S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చుక్కలతో చక్కని చిత్రాలు!

చుక్కలతో చక్కటి మానవాకృతులను తీర్చిదిద్దడం చిత్రకారుడు మధు కురవ ప్రత్యేకత. ఇదో వినూత్న ప్రయోగం. సరికొత్త అందాల ఆవిష్కరణ. ఈ ప్రత్యేక శైలి - సొంత సిగ్నేచర్‌ను తెలిపే తీరు పేరు డాట్ పెయింటింగ్. ఇందులో కొంత నైరూప్యత తొంగి చూస్తుంది. వాస్తవికత లీలగా మెరుస్తుంది. మొత్తం మీద చిత్రకారుడి సృజనకు అద్దం పడుతుంది. ఈ చిత్రరచన మ్యాట్‌ను తలపిస్తుంది. చిన్నచిన్న గళ్లు.. పిక్సెల్స్ ఒకచోట చేర్చినట్టు ‘భ్రమ’ కల్పించేదే ఈ డాట్ పెయింటింగ్. మానవ ఆకృతులే గాక నేపథ్యంలో పుష్పాలు, లతలు, లేలేత గడ్డి, గడ్డిపూలు, చిన్న ప్రాణులు ప్రత్యక్షమవుతాయి. ఇవన్నీ ఒకే యూనిట్‌గా కనిపించడంలోనే ఆ చిత్ర రచనా సౌందర్యం బహిర్గతమవుతోంది. ఈ చిత్రాలకు లేత రంగులు, ముఖ్యంగా నలుపు - నీలం, గోధుమవర్ణం ఉపయోగించడంతో ఓ కొత్త అందం ఆవిష్కృతమవుతోంది. ఓ చిత్రంలో చిరుత చర్మం (డాట్స్) బిగుతుగా తొడుక్కున్న భ్రమను కల్పించే వ్యక్తి ఆకారం కనిపిస్తోంది.. అదంతా డాట్స్ మహిమ. ఈ మహిమతో మధు కురవ చిత్రకళా ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. ఇందులో శైలి ఉంది.. వస్తువుంది.. పనితనం (క్రాఫ్ట్) ఉంది.. పరిశ్రమ కనిపిస్తోంది.. సృజనాత్మకత దర్శనమిస్తోంది. వర్తమాన చిత్రకళా రంగంలో తనదైన ‘ముద్ర’ను వేసేందుకు ఈ సృజన ఉపకరిస్తోంది. వీటన్నింటిలో ఆకృతుల ఓవర్ లాపింగ్ (ఒకదానిపై ఒకటి) కనిపిస్తుంది. ఇది తనకెంతో ఇష్టమైన పద్ధతని చిత్రకారుడు చెబుతున్నారు.
పుష్కర కాలం క్రితం అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం పోట్రేట్ గీసి ఆయనకు అందజేసినప్పటి నుంచి మధు మదిలో ఈ శైలి బలపడుతూ ఉంది. ఆనాడు ఈ శైలిలో పరిపూర్ణత, పరిపక్వత, సృజనాత్మకత అంతగా లేకపోయినా అనంతరం ఆ ఆలోచన పుష్పించింది. కొత్త శైలిగా, ప్రయోగంగా అవతరించింది. చిత్రకారుడిగా దశాబ్ద కాలంలో ఎదిగిన వైనాన్ని ఈ డాట్ చిత్రాల తీరు పట్టి చూపుతోంది.
ఈ మధ్యకాలంలో మధు కురవ చిత్రకళా రంగంలో చాలా దూరం ప్రయాణం చేశారు. ఎన్నో మజిలీలను దాటారు.
అబ్దుల్ కలాం పోట్రేట్ వేసినప్పుడు తాను శాస్ర్తియ పద్ధతిలో చిత్రరచనను అధ్యయనం చేయలేదు. తాను వేసే బొమ్మలు మాత్రం కలాం లాంటి వారిని ముగ్ధుల్ని చేస్తున్నాయంటే ఈ రంగంలో మరింత లోతుగా అధ్యయనం, అభ్యాసం అవసరమని భావించి 2013 సంవత్సరంలో హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్‌ఏ కోర్సులో చేరారు. సహజంగా తనకున్న ‘ప్రతిభ’కు అక్కడ ఓ రూపం ఇచ్చారు. రంగుల రహస్యం తెలిపారు. శాస్ర్తియంగా చిత్రరచన నైపుణ్యాలను చూపారు. చిత్రకళ సౌందర్యాన్ని జీర్ణించుకునేలా చేశారు.
ఓవైపు చిత్రకళ అధ్యయనం.. అభ్యాసం కొనసాగిస్తూనే అదే సంవత్సరం జూబ్లీహిల్స్‌లోని ‘బియాండ్ కాఫీ షాప్’లో పెన్సిల్, ఎక్రలిక్, మిక్స్‌డ్ మీడియాలో గీసిన 33 చిత్రాలతో ‘సోలో షో’ నిర్వహించారు. దీని శీర్షిక పేరు ‘ఆర్టిస్టిక్ స్ట్రోక్స్’. శీర్షికకు తగ్గట్టుగా ఆ ‘స్ట్రోక్స్’ వీక్షకుల్ని అబ్బురపరిచాయి, అలరించాయి. ఆర్ట్ విద్యార్థిగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం అరుదైన విషయం. తొలి చిత్రకళా ప్రదర్శన అలా విజయవంతమైంది. అది లగాయతు మధు కురవ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.
ఓవైపు ఆర్ట్ విద్యార్థిగా కొనసాగుతూ మరోవైపు మాదాపూర్‌లో ఆర్ట్ అకాడెమీని స్థాపించి పిల్లలకు పెద్దలకు చిత్ర రచనా విధానాన్ని బోధించడం ప్రారంభించారు. అదే సమయంలో వివిధ చిత్రకళ గ్రూప్ షోలలో పాల్గొనసాగాడు. ఇలా ‘మల్టీటాస్క్’లతో చిత్రకళా రంగమే సర్వస్వమై, అదే తిండి, అదే నిద్ర, అదే విశ్రాంతి అన్న ధోరణిలో ఆయన ముందుకే కదులుతున్నారు.
డాట్ సీరిస్‌తో పాటు ఆయన వుడ్‌కట్, లినో, డ్రైపాయింట్‌లో బొమ్మలు సృజించడంలో పూర్తి పట్టును సాధించారు. వాటర్ కలర్స్, ఆయిల్, అక్రలిక్, పెన్ ఇంక్, పెన్సిల్, చార్‌కోల్‌తో మిక్స్‌డ్ మీడియాగా తన బాల్య స్మృతులను కాన్వాసుపై, కాగితంపై తర్జుమా చేశారు. అధివాస్తవిక (సర్రియలిస్టిక్) పద్ధతిలో పలు బొమ్మలు గీశారు. వీటిలో ప్రయోగాలకే ఆయన ప్రాణం పెట్టారు. ఇందులో గ్లాస్ రిఫ్లెక్షన్స్ (ప్రతిబింబం) అన్న సీరీస్ చెప్పుకోదగ్గది. చిత్రకారుడు తన రంగుల, నైరూప్య, నైపుణ్య జ్ఞానాన్నంతా వ్యక్తీకరించేదిగా ఈ సీరీస్ నిలిచింది. ‘ప్రతిబింబం’ అన్న మాటలోనే అధివాస్తవికత ధ్వనిస్తుంది. గ్లాస్‌లో రంగులు ప్రతిబింబించడమంటే అదో అద్భుత లోకంగా దర్శనమిస్తుంది. ఆ లోకం మధు కురవ పెయింటింగ్స్‌లో దర్శనమిస్తోంది.
వుడ్‌కట్‌లో వర్షం రాత్రి.. తుపాను ప్రభావం, మనుషుల అవస్థ ప్రతిభావంతంగా చిత్రబసును తలపిస్తారు. ప్రజల కష్టాలు కన్నీళ్లను ప్రభావశీలంగా వ్యక్తం చేసేందుకు ఈ మాధ్యమం ఎంతో శక్తిమంతంగా ఉపయోగపడుతోంది. చిత్రకారుడు ఆ ‘కిటుకు’ను గ్రహించి కాగితంపై ఆ బీభత్సరస ప్రధాన దృశ్యాన్ని చిత్రించారు. అలాగే ‘వుమెన్’ శీర్షికన మరో వేదనాభరిత దృశ్యాన్ని చిత్రిక పట్టారు.
పెన్సిల్‌తో మదర్ థెరిస్సా ముడతలు పడిన ముఖాన్ని ఎంతో ప్రతిభావంతంగా ఆయన గీశారు. తనతోటి చిత్రకారులతో కలిసి ఆ బొమ్మను ప్రదర్శనకు పెట్టి ప్రశంసలందుకున్నారు.
కాన్వాస్‌పై ఆయిల్ కలర్స్‌తో ‘లాండ్‌స్కేప్’ శీర్షికన గీసిన ప్రకృతి దృశ్యం ‘మై ఫ్రెండ్’ శీర్షికన గీసిన ఓ చెట్టు బొమ్మల్లో మధు నైపుణ్యం - సృజన, నీలి రంగులో మనసును దోచే శైలి స్పష్టంగా కనిపిస్తోంది.
డ్రై పాయింట్ ఎచ్చింగ్ పద్ధతిలో నగరంలోని భవనాలు, హోర్డింగ్‌లు, సెల్ టవర్లను చిత్రికపట్టారు.
పాలమూరులోని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో 1980 సంవత్సరంలో ఓ వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన మధు కురవ ఉన్నత పాఠశాల విద్య స్వగ్రామంలో జరిగింది. ఐటిఐ విద్య కోసం ద్రోణాచలం వెళ్లగా అక్కడ చిత్రకళపై ఆసక్తి పెరిగి స్థానిక చిత్రకారుడి పరిచయంతో అది వృద్ధి చెంది ‘తీరని దాహం’గా పరిణమించింది. దాంతో డ్రాయింగ్‌లో లోయర్ హయ్యర్ పూర్తి చేసి కొంతకాలం డ్రాయింగ్ టీచర్‌గా పని చేసినా ఆ ‘దాహం’ తీరకపోవడంతో హైదరాబాద్‌కొచ్చి యానిమేటర్‌గా కొంతకాలం పనిచేసి, తన ఆలోచనలకు రంగులద్దుతూ, డ్రాయింగ్ ట్యూషన్స్ చెబుతూ తన ప్రస్థానాన్ని మరింత అర్థవంతంగా కొనసాగించేందుకు 2013 సం.లో బిఎఫ్‌ఏలో చేరారు. అనంతరం ఆలోచనల నిండా రంగులు పులుముకుని తిరుగుతున్నారు. గత సంవత్సరం (2018) హైదరాబాద్‌లో జరిగిన అనేక గ్రూప్ షోలలో ఆయన తన చిత్రాలను ప్రదర్శించారు. 2017 సం.లో తంజావూర్‌లో జరిగిన ప్రచిత్ర ప్రదర్శనలోనూ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసలందుకున్నారు.
అమెరికా, యూరప్‌లోని పలుచోట్ల వీధుల్లో చిత్రకళ ప్రదర్శనలు (స్ట్రీట్ ఎగ్జిబిషన్స్) జరిపిన పద్ధతిలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో మధు కురవ తన మిత్రులతో కలిసి వీధిలో తన చిత్రాల ప్రదర్శన నిర్వహించి ఓ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. అలా వచ్చిన ధనాన్ని దాతృత్వ కార్యక్రమాలను అందజేయడం కొసమెరుపు. అలా కేరళ వరద బాధితులను, వృద్ధాశ్రమాలను ఆదుకుని తన ఔదార్యాన్ని మధు కురవ చాటుకుని చిత్రకారులు స్పందించే గుణం కలవారని లోకానికి చాటారు. తన రంగుల లోకంలో ఈ వాస్తవలోకానికి ఎంతో చోటుందని చాటుతూ చుక్కలతో చిత్రకళలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మధు.

మధు కురవ 9666955182 9959571240

-వుప్పల నరసింహం 99857 81799