S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిన్ను చుట్టుకున్నారు?

లోకంలో ఏ మనిషికైనా కావలసినది సుఖం, ఆనందం. ఎండమావుల వెంట లేడిపిల్లలా, పరుగెత్తినా తిరిగీ తిరిగీ విసిగి వేసారటమే తప్ప ఎప్పుడూ ఆనందమనేది ఆమడ దూరంలోనే ఉంటుంది.
ఎంత సంపాదించినా ఇంకా కావాలనే అనిపిస్తుంది. తృప్తి ఎక్కడ? అంటే అది దాని దోషమా? లేక మన దోషమా? దాని దోషమే. అయితే, అది తెలియక పరుగెత్తటం మన దోషమే. లోకంలో అందరూ ఇదే చేస్తారు గదా! అది తప్పెలా అవుతుంది? అని అడగవచ్చు. కానీ దానివల్ల సంపూర్ణానందం లేనప్పుడు ఆ ఆలోచన సరైనదని చెప్పటం హాస్యాస్పదమే గదా?
అందుకే ఆదిశంకరులు సుతిమెత్తగా హెచ్చరించినా ఫలితం లేక, ‘మూర్ఖులారా? మూఢమతే!’ అని సంబోధించి చెప్పవలసి వచ్చింది.
‘పిచ్చినాయనలారా! కనిపించేదీ శాశ్వతం కాదు. ‘విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం?’ అని సాక్షాత్ ఆదిశంకరులు కేవలం వయస్సు రెండు పదులు దాటకుండానే ముఖం మీద చెప్పేశాడు. గమ్యాన్ని సూచిస్తూ మనల్ని జాగృతం చేస్తూ ముందుకు నడిపించడానికి దైవం కొందరిలో తన అంశను చేర్చి భూమిపైకి పంపుతాడు. వారే కారణజన్ములు.
‘స్కూలు ఫీజు కట్టేశాను. మిగిలిన డబ్బులు గూట్లో పెట్టాను చూసుకోండి. నా గురించి బెంగ పెట్టుకోవద్దు’ అని ఒక చీటీ రాసి, ఏకంగా తల్లినీ, ఇంటినీ వదిలేసి, అరుణాచలం చేరుకున్న భగవాన్ రమణుల సంగతి ఒక్కసారి ఆలోచిస్తే చాలు - ఒక్కొక్కరి జన్మ విశేషంలోని అంతరార్థం ఏమిటో అవగాహనకొస్తుంది.
ప్రతి మనిషికీ నిద్రానుభవముంది. గాఢనిద్రలో ఆదమరచి నిద్రబోతున్నప్పుడు కాళ్లూ చేతులూ రెండూ పని చేయవు. సూక్ష్మ శరీరానికున్న కన్ను, ముక్కు, చెవి వ్యాపారముండదు. మనస్సు కూడా పని చేయదు. ఆ గాఢనిద్రలో ప్రతి వారికీ ఒక సుఖం ఒక ఆనందం ఉంది. డబ్బు సంపాదన యావ లేదు. మంచి వస్తువును చూసిన అనుభూతి లాంటివేవీ ఉండవు. ఐదారు గంటలపాటు మనిషికి ఏ అనుభవం లేకపోవడానికి ఒకే కారణం ‘ఆత్మలో మనస్సులో లీనమవ్వటమే’. నిద్రలో శరీరచేష్టలూ లేవు, ఇంద్రియ చేష్టలూ లేవు. ఈ రెండూ లేనప్పుడు పొందే ఆనందం, నిత్యానందం - వ్యవహారమంతా రెండూ ఉంటేనే. ఎంత ఆశ్చర్యం? సర్వకాల సర్వావస్థల్లో ఈ నిత్యానందాన్ని అనుభవించే దారిని అనే్వషించి కృతకృత్యుడైన మహానుభావుడు భగవాన్ రమణులు. అందుకే..
యోగ రతోవా, భోగరతోవా
సంగరతోవా, సంగవిహీనః॥
యద్య బ్రహ్మణి, రమతే చిత్తం
నందతి, నందతి నందతి నందత్యేవ॥
అన్నారు ఆదిశంకరులు.
సంగీత జ్ఞానం లభించి, పది మందిలో కచేరీలు చేస్తూ, కీర్తిప్రతిష్ఠలతోపాటు కాస్తో కూస్తో డబ్బు సంపాదించే విద్వాంసులందరికీ నిత్యానందం లభిస్తోందనుకుంటున్నారా? అర్థం తెలియకపోయినా, భావంతో పాడలేక పోయినా, తన అంతరంగాన్ని తెలుసుకోలేక పోయినా, తన కీర్తనలు పాడుకుంటే చాలనీ, భుక్తికీ, ముక్తికీ ఏ లోటూ ఉండదన్నాడు త్యాగయ్య. అంతేకాని ఊరూ వాడా తన పేరున జయంతులు, వర్థంతులూ చేసేస్తారని కాదు.
శ్రీరాముణ్ణి ఆశ్రయించిన సీతకు, లక్ష్మణునికీ, శతృఘు్నడికీ, హనుమంతుడికీ లభించిన ఆనందం లాంటిది తనకు లభిస్తే చాలని ఆశ. అంతే భావించాడు. ఆయనకదే నిత్యానందం.
ఏక హృదయులై నిత్యానందము
శ్రీకర కరుణా సాగర నిరుపమ
చిన్మయ శ్రీత చింతామణి! నీ యెడ॥ లేకనా
1.సౌందర్యములో సుఖము సీతమ్మకు
సౌమిత్రికి కనులజాడ సుఖము లేకనా॥
2.సుందరముఖమున సుఖము భరతునికి
సుజ్ఞాన రూపమున సుఖము రిపుఘు్ననికి॥ లేకనా
3.చరణ యుగమునందు సుఖమాంజనేయునికి
వరగుణ త్యాగరాజ వరద ఆనందము॥
లేకనా నిన్ను చుట్టుకున్నారు?
‘అసావేరి’ రాగంలోని అపురూప కీర్తన ఇది.
రామచంద్రుడిలో సీతమ్మకు రకరకాల అందాలు కనిపిస్తున్నాయి. రామచంద్రుని కనుసైగలే లక్ష్మణుడికి ఆనందం. ఆజ్ఞాపిస్తే చాలు. పొంగిపోతాడు - రాముడి ముద్దు మోము భరతుడికి ఆనందాన్నిస్తోంది.
మూర్త్భీవించిన జ్ఞాన రూపంగా శత్రుఘు్నడికి కనిపిస్తూ అందులోనే తనివితీరా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇంక హనుమంతుడికి నిత్యమూ పాద సేవ చేయటంలోనే అపరిమితానందం.
అటు తండ్రి దశరథుడికి, తల్లులకు, అయోధ్య ప్రజలకు, ఇలా ఎవరిక్కావలసిన ఆనందాన్ని వారు పొందుతున్నారు. అందుకే వారంతా రాముణ్ణి ఆశ్రయించారు. యోగుల స్థితి ఇలాగే ఉంటుంది. రాముడు దేవుడనే మాట పక్కనపెట్టి ఆలోచిస్తే, భర్తగా, అన్నగా, యజమానిగా, పుత్రుడిగా, ఆదర్శప్రాయ జీవితమంటే అర్థం చెప్పాడు కాబట్టే, భక్తశిఖామణులందరూ ఆయనే్న పట్టుకున్నారు.
తన జన్మకు సార్థకతను చెప్పాడు.
శ్రీరామాయణంలోని ఘట్టాలన్నీ త్యాగయ్య నరనరాల్లో జీర్ణించుకు పోవడంతో అందులోని పాత్రల స్వభావాలన్నీ కరతలామలకమై సంగీత మకరందాన్ని నింపుకున్న కీర్తనలై భాసిల్లాయి. తింటున్నా, కూర్చున్నా, పడుకున్నా, పానీయం తాగుతున్నా, హరిస్మరణ తప్ప మరో ధ్యాస లేని ప్రహ్లాదుడే త్యాగయ్యకు స్ఫూర్తి.
అలా వచ్చినదే ఈ కీర్తన.
త్యాగరాజు రాముణ్ణి, రామనామాన్ని శ్యామశాస్త్రుల వారు ‘అంబా, తల్లీ జననీ’ అంటూ ఆ జగజ్జననినీ, ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రీ అనే మంగళకరమైన అక్షరంతో ఎన్ని వేల కీర్తనలు, ఎనె్నన్ని రాగాల్లో సంబోధించి పాడుకుని ఉంటారో? ఎలా పాడి వుంటారో? ఆ సంబోధనలో ఎంతటి ఆనందాన్ని పొంది ఉంటారో సంగీతజ్ఞులు ఊహించగలిగితే చాలు. వీరంతా అంతర్ముఖులై సంగీతోపాసన చేసినవారే. బయటకు వెళ్లి పదిమందిలో కూర్చుని పరుల కోసం కీర్తి కోసం ధన కనక వస్తు వాహనాల కోసం గానం చేసినవారు కాదు. వారికి లభించిన నిత్యానందం వారి కీర్తనలు పాడే ప్రతి గాయకుడికీ రావాలి. త్యాగయ్య లక్ష్యమదే.
సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిగారు విజయవాడ సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసే కాలంలో నేను తరచు కలుసుకుంటూ వుండేవాణ్ణి. చాలాసేపు సంగీత చర్చ చేసేవాళ్లం. మరో నాలుగు మాసాల్లో విశాఖపట్నం వెళ్లిపోతారనగా ‘రండి! ఇద్దరం కాసేపు పాడుకుందాం!’ అంటూ కాస్త ఆగి, ‘మళ్లీ వెళ్లిపోతాగా?’ అనగానే తరచు ఇంటికి వెళ్లి కూర్చుని పాడేవాణ్ణి. ఆ నాలుగు నెలల్లో నేను నేర్చుకున్న కీర్తనలు కేవలం 10 మాత్రమే. ఒక్కో కీర్తన మనసుకు బాగా పట్టి వొంటబట్టేవరకూ గంటల తరబడి నాదసుఖాన్ని అనుభవిస్తూ, మైమరచి పాడటం ఆయనలో చూశాను. ‘..లేకనా నిన్ను చుట్టుకున్నారు’ అనే కీర్తన సుమారు 45 నిమిషాలు హాయిగా ఓ రోజు ఉదయం అంతర్ముఖులమై పాడుకున్న సన్నివేశం నేను మరచిపోలేను. నాదసుఖం తెలిసిన వారికి ఆకలిదప్పులుండవు. అందుకే నాదయోగులంతా సంగీతాన్ని ఆశ్రయించారు. అదే మోక్షమని నమ్మారు.

- మల్లాది సూరిబాబు 90527 65490