‘ధాత వ్రాయవలెరా?’
Published Monday, 3 June 2019కాస్తో కూస్తో నాలుగు మాటలల్లడం తెలిసినంత మాత్రాన అందరూ కవులవ్వరు. కాస్త ముఖానికి మేకప్ చేసినంత మాత్రాన అంతా హీరోలవ్వరు. నాలుగు రాగాల పేర్లు తెలిసినంత మాత్రాన, అందరూ కమ్మగా పాడలేరు. శ్రద్ధగా ఎంతకాలం సంగీతం నేర్చినా విద్వాంసులవ్వాలనే నియమం లేదు.
సమయం, సందర్భం అన్నీ కలిసి రావటంతోబాటు, దైవ బలం కూడా వుండాలి.
యోగ్యులెందరో వుండవచ్చు కానీ యోగం కొందరికే వుంటుంది. పట్రాయిని సీతారామశాస్ర్తీ శిష్యుడైన ఘంటసాల వెంకటేశ్వర్రావు విజయనగరంలో సంగీతం నేర్చుకునే సమయంలో తీసిన ఫొటో ఒకటి నా కంటపడింది. క్రింది వరుసలో ఎడమ నుండి కుడి వరసలో కూర్చున్నవారు ‘ఘంటసాల’ అని రాశారు. ఘంటసాలతో పాటు గురువుగారి పాదాల దగ్గరే కూర్చుని ఫొటో తీయించుకున్న ఇతర విద్యార్థులకు ఘంటసాలకు పట్టిన యోగం పట్టిందా మరి? వారి చిరునామాలే మనకు తెలియవు. యోగమంటే అదే. అందుకే ‘సీతావర! సంగీత జ్ఞానము ధాతవ్రాయవలెరా?’ అంటారు సద్గురువైన త్యాగరాజు. భక్తులు భావాలు పంచుకుంటారనటానికి మహాభక్త శిఖామణులైన ఈ వాగ్గేయకారులే సాక్ష్యం.
గడ్డి తవ్వటం, పశువుల కోసం మోపులు కట్టి ఇంటికి తీసుకురావటం లాంటి పనులతో ఇంట్లో వాళ్లంతా విసిగిస్తే, తిక్కతో ఓ రోజు చేతిలో వున్న గొడ్డలిని పారవేసి తాళ్లపాక గ్రామం వదిలేసి, శ్రీ వేంకటేశ్వర దర్శనాపేక్షతో తిరుపతికి బయలుదేరే నాటికి అన్నమయ్య వయస్సు ఇంచుమించు 16 ఏళ్లు. తీరా మోకాళ్ల పర్వతం దగ్గరకు వచ్చేసరికి చాలా అలసిపోయాడు. ఆకలితో విలవిల్లాడిపోయిన అన్నమయ్యకు స్వప్నంలో ఆ తల్లి కనిపించి, సాలగ్రామమయమైన ఈ కొండను చెప్పులతో ఎక్కకూడదని, చెప్పులు విడిచి ఎక్కితే అలసట లేకుండా మనోభీష్టం నెరవేరి, స్వామి దర్శనవౌతుందని చెప్పి తానూ, స్వామి ఆరగించిన ప్రసాదాన్నం అన్నమయ్యకు పెట్టి ఆ తల్లి అంతర్థానమైందట. అంతే. అన్నమయ్య నోటి వెంట ఆశువుగా అలమేలు మంగాదేవి మీద ఒక శతకం వెలువడింది. నడుస్తూ అలా వెళ్తున్నాడు. కొండ మీద కనపడే ప్రతి చోట ఒక్కో విశేషం కనిపించింది. కొండమీద వున్న భాష్యకారులపైన మొదలుకొని స్వామి పుష్కరిణి పైన, గరుడ కంబం మీద, విష్వక్సేన, విగ్రహాలన్నీ దాటి గర్భగృహంలోని స్వామి సన్నిధి చేరేవరకూ సంకీర్తనలు ఆశువుగా పాడేశాడు. ఒళ్లు తెలియని భావావేశం.
అప్పుడే స్వామి సాక్షాత్కారమైనట్లు చెప్తారు. కారణజన్ములైన భక్తుల్లో ఒక్కొక్కరిని ఆ దైవం ఎలా బతకమన్నాడో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. ఏకంగా తన జీవితకాలంలో 32 వేల సంకీర్తనలు రాశాడు. అదే ఆయన లక్ష్యం. శ్రీకైవల్య పదాన్ని చేరేందుకు చింతించి, భాగవతాన్ని ఈ జాతికి అందించి ధన్యుడైన పోతన కూడా మరో ఉదాహరణ. మహాభక్తుడైన పోతన ఎంతమందిని పునీతుల్ని చేశాడో, మరెందరికి ఆదర్శప్రాయుడయ్యాడో వేరే చెప్పాలా? లోక క్షేమం కోరి యధార్థాన్ని చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడని వారే వీరంతా. తెలివైన వాడు అవతలి వాడి అనుభవాన్ని పాఠంగా స్వీకరిస్తాడు. మూర్ఖునికి స్వీయానుభవమే కళ్లు తెరిపించవచ్చు. త్యాగయ్య ఇంట్లో భాగవతమే నిత్య పారాయణ గ్రంథం. తండ్రి రామబ్రహ్మం వృత్తి, పురాణ పఠనం. ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది. పోతన భాగవతం త్యాగయ్యకు కరతలామలకం. అందులోని ప్రతి పాత్ర స్వభావం ఆయన కెఱుకే. పోతన మహాకవి తెలుగు పద్యాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం.
‘అంధేందూదయముల్, మహాబధిర శంఖారావముల్ మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్, నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నా వళీ
బంధుత్వంబులు, భహ్మహవ్యములు, లుబ్ధద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్, హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్’
-నేను తెలుగువాణ్ణి. నా మాతృభాష తెలుగు అనుకునేవారికి ఇటువంటి పద్యాల మాధుర్యం తెలియకపోతే ఇంకెందుకు?
నలుగురిలోనూ చులకనగాదా? మన పిల్లలు పద్యంలోని సొగసులనూ మాధుర్యాన్ని అనుభవించలేని స్థితిని ఇప్పటికే మనమే కల్పించాం.
తమిళనాడులో స్థిరపడి తెలుగు భాషకు తన కీర్తనలతో పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసిన త్యాగయ్యకు స్ఫూర్తి ప్రదాత పోతనే.
‘బలము కులము ఏల? రామ? భక్తి కారణము
వెలయు సిద్ధులెల్ల - వెంట వచ్చుగాని మేను॥
1.నీట కాకి మీనుమునుగ
నిరతము దయ స్నానమా
తేట కనులు కొంగ కూర్చ దేవదేవధ్యానమా!
2.పత్రములను మేయు మేక
బలమైన ఉపాసమా?
చిత్ర పక్షు లెగయ సూర్య
చంద్రులకు సామ్యమా?
3.గుహల వేషకోటులుంటే - గుణము కల్గువౌనులా
గహనమునను కోతులుండ ఘనవౌ వనవాసమా॥
4.వలచు త్యాగరాజ వరదు వరభక్తులు సేయు భక్తి
చెలగు సకల జనులకెల్ల చెల్లిన కాసౌనుగా॥
పోతన అడుగుజాడల్లో నడిచాడు కాబట్టే ఆయన కీర్తనకు అంతటి సుగంధం అబ్బింది.
చేప బ్రతుకెప్పుడూ నీరే. కాకులు నీటిలో మునుగుతూంటాయి. అది పరిశుద్ధత కోసం చేసే ప్రొద్దునే్న చేసే స్నానవౌతుందా?
తన కళ్లను కొంగ మూసుకుని పెద్దపెద్ద అంగలేసుకుంటూ ఆగితే ‘అది దేవదేవుడి ధ్యామా?’ బక ధ్యానమే. మేక ఆకులను మేస్తుంది - లేదా కనిపించిన దుంపలు తింటుంది. అది ఉపవాసమా? కొన్ని వింతవింత పక్షులు ఆకాశంలో చాలా ఎత్తుకుపోతాయి. ఆ గమనాన్ని సూర్యచంద్రులతో పోల్చగలమా? కదిలే చాలా జంతువులకు భాష లేదు. అది వౌన వ్రతవౌతుందా? కానీ భాగవతంలో ప్రహ్లాదుడు గజేంద్రుని భక్తిని పొగడుతూ పొంగిపోతాడు. స్నానం, ధ్యానం, వౌనం, ఉపవాసం ఇవన్నీ ఎవరికి వారు ఉద్ధరించుకుని చేసే ప్రయత్నానికి సాధనా మార్గాలు. తమిళంలో కులం తరుం, సెల్వం తరుం అనే మాటలున్నాయి. మన ఒంట్లో భక్తి బాగా జీర్ణించుకుపోతే మనక్కావలసినవన్నీ అప్రయత్నంగా సమకూరుతాయి. అందుకే మనిషికి కావలసింది కపటం లేని భక్తి. ఇది సులభంగా దొరికేది కాదు.
* * *
పద కవితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులు భాగవత సంప్రదాయంలో వాడుకలో వున్న ‘ఉత్సవ పద్ధతి నేర్పరచిన పుణ్య పురుషుడు’. తోడయము, మంగళం, శరణు, హెచ్చరిక, విన్నపాలు.. ఇలా మేలుకొలుపు నుంచి మొదలుకొని పవ్వళింపు సేవ వరకూ ఎన్నో కీర్తనలు రచించిన మహానుభావుడు.
త్యాగరాజు కూడా ఆ పద్ధతిలో దివ్యనామ కీర్తనలతోబాటు ఉత్సవ సంప్రదాయ కీర్తనలు రచించి పాడుకున్నాడు.
‘బలము కులము ఏల’ అనే కీర్తన అందులోనిదే.
త్యాగయ్య కీర్తనలన్నీ ఒక ఎత్తు. ఈ కీర్తనలన్నీ మరొక ఎత్తు. భౌళి, కేదారగౌళ, రీతిగౌళ, దేవగాంధారి కాపీ, ఖరహరప్రియ, సావేరి, సురటి మొదలైన ఎన్నో రక్తయిన రాగాల్లోని దివ్యనామ, ఉత్సవ సంప్రదాయ కీర్తనలన్నీ ఆయా రాగ స్వరూపాలను సంక్షిప్తంగా చూపించే రాగరస రూప గుళికలు. ఏకాదశి పర్వదినాన, సాయంత్రం త్యాగరాజుగారి శిష్యులు, ఈ కీర్తనలు నాలుగైదు పాడిన తర్వాత, ప్రశాంతవదనంతో విలంబ కాలంలో త్యాగయ్య ఒకటి రెండు కీర్తనలు గానం చేస్తూ మైమరచిపోయేవాడట.
ఆయన తారస్థాయిలో గానం చేస్తున్న సమయంలో, మాధుర్యంతో నిండిన ఆయన కంఠస్వరాన్ని వినాలనే ఆసక్తితో పక్కనే కూర్చుని పాడే శిష్యులు తమ కంఠధ్వనిని కాస్త తగ్గించుకుని వినేవారట.
సారూప్య సౌఖ్యదమైన అనుభూతులన్నీ ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించేవని ఆయనను దర్శించిన, మహానుభావులు కథలుగా చెప్పుకున్న మాట. నూతిలోని నీరు నెత్తిన చల్లుకుంటే గంగాస్నానవౌతుందా? అందుకే గొంతులో గమక శుద్ధిలేని గాయకులు త్యాగరాజ కీర్తనల జోలికి వెళ్లలేరు. అందని ద్రాక్ష పుల్లన.
ఏమిటో? కొందరికి సంప్రదాయ సంగీతమంటే చులకన స్వభావం. అందుకోలేని వారు విని సంతోషపడాలి లేదా కాస్త ప్రయత్నమైనా చేయాలి. అన్నీ తేలికగా, స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్లుగా, సిద్ధించాలంటే కుదరదు. సాధనమున పనులు సమకూరు ధరలోన.
అది నిజం, తథ్యం.