S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రంగు పదార్థం’ అంటే..

జీవ రహస్యాలు మనకి పరిపూర్ణంగా అర్థంకాని రోజులలో పుట్టిన మాట ఇది. మొదట్లో జీవకణాలను సూక్ష్మదర్శిని కింద పెట్టి పరిశీలించినప్పుడు గాజు సీసాలో పారదర్శకమైన గాజు గోళీలని చూసినట్టు కనపడేదిట. అంటే కణంలో ఉన్న భాగాలు, వాటి మధ్య ఉండే సరిహద్దులు ఖణిగా కనపడేవి కావుట. అందుకని ఒకరు గాజుపలక మీద ఉన్న కణాల మీద ఒక రంగు పదార్థాన్ని పులిమేరు. ఈ రంగు కణంలోని కణిక (న్యూక్లియస్)కి అంటుకుని ఆ భాగం స్పష్టంగా కనిపించటం మొదలెట్టింది. ఇలా రంగు పదార్థాన్ని పులమటం (స్టెయినింగ్) ఇప్పుడు రివాజు అయిపోయింది. కనుక కణికలో ఇలా రంగు అంటుకున్న పదార్థాన్ని - ఆహాఁ - ‘రంగు పదార్థం’ అన్నారు. మన తెలుగు వాళ్లకి సంస్కృతం మీద ఉన్న పక్షపాతం లాంటిదే పాశ్చాత్యులకి లేటిన్, గ్రీకు భాషల మీద ఉన్న మోజు. అందుకనీ, ‘రంగు పదార్థం’ అంటే మరీ దేశవాళీగా ఉంటుందని దీనిని ‘క్రోమోసోం’ అన్నారు. గ్రీకు భాషలో ‘క్రోమా’ అంటే రంగు, ‘సోమా’ అంటే పదార్థం అని అర్థం. కనుక ‘క్రోమోసోం’ అంటే రంగు పదార్థం లేదా రంగు శరీరం. దీనిని కావలిస్తే మనం ‘రంగు పదార్థం’ అని తెలుగులో అనొచ్చు. కానీ అలా అనటం వల్ల మనకి బోధపడ్డది ఏమీ లేదు. ఇటువంటి సందర్భాలలో ఆ రంగు పదార్థం ప్రయోజనం ఏమిటో తెలుసుకుని దానికి ఆ అర్థం స్ఫురించేలా పేరు పెట్టొచ్చు. అదెలాగో చూద్దాం.
ఇప్పుడు మనకి ఈ క్రోమోసోముల గురించి ఇంకా బాగా తెలుసు. ఈ క్రోమోసోములే మన డిఎన్‌ఏ. ఈ క్రోమోసోములలోనే మన జన్యువులు (జీన్స్) ఇమిడి ఉన్నాయి. వీటిలోనే మన వారసత్వపు సమాచారం అంతా సంకేత రూపంలో నిబిడీకృతమై ఉంది. కనుక ఈ క్రోమోసోములని ‘వారస వాహికలు’ అనమని నేను ప్రతిపాదించేను. ఎవ్వరూ వినలేదనుకొండి. అది వేరే విషయం. ఇప్పుడు తెలుగులో మీరు ఒక వ్యాసం రాస్తూ ‘వారసవాహికలు’ అని వాడేరనుకొండి. జీవశాస్త్రం ఎల్లలు కూడా తెలియని వారికి ఈ మాట సందర్భోచితంగా అర్థం అవుతుందని నా వాదం. నా గోడు విని విని విసుగెత్తిపోయిన ఒక పెద్ద మనిషి ‘ఇప్పుడు మన వారసవాహికలైన క్రోమోసోముల గురించి అధ్యయనం చేద్దాం’ అంటూ ఉపన్యాసం ఉపక్రమించేడు. నేను అక్కడ నుండి నిష్క్రమించేనని వేరే చెప్పనక్కరలేదనే అనుకుంటున్నాను.
* * *
శరీరానికి కావలసిన పోషక పదార్థాలలో మాంసకృత్తులు చాలా ముఖ్యమైనవి అని చిన్నప్పుడు చదువుకున్నాం. కర్బనోదకాలు కొలిమిలో పెట్టి కాల్చే ఇంధనం అనుకుంటే, ఆ కొలిమిని కట్టడానికి ఇటికలు కావాలి కదా. ఆ ఇటికలు మాంసకృత్తులలో తయారవుతాయి. అదీ మాంసకృత్తుల ప్రత్యేకత. ఈ మాంసకృత్తులనే ఇంగ్లీషులో ప్రొటీనులు అంటారు. రసాయనపరంగా ఇవి బృహత్ బణువుల (మెగా మోలిక్యులస్) కోవలోకి వస్తాయి.
మరి మాంసం తినని శాకాహారులకి మాంసకృత్తులు ఎలా వస్తాయి? పప్పుల వంటి దినుసులలోను, పాల వంటి పాడి పదార్థాలలోనూ కూడా మాంసకృత్తులు ఉంటాయని పెద్దలు చెప్పేరు. మాంసం అందరూ తినరు కానీ పప్పు పదార్థాలు అంతా తింటారు. కనకు వీటిని ‘పప్పుకృత్తులు’ అంటే సమంజసంగా ఉంటుందేమో?
కార్బోహైడ్రేట్‌లని పిండి పదార్థాలు అంటే ఎలా నప్పలేదో, అదే విధంగా ప్రొటీనులని మాంసకృత్తులు అంటే నప్పదు - అని నా అభిప్రాయం. పేర్లు పెట్టినప్పుడు కొంచెం దూరదృష్టితో ఎంపిక చేసుకోవాలి. శరీరానికి కావలసిన పోషక పదార్థాలలో అతి ముఖ్యమైన పదార్థాన్ని ఇంగ్లీషులో ‘ప్రొటీను’ అన్నారు. పిండి పదార్థాల కంటె, చక్కెరల కంటె, విటమినుల కంటె, ఖనిజ లవణాల కంటె ఈ ప్రొటీనులు ముఖ్యం - మన మనుగడకి. గ్రీకు భాషలో ‘ప్రోటోస్’ అంటే ప్రప్రథమమైనది అని కానీ ముఖ్యమైనది అని కానీ అర్థం. కనుక ఈ పదార్థానికి ‘ప్రొటీనులు’ అని ఇంగ్లీషు పేరు పెట్టేరు. అటువంటి దానికి కేవలం ‘మాంసంలో దొరికేది’ అనే అర్థం స్ఫురించే పేరు పెడితే ఏమి మర్యాదగా ఉంటుంది? పాత్రకి తగ్గ పేరు ఉండాలి.
మన మనుగడకి ముఖ్యాతి ముఖ్యమైనది మన ప్రాణం. ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికిరాదు. ప్రాణం ఉన్నంతసేపే ఈ బోదెకి విలువ. అందుకనే ముఖ్యాతి ముఖ్యమైన వాటిని మనం ‘అది నా ప్రాణం’ అంటాం. ఈ ప్రాణం మన కంటికి కనపడదు. సీసాలో బంధించి పట్టుకుందామంటే పట్టుబడదు. కానీ గాలిలో ఉండే ఆక్సిజన్ (ఆమ్లజని) అనే వాయువుని మనం పీల్చగలిగినంత సేపు ఈ ప్రాణం ఉన్నట్టు లెక్క. అందుకనే ఆక్సిజన్‌కి ప్రాణవాయువు అనే పేరు కూడా ఉంది.
మరొక ఉదాహరణ. భాషలో - ప్రతి భాషలోను - అచ్చులు, హల్లులు అని ఉంటాయి. అచ్చుల సహాయం లేకుండా - కేవలం హల్లులతో మాటలు పలకలేము. కనుక మనిషికి ప్రాణవాయువు ఎలాగో భాషకి అచ్చులు అలాంటివి. అందుకనే అచ్చులని ప్రాణములని కూడా పిలుస్తారు. నా మాట మీద నమ్మకం లేకపోతే మంచి వ్యాకరణ పుస్తకాన్ని సంప్రదించండి.
కనుక ఇటుపైన ప్రోటీనులని (వ్యాకరణంలో ఉన్న మాటకి చిన్న మార్పు చేసి) ప్రాణ్యములని పిలుద్దాం. ప్రోటీనులో మొదటి శబ్దం ‘ప్ర’, ప్రాణ్యములో మొదటి శబ్దం ‘ప్ర’ కనుక ఈ విధంగా కూడా కొంత కలిసి వచ్చింది.
నేను రాసే రాతలలో ప్రాణ్యం అంటే ప్రొటీను, కర్బనోదకం అంటే కార్బోసైడ్రేటు, పిండి పదార్థం అంటే స్టార్చి. కేవలం మాంసంలో దొరికే మరో పదార్థానికి దేనికైనా మాంసకృత్తులు అనే పేరు కేటాయిద్దాం.
ఇంత కథా చెప్పి చిన్న చిదంబర రహస్యం చెప్పకపోతే విజ్ఞానవేత్తగా నా మనస్సు ఒప్పుకోదు. చెబితే వ్రతం చెడే ప్రమాదం ఉంది. కానీ నిజాన్ని కప్పిపెట్టి ఎన్నాళ్లు దాచగలం? చారిత్రకంగా వారసవాహికల (క్రోమోజోము లేదా డిఎన్‌ఎ) వరస పరిపూర్ణంగా అర్థంకాని రోజుల్లో ఈ ప్రాణ్యపు బణువులలోనే ‘జీవరహస్యం’ దాగి ఉందని అనుకునేవారు. జీవరహస్యమే దాగి ఉన్నప్పుడు వీటిని ప్రాణ్యములనటం సమంజసంగానే ఉందని తృప్తిపడ్డారు. దరిమిలా ఈ రకం ఆలోచన తప్పు అని తేలింది. జీవ రహస్యం వారస వాహికలలో ఉంటుందని తెలిసింది.
భౌతిక శాస్త్రంలో ప్రోటీనుని పోలిన మాట ‘ప్రోటాను’. అణువు కేంద్రంలో ఉండే పరమాణువులలో ఇదొకటి. ఈ ప్రోటానుకి ఇప్పట్లో ప్రత్యేకించి తెలుగు పేరు పెట్టే ఆలోచన లేదు కానీ ప్రోటానుకి, ప్రోటీనుకి ఆయా పేర్లు రావటానికి కారణాలు ఒక్కటే అని గమనించండి.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా