S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవిత ఫార్ములా

మీ వద్ద డబ్బు నిలువడం లేదా? అనుకున్నట్టుగా పొదుపు చేయలేకపోతున్నారా? ఎప్పటికప్పుడు పొదుపు చేయాలి, రేపటి కోసం ఆ పొదుపును ఇనె్వస్ట్ చేయాలి అనుకుంటారు కానీ జీతం వచ్చాక ఖర్చులు పోగా మిగిలేదేమీ ఉండదు. ఎప్పటికప్పుడు ఇలానే ఈ సారి కాకపోయినా వచ్చేనెల నుంచి పొదుపు అంటూ వాయిదాలు వేయడం చాలా మంది జీవితాల్లో కనిపించేదే. ఎక్కువ మంది జీవితాల్లో ఇదే అంతులేని కథ కొనసాగుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నిజంగా మీకు బయటపడాలి అని ఉంటే పెద్ద కష్టమేమీ కాదు. ఐతే కొన్ని మార్పులు అవసరం.
జీతం రాగానే మీరేం చేస్తారు. మీరే కాదు ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది. అత్యవసరంగా చెల్లించాల్సిన వాటికి ముందుగా చెల్లిస్తారు. అంటే తొలుత ఇంటి అద్దె, ఆ తరువాత విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, నిత్యావసర వస్తువుల బిల్లులు ప్రాధాన్యతా క్రమం ప్రకారం చెల్లిస్తారు. ఆ తరువాత ఏమైనా మిగిలితే పొదుపు చేద్దాం అనుకుంటారు. నెల మధ్యలో వచ్చిన ఖర్చుతో ఆ పొదుపు ఖాతా కూడా ఖాళీ అవుతుంది. ఇది నిరంతరం జరిగేదే.
ఔను అందరి జీవితాల్లో ఇదే జరుగుతుంది. కానీ ఈ చిక్కు ముడులను తప్పించుకుని పొదుపు మార్గంలో పయనించే అవకాశం ఉంది. అలా పయనించిన వారే ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తారు. వారిదే భవిష్యత్తు.
జీతం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు. మీకు నెలకు ఆదాయం రాగానే అందరూ పాటించే లెక్క. ఆదాయం మైనస్ ఖర్చు=పొదుపు. లెక్కను పాటిస్తారు. అంటే ఎంత ఆదాయం వచ్చినా ముందు ఖర్చులకు పక్కన పెట్టి, మిగిలిన దానిని పొదుపు చేస్తారు. ఇక్కడే లెక్క తప్పుతోంది. మరేం చేయాలి అంటే. నెలకు ఎంత మొత్తంలో పొదుపు చేయాలి అని మీరు భావిస్తున్నారో ఒక అంచనాకు రండి. జీతంలో పది శాతం లేదా 20శాతం వరకు రేపటి కోసం పొదుపు చేయాలి అని మీరు భావిస్తే జీతం రాగానే ముందు మీకు మీరు చెల్లించుకోండి.
ఔను మీరు ఒక చోట జీతానికి పని చేసే వారే కావచ్చు. మీకు జీతం రాగానే వెంటనే మీకు మీరు చెల్లించుకోండి. మీరు నిర్ణయించుకున్న ప్రకారం పది శాతం కావచ్చు, 20 శాతం కావచ్చు. ముందుగా మీకు మీరు చెల్లించుకోండి. జీతం మీ బ్యాంకు ఖాతాలోనే పడుతుంది కాబట్టి మీకు మీరే ముందు చెల్లించుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఉదాహరణకు మీ జీతం 50 వేలు కావచ్చు. పది శాతం పొదుపు అనేది మీ లక్ష్యం అయితే జీతం రాగానే ముందుగా మీకు మీరు ఐదువేలు చెల్లించుకోండి. ఆ ఐదువేల రూపాయల పొదుపును మీకు నచ్చిన విధంగా ఇనె్వస్ట్ చేయండి. వేరుగా పొదుపు ఖాతాలో జమ చేసి ఆరునెలలకు ఒకసారి మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, లేక నెల నెలా సిప్ ద్వారా ఆ పొదుపును మ్యూచువల్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం కావచ్చు. మీకు ఏ మార్గం నచ్చితే, ఎక్కువ లాభసాటి అనుకుంటే అక్కడ ఇనె్వస్ట్ చేయవచ్చు. ముందుగా మీకు మీరు చెల్లించుకున్నా, ఖర్చులన్నీంటికి కేటాయించిన తరువాత మిగిలింది మీకు మీరు చెల్లించుకున్నా ఒకటే కదా? అని పించవచ్చు. అంకెలను కూడిక, తీసివేత లెక్కల్లో రెండూ ఒకటిగానే కనిపిస్తుంది కానీ ఆచరణలో చాలా తేడా ఉంటుంది.
ముందు మీకు మీరే చెల్లించుకునే విధానం ద్వారా మీ అలవాట్లు మారిపోతాయి, మీ భవిష్యత్తు కొంత కాలానికి మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది.
ఖర్చులన్నీంటికి కేటాయించిన తరువాత పొదుపు అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. సాధ్యం అయినా ప్రతినెలా అనుకున్న విధంగా ఒకే మొత్తం పొదుపు చేయలేరు. అనుకోని ఖర్చులు వస్తాయి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెట్టుకుంటాం అనే ఆలోచన వస్తుంది. కానీ ముందు మీకు మీరు చెల్లించుకున్న తరువాత ఖర్చలు అంటే మీ ఖర్చులపై మీకు పట్టు వస్తుంది.
ముందుగా మీకు మీరు ఐదువేల రూపాయలు చెల్లించుకుంటే మీ జీతంలో మిగిలిన 45వేలకు తగ్గట్టుగానే మీ ఖర్చులు ఉంటాయి.
ఆసక్తి ఉంటే తోటి ఉద్యోగులతో పొదుపు గురించి మాట్లాడి చూడండి. నెలకు పాతిక వేల రూపాయలు సంపాదించే ఉద్యోగి ఈ జీతంతో ఇళ్లు గడవడమే కష్టంగా ఉంది ఇక పొదుపు కూడానా అంటాడు. 25వేల నుంచి ఎంతో కొంత జీతం పెరిగితే అప్పుడు పొదుపు గురించి ఆలోచిస్తాను అనేది అతని సమాధానం అవుతుంది. అదే సమయంలో నెలకు 50వేల రూపాయల జీతం పొందే ఉద్యోగిని పలకరించి చూడండి జీతం సరిపోవడం లేదు. జీతం పెరిగిన తరువాత పొదుపు గురించి ఆలోచిస్తాను అంటాడు. మన ఆదాయానికి తగ్గట్టుగానే మన ఖర్చులు, మన ఆలోచనలు ఉంటాయి. జీతం తక్కువ ఎక్కువ అనేది పాయింట్ కాదు. మనం ఎంత సంపాదిస్తే దానికి తగ్గట్టుగానే ఖర్చులు పెంచుకుంటాం. ఆదాయం పెరుగుతున్నా కొద్ది ఖర్చులు పెంచుకుంటాం. ఇది అనివార్యం కూడా. ఐతే కొద్ది పాటి మార్పులతో మనకు మనం ముందు చెల్లించుకోవడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా అడుగులు వేయాలి. ఉద్యోగంలో చేరిన కొత్తలో నెలకు ఐదువేల పొదుపు అంటే చిన్న మొత్తం కానే కనిపించవచ్చు. కానీ చక్రవడ్డీ లెక్క తెలిస్తే కొంత కాలానికి ఇది ఎంత పెద్ద మొత్తం అవుతుందో అర్థం అవుతుంది. నెలకు ఐదువేల రూపాయలను పొదుపు చేసి మ్యూచువల్‌ఫండ్స్ లాంటి వాటిలో ఇనె్వస్ట్ చేస్తే కొంత కాలానికి ఉద్యోగం లేకపోయినా పరవాలేదు అనే స్థితికి చేరుకునే విధంగా ఆ పొదుపు ఒక గుట్టలా పెరుగుతుంది.
వయసు పెరుగుతున్నా కొద్ది ఆదాయమే కాదు ఖర్చులు కూడా పెరుగుతాయి. పిల్లల చదువులు, రిటైర్‌మెంట్ తరువాత జీవితం ఇవన్నీ భవిష్యత్తులో వచ్చే ఖర్చులు వాటి కోసం ముందు నుంచే సన్నద్ధం కావాలి. అలా సన్నద్ధం కావాలి అంటే లెక్కల్లో చిన్న మార్పు కావాలి. సింపుల్ లెక్క జీతం మైనస్ ఖర్చులు = పొదుపు. ఇది ఇప్పటి వరకు మనం పాటిస్తున్న జీతం ఫార్ములా! ఈ ఫార్ములాలో చిన్న మార్పు తీసుకు వస్తే మీ జీవిత లెక్కనే మారిపోతుంది.
దీనిలో కొద్దిగా మార్పు తెచ్చి, జీతం మైనస్ పొదుపు= ఖర్చు అనే లెక్క నేర్చుకుంటే జీవితంలో ఆర్థిక భరోసాకు ఢోకా లేదు. తాను ఈ లెక్కను పాటించే సంపన్నుడిని అయ్యాను అని వారెన్ బఫెట్ అనేక సెమినార్లలో చెప్పారు. జీతం/ ఆదాయం రాగానే ముందుగా మీకు మీరు చెల్లించుకునే విధానాన్ని ఈ నెల నుంచే ప్రారంభించండి.

-బి.మురళి