S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఉడ్‌కట్’ ఆమె అస్తిత్వం..

‘వుడ్‌కట్’ మాధ్యమంలో హైదరాబాద్‌కు చెందిన చిత్రకారిణి బి.కరుణ రంగుల వెల్లువను ప్రవహింపజేస్తున్నారు. చిత్రకళలో ఉపాంగమైన ‘ప్రింట్ మేకింగ్’లో ఆమె మేటిగా నిలిచారు. ఈ మాధ్యమం ద్వారా భావ ప్రకటన క్లిష్టమైనది, కష్టంతో కూడుకున్నది. శారీరక శ్రమ సైతం ఎక్కువే.. అయినప్పటికీ ఆ ప్రక్రియ పట్ల ఆమె ‘ప్రేమ’ను పెంచుకున్నారు. అంకిత భావం, ఇష్టం, నిష్ట కారణంగానే ఆమె 2005 సంవత్సరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎఫ్.ఏ. విద్యార్థినిగా ఉన్నప్పుడే బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. దాంతో కరుణ కెరీర్ అర్ణవమైంది.. అరుణారుణ వర్ణమైంది.
ఎం.ఎఫ్.ఏ.లో సృజనకు, భావ వ్యక్తీకరణకు, ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారు. భవిష్యత్‌కు బలమైన పునాది అక్కడే పడుతుంది. సృజన శక్తి విప్పారుతుంది. ‘శైలి’ అంకురిస్తుంది. ఆలోచనల ఫౌంటేన్ ‘వాల్వ్’ తెరుచుకుంటుంది. దాంతో ఓ సరికొత్త ప్రపంచం.. రంగుల ప్రపంచం.. రసరమ్య లోకం కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. అలా అనుభవంలోకి వచ్చినవే, చూసినవే ఇంద్రధనుస్సుల్లా కనిపిస్తాయి. కరుణ విషయంలోనూ ఇదే జరిగింది. తాను రోజూ చూసే అనేక విషయాలు, తన చుట్టూ ఉన్న వ్యక్తులు, బంధువులు, ప్రేమను పంచేవారి చర్యలు, చేష్టలు ‘వుడ్‌కట్’లో ఒదిగిపోయేందుకు మనసులో ఒత్తిడి పెంచేవి. వివిధ వర్ణాలో ఒదిగిపోయేందుకు ఆత్రుత పడేవి. ఓ మార్గాన్ని చూపేవి.. ఆ దారిగుండా నడిచేందుకు సిద్ధమై ఫ్లైవుడ్ బోర్డు ముందు కూర్చొని ముందుగా తన మదిలో బలంగా ముద్ర పడిన అంశాన్ని డ్రాయింగ్ చేసి అనంతరం వివిధ పరికరాల (టూల్స్)తో ‘ఎచ్చింగ్’ ప్రారంభిస్తుంది. తొలుత లైట్ (వెలుతురు) ఎక్కువగా ఉండాల్సిన చోటు నుంచి ప్రారంభించి క్రమంగా డార్క్ (ఎక్కువ రంగు తీసుకునే భాగం) వైపుగా ఎచ్చింగ్‌కు పూనుకుంటుంది. అలా ఒక ‘పొర’ను ఎచ్చింగ్ చేశాక ఆ బోర్డుకు రంగు పూసి రోలర్ కింద పేపర్ పెట్టి ప్రింట్ తీస్తుంది. అలా ఎన్ని రంగులు ‘చిత్రం’లో ఉండాలని భావిస్తే అన్ని మార్లు ఎచ్చింగ్ చేసి అన్ని సార్లు ప్రింట్ తీస్తుంది. ఒకే పేపర్‌పై అన్ని మార్లు ప్రింట్ తీయటం వల్ల అంతిమంగా చిత్రకారిణి అనుకున్న విధంగా చిత్రం రూపొందుతుంది. ఇలా వుడ్‌పై ‘తుది’ చిత్రం తయారుకావడానికి ఒకోసారి వారాలు, నెలలు పడుతుంది. ప్రతి ప్రింట్ రంగు ఆరాకనే మరో ‘ఇంప్రెషన్’కు వెళ్లాల్సి వుండటం వల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయమంతా చిత్ర తుది రూపంపై మేథోమథనం జరుగుతూనే ఉంటుంది. నిరంతరం ఆ చిత్రం, తదుపరి ‘స్టెప్’పై తదుపరి రంగుపై, ‘కట్’పై ఏకాగ్రత పెట్టవలసి ఉంటుంది. ఈ పని విధానంలో 4 ఇంటు 5 అడుగుల (స్నానాల గది అంతటి) బొమ్మలను వుడ్‌కట్ ద్వారా ఆమె అనేక ప్రింట్స్ తీశారు. ఇందుకోసం బరోడా నుంచి ప్రత్యేకంగా కాగితం తెప్పించి ‘ప్రింట్’ తీస్తారు. బి.కరుణ బొమ్మలు భావోద్వేగాలను, మనుషుల అంతర్లోకాలను, ఊహల ఊసులను ఎక్కువగా వ్యక్తం చేస్తాయి. ఆ బొమ్మల్లో మనుషులు కనిపిస్తున్నా వారి మానసిక ప్రపంచపు లోతులను వివిధ చిహ్నాల రూపాలలో, సంకేతాలుగా వ్యక్తం చేయడం వల్ల దానికి రంగుల కవితాత్మ అమరుతుంది. ఆ సృజననే కీలకం.. ఆ సృజన రీతుల కోసం ఎందరెందరో చిత్రకారులు, ప్రింట్ మేకర్స్ తమ జీవితాలను అంకితం చేశారు. ఏ మేరకు ఆ విధంగా తమ భావాలను ‘పండించ’గలిగితే అంత గొప్ప కళాకారుడిగా ‘లోకం’ గుర్తిస్తుంది. సహచర చిత్రకారులు, కళాకారులు కీర్తిస్తారు.. గౌరవిస్తారు. ఈ ఒక్క కనిపించని, అదృశ్య ‘ఆరాటం’తోనే కాలం గడుపుతూ ఉంటారు. వారిలో కరుణ కూడా ఒకరు. ఆ దిశగానే ఆమె ప్రయాణం. ప్రస్థానం కొనసాగుతోంది.
ఆమె ఎం.ఎఫ్.ఏ. చేస్తున్నప్పుడే భారతదేశంలోని ప్రముఖ ప్రింట్ మేకర్స్ అతుల్ దోడియా, పినాకి బారువా లాంటి వాళ్లు వచ్చి యూనివర్సిటీలో ‘ఎచ్చింగ్’ చేసేవాళ్లు. వాళ్ల పని విధానం, ఎంచుకునే వస్తువు, దాన్ని తీర్చిదిద్దడాన్ని దగ్గరగా గమనించే అవకాశం లభించింది. అలా వారు స్ఫూర్తిదాతలుగా నిలిచారు. ప్రింట్ మేకింగ్ ఓ వ్యసనం.. అదే తిండి.. అదే నిద్ర.. అదే శ్వాసగా మారాక చిత్రకారిణి వ్యక్తిత్వంలో ఓ పరిణత ఉబికి వస్తుంది. అంతకు ముందు లేని ఓ పరిపక్వత మాటల్లో.. చేతల్లో.. ఆలోచనల్లో చోటు చేసుకుంటుంది. కరుణ సైతం ఈ ‘దశ’ను దాటి వచ్చింది. అందుకే ఆమె ప్రింట్ మేకింగ్‌లో ముఖ్యంగా వుడ్‌కట్‌లో ఉద్విగ్నభరిత బొమ్మలు ‘ప్రింట్’ చేస్తున్నారు.
ఈ రంగంలో మగవారే కాదు మహిళలు అనేక మంది ఉన్నారు. వారిలో ఢిల్లీకి చెందిన అనుపమ సూద్ ఒకరు. ఆమె తన రోల్ మోడల్ అని కరుణ అంటున్నారు. అనుపమను అనేకమార్లు కలిశానని, ఆమెకు తన చిత్రాలు చూపానని, వాటిని చూసి మెచ్చుకున్నారని, అప్పుడు తన మదిలో మరువలేని అనుభూతి కలిగిందని, తాను ఎంచుకున్న మార్గంలో మరింత ముందుకు కదలాలన్న భావన కదిలిందని ఆమె అంటున్నారు. తన గురుతుల్యులు, మెంటార్ డి.ఎల్.ఎన్. రెడ్డి సైతం తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించారని, అపార అనుభవం గల ఆయన సూచనలు సలహాలు తనని తాను మలచుకోవడానికెంతో ఉపకరించాయని చెప్పారు.
2008 సంవత్సరంలో ఆమె తన డ్రాయింగ్స్, పెయింటింగ్స్‌ను హైదరాబాద్‌లోని సృష్టి ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి ‘సోలో’గా ప్రదర్శించారు. మరుసటి సంవత్సరం కొచ్చిన్‌లోని కాశీ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. 2011 సంవత్సరంలో తన భర్త - చిత్రకారుడు సుక్కా సుందర్‌తో కలిసి సృష్టి ఆర్ట్ గ్యాలరీలో తన చిత్రాలను ప్రదర్శించారు. అప్పటి నుంచి అసంఖ్యాక గ్రూపు షోలలో ఆమె తన చిత్రాలను ప్రదర్శిస్తూ వస్తున్నారు.
2004, 2009 సంవత్సరం భోపాల్‌లో భారత్ భవన్‌లో జరిగిన 6, 9వ అంతర్జాతీయ ద్వైవార్షిక ప్రింట్ - ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో, అంతకు ముందు లలిత కళా అకాడెమీ (కొత్త ఢిల్లీ) జాతీయ ప్రదర్శనలోనూ ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ గ్యాలరీలలో జరిగిన ప్రదర్శనల్లో ఆమె తన బొమ్మలను ప్రదర్శించారు.
ఈ రంగుల ప్రయాణం వెనకాల ఆమె తండ్రి ప్రముఖ చిత్రకారుడు శ్రీహరి బోలేకర్ ‘అదృశ్య హస్తం’ ఉంది. ఆయన ప్రస్తుత కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం, బొల్లక్‌పల్లిలో 1941లో జన్మించారు. 1961లో బొంబాయి (ప్రస్తుత ముంబయ్) లోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి పెయింటింగ్‌లో డిప్లొమా చేశారు. అనంతరం జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి విలువైన సేవలు అందించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి సీనియర్ ఫెలోషిప్‌ను అందుకున్నారు. అలాగే లలిత కళా అకాడెమీ నుంచి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఎందరో చిత్రకారులు, ప్రింట్ మేకర్స్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యమంతా బి.కరుణ బాల్యంపై ప్రభావం చూపింది. ఇంటి నిండా ‘రంగుల వాసన’ వ్యాపించింది. ప్రముఖుల పాదముద్రలు కనిపించాయి. 1980 సంవత్సరంలో పుట్టిన కరుణ పాఠశాల విద్య పూర్తయ్యాక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 1999 సంవత్సరంలో బి.ఎఫ్.ఏ. కోర్సులో ప్రవేశించారు. అక్కడ నాలుగు సంవత్సరాల పాటు పెయింటింగ్, శిల్పం, ప్రింట్ మేకింగ్, క్లే మోల్డింగ్ తదితర విషయాల్లో ప్రాథమిక అంశాలను నేర్చుకుంది. అభ్యాసం.. అభ్యాసం.. అభ్యాసం వల్ల అనేక విషయాలు తెలిశాయని, నాన్న శ్రీహరి ద్వారా స్ట్రాంగ్ లైన్, బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ వస్తే, బి.ఎఫ్.ఏ. లో స్కిల్స్ (నైపుణ్యాలు) నేర్చుకున్నానని ఆమె అంటున్నారు.
అలా క్రమంగా ఎదుగుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎఫ్.ఏ. పూర్తయ్యాక భారత చిత్రకారులు ‘మక్కా’గా భావించే బరోడాకు కరుణ పయనమయ్యారు. అక్కడ మూడు సంవత్సరాల పాటు మ్యూజియం స్టడీస్ (ఎం.ఏ. కోర్సు) చేశారు. అక్కడ ఓ కొత్త ప్రపంచం తన కోసమే పరచుకున్నట్టనిపించింది. అక్కడ అనేక ఆర్ట్ స్టూడియోలు, ఆర్టిస్టులు, తపస్సులా పని చేస్తూ కనిపించారు. చిత్రకళ శిఖరాయమాన వాతావరణం కళ్లకు కనిపించింది. తాను చదివిన ప్రింట్ మేకింగ్, ముఖ్యంగా ‘వుడ్‌కట్’లో ఎందరో పని చేస్తూ కనిపించడంతో ఇక ఇదే తన రంగం.. వుడ్‌కట్ మాధ్యమాన్ని మించింది లేదన్న భావన తనలో అక్కడే స్థిరపడిందని అంటారు. ఆ తరువాత ‘వుడ్’ ఆమెకు ‘్ఫడ్’ అయింది. తన అస్తిత్వాన్ని తెలిపేందుకు జెండా అయింది. ఆ జెండా సమున్నతంగా ఎగురవేసేందుకు ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారు.
బి. కరుణ 9010661085.

-వుప్పల నరసింహం 9985781799