S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘శిథిల సౌందర్యం..’ శైలీ విన్యాసం!

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి.. వారు నిర్మించిన అపురూప కట్టడాలు కూలాయి. ఇది ప్రపంచమంతటా కనిపించే దృశ్యం. ఆ దృశ్యం నిండా సౌందర్యం కనిపిస్తుంది.. శిథిల సౌందర్యం దర్శనమిస్తుంది. కొంచెం దృష్టి పెట్టి చూస్తే మనసు మూర్చనలు పోయే దృశ్యమాలికలు అగుపిస్తాయి. ఆ కోణాన్ని చిత్రకారుడు పట్టుకుంటే ‘పట్టు’లాంటి దారం చేతికి తాకిన సుఖం కలుగుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ అనుభూతిని హైదరాబాద్ నగరానికి చెందిన చిత్రకారుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి వీక్షకులకు కలిగిస్తున్నారు.
హైదరాబాద్ నగరాన్ని మొన్నటి వరకు నిజాం రాజులు పాలించారు. వారిచే కట్టబడిన అనేక అపురూప కట్టడాలు, ఆ ప్రభావానికి లోనై ఇతరులు నిర్మించిన భవనాలు, భాగ్యవంతుల ఆవాసాలు, దేవిడీలు కాలం గడిచిన కొద్దీ శిథిలావస్థకు చేరుకుంటున్న వైనం అందరికీ అనుభవంలో ఉన్నదే! అదో అలాంటి శిథిలాలను ‘వస్తువు’గా తీసుకుని కళాత్మకంగా, రంగుల ‘ఇటుక’లను, రాళ్లను రసరమ్యంగా ‘జామెట్రికల్ రంగుల పొయెట్రీ’గా చెప్పడం ఆయనకే చెల్లింది. ఈ రంగుల కవిత్వం యాదృచ్ఛికంగా, తన మానసిక కుంగుబాటులోంచి పైకి ఉబికి వచ్చిందని చిత్రకారుడు చెబుతున్నారు.
కొన్ని కట్టడాల మరమ్మతుల కోసం పాతిన కర్రల అడ్డం.. నిలువు ఆకారాలు.. వాటిలోనూ సౌందర్యాన్ని దర్శించడం సృజనశీలికే సాధ్యమవుతుంది, కళాకారుడికే కుదురుతుంది.
అలాగని శ్రీనివాసరెడ్డి శిథిలాలనే గాక ఆకాశ హర్మ్యాలను సైతం తన తైలవర్ణ చిత్రాలలో చూపుతారు. రంగుల ఫొటో చూపినట్టుగాక జామెట్రికల్ ‘జాదూ’ చేసి చూపుతారు. నిశితంగా గమనిస్తే తప్ప ఆ రంగుల గారడీలో గోడలు, ద్వారాలు, కిటికీలు అసంఖ్యాకంగా కనిపించవు. ఈ ‘మాయ’నే చిత్రకళకు ఆయువుపట్టు. చిత్రకారుడు దాన్ని పట్టుకున్నారు. ఒక్కసారి ఆ ‘పట్టు’ దొరికితే ఎవరైనా రంగులతో ఆడుకోవడం తథ్యం. ఆ ‘పట్టు’ కోసం ఎందరో చిత్రకారులు తమ జీవితాలను పణం పెట్టిన వైనం చరిత్ర నిండా కనిపిస్తుంది. అదేమిటోగానీ శ్రీనివాసరెడ్డికి అది అలవోకగా అందినట్టు అనిపిస్తోంది. అందుకే ఆయన తన శిథిల సౌందర్యం బొమ్మలతో ‘ఆర్ట్ లవర్స్’ను మాయ చేస్తున్నారు. మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. మరో లోకంలోకి తీసుకెళుతూ మైమరిచేలా చేస్తున్నారు. ఇలాంటి అనుభూతి కలిగించిన పెయింటింగ్ ఏదయినా అది దాని ప్రయోజనం నెరవేర్చిందనే భావించాలి, బొమ్మిడి శ్రీనివాసరెడ్డి గీసిన అనేక చిత్రాలు ఆ అనుభూతిని కలిగిస్తాయి.. ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి. చిత్రకారుడి విజయానికి ఇంతకు మించిన కొలమానం ఇంకేముంటుంది?
తన చిత్రాల ప్రదర్శనకు ఆయన ‘అనామక నగరం’ (అన్‌నోన్ సిటీ) అని నామకరణం చేయడంతోనే ఆయన చిత్ర హృదయం బహిర్గతమైంది. తాత్విక భూమికతో ఆలోచిస్తే ప్రతి వ్యక్తి తనదైన లోకాన్ని.. నగరాన్ని.. అనామక నగరాన్ని నిర్మించుకుంటాడు. అందులో తిరుగాడుతుంటాడు. తన ఊహలలో ఉయ్యాలలూగుతుంటాడు. తన్మయం చెందుతాడు. తాదాత్మ్యం పొందుతాడు. చిత్రకారుడైతే ఈ మానసిక స్థితిని పదిమందికి కళాత్మకంగా పంచుతాడు. పరవశింపజేస్తాడు. రంగుల రాట్నంలో తిరిగేలా చేస్తాడు. రసరమ్య డోలికల్లో రసాస్వాదన చేయిస్తాడు. అదే శిఖరాయమాన అనుభూతిని శ్రీనివాసరెడ్డి కలిగించాడు. శిథిల సౌందర్యాన్ని కాన్వాసుపైకి కాగితంపైకి ఒంపాడు.
‘అనామిక నగరం’ అన్న మాటలోనే మార్మికత దాగుంది. ఆ మార్మిక ప్రపంచంలో వీక్షకులు తమదైన సొంత నగరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చిత్రకారుడు చోటిస్తాడు. ఆ చిత్రాలు చూశాక తప్పక ప్రతివారు తమతమ పాత జ్ఞాపకాల శిథిలాలను తవ్వి తీయడం ఖాయం. అందులో అరుదైన శిథిల సౌందర్యం, లేక అంతకు మించిన అమూల్య దృశ్యమాలికలు మెదలడం సహజం. ఈ గత జ్ఞాపకాలకు హేతువైన వర్ణ చిత్రాలకు ‘సలాం’ చేయకుండా ఎలా ఉండగలరు?
చిత్రకారుడు శ్రీనివాసరెడ్డి తాను లాండ్‌స్కేప్స్ వేస్తున్నానని చెబుతాడు కానీ చరిత్రను పునర్నిర్మిస్తున్నాడని ఆయనకు తెలియదు. తన దృష్టికోణాన్ని రంగులతో, రేఖలతో చిత్రిక పడుతున్నాననుకుంటున్నాడు కానీ శిథిలమైన ఎన్నో జ్ఞాపకాలను తవ్వి తీస్తున్నాడని ఆయనకు తెలియదు.
తిరుమలలో గానీ, మరో చోట గానీ ‘శిలాతోరణం’ చాలామందిని ఆకర్షిస్తుంది. సహజ సిద్ధంగా, ప్రకృతిలో భాగంగా రూపుదాల్చిన ఆ అపురూప సౌందర్యానికి, సొగసుకు చాలామంది ముగ్ధులవుతారు. దీనే్న చిత్రకారుడు మరో రూపంలో శిథిల సౌందర్యంలో ‘శిథిల తోరణం’గా ఆవిష్కరించి అబ్బురపరిచారు. అనేక హర్మ్యాల మధ్య సహజంగానే తొంగి చూసిన భావన కల్పించే రీతిలో, అంతెత్తులో అందమైన ‘శిథిల తోరణం’ కనిపిస్తే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఆ అసాధ్యాన్ని చిత్రకారుడు సుసాధ్యం చేశాడు. కుంచెతో కళ్లకు కట్టాడు.
హైదరాబాద్ నిండా మినార్లు కనిపిస్తాయి. నింగిని తాకుతున్నట్టు కొన్ని దర్శనమిస్తాయి. రాచరికపు దర్పాన్ని ఒలకబోస్తూ ఉంటాయి. గతంతో దాగుడుమూతలు ఆడుతున్నట్టుగా తోస్తాయి. వాటిని సాయం సంధ్యలో, సూర్యుని వెలుగు వెల్లువలో, వెలుగు నీడల్లో రాతి కట్టడాలు రాగి ముద్దల్లా మెరుస్తూ ఉంటే దాన్ని చిత్రిక పట్టి వీక్షకుడి చేయి పట్టుకుని ఆ దృశ్యాన్ని ఆత్మీయంగా చూపించడం ఈ చిత్రకారుడికే చెల్లుతుంది.
కాశీ నగరంలో గంగాతీరాన భవనాలు ఒకదానిపై ఒకటి అసంఖ్యాకంగా కనిపిస్తాయి. ఈజిప్టు తదితర ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం కనిపిస్తుంది. కొన్నిచోట్ల కొండలను తొలిచి గుహపై గుహ నిర్మించుకున్న తీరు అబ్బురపరుస్తుంది. అవి పిట్టగూళ్లలా దర్శనమిస్తాయి. అచ్చం ఇలాంటి ఆకృతులనే దూరం నుంచి చూస్తే ఎలాగుంటుందో అలాంటి భావనను, ‘భ్రమ’ను చిత్రకారుడు కాన్వాస్‌పై చూపి గిలిగింతలు పెడతారు. అర్దచంద్రాకార ఆకాశ హర్మ్యాల మధ్యభాగంలో ఆకాశం నుంచి కొన్ని ఎండిన ఆకులు రాలి పడటం శిథిల సౌందర్యానికి మరో మచ్చుతునక. మెచ్చుకోదగ్గ ఇలాంటి ఎన్నో వర్ణ చిత్రాలతో ఆయన చిత్రజగత్తులో ‘జాదూ’ చేస్తున్నారు.
చిత్రకళను నిష్కామకర్మగా భావించి, ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడే ఆలోచనల్లోంచి అనుభూతిలోంచి ఇలాంటి వినూత్న విశిష్ట వైవిధ్యభరిత వెలుగు నీడల నిర్మలమైన రంగుల లోకం ఆవిష్కృతమవుతుంది. బొమ్మిడి శ్రీనివాసరెడ్డి ప్రస్థానం ఇదే.. మెట్రో నగరంలో ఉంటూ చిత్రకళనే శ్వాసిస్తూ, ‘కమర్షియల్’ కోణం వైపు ఆలోచనలు పాకకుండా కట్టడి చేస్తూ, కేవలం కళాత్మకంగా, రంగుల కవిత్వం వైపే తన సమయాన్ని మళ్లిస్తూ ఉన్నాడు. రంగులకే జీవితాన్ని అర్పణ చేయడం కొందరికే సాధ్యమవుతుంది. వారిలో ఒకరు ఈ చిత్రకారుడు.
బొమ్మిడి శ్రీనివాసరెడ్డి నగర శివారులోని కీసరగుట్ట సమీపాన గల రాంపల్లి గ్రామంలో 1971లో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఊరి పక్కన ఉన్న చిన్నవాగు, చెట్లు పొదలు, అసంఖ్యాక తాటిచెట్లు తొలి రోజుల్లో అమితంగా ఆయనను ఆకర్షించాయి. అందుకే వాటినే అలా గంటల తరబడి చూస్తూ కాగితంపై చిత్రిక పట్టాడు. ప్రాథమిక పాఠశాల చదివేప్పుడు జాతీయ దినోత్సవాల సందర్భంగా పాఠశాలను, తరగతి గదిని అలంకరించడంలో తనే ముందుండే వాడినని ఆయన చెబుతున్నారు. అలా బాల్యం నుంచే కళాత్మకత, ప్రకృతితో మమేకమయ్యానంటున్నారు.
తాను కామర్స్ కోర్సు చేస్తున్నప్పుడు బి.ఎఫ్.ఏ. కోర్సు గూర్చి తెలిసిందని, ఆ తరువాత కొన్ని ప్రవేశ పరీక్షల్లో థియరీలో విఫలమయ్యానని అనంతరం మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో 1998 బి.ఎఫ్.ఏ.లో చేరానని అక్కడ సహచరులు ఎంతో సహకరించారని, 2002 సంవత్సరంలో ఆ కోర్సు పూర్తయ్యాక కేంద్రీయ విద్యాలయాల్లో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేసి అనంతరం తాను చదివిన కాలేజీలోనే ఫ్యాకల్టీగా చేరానన్నారు. ఈ సమయంలోనే గుల్బర్గాలోని ఎం.ఎం.కె. విజువల్ ఆర్ట్స్ నుంచి ‘మాస్టర్స్’ చేశానని, అక్కడి అధ్యాపకుడు అందాని నేతృత్వంలో అభ్యాసం చేస్తుండగా ఈ శిథిల సౌందర్యం ‘కానె్సప్ట్’ తాను మానసికంగా కుంగిపోయి వున్నప్పుడు ‘లీల’గా కదలాడిందని, దాన్ని తన మాస్టర్ పసిగట్టి ప్రోత్సహించాడని ఆ తరువాత ఇక శిథిల సౌందర్యం, అనామక నగరంగా, శిథిల నగరంగా మాయానగరంగా కాన్వాసుపైకి, పేపర్‌పైకి తన్నుకొచ్చిందని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
ఈ సౌందర్యాన్ని మెచ్చిన వారు ఎన్నో అవార్డులిచ్చారు. పోటీల్లో నగదు బహుమతులిచ్చారు. తమ గ్యాలరీలలో పెట్టారు. అనేక మంది తమ గుండెల్లో దాచుకున్నారు. ఇంతకు మించి ఇంకేమి కావాలి?... అని తృప్తి.. సంతృప్తి వాక్యంతో ఆయన తన సంభాషణను ముగించారు.

బొమ్మిడి శ్రీనివాసరెడ్డి 9985682417

-వుప్పల నరసింహం 9985781799