S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హిట్లర్ పుట్టలేదు

ఒక అమ్మాయి - ఇద్దరు అబ్బాయిలు.
అమ్మాయి అనూరాధ, అబ్బాయిలు రామకృష్ణ, వంశీకృష్ణ.
ముగ్గురూ విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. అబ్బాయిలకు ఉద్యోగాలు దొరికాయి. రామ్‌కి హైదరాబాద్‌లో. వంశీకి చెన్నైలో. విజయవాడలోనే ఉంటున్న అనూరాధ మాత్రం ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. శని ఆదివారాలు ముగ్గురూ విజయవాడలో కలుస్తూనే ఉంటారు.
రామ్ అరటి పండులాంటివాడు. బయట మృదువు. లోన మధురం. కానీ వంశీ పనసపండు లాంటివాడు. బయట రఫ్. లోన తొనలు మధురాతిమధురం. రాధ ఇద్దర్నీ ప్రేమిస్తోంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది ఎడతెగని సమస్య.
‘రాముడు మంచి బాలుడు. దుష్టులకు దూరంగా ఉండవలెను అని చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. నీకు తగిన వాడు రామ్ మాత్రమే. వంశీ కాదు’ అని ఫ్రెండ్స్ మాట. ఒక్క మానస తప్ప.
‘రఫ్‌గా కనిపించే వాళ్లంతా రౌడీలు కారు. వంశీ మాట పడడు. ఎవరితోనైనా తగవుకి రెడీ అయిపోతాడు. అవసరం అయితే కొడతాడు కూడా. అయితే అతని జగడాలన్నీ న్యాయం కోసం. అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేడు. అతడు ఏ అమ్మాయినైనా అవమానించగా చూశావా? అతడ్ని ఆడిపోసుకోవడం తగదు’ అంటూ వెనకేసుకొచ్చే ఏకైక అమ్మాయి మానస!
ఆమె మరో మాట కూడా అంది. ‘నువ్వు వంశీని పెళ్లి చేసుకోకపోతే వదిలెయ్. నేను చేసుకుంటా!!’
అదో జోక్‌గా తీసుకొని అప్పటికి నవ్వేసింది రాధ.
రాధ తల్లిదండ్రులు కూడా రామ్‌కే ఓటు వేశారు. ఎందుకంటే రామ్ మంచి బాలుడు. తమకు దగ్గరగా మన తెలుగు రాష్ట్రంలోనే హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. రాకపోకలు సులభం. మరి వంశీ రౌడీలాగ రఫ్‌గా ఉంటాడు. మాట పెళుసు. పనిచేసేది చెన్నైలో. దూరం. పరాయి రాష్ట్రం రాకపోకలు అంత ఈజీ కాదు అని వారి అభిప్రాయం.
రాధకు ఒకటే గుంజాటన. చివరకు ఆ గుంజాటనతోనే నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ఫోన్ ద్వారా రామ్‌కి గ్రీన్ సిగ్నల్, వంశీకి రెడ్ సిగ్నల్ పంపింది.
తీరా సిగ్నల్ పంపాక భయం పట్టుకుంది. ఎందుకంటే వంశీకి కోపం ఎక్కువ. రెడ్‌సిగ్నల్ చూసి ఆ కోపంలో ఏమైనా చేయగలడని ఆమె భయం. కానీ - ఆ సిగ్నల్ చూశాడో లేదో గానీ బీభత్సంగా విరుచుకు పడతాడనుకున్న వంశీ నుంచి ప్రతిస్పందనే లేదు. తర్వాత అతని నుంచి ఫోన్‌కాల్స్ లేవు. తనని కలుసుకోనే లేదు.
సందేహం లేదు. అతనికి కోపం వచ్చిందని కొన్ని రోజులు గింజుకుంది రాధ. క్రమంగా అదీ మంచిదే అనిపించసాగిందామెకు.
అటు తర్వాత రాధకు హైదరాబాద్‌లోనే ఉద్యోగం దొరికింది. రామ్‌తో వివాహమూ జరిగింది. శుభలేఖ పంపినా వంశీ ఆమె పెళ్లికి రాలేదు.
రెండు నెలలు గడిచాక మానస, వంశీ పెళ్లి చేసుకున్నారని తెలిసింది రాధకు. కనీసం మానస అయినా శుభలేఖ పంపలేదు!
* * *
మంచితనం వల్ల కూడా సమస్యలుంటాయని పెళ్లయ్యాకే తెలిసింది రాధకు!
రామ్ మంచితనాన్ని అతని తల్లిదండ్రులు, అక్క సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారు. జీతం అంతా అమ్మ చేతిలో పోసి తన అవసరాలకు అమ్మను అడుక్కుంటాడు రామ్. వంద అడిగితే లక్ష ఆరాలు తీసి పాతిక ఇస్తుందామె. సినిమాలకు, షికార్లకు వెళ్లాలన్నా చివరకు పూలు కొనాలన్నా పొదుపు పాఠాలు చెప్తూందామె. ఆ ఇంట్లో ఆర్థిక సంబంధాలు తప్ప హార్దిక అనుబంధాలు లేవు అని అర్థం అయ్యాక తన జీతం అత్తగారి కివ్వటం మానేసింది రాధ.
దాంతో కొత్త సమస్యలు ప్రారంభమయినా రాధ వెనక్కి తగ్గలేదు.
హైదరాబాద్ సమీప పట్నం బోధన్‌లో ఉండే రామ్ అక్కగారు తరచుగా తమ ఇంటికి వచ్చేస్తుంది. బీరువా వెదికి తనకు నచ్చిన రాధ చీరలు, నగలు రాధకు చెప్పకుండా పట్టుకుపోతుంది. ఇంటి ఆడపడుచుగా ఆమెకు ఆ హక్కు ఉందని అత్తగారి సమర్థింపు! అమ్మకూ, అక్కకూ చెప్పలేక భార్యనే సర్దుకు పొమ్మని బతిమాలేవాడు బహు మంచి బాలుడు రామ్ - బెడ్‌రూం ఏకాంతంలో. సంపాదించేదీ, ఇచ్చేదీ మనం. అందుకు కృతజ్ఞత లేకపోగా పెత్తనం చెలాయించడం ఏమిటని బుస్సుమనేది రాధ. ఎవరినీ నొప్పించలేక, ఒప్పించలేక వౌనం వహించేవాడు రామ్. అమ్మ, అక్క చెప్పే ప్రతిదానికి తల ఊపడం మంచితనం కాదు. నీ చేతగానితనం అని భర్త మీద విసుక్కునేది రాధ. కోపగించుకునేది. కానీ ఏం లాభం? రెండేళ్ల కాపురంలోనే ఆమె కలలు కరిగిపోయాయి. జీవితం రంగు వెలసిన ఇంద్రధనుస్సులాగ నిస్సారం, నిస్తేజం అయిపోయింది. ఈ మాత్రానికి ప్రేమ వివాహం ఎందుకు?
ఇంటి సమస్యలు ఇలా ఉండగా కొత్త సమస్య దాపురించింది.
మనశ్శాంతి కోసం ఫేస్‌బుక్‌ని ఆశ్రయిస్తే దొంగ పేరుతో ఒక రోగ్ ఆమెకు అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. బహుశా ఆ రోగ్ తమ ఆఫీసులో పని చేస్తున్నవాడే అయి ఉండొచ్చని ఆమె అనుమానం. సైబర్ నేర విభాగానికి రిపోర్ట్ చేద్దామని రామ్‌కి చెప్తే ‘పరువు పోతుంది. అసలు ఫేస్‌బుక్ మూసెయ్’ అని సలహా ఇచ్చాడు ఆ మహా మంచి బాలుడు!
మొదటిసారి భర్త మీద
పట్టరాని కోపం వచ్చిందామెకు. అతడు మంచితనం ముసుగేసుకున్న పిరికివాడు. చేతగాని వాడు అనిపించింది.
‘ఫేస్‌బుక్ మానేసి కళ్లు మూసుకుంటే సమస్య తీరిపోతుందా?’ గద్దించింది. ఆ తీవ్రతకు ఖంగుతిన్న రామ్ రెండు రోజులు వౌనం పాటించి మూడోరోజు ‘మనం ఇక్కడ ఉద్యోగం మానేసి బెంగుళూరులో కొత్త ఉద్యోగాలు చూసుకుందాం’ అన్నాడు. అదే అన్ని సమస్యలకు పరిష్కారం అయినట్టు. ఆ సలహా ఆమెకు నచ్చలేదు.
‘పారిపోతే సమస్య తీరదు’ అంది దృఢంగా.
‘కొత్త వాతావరణంలో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితం ప్రారంభిద్దాం’ అన్నాడు బతిమాలే స్వరంలో. సమస్య పరిష్కారం అయినా కాకపోయినా కొత్తచోట అత్త ఆరళ్లు, ఆడపడుచు ఆగడాలు ఉండవని సరే అంది రాధ.
* * *
ఒక నెల గడిచాక మిత్రుల సహకారంతో బెంగళూరులో ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో మంచి ఉద్యోగాలే సంపాదించారు.
రాధ పనిచేసే కంపెనీ బెంగళూరుకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. కంపెనీ బస్సులోనే రాకపోకలు. అర్ధరాత్రి వరకు డ్యూటీ చేయాల్సి వస్తే కంపెనీ కారులో ఇంటికి దిగబెడతారు. అయితే మధ్యలో రెండు కిలోమీటర్ల మేర డార్క్ జోన్. దీపాలుండవు. రాత్రిపూట ఆ రూట్‌లో జన సంచారమే ఉండదు. రోడ్డుకి రెండు పక్కలా పెద్దపెద్ద చెట్లూ, పొదలూ-
అత్త, ఆడపడుచుల రంధి లేకపోవడంతో బెంగళూరులో రాధ జీవితం హాయిగా సాగుతోంది.
కానీ ఓ అర్ధరాత్రి కంపెనీ కారులో రాధ ఇంటికి వెళ్తుండగా కారు హఠాత్తుగా ఆగిపోయింది. హెడ్‌లైట్స్ కాంతిలో రోడ్డుకి అడ్డంగా ముగ్గురు భయంకరమైన రౌడీలు! కారు ఆగగానే ఒక రౌడీ డ్రైవర్‌ని బయటకు లాగి తన్ని తగిలేశాడు. తర్వాత రాధను కిందకు లాగాడు. ఆమె భయంతో, సిగ్గుతో, అవమానంతో విలవిలలాడింది. భయ విహ్వలతతో పెనుగులాడుతోంది. అరిచింది. కరిచింది. కానీ వాడి విజృంభణని ఎదుర్కోలేక పోతోంది.
హఠాత్తుగా బైక్ మీద రామ్ వచ్చి బైక్ ఆపాడు. పారిపోయిన డ్రైవర్ చెట్టు చాటు నుంచి ఫోన్ చేసి రామ్‌కి విషయం చెప్పడం వల్ల-
రామ్ బైక్ దిగీ దిగగానే రెండో రౌడీ బలం అంతా ఉపయోగించి అతని చెంప ఛెళ్లుమనిపించగా అంత దూరంలో ఎగిరిపడ్డాడు రామ్. పడినవాడు పడినట్టే ఉండిపోయాడు. లేవలేకపోయాడు.
అటు పడిపోయి లేవలేకపోతున్న భర్త, ఇటు ముష్కరుల చేతిలో నలిగిపోతున్న తను. నరకయాతన అనుభవిస్తూ భగవంతుని తలచుకుంది రాధ. ఇంతలో బైక్ వస్తున్న శబ్దం. ముష్కరులు చేష్టలుడిగి కాసేపు ఆగారు. బైక్ తమని దాటి కాస్త ముందుకెళ్లి వెనక్కి వచ్చింది. ‘హెల్ప్! హెల్ప్!’ అరిచింది రాధ.
బైక్ మీద ఒక పురుషుడు. ఒక స్ర్తి.
బైక్ దిగి అక్కడికొచ్చి విలవిలలాడుతున్న రాధను చూశారు. లేచి నిలబడలేని రామ్‌ని చూశారు. రౌడీలను చూశారు.
‘కాపాడండి! ప్లీజ్! కాపాడండి’ అరుస్తోంది రాధ నమస్కరిస్తూ.
కఁయ్‌మని అరుస్తూ ఆమె అంత ఎత్తుకి ఎగిరి కరాటే కిక్‌లతో ఇద్దరు రౌడీలను పడగొట్టడం, అతడు బాక్సింగ్ పంచ్‌తో మూడో రౌడీని పడకొట్టడం, చెట్టు వెనక దాగిన డ్రైవర్ పరుగున వచ్చి కారెక్కి ఇంజన్ స్టార్ట్ చెయ్యడం, అతడు రివ్వున రామ్ వద్దకు పరిగెత్తి అతడ్ని కారు వద్దకు నడిపించి కారులోకి తోయడం, ఈలోగా ఆమె రాధను కారులోకి తోయడం, కారు సర్రున ముందుకు దూసుకుపోవడం, ఆ కారు వెనకే వాళ్లిద్దరూ చెరొక బైక్ మీద దూసుకుపోవడం అన్నీ ఒక్క క్షణంలోనే జరిగిపోయాయి. రౌడీలు తేరుకొని లేచి చూస్తే వాళ్లు చాలా దూరం వెళ్లిపోయారు.
కారు దిగి రామ్, రాధ తాళం తీసి ఇంట్లోకి వెళ్లి లైట్ వెలిగించారు. కారు వెళ్లిపోయింది. బైక్‌లు పార్క్ చేసి అతడు, ఆమె ఇంటిలోకి అడుగుపెట్టారు.
వారిని చూసి ఆనందంతో కెవ్వున అరిచింది రాధ.
వాళ్లు మరెవరో కాదు - వంశీ, మానస! ఆరు నెలల క్రితమే వాళ్లు చెన్నై నుంచి బెంగళూరు వచ్చేశారట.
వచ్చే ఆదివారం తమ ఇంట విందుకు రమ్మని వీళ్లు వాళ్లని ఆహ్వానించారు.
* * *
ఆదివారం ఉదయమే మానస వంశీలు రామ్ ఇంటికొచ్చారు.
ప్రేమలు, పెళ్లిళ్లు కాలంనాటి వైమనస్యాలు కరిగిపోయి వెనుకటి మిత్రుల్లాగ ఆత్మీయ కబుర్లు గలగలా చెప్పుకొని కిలకిలా నవ్వుకున్నారు.
‘దేవుడే పంపినట్టు ఆ రాత్రి మీరు ఆ దారిన వచ్చి మమ్మల్ని కాపాడకపోతే నేనీపాటికి శవాల గదిలో ఉండేదాన్ని! ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలీడం లేదు’ కన్నీళ్లు పెట్టుకుంది రాధ.
‘నిజమే. దైవ సంకల్పంలాగే ఉంది. పెళ్లికి వెళ్లకూడదనుకుంటూనే వెళ్లాం. ఆ దారిన రాకూడదనుకుంటూనే వచ్చాం’ ఆమె వీపు తట్టి ఓదార్చింది మానస.
కాసేపు ఆ సంఘటన తలచుకుంటూ అందరూ వౌనంగా ఉండిపోయారు.
‘మంచితనం అంటే ఏమిటి?’ హఠాత్తుగా అడిగాడు వంశీ. ఇదేం ప్రశ్న? అన్నట్టు అందరూ అతని వైపు చూశారు గానీ ఎవరూ చెప్పలేదు.
ఓ క్షణం నిరీక్షించి మళ్లీ తనే అడిగాడు ‘ఎవరేం చెప్పినా తల ఊపడమా? కొట్టినా తిట్టినా అవమానించినా తలవంచుకొని పక్కదారిన పారిపోవడమా? మంచితనం అంటే ఏమిటి?’
ఈసారీ ఎవరూ మాట్లాడలేదు.
‘సరే. మరో విధంగా చెప్తాను. నాకు మొగమాటం లేదు. ఎదుటివారు బాధపడినా వారు నన్ను అవమానిస్తే ఆఫీసర్ అయినా సరే నిలదీస్తాను. అవసరం అయితే నాలుగు తగలనిస్తాను. కానీ అన్యాయాన్ని సహించను. నేను మంచివాడినా? కానా?’
ఏం చెప్తే ఏం తంటానో అని భయంతో ఎవరూ మాట్లాడలేదు. రాధ, రామ్‌ల గంభీర వదనాలు చూసి నవ్వేసిన వంశీ మరో ప్రశ్న సంధించాడు. ‘హిట్లర్ పుట్టలేదని ఒక గొప్ప ఆంగ్ల రచయిత అన్నాడు. ఎందుకలా అన్నాడు?’
హిట్లర్ పుట్టకపోవడం ఏమిటని అయోమయంలో పడ్డారు రాధ, రామ్.
కాసేపు వారి ముఖాలు చూసి నవ్వుకొని వివరించాడు వంశీ. ‘అందరు పిల్లల్లానే హిట్లరూ పుట్టాడు. అందరి లానే పెరిగాడు. ఆ వయసు పిల్లల్లో ఉండే పెంకితనం, అల్లరి, కోపతాపాలు, అలకలూ వాడిలోనూ ఉన్నాయి. అయితే వాడి చుట్టూ ఉన్న మిత్రులు వాడేం చేసినా వం పాడుతూ మెచ్చుకుంటూ ఉండేవారు. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పి మందలించే వాళ్లే లేకపోయారు. క్రమక్రమంగా వాడిలో దుర్మార్గం పెరిగింది. మందలించి, నాలుగు తగలనిచ్చి సక్రమ మార్గంలో పెట్టేవారే లేకపోవడంతో వాడు చివరకు నియంతగా మారాడు. చిన్నప్పుడే వాడిని నియంత్రించి ఉంటే వాడు నియంత అయేవాడు కాదు. అందుకే హిట్లర్ పుట్టలేదు. తయారయాడు అని ఆ రచయిత ఉద్దేశం.’
రాధ, రామ్‌లు తలలు వంచుకొని వింటున్నారు. మానస భర్తనే చూస్తున్నది.
అందరివైపు ఓసారి చూసి వంశీ కొనసాగించాడు. ‘మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆడ నగ్న చిత్రాలకు మానస ముఖం తగిలించిన ఫొటోలతో అసభ్య మెయిల్స్ వచ్చేవి ఆమెకి...’
రాధ, రామ్ ఉలిక్కిపడి అతని వైపు చూశారు. వంశీ నవ్వేసి ‘నాకు తెలిసిన సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ద్వారా ఆ మెయిల్స్ పంపుతున్నది మానస ఆఫీసులోనే పని చేస్తున్న ఆంజనేయులు అని తెలిసింది. నేను వాళ్ల ఆఫీసుకెళ్లి అంజిగాడి జుట్టు పట్టుకుని చెంప మీద ఛెళ్లుమని వాయగొట్టాను. చుట్టూ ఉన్న అందరూ నిశే్చష్టులై చూస్తూ ఉండిపోయారు. అతగాడు చేసిన ఘనకార్యం అందరికీ చెప్పేశాను. అంజిగాడి తలవాలిపోయింది. అంతే. ఇంటికి పారిపోయి రాజీనామా పంపి హైదరాబాద్‌కి పోయాడు’ గొప్పగా చెప్పాడు.
రాధ భర్త వైపు చూసింది. అతని తల వాలిపోయింది గతం జ్ఞాపకం వచ్చి.
వంశీ మాట్లాడుతూనే ఉన్నాడు. ‘స్వీట్లు ఎక్కువగా తింటే మధుమేహం దాపురిస్తుంది. అలాగే మనసులో మంచితనం పేరుకుపోతే అది చేతగానితనంగా పరిణమించి మన చుట్టూ దుర్మార్గం పెరుగుతుంది. వీధికొక కీచకుడు పేటకొక హిట్లర్ తయారవుతారు. మంచితనం అంటే చేతులు ముడుచుకొని కూచోడం కాదు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు చూస్తూ దూరంగా పారిపోవడం కాదు. రాముడు మంచివాడే. దుర్మార్గుడైన రావణుని చంపాడు. పాండవులు మంచివారే. ధర్మరక్షణ కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. అందుకని వాళ్లని దేవతలుగా భావించుకొని పూజిస్తాం. వాళ్లు చేసిన పనే నేను చేస్తే మాత్రం నన్ను రౌడీ అంటారు. చీదరించుకుంటారు!’ అంటూ గలగల నవ్వేశాడు.
రాధ, రామ్‌లు నవ్వలేదు. వంశీ ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ఆలోచిస్తున్నారు. వారి హృదయాల్లో ఏదో నిర్ణయం రూపుదిద్దుకుంటోంది.
* * *
నిజమే. హిట్లర్ పుట్టలేదు. తయారయాడు. పరిస్థితులు వాడు నియంతగా మారడానికి సహకరించాయి. తర్వాత వాడూ చచ్చాడు.
పుట్టుకతో ఎవరూ దుర్మార్గులు కారు.
ప్రజలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ దుర్మార్గాన్ని అంతం చేయడానికి, కనీసం అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే ప్రపంచంలో హిట్లర్‌లు తయారవరు. కీచకులు, రావణులూ తయారవరు. దేశం క్షేమంగా ఉంటుంది. ప్రజలూ క్షేమంగా ఉంటారు.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

ప్రఫుల్ల చంద్ర.. 8919875019