S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బతుకుపాటకు కొత్త చరణం!

కొమ్మల చేతులు చాచి పచ్చగా నిల్చున్న చెట్టు
పెనుగాలికి పెళపెళా విరిగిపోతుంది
అప్పటి వరకూ దూరంగా తరమబడిన ఎండ
నిప్పులు చిమ్ముకుంటూ దాడిచేస్తుంది
గొడుగులా విస్తరించిన కొమ్మలు కూలపోవడంతో
అక్కడంతా శూన్యం అనంతంగా విస్తరిస్తుంది!
నేలపై కూలిపోయిన చెట్టు
నిస్తేజంగా కన్నీటి నదిలో మునిగిపోదు
నిశ్శబ్దంగా పోరాడుతుంది
తనలోని జీవాన్నంతటినీ కూడగట్టుకొని
ఒక చిట్టి చిగురుకు ప్రాణం పోస్తుంది
వందల అడుగుల లోతు నుండి
ఒక్కొక్క నీటి చుక్కనీ మోసుకొచ్చి
చిగురు నోటికి అందిస్తూ
ప్రాణం పెట్టి పోషిస్తుంది
ప్రపంచానికి తన కష్టం చెప్పుకోదు
ఇంత కష్టపడుతున్నానని గొప్పలు పోదు
మళ్లీ దృఢంగా తలెత్తి ఆకాశానికేసి చూడ్డానికి
కొమ్మల్ని కదిపి అందంగా నవ్వడానికి
సర్వశక్తులూ ఒడ్డుతుంది
విశ్వ ప్రయత్నాలు చేస్తుంది
నేల తల్లి గర్భం నుండి మొలకెత్తినప్పటి
మొట్టమొదటి పాఠాన్ని
కూలిపోయిన ప్రతిసారీ
చెట్టు మళ్లీ మళ్లీ వల్లె వేస్తూనే ఉంటుంది!
మన ప్రక్కనే నిలబడి
మహర్షిలా మనకు జీవన వేదం బోధిస్తుంటుంది
కళ్లు మూసుకుని వెళ్లిపోతుంటాం కానీ,
చెట్టుకేసి చూస్తే.. వేదం వినబడుతుంది
బ్రతుకు పాటకు
సరికొత్త చరణం ఒకటి ప్రతిసారీ జతవుతుంది!

-సాంబమూర్తి లండ 9642732008