S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వస్తాడు.. నెలరాజు!

సూక్ష్మంలోనే మోక్షం ఉంది.
-ఇది పూర్వీకుల మాట.
అందుకే -మోక్షం పొందాలంటే సూక్ష్మాన్ని గ్రహించాలంటాడు శ్రీకృష్ణుడు. ‘పాండవ వనవాసం’లో నిద్రపోతున్న భీముణ్ణి తట్టి మరీ చెప్పాడు. మరి -సూక్ష్మాన్ని గ్రహించడమెలా? అంటే -అనంతాన్ని ఔపోసన పట్టాలి. ఆ పనిలోనే ఉన్నాడిప్పుడు మనిషి.
**
లాస్ట్ సిప్‌తో టీ పూర్తి చేసి.. చప్పుడు చేయకుండా -కప్పు కిందపెట్టాను- వాడు చెప్తున్నది వింటూనే.
**
‘శూన్యం నుంచి విశ్వావిర్భావం సంభవించి ఉండొచ్చన్న సమాధానాన్ని శాస్త్రం చేసుకున్నాడు మనిషి. అదే ఎక్స్‌ట్రాగా మొలిచిన జ్ఞానదంతమని నా నమ్మకం. సమాధానమంటూ ఒకటుందంటే -దానికి ముందో వెనకో ప్రశ్న ఉండే ఉండాలి..’
‘నిజమే.. అదే సరైన సమాధానం’ -మనసులో అనుకున్నా.
వాడు మాత్రం ఏమాత్రం ఆపకుండా చెప్పుకుపోతున్నాడు. అందుకే -సమాధానాన్ని ప్రశ్నించుకుంటూ.. ప్రశ్నకు సమాధానపడుతూ జ్ఞానదంతమే ఆయుధంగా మేధో ప్రయాణం చేస్తున్నాడు మనిషి. ఆ ప్రయాణంలోనే -అనంతాన్ని ఆకళింపు చేసుకునే సంకల్పానికి ఒడిగట్టాడు. విశ్వావిర్భావ సూక్ష్మాన్ని గ్రహించడానికి, అనంత సృష్టిని అందుకోడానికి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాడు.
**
చైర్‌లో నేను స్టడీగానే కూర్చున్నా. వాడు మాత్రం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న స్టార్ హీరోలా యాక్షన్‌తో చెప్పుకుపోతున్నాడు.
**
‘దానికోసం ఎన్నో అవస్థలు. ఎనె్నన్నో ఆలోచనలు. మరెన్నో పరిశోధనలు. వేల లక్షల మైళ్ల దూరాలకు ప్రయాణాలు. ఈ సాహస క్రీడలోనే -పుడుతున్నాం.. పడుతున్నాం.. పరిగెడుతున్నాం. చస్తున్నాం. మళ్లీ -అలుపెరుగని ప్రయాణం. ఈ తహతహ అంతా -సూక్ష్మాన్ని గ్రహించడానికే. సృష్టిమూలాలు తేల్చడానికే..! అనంతావిర్భావం అనంతరం కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల తరువాత -జీవపరిణామక్రమంలో భాగంగా మొలకెత్తిన మనిషి.. ‘ఆది’ని కనుక్కోడానికి అనంతానంత ప్రయాణం చేస్తూనే ఉన్నాడు’
****
ఆయాసం కంట్రోల్ చేసుకోలేక -చిన్న ‘పాజ్’ ఇచ్చాడు.
‘అరకప్పు టీకి -ఆది తత్వాన్ని కక్కుతున్నావేంట్రా బాబూ అనుకున్నా మనసులో. కానీ, ననే్నం పట్టించుకోవడం లేదు వాడు. కళ్లు బైర్లు కమ్మేంత భయానకంగా సృష్టి సూత్రం ముడులిప్పుతున్నాడు. ఆద్యంతాల్ని, వాటిమధ్య ఇరుక్కున్న కనుక్కోలేని అనంతాన్ని -డ్రామా డేరాలు పైకిలేపి మరీ చూపిస్తున్నాడు. వాడు నాన్‌స్టాప్‌గా చెప్తున్నది వినలేక -అసౌకర్యంగా కదిలాను కుర్చీలో. ‘కొంపదీసి చంద్రయాన్-2 వ్యాసానికి లీడా?’ అప్రయత్నంగా వచ్చేసింది నా నుంచి ప్రశ్న.
అద్దంలో కనిపిస్తున్న ప్రతిరూపంగాడి కళ్లలో -వెనె్నల మెరుపు. ప్రయత్న పూర్వకంగా నన్ననుకరించినట్టు కుర్చీలో సౌకర్యంగానే కదిలాడు.
‘బావుందా?’ -సుదీర్ఘ సోదికి ఇంటర్వెల్ ఇచ్చినట్టు చిన్న ప్రశ్నతో ఆగాడు.
ఏం చెప్పాలో నాకర్థంకాలేదు. కానీ ఏదోకటి చెప్పాలి. లేదంటే వాడే చెప్తాడు మళ్లీ. ఆలోచిస్తూనే.. ఆన్సర్ చెప్పడమే బెటరన్నట్టు నోరు విప్పబోయాను. వాడు చాన్సివ్వలేదు. నా నోరు మెదపడానికి ముందే ప్రతిరూపంగాడి పెదవి పెగిలింది. పదునైన కోరనవ్వు క్రూరంగా ప్రయోగిస్తూ -‘కొంపదీయడానికి మనకది లేదుగా. నాకంటే ముందుగాళ్లంతా భూగోళాన్ని కమ్మేశారు. అందుకే -ఉపగోళాన్నైనా ప్రశాంతంగా ఆక్రమించి కొంపకడదామని -అడ్వాన్స్‌గా ఖగోళాల్ని స్టడీ చేస్తున్నా’.
ప్రతిరూపం బదులుకి నా దిమ్మతిరిగింది. సౌర కుటుంబమంతా బుర్ర చుట్టూ గిర్రున తిరుగుతున్న ఫీలింగ్. -కళ్లు బైర్లుకమ్మాయి.
‘నీకేమైనా పిచ్చా.. వెర్రా.. చాదస్తమా? ఎప్పటినుంచో ఊరిస్తోన్న చంద్రయాన్-2కి ముహూర్తం పెట్టినంత మాత్రాన, ప్రయోగ రాకెట్‌లో ప్లేస్ ఇస్తారనుకున్నావా?’ -మండిపోయి అడిగాను.
వాడి ముఖం మీది క్రూరమైన నవ్వు గర్వంగా మారింది. ‘లాస్ట్ టైమ్.. అదే 2008 అక్టోబర్‌లో చంద్రయాన్-1 ఫెయిలైంది. కారణం -మనోళ్లకు ఎక్స్‌పీరియన్స్ లేక. ఈసారి అలాంటి చానే్స లేదంటున్నాడు ఇస్రో ‘శివుడు’. ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ పెట్టి, ఎక్స్‌పీరియన్స్‌కి సానపెట్టి రోవర్‌ని డిజైన్ చేశాడట’
కదలడానికి అవకాశం లేదన్నట్టు నేను చైర్‌లో అలాగే కూర్చున్నా. వాడుమాత్రం నా ప్రమేయం లేకుండానే -ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతున్నట్టు ఫీలవుతున్నాడు.
‘చంద్రయాన్-1 సాంకేతిక విధానానే్న చంద్రయాన్-2కీ వాడతారు. కాకపోతే -ల్యాడింగ్ ప్రక్రియ కొత్తగా డిజైన్ అయ్యింది. చంద్రయాన్-1 ప్రయోగ కాలంకంటే, -2 ప్రయోగకాలం పావుగంట తక్కువ. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరయ్యే క్రూషియల్ టైంలో ఎటువంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకపోవచ్చన్న నమ్మకముంది. సో, డామ్ ష్యూర్.. ‘మామ’ మననుంచి తప్పించుకోలేడు’
ఇస్రో చైర్మన్ శివన్‌కంటే కాన్ఫిడెంట్‌గా చంద్రయాన్-2ని రివీల్ చేస్తున్నాడంటే.. ‘వీడు వ్యాసానికి ప్రిపేరయ్యే, నాకు వ్యాసార్థం చూపిస్తున్నాడు. ఈటైంలో ఎదురెళ్లడం కంటే వాలు చూడ్డం ఉత్తమం’ మనసులో అనుకుంటూ ఆ నిర్ణయానికి వచ్చేశాను.
‘సర్లేగానీ, ఇంకో వన్ బై టూ కొడదాం’
ట్రాక్ తప్పించాలని నేననుకున్నా.
తప్పాలని వాడనుకోలేదు. అందుకే డైరెక్ట్‌గా సబ్జెక్టులోకి దూకేశాడు. ‘మామ -ఈసారి ఎక్కడికీ తప్పించుకోలేడురా. లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించగల స్వదేశీ పరిజ్ఞానానికి మనోళ్లు పదునెట్టారట. అంతరిక్షం అంతుచూసైనా -తెల్ల చంద్రుడికి త్రివర్ణం పూస్తామని తొడగొట్టి మరీ చెప్తున్నారు. అందుకే -శ్రీహరికోటను ఆల్రెడీ డెకరేట్ చేసేశారు. ఆ ఫ్లాట్‌ఫాం నుంచి జీఎస్‌ఎల్‌వి మార్క్ -2 (జూలై 15 తెల్లవారు ఝామున 2.51 గంటలకు) భూతలాన్ని దాటేయడానికి భూతంలా ఆకాశంవైపు చూస్తోంది. ముహూర్తం టైంకి మన సైంటిస్టులు మంట పెట్టడమే తరువాయి -మంటల్ని చిమ్ముకుంటూ రాకెట్ పైకెగరడం, వెనె్నల్ని పీల్చుకుంటూ రోవర్ చందమామ మీద దబ్బున దిగడం ఆటోమేటిగ్గా జరిగిపోతాయి’
స్టార్ హీరోకి స్టోరీ చెప్తున్న ఫ్రెష్ రైటర్‌లా -కంటెంట్ చెప్తూనే కంపించిపోతున్నాడు ప్రతిరూపం గాడు.
‘రెండు నెలలు. రెండే రెండు నెలలు. అంటే సెప్టెంబర్ సిక్స్త్‌కి రోవర్ దిగిపోతుంది. వ్యవహారాన్ని చక్కబెట్టేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అఫ్‌కోర్స్, అది మనవరకూ రావడానికి డిసెంబర్ కావొచ్చు. ఏదేమైనా -కొత్త ఏడాది 2020లో మూన్ మీద మాంచి ఈస్ట్ ఫేస్ బిట్ చూసుకుని సెట్ చేసుకోవడం ఖాయం’
డైలాగ్స్‌లోనే యాక్షన్ ఎపిసోడ్ మిళితం చేసి -స్టార్ హీరోని శాటిస్‌ఫై చేసినట్టు సీన్‌కి క్లైమాక్స్ ఇచ్చేశాడు ప్రతిరూపంగాడు.
‘దానికి చంద్రయాన్-2 వరకూ ఎందుకురా? గ్రేట్ పొరుగు కంట్రీస్.. మనకంటే ముందుగా మూన్‌ని క్యాచ్ చేశాయిగా. వాళ్ల యాంగిల్‌లో వర్కౌట్ చేయలేకపోయావా? కాంపిటీషన్ లేకుండా కావాల్సిన ఫేసింగ్ బిట్ దొరికేది’ కూల్‌గా అంటూనే కుర్చీలోంచి లేచాను.
ప్రతిరూపంగాడి ఈగో హర్టయ్యింది. కాదు, నేనే హర్ట్ చేశానని తెలుస్తోంది. ననే్న ఇమిటేట్ చేస్తూ -అద్దంలోని కుర్చీలోంచి సీరియస్‌గా లేచాడు వాడుకూడా.
‘తెల్లోళ్లని అడుక్కునేదేంట్రా.. మనకేం తక్కువ?’. విలన్‌కు అల్టిమేటమ్ ఇచ్చే హీరో లెక్క పోజెట్టాడు.
‘బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ స్టేషన్. షార్‌లో సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్. అక్కడ డిజైన్ చేసే శక్తివంతమైన జీఎస్‌ఎల్వీలు. ఓహ్.. మనకేం లేవని, ఏం తక్కువని?
అయినా, నీకో సీక్రెట్ చెప్పనా? ఫారినోళ్లు అడుగెట్టిన పాత ప్లేస్‌కి కాదురా మనం రోవర్‌ని గురిపెట్టింది. సన్‌కు ఫార్టీఫైవ్ డిగ్రీస్ క్రాస్‌లోవున్న మూన్‌మీది సౌత్‌పోల్‌కి. ఇంతవరకు ఏ వాహక నౌకా దిగని ప్రాంతమది. మన డైరెక్షన్ మన్ది..’
ప్రతిరూపంగాడు క్రమంగా సబ్జెక్టుని థ్రిల్లర్‌లోకి దించుతున్నట్టు అర్థమైంది నాకు. కాపీ కంటెంట్‌కు కొత్త కానె్సప్ట్ యాడ్ చేయడం మొదలెట్టాడు. పైగా సీన్‌ని పదే పదే రిహార్సల్ చేసినంత ఈజీగా -చంద్రయాన్ ఫైవ్ స్టేజెస్‌ని బ్రెత్‌లెస్‌లో చెప్పడం మొదలెట్టాడు.
‘ఫైవ్ స్టేజెస్. జస్ట్ ఫైవ్ స్టేజెస్.
జూలై 15న జీఎస్‌ఎల్‌వి మార్క్ -3 జర్నీ మొదలెట్టి, ఫైవ్ డేస్‌లో మట్టిగోళం కక్ష్య దాటుతుంది. అక్కడి నుంచి 3.5 లక్షల కిలోమీటర్లు చంద్రుడివైపు దూసుకెళ్తుంది. తరువాత మన శాస్తవ్రేత్తలు కీ ఇచ్చినట్టే -రాకెట్‌ను వదిలేసిన ఆర్బిటర్, రోవర్ (ప్రజ్ఞాన్), ల్యాండర్ (విక్రమ్) సౌత్ పోల్‌ను టార్గెట్ చేస్తాయి. మూన్‌కి జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ల్యాండర్‌ను వదిలేస్తుంది ఆర్బిటర్. అంతే -ల్యాండర్ డోర్లు తెరుచుకోవడం, మూన్ మీదకి రోవర్ దిగిపోవడం. దట్స్ ఇట్. పనైపోయినట్టే.
ఆ తరువాత -చట్టం లాగే రోవర్ సైతం తన పని తాను చేసుకుపోతుంది. నీకో విషయం తెలుసా? -చంద్రుడిమీద రోవర్ ఎంత దూరం తిరిగి ఆక్రమిస్తే- అదంతా మనదేనట..!’
వాడు చెప్తున్నది వింటుంటే -దిమ్మ తిరిగింది. మాట పెగల్లేదు. నేను సైలెంటైపోవడంతో -ప్రతిరూపంగాడు డామినేషన్‌కు దిగాడు. ప్యూచర్‌ని ఫుల్ స్క్రీన్‌మీద చూపిస్తున్నాడు.
‘ఇప్పుడు రోవర్‌ని పంపినట్టు -తరువాత వాకర్స్‌ని పంపుతారు. అంటే -మానవ సహిత చంద్రయానాలన్న మాట. చంద్రుడిమీద జాగాలు కొన్నోళ్లకే ఫస్ట్ చాన్స్. వెళ్లినోళ్లంతా ఊరికే ఉంటారా? ఇళ్లు కడతారు. కాలనీలవుతాయి. కొనే్నళ్లకు అదో ప్రపంచమవుతుంది. అదే -చంద్ర ప్రపంచం. అంతే -అక్కడోళ్లిక్కడికి, ఇక్కడోళ్లక్కడి తిరుగుడే తిరుగుడు’
ప్రతిరూపంగాడు మైకంలో చెప్పుకుపోతున్నా -అదంతా జరిగితే ఎంత బావుణ్ణన్న భావన కలిగింది నాకు.
అయితే -వాడి పిచ్చికి పగ్గాలేయాలంటే ఆయువుపట్టుమీద కొట్టాలని తెలుసునాకు. వాడికసలే పాటల పిచ్చి. అందుకే -కీలెరిగి వాత పెట్టినట్టు.. వాలెరిగి రాకెట్ వదిలినట్టు.. రెండూ కలిసొచ్చేలా టైమ్ చూసి ‘ఆరుద్ర’ను ప్రయోగించాను.
‘నువ్వు చెప్పేదంతా నిజమేరా. కాని, ఇదే విషయాన్ని ఆరుద్ర ఇంతకుముందే ఇంకోలా చెప్పాడుగా. ‘మానవుడే మహనీయుడు’ అంటూ బాలభారతం సినిమాలో. ఆయన రాసిన పాటనే -నీ పిచ్చి ట్రాన్స్‌లేషన్‌తో సీన్‌గా చూపిస్తున్నావ్’.. వెటకారంగా అన్నా.
పదేళ్ల క్రితం ఆగిన చంద్రయాన్-1లా ప్రతిరూపంగాడి మాటలకి బ్రేక్ పడింది. అద్దంలోంచి ప్రతిబింబంలా కళ్లప్పగించి ననే్న చూస్తున్నాడు.
**
ఫ్లాస్క్‌లోంచి కొంత టీ కప్పులోకి పోసుకున్నా. వాడూ నన్ను ఇమిటేట్ చేశాడు. అంటే-్ఫలో అవుతున్నాడు. నాలో ఉత్సాహం పెరిగింది. మొబైల్‌లో యూట్యూబ్ ఓపెన్ చేసి -బాలభారతం సినిమాలోని ఆరుద్ర పాట పెట్టా. పిల్ల అర్జునుడు బాణాలతో నిచ్చెన కడుతుంటే -కుర్ర భీముడు గదను చంకన పెట్టుకుని టపటపా గాల్లోకి మెట్లెక్కేస్తున్నాడు. సాంగ్ సౌండ్ పెంచటంతో -కళ్లప్పగించి సీన్ చూస్తూ వింటున్నాడు ప్రతిరూపంగాడు.
‘మానవుడే మహనీయుడు/ మానవుడే మహనీయుడు
శక్తియుతుడు/ యుక్తిపరుడు.. మానవుడే మాననీయుడు’
ఎటర్నల్ ట్రూత్‌ని రాసిపడేసిన ఆరుద్ర అక్షరాల్ని గుదిగుచ్చి మరీ పాడుతున్నాడు ఘంటసాల.
‘మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే/ ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే/ దివిజ గంగ భువిదించిన భగీరధుడు మానవుడే/ సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే/ సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే/ జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే
మానవుడే మహనీయుడు.. మానవుడే మాననీయుడు’
పాట ఫోర్స్‌కి -చందమామ మీదికి వెళ్లినట్టు ఫీలవుతున్నాడు ప్రతిరూపంగాడు.
‘గ్రహరాశులనధిగమించి ఘనతారల పథమునుంచి/ గగనాంతర రోదసిలో గంధర్వగోళగతులు దాటి/ చంద్రలోకమైన దేవేంద్రలోకమైనా/ బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే..’
కుర్రభీముడు దేవేంద్రలోకం నుంచి ఐరావతాన్ని కిందకు తెచ్చిన సీన్ నడుస్తోంది. -కళ్లప్పగించిన ప్రతిరూపంగాడు తన్మయత్వంలో ఘంటసాల మాస్టారి గొంతుతో అపశృతి కలిపాడు. ఘంటసాల బెదిరిపోయేలాంటి గార్ధ్భస్వరంతో -‘మనవుడే మహనీయుడు’ అంటూ అపశృతిని పెంచుతుంటే, భరించలేక గట్టిగా అరిచాను. ఆగిపోయాడు. మొబైల్‌లో పాటైపోయింది.
‘దీన్నిబట్టి నీకేమర్థమైంది?’ వాడు ఆలోచించుకోడానికి అవకాశం లేకుండా ప్రశ్నించాను. వాడు ప్రిపేర్ చేసిన వ్యాసంలో లేని పాయింటిది. కనుబొమలు ముడేసి ఆశ్చర్యంగా చూశాడు.
టీ అయిపోవడంతో కప్పు కిందపెట్టాను. గౌరవంగా వాడూ అదే పని చేశాడు.
‘ఓరి పిచ్చోడా.. ఆరుద్ర చెప్పింది మనోళ్ల గురించే. కాకపోతే -కాస్త ముందుగా ఫారినోళ్లు క్యాచ్ చేశారు’
ఎదురు ప్రశ్నకు అవకాశం దొరికిందన్నట్టు వాడి ముఖంలో చిన్న నవ్వు. ‘చెప్పేవులేవోయ్. ఆయన మొత్తం మానవ జాతి గురించి చెప్పాడు. మనోళ్ల గురించంటే నమ్మేస్తానా’ -లా పాయింట్ లాగాడు, ఏం చెప్తానా? అని అద్దంలోంచి నావైపే చూస్తూ.
‘్భగీరథుడు ఎవర్రా?’
‘మనోడే..’
‘మరి ధ్రువుడు?’
‘మనోడే..’
‘అమెరికా, రష్యా, చైనాల్లో విశ్వామిత్రుడుంటాడా’
నో!!!
‘మన పూర్వీకుల్ని ఆరుద్ర ప్రస్తావించాడంటే -ఏంటర్థం. మనోళ్లు గొప్పోళ్లనేగా. చెప్పింది వాళ్ల గురించేగా. కానీ, మనమేం చేశాం’
‘చంద్రయాన్ లేట్ చేశాం’ -్ఠక్కున అనేశాడు పూర్తిగా దారిలోకి వచ్చేసిన ప్రతిరూపంగాడు.
‘అదీ అసలు పాయింట్. అసలామాటకొస్తే -చంద్రుడి దగ్గరికి మనం వెళ్లక్కర్లేదురా. నెలరాజే మనతో ఎప్పుడూ ఉంటాడు. మనం గ్రహించడం లేదంతే’
‘ఔనా!’
‘అంత షాక్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకు.
‘చిన్నప్పుడు అన్నం తినడానికి మారం చేశావా?’
‘ఊ.. చేసేవుంటాను’
‘మరి మీ అమ్మ ఎవరిని పిలిచింది?’
‘చందమామని..’
చందమామ రావె/ జాబిల్లి రావె/ మెట్రోలోన రావె/ ట్విట్టర్ అకౌంట్ తేవె/ జెట్ ఫ్లైట్‌లో రావె/ జియో సిగ్నల్స్ తేవె..
‘ఆపుతావా..’
‘మారిపోయింది కదూ. చిన్నప్పటి పాట ఏం గుర్తుంటుంది మరి’ -బుర్రగోక్కున్నాడు ప్రతిరూపంగాడు.
‘నేను చెప్పేదీ అదే’
కొండెక్కి రావె/ గోగుపూలు తేవె/ బండెక్కి రావె/ బంతిపూలు తేవె.. అంటూ సాగే పాటను మర్చిపోయినట్టే చంద్రుడొచ్చిన విషయాన్నీ మర్చిపోయుంటావ్’
‘లేదు, నాకు గుర్తుంది. అమ్మ పాడిందిగానీ, చందమామ రాలేదు’
‘అమ్మ పాడిందా? ఏడుపు ఆపేసి అన్నం తిన్నావా’
‘...ఔను, తిన్నాను’
‘అంటే వచ్చినట్టేగా.. చందమామ వస్తేనేగా, అన్నం తినుంటావ్’
నా లాజిక్‌తో -ప్రతిరూపంగాడి బుర్ర గిర్రున తిరిగింది. క్రమంగా వాడికి గోళాలు, ఖగోళాల కంటెంట్ అర్థమవుతున్నట్టు ఫేస్ పెట్టాడు.
‘ఎవ్వరికీ తెలీని ఇంకో విషయం చెప్తాను, విను’ -అంటూ వాడి పాటల పిచ్చికి మళ్లీ పురిపెట్టాను.
‘అల్లూరి సీతారామరాజులో సీత (విజయనిర్మల) పాడుకున్న పాట గుర్తుందిగా..’
‘వస్తాడు నారాజు ఈరోజు/ తానె వస్తాడు నెలరాజు ఈ రోజు.. కార్తీక పున్నమి వేళలో/ కలికి వెనె్నల కెరటాల పైన’ -అడిగిందే తడవన్నట్టు పాడేస్తున్నాడు ప్రతిరూపంగాడు.
ముయ్ అన్నట్టు నా నోటికి చేయి అడ్డం పెట్టా. -వాడు పాట ఆపేశాడు. అద్దంలోవున్న వాడి దగ్గరికి కుర్చీని లాక్కున్నాను. రహస్యం వినడానికన్నట్టు వాడూ కుర్చీని నాముందుకు లాక్కున్నాడు, నాతో సమానంగా.
‘వెర్రిమొగమా.. నిజంగానే సీత.. చంద్రుణ్ణి పిలిచింది. కానీ -డైలీ పనులన్నీ ముగించుకుని చందమామ కిందకు దిగేసరికి లేటైంది. అదే టైంలో అటుగా రామరాజు వచ్చాడు. అతన్ని -వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించింది. అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలీ వినిపించింది. అతని పావన పాదధూళికై అవని అణువణువూ కలవరించింది. అతని రాకతో ఆమె అంతరంగం పాలసంద్రమై పరవశించింది. తన మనసే కాదు, ప్రకృతే ఇంతగా పులకించిందంటే -కచ్చితంగా చంద్రుడే అయివుంటాడని ఫిక్సయ్యింది సీత. సినిమాని మళ్లీ ఓసారి చూడు. దర్శకుడు.. -చంద్రుడిలో రామరాజును చూపించింది అందుకే’
ఆర్బిటర్ నుంచి పర్ఫెక్ట్‌గా ల్యాండర్ వేరైనపుడు శాస్తవ్రేత్తల ముఖంలో కనిపించినంత ఆనందం కనిపిస్తోంది ప్రతిరూపంగాడి ఫేస్‌లో. అంటే నా ప్రయోగం సక్సెస్ అవుతోందన్న మాట. అదే అదనుగా మరో నాలుగు పాటలేశాను..
‘పూజాఫలం సినిమాలో జమున పియోనో వాయిస్తూ -పగలే వెనె్నల పాటేసుకుంది గుర్తుందా? పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం.. నింగిలోని చందమామ తొంగి చూస్తోందని ఆమె ఎలా చెప్పింది? చందమామను ఫీలైంది కనుక. అంటే, తలచుకుంటే చందమామ అందుబాటులో ఉంటాడనేగా. అంతెందుకు సంబరాల రాంబాబులో చలం పాట గుర్తు తెచ్చుకో’ గుర్తుకొచ్చీ రానట్టుగా -పాడటానికి ట్రై చేస్తున్నాడు ప్రతిరూపంగాడు.
‘మామా చందమామా’
‘వినరావా నా కథ/ వింటే మనసువుంటే/ కలిసేవూ నా జత...’
పదం మొదలెట్టగానే -పాటందుకున్న వాడి తన్మయత్వం నాకు అర్థమైంది. పల్లవైతే పాడేశాడుకానీ, చరణం గుర్తురాక బుర్రగోక్కున్నాడు.. నేనందిస్తానేమోనని నావైపు ఆశగా చూస్తూ.
‘నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు/ నీ కళలే సాటిలేని పాటలు ప్రేమకు/ నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు/ జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు’
ప్రతిరూపంగాడి ముఖంలో చందమామ కనిపిస్తోంది నాకిప్పుడు. అంటే -పిలిస్తే, తలిస్తే చందమామ ఏదోలా కిందకు దిగడం ఖాయమన్న నా ఆలోచన నిజమైనట్టు అనిపిస్తోంది. అందుకే అంతమంది భావకవులు, ఎంతోమంది కథకులు ‘చందమామ’ కబుర్లు అంతచక్కగా చెప్పారు.
‘చందమామా అందాలమామా/ నీ ఎదుట నేను/ వారెదుట నీవు/ మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు?’ -అంటూ ‘తేనెమనసులు’ కోసం ఆచార్య ఆత్రేయ రాసిన పాట గుర్తుకొచ్చింది ఒక్కసారిగా. ‘మా ఎదుట ఎప్పుడుంటావు?’ అని ఆత్రేయ అడిగాడంటే -చందమామ కిందకు దిగుతాడనేగా! అతెందుకు ‘రావోయి చందమామా/ మా వింతగాథ వినుమా’ అని మిస్సమ్మ సినిమాలో ఎన్టీఆర్ పిలిచినా, ‘మల్లె పందిరి నీడలోన జాబిల్లీ/ మంచమేసి ఉంచినాను జాబిల్లీ’ అంటూ మాయదారి మల్లిగాడులో జయంతి చెప్పుకున్నా.. ‘హాయి హాయిగా జాబిల్లి/ తొలిరేయి వెండి దారాలల్లి/ మందు జల్లి నవ్వసాగె ఎందుకో/ మత్తు మందు జల్లి నవ్వసాగె ఎందుకో’ అంటూ వెలుగు నీడలు సినిమాలో గిరిజ పాడుకున్నా.. ఇవన్నీ ఎవరిని పిలిచినట్టు? ఎవరికి చెప్పుకున్నట్టు? ఎవరితో పాడుకున్నట్టు? చనువుకొద్దీ చందమామతోనేగా.
నాకూ చందమామ మైకం కమ్మినట్టు కనిపించింది. అమ్మో, ఈ మైకం శృతిమించితే ప్రతిరూపంగాడు చందమామైపోతాడని భయమేసింది. అందుకే -బ్రేక్ చేయడానికి వీలుగా టాపిక్‌ను మార్చాను.
అద్దంలో -ప్రతిరూపంగాడు మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. పున్నమి చంద్రుడిలా నిండుగానూ అనిపించాడు. వాణ్ణి ఇంకొంత సంతృప్తిపర్చే ఉద్దేశంతో కొత్త పాయింట్ లేపాను.
‘ఓరి పిచ్చోడా.. చంద్రుడికి మనమీద ప్రేమెక్కువరా. మామ దగ్గరికి మనం వెళ్లాలంటే కష్టం. మామ మనదగ్గరికి రావడం ఇష్టం’
‘అదెలా..?’ ఆత్రంగా ప్రశ్నించాడు.
‘పగలంతా పనిచేసి అలసిపోయాక -నిన్ను సేదతీర్చడానికి రోజూ రాత్రి వస్తున్నాడా? లేదా? చంద్రుడిమీద నువ్వు జాగా చూసుకోవడం కాదురా. రోజూవచ్చే చంద్రుడికి నీ మనసులో కొంచెం జాగా ఇవ్వు. హాయిగా ఉంటుంది’
వాడినోటినుంచి మాట లేదు. ఆశ్చర్యంగా నావైపే చూస్తున్నాడు.
‘చీకట్లో రోడ్డుమీద వెళ్తూ ఓపెన్ డ్రెయిన్‌లోకి చూడు. మురికి నీళ్లల్లోనూ మకిలంటని మూన్ కనిపిస్తాడు. పెరట్లో లోతైన బావిలోకి తొంగిచూడు, నవ్వుతూ పలకరిస్తాడు. చెట్ల చాటున, మేఘాల మాటున ఎక్కడ చూసినా నిన్ను విష్ చేస్తుంటాడు. పగిలిన అద్దం పెంకుల్లోనూ చూడొచ్చు. పసిబుగ్గల పాల నవ్వుల్లోనూ చూడొచ్చు. పాజిటివ్, నెగెటివ్ భేదం చందమామకుండదు. ఆనందం,విషాదం అన్న భావనలకు అందడు. -చంద్రుడెప్పుడూ చంద్రుడే. ఔనా? కాదా??’
ప్రతిరూపంగాడికి తత్త్వం బోధపడిందన్న విషయం నాకర్థమైంది. ఈసారి ఇంకొంచెం ఆసక్తిగా మరీ దగ్గరకు జరిగాడు -అద్దంలోంచి.
‘మరీ.. ఈ ప్రయోగాలెందుకంటావ్?’
రహస్యంగా అడిగాడు.
‘వాళ్లు శాస్తవ్రేత్తలు కనుక -వాళ్లు చేయాల్సిన పనులు వాళ్లు చేస్తారు. నువ్వు భావుకుడివి కనుక -నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి అంతే’
చెప్తుండగానే కరెంట్ పోయింది. ప్రతిరూపంగాడు కనిపించటం మానేశాడు. చీకట్లో తనే్నస్తానేమోనని కుర్చీ పక్కనపెట్టి కప్పును చేతిలోకి తీసుకుని కుర్చీలోంచి లేచాను. వాడూ నన్ను ఇమిటేట్ చేస్తున్నట్టు శబ్దం వినిపించిందే కానీ, చీకట్లో వాడు కనిపించటం లేదు.
తలపైకెత్తాను, నెలరాజు మాత్రం నవ్వుతూ కనిపించాడు.
*
ఆశల అంతరిక్షం
‘వ్యోమగాముల్ని రోదసిలోకి పంపే రోజెంతో దూరం లేదు’
చీకట్లో అద్దం కనిపించకపోవడంతో -ప్రతిరూపంగాడి మాటలే వినిపిస్తున్నాయి. డయాస్‌మీద నిలబడి స్కూలు పిల్లాడు స్పీచ్ ఇస్తున్న భావన వాడి గొంతులో వినిపిస్తోంది. ‘ఔను -గగన్‌యాన్ ప్రాజెక్టుతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించనుంది. ప్రాజెక్టు కొనసాగింపుగా భూకక్ష్యలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్నీ ఏర్పాటు చేయనుంది. రెండేళ్లలో గగన్‌యాన్ మొదలైతే -వెంటనే స్పేస్ స్టేషన్‌పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తారట. 20 టన్నుల బరువుండే భారత అంతరిక్ష స్పేస్ స్టేషన్ -అన్నింటికంటే చిన్నదై ఉంటుందన్నది అంచనా. భవిష్యత్తులో ఈ కేంద్రం నుంచి మరింత ఎక్కువ వ్యోమగాములను రోదసిలోకి పంపాలన్నది ఆశ. ప్రాజెక్టు మొదలుపెడితే -ఐదునుంచి ఏడేళ్లలో పూర్తికావొచ్చని శాస్తవ్రేత్తల అంచనా’
భారత అంతరిక్ష ప్రయోగాల విశేషాలను చెప్తున్నపుడు ప్రతిరూపంగాడి గొంతులో చిన్న ఉద్వేగం.
‘సూర్యుడిపై పరిశోధనలనకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సిద్ధమైంది. వచ్చే ఏడాది జూన్-జూలైలో దీని ప్రయోగించనున్నారు. భూమినుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, అక్కడే కక్ష్యలో సంచరిస్తూ సూర్యుడిని అధ్యయనం చేస్తుందట. రెండు మూడేళ్లలో శుక్రుడిపైకీ వ్యోమనౌకను పంపేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
భారత ప్రగతి, శాస్తవ్రేత్తల ఘనత, ప్రయోగ సన్నాహాలు ప్రతిరూపంగాడి గొంతులో వినిపిస్తుంటే -నా మనసు క్రమంగా ఏవో ఊహలవైపు పరిగెడుతోంది. బుర్రనిండా ఆలోచనలు ముసరడంతో -ప్రతిరూపంగాడి గొంతు క్రమంగా నా ఆలోచనలతో మమేకమైపోయింది.
యుగయుగాలకూ దూరం
ఎంత దగ్గరగా ఉన్నాడని చెప్పుకుంటున్నా -చందమామ అంతకంతకూ దూరమవుతూనే ఉన్నాడు. యుగాలు మారేకొద్దీ ఆ దూరం మరీ దూరమవుతోంది. సరదాగా చెప్పుకుంటే -కృతయుగానికి ఈశ్వరుడు ప్రతినిధి అన్నది కొందరి నమ్మకం. అప్పుడు చంద్రుడు -ఈశ్వరుడి నెత్తిన ఆభరణంగా ఉండేవాడు. త్రేతాయుగానికి శ్రీరాముడు ప్రతినిధి అనుకుంటే -అద్దంలో అందేంత దగ్గరగా ఉన్నాడు చంద్రుడు. అవతారపురుషుడైన రాముచంద్రుడి పేరులోనూ కనిపిస్తాడు. ద్వాపర యుగం వచ్చేసరికి -ఆరుద్ర చెప్పినట్టు మహాపురుషులు వెళ్లివచ్చేంత దగ్గరగానే ఉన్నాడు చంద్రుడు. అంటే చంద్రలోకానికి, దేవేంద్రలోకానికి వెళ్లే అవకాశం ఆ మహా పురుషులకు ఉండేదన్న మాట. కాకపోతే కలియుగానికి -మళ్లీ ఆరుద్ర చెప్పినట్టు జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడు. అంటే -కలియుగ ప్రతినిధి. అలాంటి మనిషి మాత్రం చంద్రుడ్ని అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. అంటే -యుగయుగానికీ చంద్రుడు దూరం జరుగుతున్నాడన్న మాట.

- మహాదేవ 79895 65289