S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకటన (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

ఆ దినపత్రికలోని క్లాసిఫైడ్ ఏడ్స్ కౌంటర్‌లోని అమ్మాయి ఆ ప్రకటనని చదివి పెన్సిల్‌ని పళ్లతో కొరుకుతూ కొద్ది క్షణాలు ఆలోచించింది. తర్వాత అడిగింది.
‘దీన్ని మా దినపత్రికలో ప్రకటించాలా?’
‘అవును. జవాబులు బాక్స్ నంబర్‌కి వచ్చే ఏర్పాటు కూడా కావాలి’
‘హెరాల్డ్ జర్నల్’లో ప్రకటనకి అతను ఇచ్చిన కాగితంలో ఇలా ఉంది.
‘మీ జీవిత భాగస్వామితో మీరు కట్టుబడి ఉండే పరిస్థితి ఉందా? బహుశా మీ సమస్యకి ఓ అంతిమ పరిష్కారం ఉంది. అన్ని ఉత్తరాలు రహస్యంగా ఉంచబడతాయి. బాక్స్ నంబర్...’
‘దీంట్లో ఏదైనా తప్పుందా?’ పార్కర్‌సన్ ప్రశ్నించాడు.
పెన్సిల్ మీద మరి కొన్ని పళ్ల గాట్లు పడ్డాయి.
‘నేనిక్కడ కొత్త. ఈ పేపర్ పాలసీ ఏమిటో నాకు పూర్తిగా తెలీదు. దయచేసి మిస్టర్ విల్సన్‌ని కలవండి’
విల్సన్ కూడా ఆ ప్రకటన చదివాక పార్కర్‌సన్‌ని ప్రశ్నించాడు.
‘మీరు లాయరా?’
‘కాదు’
‘మీరు విడాకుల గురించి ఈ ప్రకటన ఇస్తున్నారా?’
‘లేదు’
‘అంతిమ పరిష్కారం అంటే అర్థం ఏమిటి?’
‘దాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా చేసుకోనివ్వండి’
విల్సన్ అడ్వర్టయిజ్‌మెంట్ మేనేజర్ గదిలోకి ఆయన్ని తీసుకెళ్లి ఆ ప్రకటన గురించి వివరించాడు.
‘మీరు ‘అంతిమ పరిష్కారం’ అంటే ఏమిటో మాకు తృప్తి కలిగేలా వివరిస్తే తప్ప దీన్ని ప్రకటనకి తీసుకోలేం’ ఆయన చెప్పాడు.
పార్కర్‌సన్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘సరే. నా పేరు జేమ్స్ పార్సర్‌సన్. యూనివర్సిటీలో సైకాలజీ సబ్జెక్ట్‌లో ప్రొఫెసర్ని’
‘ఇది మీ సబ్జెక్ట్‌కి సంబంధించినదా?’ ప్రకటన కాగితాన్ని చూపిస్తూ మేనేజర్ అడిగాడు.
‘అవును. నేను ఓ కొత్త థీసిస్‌ని రాయబోతున్నాను. దాని ప్రకారం భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామి చేత హత్య చేయబడే అవకాశాలు ఎక్కువ. అఫ్‌కోర్స్. ఒక్క సైకలాజికల్ అంశం వదిలేస్తే’
‘తాము పట్టుబడతామన్న భయమా అది?’ మేనేజర్ అడిగాడు.
‘అదీ ముఖ్యమైన అంశమే. మరో అంశం. నా థీసిస్ ప్రకారం తాము స్వయంగా ఆ పనిని చేయలేరు. అవకాశం ఉంటే దాన్ని ఇతరులకి అప్పగిస్తారు. కిరాయి హంతకుడ్ని నియమించే అవకాశం ఉంటే, హింసాత్మక మరణాలు పెరుగుతాయి’
‘అంటే మీరు కిరాయి హంతకుడిగా ఈ ప్రకటన ఇస్తున్నారా? దీనికి సమాధానం వస్తుందని మీరు ఆశిస్తున్నారా?’
‘అవును. హాస్యాస్పద ప్రకటనలకి కూడా జవాబులు వస్తాయి. ఉదాహరణకి కొనే్నళ్ల క్రితం ఓ దినపత్రికలో ‘ఇది మీ ఆఖరి అవకాశం. ఓ డాలర్‌ని బాక్స్ నంబర్ 107కి పంపండి’ అనే ప్రకటన వచ్చింది. బదులుగా ఏమిస్తారో చెప్పకపోయినా వేల మంది పాఠకులు తలో డాలర్ పంపారు. నేను కావాలనే ‘అంతిమ పరిష్కారం’ అనే పదాలని వాడాను. హత్య అనే పదం వాడితే పిచ్చివాళ్లు తప్ప అంతా భయపడతారు. నాకు వచ్చే ఉత్తరాలు రెండు విభాగాలకి చెంది ఉంటాయని అనుకుంటున్నాను. నేను లాయర్ అనుకుని కొందరు విడాకుల గురించి రాస్తారు. ఇవి నా థీసిస్‌కి ఉపయోగపడవు కాబట్టి వాటిని పక్కన పెడతాను. రెండో రకం ఉత్తరాలు చదివితే హత్యకి ఎక్కడో ఓ బీజం కనిపిస్తుంది. దాన్ని నేను పసికట్టగలను. ‘ఇది నిజంగా హత్య గురించిన ప్రకటనేనా అది సాధ్యమా?’ అనేది తెలుసుకోడానికి వారు కొంత సమయాన్ని, ఓ తపాలా బిళ్లని ఖర్చు చేస్తారు’
‘కాని మీరు ఎవరో, ప్రకటనకి కారణం ఏమిటో వాళ్లకి తెలిసాక వాళ్లు తర్వాత మీ ప్రశ్నలకి జవాబులు ఇవ్వకపోవచ్చుగా?’
‘వాళ్ల నించి అవసరమైన సమాచారం పొందేదాకా నేనెవరో వాళ్లకి చెప్పను. అంతదాకా నా సేవని అమ్మే కిరాయి హంతకుడిగానే వాళ్లు నన్ను భావిస్తారు’
మేనేజర్ కొద్దిసేపు మెడని గోక్కుని ఇబ్బందిగా చెప్పాడు.
‘సరే. నేను చేసేది సబబైందో కాదో తెలీదు. నాకూ ఈ ప్రకటన మీద ఆసక్తి ఉంది. కాబట్టి దీన్ని అంగీకరిస్తాను. ఎన్ని రోజులు వేయాలి?’
‘ప్రస్తుతానికి ఒక్క రోజు చాలు’
‘మీకు వచ్చే ఉత్తరాలని మీరు మా ఆఫీస్‌కి వచ్చి తీసుకోవాలి’ మేనేజర్ చెప్పాడు.
‘సరే’
* * *
ఆ సాయంత్రం ఆ ప్రకటన హెరాల్డ్ జర్నల్‌లో వచ్చింది. మర్నాడు యూనివర్సిటీలో తన క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్తూ పార్కర్‌సన్ ఆ పత్రిక ఆఫీస్‌కి వెళ్లి తనకి వచ్చిన ఉత్తరాలని తీసుకున్నాడు.
‘ఇతను సార్జెంట్ లార్సన్. ఇతని బాధ్యతల్లో ఒకటి దినపత్రికల్లోని క్లాసిఫైడ్ ప్రకటనలని చదివి, వాటిల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే విచారించడం’ సాధారణ దుస్తుల్లోని ఓ వ్యక్తిని పరిచయం చేస్తూ అడ్వర్‌టైజ్‌మెంట్ మేనేజర్ ఇబ్బందిగా చెప్పాడు.
‘ఇందులో ఇబ్బందికరమైనది అంటూ ఏమీ లేదు. సార్జెంట్‌కి నేను చెప్పింది మీరు చెప్తే సరి’
‘నాకు ఇప్పటికే చెప్పారు. కానీ నేను నిజానిజాలు తెలుసుకోవాలి. మీ పర్స్ ఇవ్వండి’
ఆ పర్స్‌లోని పార్కర్‌సన్ యూనివర్సిటీ ఐడెంటిటీ కార్డ్‌ని చూశాక అతను చెప్పాడు.
‘మీరు నిజంగా యూనివర్సిటీలో పని చేస్తున్నారో లేదో తెలుసుకున్నాను. సరే’
మేనేజర్ ఇచ్చిన ఆరు ఉత్తరాలని చదివి పార్కర్‌సన్ కొద్దిగా నిరాశ చెందాడు.
‘ఆ ఉత్తరాలు తమ భర్తల్ని లేదా భార్యల్ని చంపాలనుకున్న వారి నించా?’ లార్సన్ ప్రశ్నించాడు.
‘అలాంటివే’
‘ఐతే ఆ ఉత్తరాలు ఇవ్వండి...’
‘ఇవ్వను. ఇవి నాకు రాసిన వ్యక్తిగత ఉత్తరాలు’
‘చూడండి ప్రొఫెసర్. మీరు హత్యల్ని నివారించడానికి సహకరించరా?’ లార్సన్ ప్రశ్నించాడు.
‘తప్పకుండా. చివరికి నా ప్రాజెక్ట్ దానికే సహాయం చేస్తుంది. కానీ ఓ రోగానికి చికిత్స చేసే ముందు దాన్ని చక్కగా డయాగ్నైజ్ చేయాలి. వీళ్లంతా కిరాయి హంతకుడ్ని నియమించాకే హత్యలు జరుగుతాయి. వారు నాతో బేరం ఆడే సమయంలో ఆ హత్యలు తాత్కాలికంగా నివారింపబడతాయి’
లార్సన్ అయిష్టంగా చెప్పాడు.
‘మీ బేరాలు పూర్తయ్యాక మాకు ఆ పేర్లు కావాలి. వారికున్న ఉద్దేశాన్ని తొలగించడానికి మేం ప్రయత్నిస్తాం’
‘మీ పాయింట్ నాకు అర్థమైంది. నా పని పూర్తయ్యాక మీకా పేర్లు ఇస్తాను’
ఇంటికి వెళ్లాక భార్య డోరిస్‌తో చెప్పాడు.
‘నేనో కొత్త ప్రాజెక్ట్‌ని ఆరంభించాను. కాబట్టి ఈసారి సెలవులు ఉండవు’
‘అంటే మన యూరప్ టూర్ రద్దయిందన్న మాట’ నిరాశగా చెప్పింది.
‘డోరిస్! నువ్వు ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటావు?’
‘కొత్త వాళ్లని కలుసుకోవడానికి’
‘ప్రపంచంలోని ప్రతీ మనిషి వౌలికంగా ఒకే విధంగా ఉంటాడని నీకు తెలీదా? తెలిస్తే ఈ విషయాన్ని తనిఖీ చేయడానికి డబ్బు ఖర్చు చేయడం వృధా కదూ?’
పార్కర్‌సన్ తన గదిలోకి వెళ్లి ఆ ఆరు ఉత్తరాలని చదివాడు. వాటిలో నాలుగు మొదటి రకానికి చెందినవి. మిగిలిన రెంటిలోనే అతనికి ఆసక్తి కలిగింది. మొదటి ఉత్తరం మళ్లీ చదివాడు.
‘డియర్ సర్,
ఆసక్తికరమైన మీ ప్రకటనని హెరాల్డ్ జర్నల్ ఈవెనింగ్ ఎడిషన్‌లో ఇప్పుడే చదివాను. అంతిమ పరిష్కారంలోని సాధ్యాసాధ్యాలు మీకు బహుశా తెలియకపోవచ్చు అనిపించింది. నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలనుకుంటే, హెరాల్డ్ జర్నల్‌లో దయచేసి ఈ ప్రకటనని జారీ చేయండి. ‘మగ కుక్క తప్పిపోయింది. పేరు రెజిస్’
ఆ ఉత్తరంలో సంతకం లేదు.
రెండో ఉత్తరం కూడా టైప్ చేసిన సంతకం లేని ఉత్తరమే. ‘మేక్స్ బార్. ట్వంటీ ఫస్ట్ అండ్ వెల్స్ కార్నర్. ఈ రాత్రి ఎనిమిదికి. స్కాచ్ ఆర్డర్ చేయి. కుడి బూట్ లేస్‌ని విప్పదీసి మళ్లీ కట్టు’
పార్కర్‌సన్ రిసీవర్ అందుకుని హెరాల్డ్ జర్నల్‌కి ఫోన్ చేసి రెజిస్ కుక్క గురించిన ప్రకటనని మర్నాడు దినపత్రికలో వేయమని కోరాడు.
భోజనం అయ్యాక కోటు తొడుక్కుని భార్యతో చెప్పాడు.
‘నేను పని మీద యూనివర్సిటీకి వెళ్తున్నాను. ఎప్పుడు వస్తానో తెలియదు’
సరాసరి మేక్స్ బార్‌కి వెళ్లి స్కాచ్ ఆర్డర్ చేశాడు. కుడి బూటు లేస్‌ని విప్పదీసి కట్టుకున్నాడు. ఐదు నిమిషాలు గడిచినా ఎవరూ వచ్చి అతన్ని పలకరించలేదు. అతను ఆలస్యమై ఉండచ్చు అనుకుని మరోసారి బూటు లేస్‌ని విప్పదీసి కట్టుకున్నాడు. ఐనా ప్రయోజనం లేకపోయింది. తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
మర్నాడు యూనివర్సిటీ నించి ఇంటికి కాలినడకన తిరిగి వస్తూంటే, ఓ కొత్త వ్యక్తి పార్కర్‌సన్ బూట్ల వంక చూస్తూ చెప్పాడు.
‘మీ కుడి కాలి బూటు లేస్ కట్టి ఉంది’
‘మీరేనా? ఆ ప్రకటన...’
‘అవును. నిన్న రాత్రి మేక్స్ బార్‌కి నేనూ వచ్చాను’
‘మరి నన్ను పలకరించలేదే?’
‘నేను జాగ్రత్త మనిషిని. ఇది జాగ్రత్త పడాల్సిన విషయం. అంతిమ నిర్ణయం అంటే ఏమిటి? హత్యా?’ అతను అడిగాడు.
‘అవును’
‘ఇది మీ వృత్తి కాదుకదా ప్రొఫెసర్ పార్కర్‌సన్? మరి ఆ ప్రకటన ఎందుకు ఇచ్చారు?’ అతను అడిగాడు.
‘నా పేరు ఎలా తెలుసుకున్నారు?’
‘క్రితం రాత్రి మీ ఇంటికి, ఈ ఉదయం మీ యూనివర్సిటీకి మిమ్మల్ని అనుసరించాను. మీలాంటి వాళ్లు హాబీగా కానీ, వృత్తిగా కానీ ఈ పని చేస్తారంటే నమ్మలేకపోతున్నాను’
‘మీ గురించి పోలీసులకి ఫిర్యాదు చేస్తాను’ పార్కర్‌సన్ హెచ్చరికగా చెప్పాడు.
‘మీ ప్రకటనకి జవాబులు వచ్చాయా?’ అతను అడిగాడు.
‘ఇంత దాకా ఆరు వచ్చాయి’
కొద్ది క్షణాలు ఆలోచించి ఆ కొత్త వ్యక్తి చెప్పాడు.
‘ప్రొఫెసర్ పార్కర్‌సన్! మీరు వాళ్ల పేర్లని నాకు దయచేసి ఇస్తారా?’
‘దేనికి?’
‘ప్రతీ పేరుకి ఐదు వందల డాలర్లు ఇస్తాను. ఐతే వారు నన్ను వినియోగించుకుంటేనే’
‘మీరు కిరాయి హంతకుడా?’
‘అవును’
‘ఒకరిని హత్య చేయడానికి మీరెంత తీసుకుంటారు?’ పార్కర్‌సన్ అడిగాడు.
‘పది వేల డాలర్లు’
‘ఎలా చేస్తారు?’
‘కోరిన వ్యక్తి ఎలిబీ ఉన్న సమయంలో అతను కోరిన వ్యక్తిని రివాల్వర్‌తో కాల్చి చంపుతాను. కాబట్టి వారి ప్రమేయం ఉండదు. నా వృత్తిలోని కష్టాల్లో ఒకటి క్లయింట్‌ని వెతుక్కోవటం. నేను మీలా ప్రకటనని ఇవ్వలేను’
‘మీ మీద పోలీసులకి ఫిర్యాదు చేస్తాను’ పార్కర్‌సన్ మళ్లీ చెప్పాడు.
‘రుజువేది? మీరు ఆలోచించుకునేందుకు కొంత సమయం ఇస్తాను ప్రొఫెసర్. మీరు కాకపోతే ఇందుకు ఒప్పుకునే సైకాలజిస్ట్‌లు దేశంలో చాలామంది ఉన్నారు’
అతను రోడ్డుని దాటి 2013 కన్వర్టబుల్ కారెక్కాడు.
పార్కర్‌సన్ 1996 సెడాన్ పార్క్ చేసి ఉన్న ఇంట్లోకి వెళ్లాడు. డోరిస్ కొన్ని బట్టల్ని చూపించి చెప్పింది.
‘వీటిని చర్చ్‌కి డొనేషన్‌గా ఇస్తున్నాను’
‘నా బ్రౌన్ సూట్‌ని ఎందుకు ఇస్తున్నావు? మన పెళ్లి రోజు నేను దానే్న తొడుక్కున్నాను’
‘అది పాతబడింది. మీరింత సెంటిమెంటల్ అనుకోలేదు’
‘సెంటిమెంట్ కాదు. దాన్నింకా కొన్ని సంవత్సరాలు వాడచ్చు’
‘మీరు పెళ్లి చేసుకున్న సూట్లోనే పాతి పెట్టబడటం మీకు ఇష్టమైతే సరే’
ఆ రాత్రి పార్కర్‌సన్ ఆలోచించాడు. అమెరికాలో ఇరవై కోట్ల మంది ఉన్నారు. వారిలోని లక్ష మంది భర్తలు లేదా భార్యలు తమ జీవిత భాగస్వామిని చంపాలనుకోవచ్చు. పేరుకి ఐదు వందల డాలర్ల చొప్పున ఎంత రావచ్చు?
లేచి లెక్కకట్టి సంతృప్తిగా తలాడించి ఆ కాగితాన్ని చెత్తబుట్టలో పడేశాడు.
* * *
మర్నాడు హెరాల్డ్ జర్నల్ ఆఫీస్‌కి వెళ్లి రెజిస్ కుక్క ప్రకటనకి వచ్చిన ఏకైక ఉత్తరాన్ని తీసుకున్నాడు.
‘డియర్ సర్,
రెజిస్ ప్రకటన చూశాను. మనం కలుసుకునే సమయం వచ్చింది. 27 అండ్ గెరాల్డ్ కార్నర్‌లోని లియోని రెస్ట్‌రెంట్‌లో శుక్రవారం రాత్రి ఎనిమిదికి కలుద్దాం. నేను రోజ్ షిఫాన్ స్కార్ఫ్‌ని ధరిస్తాను. మీరు తెల్ల మఫ్లర్‌ని ధరించండి. నేను ‘రెజిస్’ అంటే, మీరు ‘బ్లాక్ కాలర్’ అని జవాబు ఇవ్వండి’
ఆ ఉత్తరం రాసింది స్ర్తి అని స్కార్ఫ్ రంగుని బట్టి పార్కర్‌సన్ గ్రహించాడు. ఏడాది క్రితం తన భార్యని ఆ రెస్ట్‌రెంట్‌కి తీసుకెళ్లాడు. కాబట్టి అది ఎక్కడుందో తెలుసు.
యూనివర్సిటీ నించి ఇంటికి వెళ్లాక ఫోన్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ గురించి అతనితో పాలుపంచుకునే మరో ప్రొఫెసర్ అడిగాడు.
‘చెప్పడం మరిచాను. దీని గురించి మీ భార్యతో చర్చించారా?’
‘ఇది జువాలజీ లేదా రొమేన్స్, లాంగ్వేజెస్ కాదు చర్చించడానికి’ చెప్పాడు.
‘నేను ఉమెన్స్ క్లబ్‌కి మీటింగ్‌కి వెళ్తున్నాను. మీ కారు తీసుకెళ్లచ్చా?’ డోరిస్ అడిగింది.
పార్కర్‌సన్‌కి కూడా లియోనీ రెస్ట్‌రెంట్‌కి వెళ్లడానికి కారు అవసరమైనా భార్య అడిగిందని కాదనలేక పోయాడు. భార్య వెళ్లిన పావుగంట తర్వాత టేక్సీలో ఆ రెస్ట్‌రెంట్‌కి చేరుకున్నాడు. గుమ్మంలోంచే గులాబీ రంగు షిఫాన్ స్కార్ఫ్ కోసం చూశాడు. ఓ బూత్‌లోని డోరిస్ కనిపించింది. ఆమె మెడకి రోజ్ షిఫాన్ స్కార్ఫ్ ఉంది.
ఓ కుర్రాడిని పక్కకి పిలిచి చెప్పాడు.
‘నువ్వు ఓ ఎడ్వెంచర్ చేస్తే నీకు ఏభై డాలర్లు ఇస్తాను’
ఆ డబ్బు తీసుకుని అతను ప్రొఫెసర్ ఇచ్చిన తెల్ల మఫ్లర్‌ని మెడకి చుట్టుకుని డోరిస్ దగ్గరికి వెళ్లాడు.
‘రెజిస్?’ డోరిస్ అతన్ని చూసి అడిగింది.
‘బ్లాక్ కాలర్. మీ భర్తని ఎందుకు చంపాలనుకుంటున్నారు?’ అతను అడిగాడు.
‘అందుకు ఎంత కావాలి? ముందుగా అది చెప్పండి’ కోరింది.
‘ఐదు వేల డాలర్లు’
‘కారణం ప్రొఫెసర్ కోనర్‌కీ, నాకూ సంబంధం ఉంది కాబట్టి’
* * *
పార్కర్‌సన్ టేక్సీలో మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. అతని మనసంతా స్తబ్దుగా ఉంది. పెళ్లయిన పదమూడేళ్లలో డోరిస్ ఇలాంటి వ్యక్తి అని అతను ఎన్నడూ ఊహించలేదు. స్కాచ్ కలుపుకుని తాగుతూండగా ఫోన్ మోగింది.
‘పేరుకి ఐదు వందల డాలర్లు. మీకు అంగీకారమేనా?’
‘ముందు ఇది చెప్పు. హత్యకి పది వేల డాలర్లకి తగ్గవా?’ పార్కర్‌సన్ ప్రశ్నించాడు.
‘ఏమిటి విషయం?’
‘మా ఇంటికి వస్తే చెప్తాను. ఐదు వేల డాలర్లకి అంగీకరిస్తేనే రా. లేదా వద్దు’
పావుగంట తర్వాత డోర్ బెల్ మోగింది. తలుపు తరిచి పార్కర్‌సన్ ఆ కిరాయి హంతకుడిని చూశాడు. ఇద్దరూ లోపలికి వెళ్లగానే తలుపు మూశాడు.
*
(జాక్ రిట్చీ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి