S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జాతి పదార్థాలు

మెతేన్, ఎతేన్, వగైరాలు కర్బన రసాయన శాస్త్రంలో ఒక జాతి పదార్థాలు. ఈ జాతి లక్షణం ఏమిటంటే ఈ జాతి బణువులన్నింటిలోనూ కర్బనపు అణువులు, ఉదజని అణువులు మాత్రమే ఉంటాయి. ఒకే ఒక కర్బనపు అణువు విష్ణుమూర్తిలా నాలుగు చేతులతో ఉంటే, ఒక్కొక్క చేతిని ఒక్కొక్క ఉదజని అణువు పట్టుకొని ఉన్న సందర్భంలో ఆ పదార్థం పేరు మెతేను. దీనిని ఇంగ్లండ్‌లో మీథేన్ అని ఉచ్చరిస్తారు కనుక దీని పేరు తెలుగు పుస్తకాలలో మీథేను అని కూడా కనిపిస్తుంది.
నాలుగేసి చేతులు ఉన్న ఇద్దరు దేవుళ్లు, ఒక్కొక్క చేతిని పక్కనున్న దేవుడి చేతిని పట్టుకుందికి వాడి ఉంటే వారికి ఉమ్మడిగా ఆరు ఖాళీ చేతులు ఉంటాయి కదా. అదే విధంగా రెండు కర్బనపు అణువులు ఒక దానిని ఒకటి పట్టుకుని, మిగిలిన ఆరు ఖాళీ చేతులతో ఆరు ఉదజని అణువులని పట్టుకున్న సందర్భంలో మనకి వచ్చేది ఎతేను. దీనినే, బ్రిటీష్ సంప్రదాయానుసారం, మన పుస్తకాలలో ఈథేను అని రాస్తున్నారు.
ఇదే పద్ధతిలో మూడు కర్బనపు అణువులు, చేతులు కలిపి ఒక గొలుసులా ఏర్పడినప్పుడు, ఎనిమిది ఖాళీ చేతులు ఉంటాయి. ఆ చేతులకొక్క దానికి ఒక్కొక్క ఉదజని అణువుని తగిలించినప్పుడు మనకి ప్రొపేను వస్తుంది.
ఆ తరువాత వరుస క్రమంలో వచ్చేదానిని బ్యుటేను అంటారు. అంటే ఈ బ్యుటేనులో నాలుగు కర్బనపు అణువుల గొలుసు, ఆ గొలుసుని పట్టుకుని పది ఉదజని అణువులు ఉంటాయి. చిన్న బొమ్మ గీసి చూసుకుంటే ఈ పది ఎలా వస్తుందో తేలికగా అర్థం అవుతుంది.
వెనుకటికి ఒక బుచ్చమ్మ పుచ్చ పాదులా పిల్లల్ని కనేస్తూ ఉంటే పేర్లు వెతుక్కోలేక అప్పదాసు కేశవ నామాలు అందుకున్నాట్ట. అలా, ఈ రసాయనపు గొలుసులు ఆంజనేయుడి తోకలా అంతూ దరీ లేకుండా అలా పెరిగిపో ఉంటే కొత్త కొత్త పేర్లు పెట్టటం చేతకాక, ఈ వరుసలో అయిదో దానిని ‘పెంటేను’ అనీ, ఆరవ దానిని ‘హెక్సేను’ అనీ, ఆ తరువాత హెప్టేను, ఆక్టేను. అలా పేర్లు పెట్టటం మొదలెట్టేరు. కొద్దిగా లేటిన్‌తో పరిచయం ఉన్నవారూ, సంస్కృతం వచ్చినవారూ ఈ పేర్లలో ఒక బాణీని గుర్తించి ఉంటారు. ‘పెంటా’ అంటే 5, ‘హెక్సా’ అంటే 6, ‘హెప్టా’ అంటే 7, ‘ఆక్టా’ అంటే 8, మొ.
ఈ పద్ధతిలో బ్యుటేన్‌ని ‘క్వార్టేను’ అనీ, ప్రొపేన్‌ని ‘ట్రయేను’ అనీ, ఎతేన్‌ని ‘డయేను’ అనీ, మెతేన్‌ని ‘ఏకేను’ అనీ అనాలి. కాని అలవాటు పడ్డ ప్రాణాలకి అది కష్టం అయిపోయింది కనుక అలవాటుని మార్చుకోలేక పోయేరు. ఇప్పుడు మనకి కొన్ని పాత పేర్లు, కొన్ని కొత్త పేర్లూ మిగిలేయి. ఈ కథంతా ఈ మధ్యనే - అనగా, పద్దెనిమిదో శతాబ్దం మధ్యలో జరిగింది.
ఇప్పుడు ఒక ఊహా ప్రపంచంలోకి వెళదాం. మన వేమన యోగి పదహారో శతాబ్దం వాడనుకుంటాను. ఆయనా రసాయనాల మీద పరిశోధనలు చేసేడు. సరదాకి ఆ రోజుల్లో ఈ మెతేన్, ఎతేన్, ప్రొపేన్, బ్యుటేన్, పెంటేన్, హెక్సేన్.. మొదలైన వాటిని మన వేమనే కనుక్కున్నాడని అనుకుందాం. అప్పుడు ఆయన వీటికి ఏ పేర్లు పెట్టి ఉండేవాడంటారు? మూడొంతులు, పాడేను, విదేను, తదేను, చతుర్థేను, పంచేను, షష్ఠ్‌ఏను, సప్తేను, అష్టేను, నవేను, దశేను, ఏకాదశేను.. అలా పేర్లు పెట్టి ఉండేవాడమో. అప్పుడు చచ్చినట్లు ప్రపంచం అంతా మన దేశపు పేర్లని వాడి ఉండేవారు. అప్పుడు మనం తెలుగు పేర్లు వాడటానికి చిన్నతనం పడిపోయి, ఏ సిరా బుడ్డిలోనో బుర్ర పెట్టేసి చచ్చిపోయి ఉండేవాళ్లం కాదు!
* * *
ప్రాణ్యములని (ప్రోటీనులని) ఇటికలతో కట్టిన గోడలులా ఊహించుకుంటే ఆ ఇటికలని ఇంగ్లీషులో ఎమినో (లేదా ఎమైనో) ఏసిడ్‌లు అంటారు. కనుక ప్రాణ్యముల గురించి అర్థం అవాలంటే ఈ ఎమినో ఏసిడ్ అంటే ఏమిటో తెలియాలి.
ఎమీనో ఏసిడ్‌లో రెండు భాగాలు ఉన్నాయి: ఎమైన్ భాగం, ఏసిడ్ భాగం. ఏసిడ్‌ని తెలుగులో ఆమ్లం అంటారు. (ఆమలకం అంటే ఉసిరికాయ. ఉసిరికాయలా పుల్లగా ఉంటుంది కనుక ఈ పేరు వచ్చి ఉంటుంది) పోతే, ఈ ‘ఎమైన్’ అన్న మాట ‘అమ్మోనియా’ లోంచి వచ్చింది. అమ్మోనియా అనేది ఒక ఘాటైన విష వాయువు. నవాసారాన్ని, సున్నాన్ని కలిపితే ఈ వాయువు పుడుతుంది.
ఉదకాన్ని పుట్టించేది ఉదజని (హైడ్రోజన్), ఆమ్లాన్ని పుట్టించేది ఆమ్లజని (ఆక్సిజన్). ఇదే విధంగా చాలా వాయువులకి ఇంగ్లీషులో ‘-జెన్’ అనే తోక, తెలుగులో ‘-జని’ అనే తోక తగిలించటం సంప్రదాయమై పోయింది. ఈ సంప్రదాయం ప్రకారం సూర్యుడిని పుట్టించిన వాయువైన హీలియంని తెలుగులో రవిజని అని పిలవచ్చు. ఈ తర్కం ప్రకారం నవాసారాన్ని పుట్టించేది - లేదా నవాసారం నుండి పుట్టేది - నవజని! కనుక ‘అమ్మోనియా’కి తెలుగు పేరు నవజని.
ఈ నవజని బణువు ‘అమ్మోనియా మోలిక్యూల్)లో కొన్ని అణువులని తొలగిస్తే మిగిలే దానిని రసాయనులు ‘అమ్మోనియా రేడికల్’ అంటారు. దీనిని తెలుగులో ‘నవాంశ’ (నవజని లోని ఒక అంశ) అందాం. (జ్యోతిష శాస్త్రంలో వచ్చే నవాంశ అర్థం వేరు) ఈ ‘అమ్మోనియా రేడికల్’కి ఒక ‘ఏసిడ్’ తోక తగిలిస్తే వచ్చేదే ‘ఎమీనో ఏసిడ్’. ఇదే విధంగా ‘నవ’కి ‘ఆమ్లం’ తోక తగిలిస్తే ‘నవామ్లం’ వచ్చింది. ఇదే ‘ఎమీనో ఏసిడ్’కి నేను పెట్టిన తెలుగు పేరు!
ఈ నవామ్లాలు జీవ రసాయన శాస్త్రం (బయోకెమిస్ట్రీ)లో కొత్తగా ఆవిష్కరణ చెందిన ఆమ్లాలు. ‘నవ’ అంటే సంస్కృతంలో ‘కొత్త’ అనే అర్థం కూడ ఉంది కనుక ‘నవామ్లాలు’ కొత్త ఆమ్లాలు అనే అర్థం కూడా వస్తోంది. వీటి గురించి చాలా విపులంగా ‘ప్రాణి ఎలా పుట్టింది’ అనే పుస్తకంలో రాసేను. ఆ పుస్తకం ప్రతులు ఇప్పుడు కినిగెలో దొరుకుతున్నాయి.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా