S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అస్తిత్వం కోరుతున్న ఆదివాసీ చిత్రకారులు

అది 2015 సంవత్సరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది కాలం గడిచింది. హైదరాబాద్‌లో ‘ఆదిచిత్ర’ (ఆదివాసీల చిత్రకళ) పేర ఓ పెద్ద కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. అందులో నాయక్‌పోడ్ గిరిజన తెగకు చెందిన కొందరు తమ ‘దేవర్ల’ను తీసుకొచ్చి, తొడుగులను (మాస్క్‌లను) ముఖాలకు తగిలించుకుని ‘నృత్యం’ చేశారు. నాయక్‌పోడ్ తెగకే ప్రత్యేకమైన ఆ నృత్యం ఎందరినో ఆకర్షించింది. ఆ బృందానికి పసుల బుచ్చయ్య నాయకత్వం వహించాడు.
పసుల బుచ్చయ్య చిత్రకారుడు, ఉద్యమకారుడు, రచయిత.. ఇట్లా అనేక పాత్రలు పోషించే వ్యక్తి ఆ తెగలో ఉండటం అపురూపం.
నాయక్‌పోడ్‌ల దేవర్లను, మాస్క్‌లను రూపొందించడం వెనుక ఎంతో నిష్ట.. రంగుల నైపుణ్యం.. సృజనాత్మకత దాగున్నది. సింగబోయడు, లక్ష్మీదేవర, గుర్రాపోతు (దున్నపోతు) ఇట్లా రకరకాలైన మాస్క్‌లను తయారుచేసి వాటిని రంగులతో అలంకరించడంలో వారి సంప్రదాయ నైపుణ్యం, నాజూకుతనం తొంగి చూస్తుంది. భక్తిశ్రద్ధలతో, అంకిత భావంతో, తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాల కనుగుణంగా వాటిని రూపొందిస్తున్నారు. ఈ మాస్క్‌ల కోసం అడవి నుంచి కొనికి కర్ర (మొద్దు) తెచ్చి ఆరబెట్టి ఏ ఆకృతిని తీర్చిదిద్దాలనుకుంటే దాని కనుగుణంగా ఉలితో చెక్కి, ముందు భాగంలో మాత్రమే ఆ ఆకారం కనిపించేలా చేసి మధ్యలో డొల్లగా మార్చి కొన్ని రోజులు ఆరబెట్టాక అనంతరం చింతజిగురు, కవిశ జిగురు తయారుచేసి ఆ ఆకారానికి ‘బకరాం క్లాత్’ (మందమైన బట్ట) ఆ ఆకృతికి చుట్టి జిగురు పట్టిస్తారు. మళ్లీ ఆరబెట్టాక ప్రాథమిక రంగులు వేస్తారు. ఆఖరున అవిశెనూనె పూస్తారు. దాంతో ఆ ఆకృతి అందంగా మెరుస్తుంది. సంప్రదాయ సిద్ధమైన లక్ష్మీదేవర, కొర్రాజుల తదితర నాయక్‌పోడ్ దేవతల ఆకారాలు తయారుచేస్తే కొలుపులు - జాతరలు చేసి పండుగ చేస్తారు. ఆ విధంగా ఆ దేవతల ఆకృతులు వివిధ చోట్ల భద్రపరుస్తారు. మాస్క్‌లను సైతం పవిత్రంగానే చూస్తారు.
ఇప్పుడు బుచ్చయ్య కొనికి కర్ర, అల్లికర్రతో చేసే ఆ మాస్క్ బొమ్మలను కాన్వాసుపైకి తీసుకొస్తున్నారు, బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అంతే నిష్టతో ఆ బొమ్మలను కాన్వాసుపై వేస్తున్నారు. కాన్వాసుపై ‘డెప్త్’ తీసుకొచ్చేందుకు అవసరమైన నైపుణ్యం ఆయన వశపరచుకున్నారు. దీనికి బీజం 1979-81 సంవత్సరాల మధ్య వరంగల్‌లో ఐటిఐలో డ్రాఫ్ట్స్‌మన్ శిక్షణ పొందినప్పుడే పడింది. ఆ సమయంలోనే వెర్టికల్, ప్యారలెల్ లైన్లు ఎలా గీయాలో గ్రాఫ్స్ ఎలా వేయాలో అవగాహన చేసుకున్నారు. అలాగే, ఆంగ్ల అక్షరాలు ఎలా అందంగా రాయాలో, ‘సమతుల్యత’ ఎలా ఉండాలో అక్కడ బోధించారు. ఆ ప్రాథమిక శాస్ర్తియ అవగాహన బుచ్చయ్యకు ఎంతో ఉపకరించింది. ఐటిఐకి పూర్వం పాఠశాలలో బొమ్మలు గీసినా, వాటర్ కలర్స్‌తో చిత్రాలు వేసినా ఆ ఆసక్తి ఐటిఐ విద్యలో ఎక్కువగా ఉపయోగపడిందని బుచ్చయ్య అంటున్నారు.
ఉపాధి కోసం పాల్వంచలో కొంతకాలం సైన్‌బోర్డు ఆర్టిస్టుగా పని చేశానని, 1985లో అప్పటి ప్రభుత్వం తెలుగులోనే దుకాణాల పేర్లు ఉండాలని జి.వో తీసుకురావడంతో సైన్‌బోర్డుల రాతకు డిమాండ్ పెరిగిందని, ఆ సమయంలో ఎక్కువ పని లభించిందని ఆ సమయంలోనే అక్షరాలనే గాక ఫిగరేటివ్ వర్క్ నేర్చుకున్నానని, రెండంగుళాల చిన్న బొమ్మలు పెద్దదిగా ఎలా గీయాలో స్థానిక పెయింటర్ దగ్గర తెలుసుకున్నానని, ఆ పని విధానం తనకెంతో ఉపకరించిందని బుచ్చయ్య చెప్పారు.
ఈ క్రమంలోనే గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం రావడంతో కృష్ణానగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లానని, చిత్రకల అభిరుచితో అక్కడ ఎక్కువ కాలం పని చేయలేక పోయానని వెనక్కి వచ్చి పాల్వంచలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ దుకాణ సముదాయంలో ఒక షాపులో స్క్రీన్ ప్రింటింగ్, మాస్క్‌లు తయారుచేయడం, పోట్రేట్స్ వేయడం ప్రారంభించానని అనంతరం కొంతకాలానికి అంటే 1993 సంవత్సరంలో నీటిపారుదల శాఖలో ‘ట్రేసర్’ ఉద్యోగం రావడంతో అందులో చేరానని ఆయన చెప్పారు. ఉద్యోగం చేస్తూనే చిత్రకళ పని కొనసాగించానని, ముఖ్యంగా నాయక్‌పోడ్ తెగ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చే పనులను తలకెత్తుకున్నానని, తమ జాతివారికి ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేని కారణంగా తమ జాతి మూలాలలోకి వెళ్లి వాటి ఆధారాలను సేకరించి, సంస్కృతి, చిత్రకళ, కొలుపులు, జాతరలు వాటి వెనుక గల చారిత్రక అంశాలు వెలికితీసి తమ జాతిని (నాయక్‌పోడ్‌లను) ప్రత్యేకంగా గుర్తించాలలని ప్రభుత్వాన్ని కోరుతూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. నాయక్‌పోడ్‌లు ఏర్పరచుకున్న రాష్ట్ర సంఘానికి ఉపాధ్యక్షునిగా, కార్యదర్శిగా ఆయన పని చేశారు. విద్య, ఉద్యోగాల కల్పనలో తమ తెగకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని అనేక మహజర్లను ఆయన, ఆయన బృందం ప్రభుత్వానికి అందజేసింది. తమను గోండ్‌లతో జత కలపడం వల్ల ఎన్నో విధాలుగా నష్టపోతున్నామని ఆయన వాదన. ఈ కార్యక్రమాలు ఇచ్చిన చైతన్యంతో ఆయన కంప్యూటర్‌పై పనిచేయడం నేర్చుకున్నారు. పేజ్‌మేకర్, ఫొటోషాప్‌ను ఆపరేట్ చేయడం అలవడింది. కంపోజ్ చేయడం నేర్చుకున్నారు. దీంతో ఆయన తన తెగకు చెందిన సమాచారం, చరిత్ర, లభించిన ఆధారాలు, చిత్రాలతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ విధంగా ఆయన వ్యాస రచయితగా, పుస్తక రచయితగా జిల్లాలో గుర్తింపు పొందారు. నాయక్‌పోడ గిరిజన తెగ నుంచి ఓ నిరక్షరాస్య పేద కుటుంబంలో 1960లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాగారం గ్రామంలో జన్మించిన పసుల బుచ్చయ్య అంచెలంచెలుగా చిత్రకారుడిగా, ఉద్యమకారుడిగా, రచయితగా ఎదగడం అరుదైన అపురూపమైన విషయం!
2018 సంవత్సరం ఆగస్టులో ‘ఆదివాసీ దినోత్సవం’ హైదరాబాద్‌లో జరిపారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన ఆ ఉత్సవంలో ‘పెయింటింగ్ ఎగ్జిబిషన్’ (గిరిజన చిత్రకళా ప్రదర్శన) నిర్వహించారు. అందులో బుచ్చయ్య ప్రముఖ పాత్ర నిర్వహించారు. నాయక్‌పోడ్ ఇతర గిరిజన తెగలకు చెందిన చిత్రకారులతో ఆర్ట్ క్యాంప్‌లు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో, ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్‌తో నిరంతరం సంబంధాలు నెరపుతూ ట్రైబల్ ఆర్ట్‌లో భాగమైన నాయక్‌పోడ్ జాతి చిత్రకళను ప్రపంచానికి పరిచయం చేయాలని తపన పడుతున్నారు. కాన్వాసులపై స్వయంగా సంప్రదాయ రంగులు - రేఖలతో కూడిన బొమ్మలు గీస్తూ ఇతరులకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
రంగుల్లో ‘మేడారం’
శాస్ర్తియంగా చిత్రకళను అధ్యయనం చేసిన కోయ చిత్రకారుడు చుంచ కుమారస్వామి. మహబూబ్‌నగర్ జిల్లా గంగారం మండలం మడగూడెంకు చెందిన కుమారస్వామి హైదరాబాద్, మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో 1999 నుంచి 2004 సంవత్సరం వరకు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బిఎఫ్‌ఐ) కోర్సు చేశారు. ఆయిల్ కలర్, వాటర్ కలర్స్‌తో పోట్రేట్స్ వేయడంలో అక్కడ మంచి శిక్షణ పొందారు. మట్టి (క్లే)తో బొమ్మలు తయారుచేయడంలో అక్కడ పాఠాలు బోధించారు. ముఖ్యంగా అక్కడ నేర్పిన ‘కలర్ థియరీ’ తనకెంతో ప్రయోజనం చేకూర్చిందని కుమారస్వామి అంటున్నారు. పోస్టర్ కలర్స్‌తో హాండ్‌మేడ్ పేపర్‌పై బొమ్మల సాధన సైతం తనకెంతో పనికొచ్చిందని అంటున్నారు. అలా శాస్ర్తియంగా నేర్చుకున్న చిత్రకళ ఇప్పుడు కోయ తెగ చిత్రాలను కాన్వాసుపైకి తీసుకురావడానికి ఎంతో దోహద పడుతోందంటున్నారు. పుట్టమట్టితో తయారుచేసే ఇండియన్ రెడ్ (జాజు) కలర్, తమ ప్రాంతంలోని సున్నపు బావుల నుంచి చేసే తెల్లరంగును వాడతామని, కోయ గిరిజన తెగ జీవితాలను చిత్రిక పడుతున్నామని అంటున్నారు. తాను కోయల నృత్యం, వడ్లు దంచడం, మేడారం పడిగిద్దరాజు జెండా ఇట్లా అనేక చిత్రాలను కాన్వాసుపై చిత్రించినట్టు కుమారస్వామి చెప్పారు. కోయ చిత్రకారుడిగానే కొనసాగుతానని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే లక్షలాది మంది హాజరయ్యే మేడారం జాతర సందర్భంగా అక్కడ (మేడారంలో) ఉన్న ట్రైబల్ మ్యూజియంలో దాదాపు 100 పెయింటింగ్స్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తనతోపాటు కోయ చిత్రకారులైన శ్రీ్ధర్, వేణుమాధవరావు, నవీన్‌లకు చెందిన బొమ్మలను తొలిసారి ప్రదర్శనకు పెట్టబోతున్నామని, అలాగే తాము ఒక ‘గ్రూప్’గా ఏర్పడి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన ఆర్ట్ క్యాంప్‌లో పాల్గొని కోయ గిరిజన బొమ్మలు గీశానని, హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాంపుల్లోనూ పాల్గొని కోయల జీవితాన్ని కాన్వాసుపై పొందుపరిచానని ఆయన చెప్పారు. 1981 సంవత్సరంలో జన్మించిన కుమారస్వామి మడగూడ, గంగారం, కొత్తగూడలో చదువుకున్నారు. ఉన్నత పాఠశాల విద్య అనంతరం హైదరాబాద్‌లో లోయర్, హయ్యర్ చిత్రలేఖన పరీక్షలు పాసయ్యాక, ఆ అనుభవంతో బిఎఫ్‌ఏలో చేరి ఉత్తీర్ణులయ్యారు. బాల్యం నుంచే చిత్రకళపై మక్కువ పెంచుకుని సాధన చేశానని, కొంతకాలం ఏటూరునాగారం ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేశానని, ఆ సమయంలో తనకు మంచి గుర్తింపు లభించిందని, తనకు, తన విద్యార్థులకు బంగారు పతకాలు చిత్రకళలో దక్కాయని ఆయన గర్వంగా చెబుతున్నారు.
కోయ చిత్రకళ వారసత్వాన్ని సజీవంగా నిలుపుతానని, ఆ సంస్కృతిని కాన్వాసుపైకి తర్జుమా చేస్తానని, దేశీ ‘రంగుల సాక్షి’గా ఆయన చెప్పారు.

పసుల బుచ్చయ్య (నాయక్‌పోడ్) 9652571578 చుంచ కుమారస్వామి (కోయ) 9491142952

-వుప్పల నరసింహం 9985781799