S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీరాముడి శోకం (అరణ్యకాండ)

ప్రియురాలినీ, ఆమెకు కలిగిన ఆపదనూ స్మరించడం వల్ల కలిగిన పరవశత్వంతో ప్రియ విరహం వల్ల కలిగిన శోకంతో, తనకు కలిగిన దుఃఖాన్ని తనలాగే శోకిస్తున్న తమ్ముడు లక్ష్మణుడితో రామచంద్రమూర్తి ఇలా అన్నాడు.
‘శోకం మీద శోకం విశేషంగా ప్రాప్తించి నా గుండెలు పగిలేటట్లు కలవర పరుస్తున్నాయి. ఈ లోకంలో నాలాంటి మహాపాపి మరొకరు ఉండరు. పూర్వజన్మలో నేను విస్తారంగా ఎన్నో పాపాలను చేసిన కారణాన ఈ జన్మలో వాటి ఫలితంగా పెద్ద దుఃఖం మీద దుఃఖంలాగా ఇలా సంభవించింది. ఒకటి వెంట ఇంకొక కష్టం ఏమిటంటే.. చెప్తా విను.. మొదటిది.. న్యాయంగా రావాల్సిన రాజ్యం నాకు రాకపోవడం. ఆ కారణాన నా మేలు కోరిన ముఖ్య బంధువులందరినీ వదలడం. నా కొరకై తండ్రి చావడం. తల్లిని దిక్కులేనిదానిగా చేసి నేను అడవులకు రావడం. ఇవన్నీ ఈ శరీరాన్ని దహించి వేస్తున్నాయి. ఇప్పుడు భార్యను పోగొట్టుకోవడంతో అవన్నీ జ్ఞాపకానికి వచ్చి రగులుతున్న అగ్నికి కట్టెలు చేర్చినట్లై భగ్గున మండుతున్నాయి. ఎవడో రాక్షసుడు బలాత్కారంగా ఈడ్చి పట్టుకుని ఆకాశాన పరుగెత్తగా భయపడ్డ సీతాదేవి మారుపడ్డ గొంతుతో దిక్కులేనిదానిలాగా ఏడవకుండా ఉంటుందా? బలవంతంగా తీసుకొని పోయి ఏం చేయగలడు? వశపర్చుకోవడం సాధ్యంకాని పని. కాబట్టి కోపంతో చంపి వుండవచ్చు. చంపి, ఎర్ర చందనం పూయడం వల్ల, అందమైన, మనోహరమైన ఆమె కుచాలు నెత్తురు ధారలు కారేట్లు ఎవరో దుష్టుడు చేస్తే ఆమె అందం చెడిపోయిందేమో? మృదువైన ఆమె తీయటి మాటలు, ఆ నల్లటి వెంట్రుకలు, అందమైన ముద్దులుకారే ముఖం, రాహువు చేతిలో చిక్కి దుఃఖపడే చంద్రుడిలాగా కాంతిహీనమై పోయిందేమో?’
‘ముత్యాల హారాలు వేలాడే ఆమె మెడను చీల్చి నీచమైన మనస్సు కలవారెవరైనా ఆమె నెత్తురు తాగారేమో? నేను ఒంటరిగా అడవిలో నడిచిపోయిన కారణాన రాక్షసులు హింసిస్తే ఆమె ఏడవకుండా ఉంటుందా? ఇది గోదావరీ నది. దీని మీద సీతకు అమితమైన ప్రేమ. ఇక్కడికి ప్రతిరోజూ వస్తుంది. ఇక్కడున్నదేమో? వుండదు. ఎందుకంటే ఎన్నడూ ఇక్కడికి ఒంటరిగా రాలేదు. పద్మం లాంటి ముఖం, పద్మం లాంటి కళ్లు గల పద్మిని, సీతాదేవి, పద్మాల కోసం గోదావరీ నదికి వచ్చిందేమో? ఒంటరిగా ఎన్నడూ ఇల్లు విడిచి వెళ్లని సీత ఇవ్వాళ ఇక్కడికి వస్తుందా? రాదు. అసమానమైన పూల సమూహాలతో అందంగా, ఆడే తుమ్మెదలు, ఆడే చిలుకలు, పక్షులు వున్నా ఈ పూల పొద దగ్గరికి వచ్చిందేమో? వచ్చి ఉండదు. ఎందుకంటే, సీత పిరికిది.. ఒంటరిగా రావడానికి ప్రయత్నం చేయదు.’
ఇలా వెతికి వెతికి ఎక్కడా సీతను చూడలేక జగచ్ఛక్షువు కాబట్టి, తన వంశానికి మూల పురుషుడైన సూర్యుడిని అడగడం ప్రారంభించాడు. ‘రవీ! నీకు నమస్కారం. లోకంలోని అందరి సత్య ప్రవర్తన, అసత్య ప్రవర్తన తెలిసినవాడివి కదా! నా భార్య ఎక్కడికి పోయింది? ఎవరైనా ఎత్తుకుపోయారా? చెప్పు’
ఆకాశాన వున్న సూర్యుడికి భూమీద గృహాలలో జరిగే విషయాలు చూసి ఉండకపోవచ్చని వాయు దేవుడిని అడగసాగాడు. ‘వాయుదేవా! నీకు తెలియని విషయం లోకంలో లేదు. సీత మరణించిందా? లేక ఎవడైనా అపహరించాడా? ఈ అడవుల్లో ఎక్కడైనా చిక్కుకుని దారి తెలియక ఇబ్బందుల్లో పడిందా? ఆలస్యం చేయకుండా చెప్పు’
ఈ విధంగా రామచంద్రమూర్తి విలపిస్తుంటే ధైర్యవంతుడైన లక్ష్మణుడు రాముడిని ఊరట పరచటానికి కాలానుగుణమైన కొన్ని మాటలు చెప్పాడు ఇలా. ‘అన్నా! ఏడవవద్దు. సంతాపంతో శుష్కించి విచారించవద్దు. ధైర్యంగా ఉండు. శోకంతో కృశించవద్దు. స్ర్తిరత్నమైన సీతాదేవిని వెతుకుదాం. మహాత్ములైన వారు కష్టమైన పనులు చేయడానికి కొంచెం కూడా బాధపడరు.’
(స్ర్తి పురుషుల సంయోగం వల్ల కలిగిన దేహం భగవంతుడికి లేదు. అయినా విష్ణుమూర్తి ఇతర అవతారాలలాగా కాకుండా రామావతారం దోష రహితమై, చైతన్యం కలదై, నిత్య సుఖ స్వరూపమైన తన శరీరాన్ని ప్రకాశించేట్లు చేసింది. రామచంద్రమూర్తిలో రావణుడికి భగవంతుడనే బుద్ధి లేకుండా చేసి వాడికి మోక్షం లేకుండా చేయడమే రామచంద్రుడి శోకానికి ఫలం అని చెప్పడం జరిగింది. రావణుడి చేత సీను అపహరించేట్లు చేయడం, వాడి పుణ్యాన్ని నాశనం చేసి, వాడిని తన చేతిలో చంపబడేట్లు చేయడమే. గొప్ప తపస్సు చేసి సంపాదించిన బలం కల రావణుడిని అంతకంటే అధిక తపోబలం లేకుండా చంపడం సాధ్యపడదు. దేవతలు అంతకంటే ఎక్కువ తపస్సు చేయలేరు. కాబట్టి, వాడికి అనుచితమైన అనురాగం సీత మీద కలిగించి, దానివల్ల వాడిని మోహితుడిని చేసి, రావణుడి తపశ్శక్తి నాశనం చేసి, దేవతలా కార్యం సాధించాలని లక్ష్మీదేవితో కలిసి ఆలోచించి సీతతో సహ అవతరించాడు విష్ణువు.
రామచంద్రమూర్తి మాయామానుష వేషధారి అని అంగీకరించాలి. కర్మబద్ధులై జన్మించిన ప్రాకృత జనులు ఎలా ప్రవర్తించారో ఆయనా అలానే చేశాడు. భార్య మీద ప్రేమగల మనుష్యులు ఆమెను పోగొట్టుకుంటే ఎలా ఏడుస్తారో రాముడు కూడా అలానే చేశాడు. కన్నీరు కార్చడం, ఏడవడం, సత్యమే కానీ అది తామస శోకం వలన కలిగింది కాదు.
జయ విజయులకు మూడో జన్మలో కానీ ముక్తి లేదనే విషయం భగవంతుడికి తెలుసు. రావణ కుంభకర్ణులది రెండవ జనే్మ కాబట్టి ముక్తి లేదు. భగవంతుడు రావణుడికి మోక్షం లేకుండా చేయడానికి వాడికి దుర్బుధ్ధి పుట్టించి వాడితో ఒక అకార్యం చేయించి అది నెపంగా వాడిని వధించాడు. లోక శిక్ష కోసం వచ్చినవాడు కదా భగవంతుడు.

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 036558799 08644-230690
-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12