుకున్న తమని ఇష్టం లేని తీరం చేరుస్తున్నా ఆ తల్లి హృదయం రోదిస్తోందే కానీ శపించటం లేదు.
‘రా బాబాయ్!’
అంటూ బేగ్స్‌ను డిక్కీలోంచి తీశాడు రామ్.
‘ఇదేమిటి రామ్! ఇది మీ ఇల్లు కదా!’
‘అవును బాబాయ్. ఇక నుంచీ మీరు నా దగ్గరే ఉంటున్నారు. ఇన్నాళ్లూ నేను మీ దగ్గర ఉన్నట్లే!’
ఆయన కళ్లల్లో ఆనందబాష్పాలు.
అయినా ‘వద్దు. మేము అక్కడికి వెళ్లిపోతాం’ అన్నాడాయన.
ఆవిడ శ్రోతలా మిగిలిపోయింది.
‘ఇంట్లో అందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం బాబాయ్. నేను నీ సొంత కొడుకు నయితే ఇలా ఆలోచించవుగా. చూసేటప్పుడు నన్ను బిడ్డలానే ఆదరించావు. మరి ఆ హక్కుతోనే నా దగ్గర ఉండాలి నువ్వు. పదండి’ అని వాళ్లను మరో మాట మాట్లాడనివ్వకుండా లోపలికి తీసుకువచ్చాడు.
సౌశీల్య గుమ్మంలోనే ఎదురువచ్చింది.
‘రండి అత్తయ్యా. రండి మామయ్యా’ అంటూ సాదరంగా ఆహ్వానించింది.
ఆ ఆప్యాయతకు ఆవిడ కళ్లు చెమ్మగిల్లాయి.
వాళ్లకు తోడుగా రామ్ అమ్మా నాన్న కూడా కలిశారు.
ఇక అక్కడ అంతా నవ్వుల పువ్వులే.
* * *
వర్కర్స్, వారి పిల్లలకు సంపాదనలో సగ భాగం ఇస్తానని ప్రకటించాడు రామ్. అందరూ హర్షధ్వానాలతో అతన్ని పైకెత్తేశారు.
వారి ఆనందంలోనే తనకు తృప్తి ఉంది అనిపిస్తుంది.
తన సంసార నావ ఏ లోటూ లేకుండా సాగిపోతోంది. ఆ ఆనందాన్ని అందరితో కలిసి పంచుకోవాలనేదే తన సిద్ధాంతం.
చివరి దాకా ఈ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటే చాలు అని మనసులో అనుకున్నాడో లేదో కారుకు బ్రేక్ పడింది.
ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి బయటకు వచ్చాడు.
గమ్యానికి చేరాడు మరి.
------------------------------------------------------------------------------------------------------

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-యలమర్తి అనూరాధ 9247260206