S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చైతన్య స్రవంతి

అన్నప్రాశన మహోత్సవం. బోర్లాపడుకున్న ఏడు నెలల స్రవంతి తలెత్తి ఎదురుగా బంగారునగలు, నోట్ల కట్టలవైపు చూసింది. చూపు మరల్చి ప్రక్కనే వున్న పుస్తకం, పెన్ను, చాకు, పూలదండ వైపు దృష్టి సారించింది. వాటి వెనుక నిలబడి. ‘‘రావాలి.. రావాలి.. చిట్టితల్లి’’ అని చేతులూపుతూ పిలుస్తున్న అమ్మ నాన్నలను చూస్తూ చేతులు నేలపై ఆన్చి పాదాలు పైకెత్తి పాకడం మొదలుపెట్టింది. ఏ వస్తువు మొదట ముట్టుకుంటుందా అని తల్లిదండ్రులు, చుట్టూ వున్న బంధువులు ఆతృతగా చూస్తుంటే హుషారుగా కేరింతలతో పాకుతూ వెళ్లి చాకును ముట్టుకుంది. ఆ తరువాత పెన్ను పుస్తకం పట్టుకుంది. నగలు, నోట్ల కట్టవైపు చిట్టితల్లి దృష్టి పోనేపోలేదు.
చుట్టూ చేరిన బంధువులు హర్షాతిరేకంతో ఆశీర్వదించారు.
‘‘మీ అమ్మాయికి బంగారం, డబ్బు అంటే ఆశలేదు. కత్తి, కలం పట్టుకుంది.. నాయకురాలవుతుంది’’ దీవించింది స్రవంతి అత్తయ్య.
ముద్దుగా, బొద్దుగా వున్న స్రవంతిని ఎత్తుకుని అందరూ ముద్దులాడారు. ‘పాపకు దిష్టితీయండి’ సలహా పురోహితునిది. అన్నప్రాశస మహోత్సవం వేడుకగా ముగిసింది.
***
గోపాలరావు ఐపిఎస్.. భ్రమరాంబల ఏకైక సంతానం స్రవంతి. భ్రమరాంబ డిగ్రీ చదివింది. సంగీత విద్వాంసురాలు. పెళ్ళయిన పదేళ్ళకి పుట్టిన సంతానం కావడంతో స్రవంతి గారాబంగా పెరుగుతోంది.
గోపాలరావు దంపతులు కూతురి పెంపకంలో ఎంతో శ్రద్ధతీసుకున్నారు. బాల్యం నుండే స్రవంతికి గోపాలరావు రోజూ రాత్రి పడుకోబోయే ముందు రామాయణ కథలు, నీతి కథలు బోధించేవాడు. స్వాతంత్య్ర సమరయోధుల గాథలు, వీర వనితల జీవితాలు వినిపించేవాడు. ‘్ధన సంపాదన కన్నా జ్ఞాన సముపార్జనే మిన్న’ అనే సూత్రాన్ని కూతురికి వంటబట్టించాడు.
ఐదో ఏటనుంచే తల్లి సంగీత శిక్షణ ప్రారంభించింది. వయసు పెరుగుతుంటే విద్యతోపాటు సంస్కారం నేర్చుకుంది స్రవంతి. తల్లి గురువై కూతురిని సంగీతంలో నిష్ణాతురాలిని చేసింది. స్రవంతి సుమధుర స్వరంతో త్యాగరాజ కృతులు, అన్నమయ్య కీర్తనలు అలవోకగా ఆలపించేది. వయసు తెచ్చిన సొగసులతో స్రవంతి కాలేజీ బ్యూటీగా వనె్నకెక్కింది.
***
గోపాలరావు ఐపిఎస్ సిన్సియర్ అండ్ ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. పై అధికారుల ఒత్తిడులకు తట్టుకుంటూ అన్యాయాల్ని ప్రతిఘటిస్తున్నాడు. దోషులు తప్పించుకునే వీలు లేకుండా పకడ్బందీగా కేసులు రూపొందిస్తున్నాడు. అక్రమార్కులకు సింహస్వప్నంగా నిలిచాడు. మంత్రిగారి కుమారుడు ఒక అమాయకురాల్ని రేప్‌చేసిన కేసులో మంత్రిగారి కుమారుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి బోనులో నిలబెట్టి యావజ్జీవ శిక్ష పడేలా కేసు నడిపాడు గోపాలరావు. మంత్రిగారి పదవి ఊడింది. కోపోద్రిక్తుడైన మాజీ మంత్రి గోపాలరావుపై కత్తికట్టాడు. తెల్లవారు ఝామున చీకట్లో మార్నింగ్ వాక్‌కు వెడుతున్న గోపాలరావును నక్సలైట్ల పేరుతో రౌడీలు తుపాకులతో ఎటాక్ చేశారు. గోపాలరావు అక్కడికక్కడే నేలకూలాడు. నక్సలైట్ల దాడిలో గోపాలరావు మృతి చెందాడని పోలీసులు నిర్థారించి కేసు మూసేశారు. తండ్రి చనిపోయేనాటికి స్రవంతి వయసు ఇరవై. ఆమె ఆ సంవత్సరమే డిగ్రీపూర్తిచేసింది.
***
తన భర్త చనిపోవడానికి నక్సలైట్లుకారణం కాదని భ్రమరాంబకు తెలుసు. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వౌనంగా ఉండిపోయింది. కూతురి భవిష్యత్తు ముఖ్యమని తలచింది.
‘‘ఈ దేశంలో అవినీతి ఏరులై పారుతోంది. నేడు ఉద్యోగస్తులను, రాజకీయ నాయకులను నడిపించే ఏకైక మంత్రం లంచం. డబ్బుకోసం గడ్డితినే మనుషులతో రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ మంత్రాంగంలో చిక్కుకుంది. మీ నాన్నగారి వంటి నిజాయితీపరులకు రక్షణ కరువైంది. మీ నాన్నగారు అవినీతిని ఎదిరించి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు బాగా తెలుసు. రోజూ రాత్రి ఆఫీసు విషయాలు నాతో పంచుకునేవారు. ఈ వ్యవస్థను తనొక్కడే మార్చలేడని, కనీసం తనవరకు నీతిగా నిజాయితీగా బ్రతుకుదామన్నా వీలులేని పరిస్థితి..’’ అని వాపోయేవారు. భ్రమరాంబ ఆవేదనతో చెప్పిన మాటలకు స్రవంతి మనసు కోపంగా రగిలిపోయింది. ఏదో చెయ్యాలి.. తండ్రి ఆశయం నెరవేర్చాలంటే ఒక వ్యక్తిగా సాధ్యంకాదు.. ఒక శక్తిగా మారాలి అని తలపోసింది స్రవంతి. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు. తల్లికి ధైర్యం చెప్పింది కూతురు.
***
త్యాగరాజ గానసభలో స్రవంతి పాటకచేరి జరిగింది. ఆమె అద్భుత స్వరానికి శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు. ఆ కార్యక్రమానకి హాజరైన ప్రముఖ సంగీత దర్శకుడు రాజేంద్ర కార్యక్రమం పూర్తయ్యాక స్రవంతిని అభినందనలతో ముంచెత్తాడు. తను సంగీత దర్శకత్వం వహిస్తున్న సినిమాకు పాటలు పాడాలని ఆహ్వానించాడు. స్రవంతి ఇంటికొచ్చాక తల్లి సలహా తీసుకుంది.
ఆమె మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. తన ఆశయం సిద్ధించాలంటే ముందుగా తానో సెలబ్రిటీగా మారాలని తలపోసింది. డైరెక్టర్ ఆహ్వానం ఆ భగవంతుని నిర్ణయంగా భావించింది. సంగీత దర్శకునికి ఫోన్ చేసి తన అంగీకారం తెలిపింది.
రాజేంద్ర సంగీత దర్శకత్వంలో మూడు పాటలు పాడింది స్రవంతి. ఆ సమయంలో స్టూడియోలో ఆమెను చూసిన ప్రముఖ దర్శకుడు ప్రభాకరమూర్తి తను తీయబోతున్న సినిమాలో హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు.
‘‘మీ అందం అద్భుతం.. కంఠస్వరం అపూర్వం.. మీరు ఫీల్డులోకి వస్తే ఎదురుండదు’’ ప్రశంసించాడు ప్రభాకరమూర్తి.
అసభ్యకరమైన సన్నివేశాలలో నటించననే షరతుమీద స్రవంతి హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించింది.
‘‘మీరు హీరోయన్‌గా నటిస్తానంటే అంతకన్నానా.. మీకు నచ్చని సన్నివేశాలలో నటించమని బలవంతం చేయం’’అంటూ ప్రభాకరమూర్తి స్రవంతిని సినీ ఫీల్డుకు ఆహ్వానించాడు. తన పాటలు తనే పాడుకునే అవకాశం కల్పించాడు.
డైరెక్టర్ వివరించే సన్నివేశాలను చక్కగా ఆకళింపు చేసుకుని సునాయాసంగా నటించసాగింది స్రవంతి. మొదటి చిత్రమంటే ఎవరూ నమ్మలేనంత గొప్పగా నటించి విశే్లషకుల ప్రశంసలుపొందింది. ఆమె మొదటి చిత్రమే సూపర్‌హిట్టయ్యింది. మొదటి చిత్రంతోనే స్రవంతి పేరున
అభిమాన సంఘాలు వెలిశాయి.
వరుసగా అగ్రిమెంట్లమీద సంతకాలు చేయసాగింది స్రవంతి. ఆమె సినిమాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభించింది. కాసుల వర్షం కురుస్తోంది.
‘కళ్ళతోనే హావభావాలు ప్రకటించగల నటి.. ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ పలికించగల నటి.. నవరసాలను సవ్యంగా పండిస్తున్న నటి.. డైలాగ్ డెలివరీ అనన్య సామాన్యం..’’ అంటూ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
పది సంవత్సరాల కెరీర్ అద్భుతంగా గడిచింది. వివాదాలకు దూరంగా వున్న నటిగా పేరు తెచ్చుకుంది స్రవంతి.. ‘సౌమ్యురాలు.. అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది.. ఆపదలో వున్నవారిని ఆదుకుంటుంది’ అని ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. నటనతోపాటు సంగీత కచేరీలు చేస్తూ సంగీతప్రియుల అభిమానం సంపాదించింది.
పెళ్లిచేసుకోమని తల్లి ప్రపోజ్ చేసింది. సున్నితంగా తిరస్కరించింది స్రవంతి. ‘‘నా లక్ష్యం వేరే.. నాన్నగారి ఆశయసిద్ధికి కృషిచేస్తా.. నేను పెళ్ళిచేసుకుని కుటుంబానికి కట్టుబడలేను. నా లక్ష్యసిద్ధికి సినీ ఫీల్డును ఆలంబనగా చేసుకున్నానంతే...’’ తల్లికి బదులిచ్చింది కూతురు.
***
చేతిలో వున్న సినిమాలు పూర్తిచేసుకుని హఠాత్తుగా పత్రికా సమావేశం ఏర్పాటుచేసింది స్రవంతి. ఆమె వివాహ వార్త చెపుతుందని హుషారుగావచ్చిన విలేఖరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తాను రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అవినీతిని అంతమొందించి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఏకైకలక్ష్యంతో రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు, ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఆ వార్త విన్న అభిమానులు ఉత్సాహంతో అభినందించారు. ఆమె లక్ష్య సాధనలో పాలు పంచుకుంటామని ప్రకటించారు.
సినిమా మహారాణి అయినంత మాత్రాన రాజకీయాల్లో రాణిస్తుందా.. ఎన్నికల్లో పోటీ చేస్తుందట.. తలపండిన మేధావులం మనని కాదని ఈవిడగారికెవరు ఓటేస్తారు..’’ హేళన చేశారు రాజకీయ నేతలు.
***
ముకుందరావు ఐఎఎస్.. జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిపరుల ఆట కట్టించాలని విశ్వప్రయత్నం చేశాడు. పై అధికారుల ఒత్తిడి తట్టుకోవడం కష్టమైంది. నిజాయితీకి నిలువెత్తు రూపం ముకుందరావని పేరు సంపాదించినా, అవినీతిపరుల మధ్య పనిచేయడానికి మనసొప్పలేదు. ముకుందరావుకు తాత తండ్రులు సపాదించిన ఆస్తులున్నాయి. ఉద్యోగం లేకపోయినా తిండికి లోటులేదనుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి నిర్మూలనకు నడుం కట్టి రాజకీయ పార్టీ ప్రారంభించాడు. పార్టీ పేరు ‘ప్రజాచైతన్య పార్టీ’. ప్రజలలో చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో పార్టీ ప్రచారం ప్రారంభించాడు. నిజాయితీపరులకు మాత్రమే పార్టీలో సభ్యత్వం కల్పించాడు. పార్టీ ప్రారంభించి సంవత్సరం గడిచినా ప్రజాచైతన్య పార్టీ ముకుందరావు అనుకున్నంతగా ప్రజలలో చైతన్యం రగల్చలేకపోయింది. పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఆలోచిస్తున్న సమయంలో స్రవంతి ప్రకటన ముకుందరావుని ఆకర్షించింది.
***
స్రవంతి పత్రికా ప్రకటన వెలువడిన వెంటనే ముకుందరావు ఆమెను ఇంటి వద్ద కలిశాడు. తన పార్టీ లక్ష్యాలు వివరించి తనతో చేతులు కలపమన్నాడు.
‘‘మీ నాన్నగారు నేను మంచి మిత్రులం. మా లక్ష్యాలు ఒక్కటే... మా పార్టీ పగ్గాలు మీరు చేపట్టండి.. నేను నా పూర్తిసహాయ సకారాలందిస్తాను’’ అంటూ పార్టీలోకి స్రవంతిని ఆహ్వానించాడు ముకుందరావు.
‘‘మీకు జనాకర్షణ శక్తి వుంది. నాకు పరిపాలనాననుభవం వుంది. మన ఆశయాలను గౌరవించే రిటైర్డ్ ఆఫీసర్స్ నాకు తెలుసు. అందరం కలిసి అవినీతిరహిత పాలనకు శ్రీకారం చుడదాం’’ అన్నాడు ముకుందరావు.
అతని మాటలలో నిజాయితీని స్రవంతి ఆకట్టుకుంది.
తల్లి సలహా తీసుకుంది స్రవంతి. ‘‘క్రొత్తగా మనం పార్టీ పెడితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వుంటాయి. ముకుందరావుగారు అనుభవజ్ఞుడు. ఆయనతో చేతులు కలుపు. లక్ష్యం సాధించు’’ దీవించింది భ్రమరాంబ.
ముకుందరావు పార్టీలో చేరడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది స్రవంతి.
***
పదిమంది రిటైర్డ్ ఐఎఎప్, ఐపిఎస్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటుచేశాడు ముకుందరావు. స్రవంతి తన లక్ష్యం వివరించింది. అందరి సహకారం అర్థించింది.
‘‘అవినీతిపాలనను అంతమొందించాలని మేం సర్వీసులో ఉండగా ప్రయత్నించాం. కానీ ఏమీ సాధించలేకపోయాం. ప్రజాదరణ గల మీవంటి వ్యక్తులు పదవి చేపట్టి అవినీతి నిర్మూలనకు నడుం కడితే తప్పక ఫలితాలు సాధించగలమని నమ్ముతున్నాం. మీరు ముందు నడవండి. ప్రజలను సమీకరించండి.. మీ వెంటే మేముంటాం. మనందరం కలిసి నిస్వార్థసేవకు నడుం కడదాం’’ దిశా నిర్దేశం చేశాడు రిటైర్డ్ ఆఫీసర్లు.
సినీరంగంలో తాను సంపాదించిన సంపదను పార్టీకి విరాళంగా ప్రకటించింది స్రవంతి. ఆమె నిర్ణయాన్ని వారంతా అభినందించారు.
స్రవంతి విజయం సాధించగల ప్రజ్ఞావంతురాలని ముకుందరావు నమ్మాడు. ఆమెకు పూర్తి సహాయ సహకారాలందిస్తానని ప్రకటించాడు. పార్టీ నాయకురాలిగా స్రవంతికి బాధ్యతలు అప్పగించాడు. స్రవంతికి ఉపన్యాసాలు తయారుచేసే బాధ్యతను ఒకరిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ తీసుకున్నాడు. యువతను, విద్యావంతులను చైతన్యపరిచి తమ పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లివ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ఎన్నిక చేసి వారు తాము నిర్దేశించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకునే వీలు కల్పించాలని సంకల్పించారు. స్రవంతి రాష్టమ్రంతటా ఒకసారి పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నాక పార్టీ మేనిఫెస్టో తయారుచేయాలని నిర్ణయించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను స్రవంతి పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రకటించింది.
***
ప్రత్యేకంగా నిర్మించిన వ్యాన్‌లో ముకుందరావు తోడురాగా రెండు నెలలు రాష్టమ్రంతటా పర్యటించింది స్రవంతి. ముఖ్యకూడళ్ళలో బహిరంగ సభలు నిర్వహించింది. సినిమా హీరోయిన్‌ను చూడటానికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిసభలో స్రవంతి తాను అవినీతిపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు ప్రజలకు విన్నవించింది. ‘ఇపుడున్న రాజకీయ పార్టీలు అవినీతి రొచ్చులో మునిగితేలుతున్నాయి. నాకో అవకాశం ఇవ్వండి... నీతివంతమైన పాలన అందిస్తానని శపథంచేస్తున్నాను. అన్యాయాల్ని ఎదిరించడంలో అవసరమైతే నా ప్రాణాల్ని పణంగా పెట్టడానికి వెనుకాడను.. నన్ను నమ్మండి. మార్పునకు నాంది పలకండి’’ అంటూన్న ఆమె ప్రసంగాలను ప్రజలు జయజయ ధ్వానాలతో స్వాగతించారు.
ఎంతో సంపాదనకు అవకాశంవున్న కెరీర్‌ను పణంగాపెట్టి సంపాదించిన ఆస్తిని పార్టీకి విరాళంగా ఇచ్చేసి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ప్రజల్లోకి రావడం చర్చనీయాంశమైంది..
స్రవంతి వాగ్ధాటికి ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆ కంఠంలోని సమ్మోహనశక్తికి ప్రజలు బ్రహ్మరథంపట్టారు. ఆమె వదనంలోని నిజాయితీని ప్రజలు స్వాగతించారు. ఒక అక్కలా యువకులు ఆదరించారు. ఒక కూతురులా పెద్దలు దీవించారు.
రెండు నెలల పర్యటన స్రవంతిలో నూతనోత్సాహాన్ని నింపింది. తన లక్ష్యం నెరవేరే రోజు దగ్గరలో వుందన్న ఆశతో ఆమె తన ఆలోచనలకు పదునుపెట్టింది. ఆమె ఆలోచనలను ముకుందరావు ఆచరణాత్మక కార్యక్రమాలుగా మలిచాడు.
పార్టీలో సభ్యుల చేరిక లక్షలు దాటింది. పార్టీ ప్రెసిడెంటుగా స్రవంతి ఎన్నికైంది. కార్యదర్శిగా ముకుందరావు నిలిచాడు. స్రవంతి ఫ్యాన్స్ గ్రామగ్రామాన తిరుగుతూ ఓటర్లలో చైతన్యం రగులుస్తున్నారు. స్రవంతి ముకుందరావులు తమకి తోడున్న రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్‌ల సాయంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిజాయితీగల చదువుకున్న యువకులను ఎంపిక చేశారు.
***
ప్రజలమధ్య తిరుగుతూంటే సంవత్సరం గడిచినట్లే తెలియలేదు స్రవంతికి. అనుకున్నట్లే ఎన్నికలు ప్రకటించారు. మొత్తం నూట ఎనభై స్థానాల్లో ఇదివరకే నిర్ణయించిన అభ్యర్థులకు టిక్కెట్లు ప్రకటించింది స్రవంతి. పార్టీ జెండా చేతబూని తన ఫ్యాన్స్ వెంటరాగా ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటించి పార్టీ ప్రచారం చేసింది స్రవంతి.
తను వివాహం చేసుకోదలచుకోలేదని తన భావి జీవితం ప్రజాసేవకే అంకితమన్న స్రవంతి ప్రకటనకు ప్రజలు హర్షధ్వానాలు చేశారు. తమ పార్టీ గెలిస్తే అవినీతిని అంతమొందిస్తానని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగుపెట్టిస్తానని.. అన్యాయాలు, అక్రమాలకు కళ్లెం వేస్తానని, రైతు కష్టాలు గట్టెక్కించే పథకాలు అమలు చేస్తానని, బడుగు బలహీన వర్గాల ఉన్నతి స్థితికి చేరుకునే పథకాలు రూపొందిస్తానని బాస చేసింది.
స్రవంతి పట్టుదలకు, ఆమె మాటలలో సిన్సియారిటీకి ప్రజలు సంతృప్తి వ్యక్తపరిచారు. అవినీతి పార్టీలతో విసిగిపోయిన ఓటర్లు స్రవంతి పార్టీకి జైకొట్టసాగారు.
ముకుందరావుతో సహా మాజీ ఐఎఎస్ ఐపిఎస్‌లు విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మేధావులను పార్టీకి అనుకూలంగా సమీకరించారు. ఎక్కడా తొట్రుపడకుండా అలుపులేకుండా రాత్రీ పగలూ పద్ధతి ప్రకారం ప్రచారం చేసింది స్రవంతి. ఎక్కడికక్కడ స్థానిక నేతలే ప్రచారానికి ఖర్చుని భరించారు. యువత ప్రతిపక్షాలాపేక్ష లేకుండా పార్టీ విజయానికి కృషిచేశారు.
ఒక ఉద్యమంలా సాగిన ప్రచారం చివరి దశకు చేరేసరికి ప్రజాచైతన్య పార్టీ విజయం ఖాయమని తేలింది.
కంగారుపడిన అధికార పార్టీ ప్రచారం చివరి రోజున డబ్బు సంచులు గుమ్మరించింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసింది. ఎన్నికలు ముగిశాయి.
***
ఫలితాలు ప్రకటించారు. నూట ఎనభై నియోజకవర్గాల్లోని తొంభై ఐదు స్థానాల్లో ప్రజాచైతన్యపార్టీ విజయకేతనం ఎగరేసింది. స్రవంతి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అందరూ భావించారు. అధికార పార్టీ అంత తేలికగా అధికారం వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఫలితాలు ప్రకటించిన గంట సేపట్లోనే ప్రజాచైతన్య పార్టీనుండి ఎన్నికైన పదిమంది ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయబడ్డారు. వారు అధికార పార్టీకి మద్దతు ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఎన్నికల కమీషన్ ఎన్నికలు పూర్తయినట్లు ఎన్నికల అభ్యర్థుల జాబితాను గవర్నర్‌కు సమర్పించిన వెంటనే పాత ముఖ్యమంత్రినే గవర్నరు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. మరుసటి రోజు ఉదయం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయింపబడింది. విషయం తెలుసుకున్న స్రవంతి ఆగ్రహోదగ్రురాలైంది. ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ ప్రమాణ స్వీకారం జరగడానికి వీలులేదని, కిడ్నాపైన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని ప్రకటించింది.
మర్నాడు ఉదయం ప్రమాణ స్వీకార సమయానికి ముందే ప్రజాస్వామ్యవాదులంతా రాజ్‌భవన్ చుట్టుముట్టాలని ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని టీవీల ద్వారా ప్రకటించింది.
***
ఉదయం ఎనిమిది గంటలకే.. నేల ఈనినట్లు జనం ఒక్కసారిగా విరుచుకపడ్డారు. గ్రామాలనుండి ట్రాక్టర్లలో, లారీల్లో వచ్చిన జనం రాజ్‌భవన్‌ను చుట్టుముట్టారు. లక్షలమంది జనంతో రాజ్‌భవన్ చుట్టూ రోడ్లు నిండిపోయాయి. బయట మనిషి రాజ్‌భవన్‌లో ప్రవేశించలేడు. లోపలి మనిషి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
పోలీసులు నిస్సహాయంగా నిలుచుండిపోయారు.
కిడ్నాపైన ఎమ్మెల్యేలను విడిపించాలని స్రవంతి గవర్నర్‌ను కోరింది. గవర్నర్ ప్రజాగ్రహం గ్రహించి దిక్కుతోచని స్థితిలో వెంటనే ప్రజాచైతన్య పార్టీకి చెందిన కిడ్నాప్ అయిన ఎమ్మెల్యేలను తనముందు హాజరుపరచాలని డిజిపి ఆదేశించాడు.
***
అదేరోజు సాయంత్రం లక్షలమంది ప్రజల సాక్షిగా స్రవంతి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ముకుందరావు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆమె మంత్రివర్గంలో అందరూ యువకులే.. విద్యావంతులే.. నిజాయితీపరులే..
***
మరో ఐదు సంవత్సరాల తరువాత.. మళ్లీ ఎన్నికలు జరిగాయి. అవినీతిరహిత పాలన అందించడమేగాక, ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగెత్తించిన ప్రజాచైతన్య పార్టీ నూట అరవై స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. రైతన్నల ముఖంలో చిరునవ్వులు వెలుగుతుండగా స్రవంతి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
=================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ఇంద్రగంటి నరసింహమూర్తి 99593 52900