S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బృహత్ బణువు

తెలుగు భాషలో అణువుకీ, పరమాణువుకీ మధ్య తేడా ఉందో లేదో తెలియకుండా అంతా గజిబిజిగా తయారయింది.
ఇది మొదట్లో మొదలెడితే కానీ తేలే విషయం కాదు.
మీరెవ్వరైనా, ఎప్పుడైనా పరమాణు బాంబు గురించి విన్నారా? పరమాణు విద్యుత్ కేంద్రం గురించి విన్నారా?
గ్రీకు భాషలో ‘అ’ అనే పూర్వప్రత్యయం ‘కానిది’ అనే అర్థాన్ని ఇస్తుంది. సంస్కృంలో అశుభ్రం అంటే ‘శుభ్రం కానిది’ అయినట్లు, గ్రీకు భాషలో ‘తోమోస్’ అంటే ‘కత్తిరించు’ అనే అర్థం వస్తుంది. ఈ రెండింటిని సంధించగా వచ్చిన మాట ‘అతోమోస్’ అంటే కత్తిరించడానికి వీలు కానిది లేదా అవిభాజ్యం. ఈ ‘అతోమోస్’ లోంచి వచ్చిన ‘ఏటం’ (atom) అంటే విభజించడానికి వీలు పడనంత చిన్న పదార్థం.
గ్రీకు, సంస్కృతం జ్ఞాతి భాషలు. సంస్కృతంలో ఈ రెండు మాటలని పోలిన మాట ‘ఆత్మ’. ఈ ఆత్మ స్వభావం ఎటువంటిదో ఋగ్వేదంలో వచ్చే నారాయణ సూక్తం ఇలా చెబుతుంది.
‘నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా
తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః’
అంటే, ఆత్మ అణు ప్రమాణంలో, మన హృదయ పీఠంలో వ్యవస్థితమై ఉంటుందని చెబుతోంది. ఈ వేద మంత్రాన్నిబట్టి అణువు అనే మాట వేదంలో ఉండడమే కాకుండా ఆత్మకి అణువుకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది కదా!
భగవద్గీత ఏమంటోంది?
‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి, నైనం దహతి పావకా’
అనగా (అణు ప్రమాణంలో ఉన్న) ఈ ఆత్మని కత్తితో కొయ్యలేము. మంటలో వేసి కాల్చలేము.
ఆధునిక శాస్త్రంలో ‘ఏటం’ అన్న ఇంగ్లీషు మాటకి డాల్టన్ ఇచ్చిన నిర్వచనం కూడ ఇదే గనుక అణు ప్రమాణంలో ఉన్న ఆత్మకి అణువుకి మధ్య ఉన్న పోలికని బట్టి ‘ఏటం’కి అణువు సమానార్థకమైన తెలుగు మాట అని మనం నిర్థారించవచ్చు.
సా.శ.1808లో బ్రిటీష్ వాడైన జాన్ డాల్టన్ ఏమన్నాడు? ప్రతి రసాయన మూలకానికి తనదైన ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన (అనగా, విభజించడానికి వీలు కాని) అణు (atom) రూపం ఉంటుందనిన్నీ, ఈ స్థూల ప్రపంచంలో మనకి తారసపడే ప్రతి వస్తువు ఈ అణువులు సమ్మేళనమే అని అభివర్ణించేడు. కనుక ఇంగ్లీషులో ‘ఏటం’ అన్న మాటకి తెలుగులో అణువు అన్నదే సరి అయిన అనువాదం.
మనకి అణువుల గురించి చాలా తెలుసు. సా.శ.1896లో, యూరోప్‌లో, హెన్రీ బెక్విరల్, మరీక్యూరీ, పియేర్ క్యూరీ ప్రకృతి సిద్ధంగా జరిగే ‘రేడియో ధర్మం’ అనే ప్రక్రియని అధ్యయనం చేస్తూ ‘కత్తిరించడానికి కూడా వీలు పడని సూక్ష్మాతి సూక్ష్మమైన అణు రూపం’ అని మనం అభివర్ణిస్తున్న అణువు లోపల అంతర్గతమైన నిర్మాణశిల్పం ఉందనే భావానికి పునాదులు వేసేరు.
సా.శ.1897లో బ్రిటన్‌లో, కేథోడ్ కిరణాల మీద పరిశోధన చేస్తున్న జె.జె.్థంసన్ ఏమన్నాడంటే కేథోడ్ కిరణాలు నిజానికి విద్యుత్ తత్త్వం పూనిన, ఉదజని అణువు కంటే చిన్నవయిన, రేణువులు అన్నాడు. ఈ రేణువులకి తరువాత ‘ఎలక్‌ట్రానులు’ (electrons) అని పేరు పెట్టేరు. అనగా అణువులో ‘ఎలక్‌ట్రానులు’ అనే రేణువులు ఉన్నాయి! అణువుని కత్తిరించి లోపల చూడవచ్చన్నమాట! అణుగర్భంలో ఇంకేమి ఉన్నాయో?
అణు గర్భంలో ప్రోటానులు, న్యూట్రానులు కూడా ఉంటాయి. బాగా ప్రాచుర్యం ఉన్న ఒక నమూనా ప్రకారం అణు గర్భం చుట్టూ ఎలక్‌ట్రానులు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. ఈ ప్రోటానులు, న్యూట్రానులు, ఎలక్‌ట్రానులు అణువు కంటె చిన్నవి - కనుక వాటిని పరమాణువులు (sub-atomic particles) అంటే బాగుంటుంది. ఈ పరమాణువుల కంటె చిన్నవి - క్వార్కులు - ఉన్నాయి. కావలిస్తే వీటిని పరమాణు రేణువులు అనొచ్చు.
అణువులు కంటె పెద్దవి కూడ ఉన్నాయి. ఉదాహరణకి రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు సంయోగం చెందితే వచ్చేది ‘నీటి అణువు’ కాదు; నీటికి అణురూపం లేదు. ఇప్పుడు ఈ మూడు అణువుల మూకని ఏమనాలి? ఇటువంటి అణువుల గుంపుని, ఇంగ్లీషులో, ‘మోలిక్యూల్’(molecule) అంటారు. తెలుగులో 1968 వరకు, నాకు తెలిసినంత వరకు, పేరు లేదు. ఈ ‘మోలిక్యూల్’ అనే మాట లేటిన్ నుండి ఫ్రెంచిలోకి వచ్చింది. ఫ్రెంచి నుండి ఇంగ్లీషులోకి వచ్చింది. లేటిన్‌లో ‘మోల్’ అంటే ముద్ద. కనుక రెండు కాని, అంతకంటె ఎక్కువ కానీ ఉన్న అణువుల గుంపుని (ముద్దని) ఇంగ్లీషులో ‘మోలిక్యూల్’ అనడం మొదలుపెట్టేరు.
మన సంప్రదాయంలో కాణాదుడు దరిదాపు ఇదే భావాన్ని శతాబ్దాలకి ముందే ప్రవేశపెట్టేడు. పైపెచ్చు కణాదుడు ద్వియాణువు, త్రయాణువు అని అణువుల గుంపులకి పేర్లు పెట్టేడు. అనగా, నేటి బణువు (molecule) ) అనే భావానికి అంకురార్పణ చేసేడు. కాణాదుడు తరువాత మన దేశంలో ఈ బాణీలో ఆలోచన కొనసాగించిన వారు లేకపోయారు.
తెలుగు భాషా పత్రికలో ఒకరు (నేను కాదు) ఈ రకం అణువుల మూకకి ‘బణువు’ అని పేరు పెట్టేరు. అంటే ‘బహుళమైన అణువుల గుంపు’ కనుక ఇటుపైన మోలిక్యూల్ అన్న మాటని తెలుగులో బణువు అందాం. అప్పుడు ‘మోలిక్యులార్ వెయిట్’ (molecular weight) బణుభారం అవుతుంది.
బణువులలో చిన్న బణువులు ఉన్నాయి. పెద్ద బణువులు ఉన్నాయి. పేద్ద బణువులు వున్నాయి. ఈ తేడాని గుర్తించటానికి రక్తచందురం(hemoglobin)) లో ఉంటే హీం( heme) వంటి ఫేద్ద బణువులని బృహత్ బణువు (మెగా మోలిక్యూల్) అంటారు.
చూశారా! బృహత్ బణువులు, బణువులు, అణువులు, పరమాణువులు, పరమాణు రేణువులు అని వరసగా అన్నింటికి ఒకేసారి పేర్లు పెట్టేసి వాటి లక్షణాలు చెప్పేస్తే అనుమానానికి ఆస్కారం ఉండదు కదా.
ఈ పద్ధతిలో ‘నూక్లియార్’ (nuclear) అన్న విశేషణం ‘కేంద్రక’ లేదా ‘కణిక’ అవుతుంది. ‘ఎటామిక్’ అనే విశేషణం ‘అణు’ అవుతుంది. ‘మోలిక్యులార్’ అన్న విశేషణం ‘బణు’ అవుతుంది. ఇప్పుడు ‘నూక్లియార్ వెపన్’ అనవలసి వస్తే ‘కణ్వస్త్రం’, అనిన్నీ ‘ఎటామిక్ వెపన్’ అనవలసి వస్తే ‘అణ్వస్త్రం’ అంటూ ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని గుర్తించవచ్చు. ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడా ఏమిటంటారు? అణ్వస్త్రం అంటే హీరోషిమా, నాగసాకి నగరాల మీద అమెరికా ప్రయోగించిన అస్త్రం. లేదా భారతదేశం పోక్రాన్-1 అన్న పేరుతో రాజస్థాన్ ఎడారిలో మొదటిసారి ఇందిరాగాంధీ హయాంలో ప్రయోగించిన అస్త్రం. దీనే్న ‘ఏటం బాంబు’ అని కూడ అంటాం. కణ్వస్త్రం అంటే వాజపేయి హయాంలో పోక్రాన్-2 పేరిట భారతదేశం ప్రయోగించిన అస్త్రం. దీన్ని ‘హైడ్రొజన్ బాంబు’ అని కూడా అంటారు. ఈ రెండింటికి మధ్య వౌలికమైన తేడాలు ఉన్నాయి కనుక రెండింటిని ఒకే పేరుతో పిలిస్తే శాస్త్రం ఒప్పుకోదు.

-

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా