S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మదరిండియా

‘అమ్మో... అమ్మో!’ సంఘసేవ, సాంఘిక న్యాయం అంటూ ఎంతలేసి మాటలంది కోడలు మాణిక్యం. ఏమైనా సరే ఈ విషయం వాళ్ల నాయన రాఘవ చెవిని వేయవలసిందే. అది చేసిన రాద్ధాంతం రాద్దామంటే ఎంతగా కలం కదిలించినా ఉత్తరం ముందుకు సాగడంలేదు. సరికదా తనకున్న చిటికెడు తెలివి స్తంభించిపోయింది అదన్న మాటలకి. తానన్న మాటల్ని.. తనుగా అనాలనుకున్న మాటల్ని పూసగుచ్చి కాగితం మీదకెక్కించి పోస్టులో పడేయించింది పనిమనిషి రత్తాలుతో లక్ష్మీకాంతం.
‘అమ్మా.. అమ్మగారూ..’ కేకలెడ్తున్నారు గేటు ముందుగా నిలబడి. అరిసెలకి ఆరబోసిన బియ్యాన్ని మంచంపై వేసిన తెల్లబట్టపై నెరుపుతూ గేటు వైపుగా చూసింది లక్ష్మీకాంతం. ఎవరో కుటుంబంతో సహా వచ్చి నిలిచారు గేటు దగ్గర. బహుశా శరణార్థులో ఏమో!! గేటు దగ్గరగా వచ్చిన లక్ష్మీకాంతం ప్రశ్నార్థకంగా చూసింది వాళ్ల నుద్దేశించి.
‘మాది పక్కూరమ్మా.. పనీపాటా ఎతుక్కుంటూ..’ అంటూ నసుగుతుంటే, ఆ మాటల్ని తుంచేస్తూ లక్ష్మీకాంతం ‘నా దగ్గర పనుందని.. నేను పనులు చూపిస్తానని మీతో ఎవరు చెప్పారు. అయినా ఇంటిల్లిపాదీ ఇలా ఇళ్ల మీదకి దండయాత్రగా వచ్చేయడమేనా..’ అంటూ ఉరిమింది మేఘంలా.
ఆ మాటలకి కుదేలయి బహుశా మనం వెతుకుతున్న అడ్రస్ ఇది కాదు కాబోలనుకుంటూ వెనుదిరిగారు. లక్ష్మీకాంతం వాళ్లనే చూస్తూ పనీపాటా అంటూ ఇల్లిల్లు తిరుగుతూ అప్రమత్తంగా ఉంటే యజమాని అందింది అందినట్లు దొరుకు బుచ్చుకు పోతున్నారట.. లేదంటే ఆనుపాను కనిపెట్టి రాత్రికి రాత్రి ఇంట్లో పడి నగా నట్రా నగదు ఊడ్చుకు బెట్టుకు పోతున్నారట.. పాత్రులెవరో, అపాత్రులెవరో.. ఎవరికెరుక.. అంతర్వాణి మెలకువ చెప్తోంది లక్ష్మీకాంతంకి. అలా తనలో తనే తర్కించుకుంటూ లోనికి వెళ్లిపోయింది లక్ష్మీకాంతం.
లక్ష్మీకాంతం లోని కెళ్లిందన్న మాటే గానీ చిరాకు తగ్గలేదు.. కోడలు మాణిక్యం అలా మాటాడవలసింది కాదు. ఏదో అన్నకూతురు మేనకోడలని తన ఒక్కగానొక్క కొడుక్కి చేసుకుంటే తనని చులకన చేస్తుందా, రానీ - వాళ్ల నాన్నని అడగవలసిన నాలుగూ అడిగి పారేస్తాను..
‘ఇంతకీ అంత కాని మాట ఏమందే అంతలా గింజుకుంటున్నావ్’ అంటూ అంతర్వాణి నిలదీసింది లక్ష్మీకాంతాన్ని.
గతమంతా లక్ష్మీకాంతం కళ్లకి కట్టినట్లు అవగతవౌతోంది.
‘అనాథలకి, అభాగ్యులకి, అంధులకి, మూగపిల్లలకి ఇంత ఉపాధి కల్పించటానికి మా నాన్న ఆర్థిక సాయం చేస్తున్నారు, మీ అబ్బాయి నన్ను సమర్థిస్తూ సహకరిస్తుంటే మీ కభ్యంతరమేంటత్తయ్యా!’ అంటూ ఉపన్యాసమే ఇచ్చింది మాణిక్యం. అంతటితో వదిలేసింది. ‘వాళ్లకి వంటా వార్పూ నన్ను చేయమనలా..’ మూతి మూడు వంకర్లు తిప్పింది లక్ష్మీకాంతం కోడలు మాటలకి.
ఇలా ఇద్దరు అభాగ్యులు, అనాథలంటూ ఆ ఉన్నది కాస్తా ఊడ్చిపెడితే.. ముందు ముందు పిల్లాపీచూ పుట్టుకొస్తే వాళ్ల పరిస్థితేంటి? తల్లి మనసు ఆరాటపడింది. అదే చెప్పింది కోడలికి. తన మాటలు రుచించినట్లనిపించలే.. విసవిస గేటు తీసుకు వెళ్లిపోయింది మాణిక్యం. ఆ ఆవేశంలో లక్ష్మీకాంతం మాణిక్యం తండ్రికి కబురంపింది ఉత్తరంతో.
గేటు తడ్తున్న చప్పుడయింది. లక్ష్మీకాంతం అటుగా చూస్తూ ‘రండి.. రండన్నయ్యా..’ గేటు వైపు చూస్తూనే లోనికి ఆహ్వానించింది లక్ష్మీకాంతం. లోనికి వస్తూనే చెల్లెలందించిన మంచినీళ్ల గ్లాసందుకుంటూ రాఘవ ‘కులాసానా చెల్లెమ్మా’ అన్నాడు రాఘవ నీళ్లతో కొంచెం కొంచెంగా గొంతు తడుపుకుంటూ దాహం తీర్చుకుంటూ.
‘ఆఁ; ఏం కులాసాలే అన్నయ్యా.. మన మాణిక్యం చూశావా? ఎంతసేపూ సంఘసేవ, సాంఘికన్యాయం.. సంఘం పట్ల పౌరులుగా బాధ్యత, ధర్మం.. అంటుందే కానీ కడుపున ఓ కాయో, పండో కని నా చేతుల్లో పెడ్దామని, నాకు న్యాయం చేద్దామని, ముద్దూ ముచ్చట తీరుద్దామనీ లేదు..’ అంటూ మొరపెట్టుకుంది.
‘లేదమ్మా..’ రాఘవ ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే తనని అడ్డుకుంటూ లక్ష్మీకాంతం
‘నువ్వలా లేదమ్మా, కాదమ్మా అంటే కాదన్నయ్యా. మాణిక్యాన్ని కొంచెం గట్టిగా మందలించాలి.. ఇల్లూ వాకిలీ పట్టించుకోమని నచ్చజెప్పు’ అంది కొంచెం కటువుగానే.
‘ఆవేశపడకు చెల్లెమ్మా.. దాని మాట కొంచెం కటువేమో గానీ మనసు నవనీతం. చూడు అది వ్రాసిన ఉత్తరాలు. దానికి నీపై ఎంత ప్రేమ, గౌరవం, ఆరాధన, అంకితభావం ఉన్నాయో’ అంటూ లక్ష్మీకాంతం చేతికందించాడు రాఘవ.
చదువుతూనే మురిసిపోసాగింది లక్ష్మీకాంతం. అంతరంగం కొంచెం కొంచెం స్వాంతన పొందుతోంది. చిరాకు పోయి కోడలి పట్ల మమకారం పొంగుకొస్తోంది లక్ష్మీకాంతానికి. రాఘవ చెప్పుకుంటూ పోతున్నాడు-
దానికి చిన్నప్పటి నుండి, సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన, అనాథలకు, అభాగ్యులకు, మూగ, గ్రుడ్డివారికి పనికివచ్చే విద్యల నభ్యసించింది. వారిని ఎలాగైనా ఇతరత్రా సామర్థ్యం చూపగల శిక్షణ నందించాలని తన వంతు బాధ్యతగా స్కూలుని తెరచి అందులో అల్లుడు ప్రకాష్‌నీ, నన్ను భాగస్వాముల చేసిందమ్మా. నీ పట్ల మేనత్తవన్న చొరవ తప్ప మరొకటి కాదమ్మా.. నువ్వనవసరంగా మనసు కష్టపెట్టుకోకమ్మా...’ అంటూ అనునయించాడు చెల్లిని.
‘ఆఁ! అన్నట్టు స్కూల్లో హాస్టల్లో పనే్జయటానికి, అమ్మాయికి చేదోడు వాదోడుగా ఉంటారని మన పాలేరు సుందరయ్య కుటుంబాన్ని, మీ దగ్గరకు పంపించాను. వాళ్లేమన్నా వచ్చారామ్మా..’ అంటున్నంతలోనే మాణిక్యం సుందరయ్య కుటుంబాన్ని వెంటబెట్టుకుని వస్తోంది లోనికి. మాణిక్యం వస్తూనే తండ్రి రాఘవని కుశలు ప్రశ్నలు వేసింది. మాణిక్యం ‘అత్తయ్యా నువ్వు వీళ్లని గుర్తుపట్టలా.. ఊర్నించి నాన్న పంపించారు. ఇక్కడ పనులు చూసుకోవడానికి’ అనటంతోనే ‘అలానా.. అలా అని నోరు విప్పారు కాదూ.. నేనెవరో అనుకుని మామూలు ధోరణిలో పంపించేశాను’ అంటూ లోనికి తనూ వెళ్లింది.
రాఘవ కూతురు మాణిక్యం చేతికిందించిన కాఫీ తాగుతూ ‘పొలానికి కావలసిన ఎరువులు అవి పురమాయించి ఇటుగా వచ్చాను. అందర్నీ చూసినట్లవుతుందని. అన్నట్టు అల్లుడు ఏడి..’ అంటూంటే మాణిక్యం ‘మరే.. మీ అల్లుడికిప్పుడు చేతినిండా పనే స్కూల్ పుణ్యమా అని’ అంటూ మాణిక్యం సుందరయ్య కుటుంబానికి బస చూపించటానికి పెరట్లోకి తీసుకెళ్లింది. రాఘవ అల్లుడ్ని కలిశాక ఊరికి బయల్దేరాడు ఆ రోజు రాత్రికే పొలం పనులున్నాయంటూ.
లక్ష్మీకాంతంలో మునుపటి నైరాశ్యం లేదు. సుందరయ్య వాళ్లు స్కూల్లో పని, హాస్టల్ పని, ఇంటి పని అందిపుచ్చుకున్నాక మాణిక్యం స్కూల్లో పాఠాలు ముగించుకుని వచ్చి ఇంటి పట్టునే ఉంటోంది. అటు స్కూలు.. ఇటు ఇల్లు చూసుకోవడంలోనే రెండేళ్లు ముందుకు వెళ్లింది కాలగమనం.
మాణిక్యం నెల తప్పింది.. లక్ష్మీకాంతం ఆనందం పరవళ్లు తొక్కింది. ఇంటా బయటా ప్రకాష్ చేసుకుంటున్నాడు. మాణిక్యాన్ని కూర్చోబెట్టి సుందరయ్య భార్య అపురూపంగా చూసుకుంటోంది. నేనే ఆ కుటుంబాన్ని అపార్థం చేసుకున్నాను. తన తొందరపాటు, పొరపాటు ఆలోచనలకి లక్ష్మీకాంతం అప్పుడప్పుడు గిల్టీగా ఫీలవుతూంటుంది.
‘ఏమేవ్ జగదాంబ..’ గావుకేక పెట్టాడు రాఘవ ఆ రోజు దినపత్రిక చదువుతూ. చేతిలో పని అలా వదిలేసిన జగదాంబ రాఘవని సమీపించింది కంగారుగా. ‘నేటికి అల్లుడు, అమ్మాయి కలలు పండాయి. గవర్నమెంటు వారు అమ్మాయి నడుపుతున్న స్కూల్‌ని ఎయిడెడ్ స్కూల్‌గా ప్రకటించారు. వారిరువురి కృషిని ప్రశంసిస్తూ ‘ఉత్తమ పాఠశాల’గా గుర్తిస్తూ మాణిక్యాన్ని ‘ఉత్తమ అధ్యాపకురాలి’ పురస్కారాన్ని ప్రకటించారు’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోతున్నాడు రాఘవ.. రాఘవని చూస్తూ మురిసిపోతోంది జగదాంబ.
‘అంతే కాదండోయ్.. అమ్మాయి ఇంతకు ముందే ఫోన్లో చెప్పింది. మీరు త్వరలో తాతగారు కాబోతున్నట్టు..’ అంటూంటే జగదాంబనే చూస్తూ.. వార్త మీద వార్త శుభవార్త అనటంతో ‘మాణిక్యం’ తన కళ్లకి ఇండియా మ్యాప్ అంత విస్తరించి పోయి కనిపిస్తోంది.. తను ఎంతైనా మదర్ ఇండియా మాతృత్వాన్ని పంచటంలో.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505