S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. అక్షరాన్ని

నేను
అక్షరాలుగా
తెల్లకాగితంపై పరుగులు పెడుతుంటే
నల్లకాగితాన నక్షత్రాలవుతున్నాయి
గగనం వైపు ఆలోచనలను మళ్లిస్తుంటే
ఆకాశవాణికి దత్తత పోతున్నాయి.
ఋషి మండలాలకు చేరుస్తుంటే
ద్వాదశ రాశుల వాకిలి లవుతున్నాయి
అంతరంగానికి పరిమితమవుతుంటే
బ్రహ్మరాతకు సాక్ష్యమవుతున్నాయి
అవును,
నా కలం రాతలన్నీ నుదుటి రేఖలే
కాలక్రమంలో కపాల వైదుష్యాలే
స్వఇచ్చా పథంలో విముక్తాలే.
* * *
నా అక్షరాలు
నైమిశారణ్య పత్రాలు శుక పికాలు
నీటి సవ్వడులు నింగి రహస్యాలు
గిరి మంత్రాలు అరణ్య తంత్రాలు
కర్షక పల్లె పదాలు శ్రామిక నినాదాలు
బ్రహ్మర్షి బోధనలు కర్మిష్ఠి క్రియలు
నా అక్షరాలు
సప్తవర్ణాశ్రమాలు
సప్తర్షుల మూల వనరులు
ఇటు నుండి అటుకు పారాడిన తనూవిలాసాలు
ఈ మట్టిని మెట్టిన భూతాత్మక మనోల్లాసాలు
మెత్తిన వర్ణ్ధాతు చిత్తరువులు
సూర్యరశ్మి జలబిల సంగమాలు
సప్త ఆవరణ శోభిత సంయోగాలు
ఆదిమ అణు విస్ఫోటనాలు
అవును,
నింగి ఉరిమిందంటే నా అక్షరాల రాపిడే
ఆకాశం మెరుపయిందంటే నా అక్షరాల విరుపే
నల్లమబ్బు కరిగిందంటే నా అక్షరాల లాలిత్యమే
* * *
నా అక్షరాలు
దృశ్యంలోనే కాదు
అదృశ్యంలోనూ విహంగాలవుతుంటాయి
దేహంలోనే కాదు
ధ్యానంలోనూ శ్వాసిస్తుంటాయి
స్వరపేటికలోనే కాదు
నిశ్శబ్దంలోనూ స్వరసంహిత లవుతుంటాయి
వౌనంలోనే కాదు
శూన్యంలోనూ సత్యావిష్కరణ లవుతుంటాయి
నడివీధినే కాదు
నడిబొడ్డునా ఆవిష్కృతమవుతుంటాయి
అవును, నా అక్షరాలు
మట్టి చెలమనే కాదు
మనిషి మెతుకునా మొలుస్తుంటాయి.
* * *
నా అక్షరాలు
పరమ సంతకాలు
పరతత్వ సంక్షిప్తాలు
పరోన్ముఖ ఆదేశాలు
శిల్ప కళాకృతులు శాసన నాగబులు
ధార్మిక వనరులు అధిభౌతిక వలసలు
మహాపురాణాల అంతర్మథనాలు
ప్రబంధాల వలపు వేవిళ్లు
ఆధునిక అమలిన భావోదయాలు
అరస విరస దిగంబర ఘర్షణలు.
అవును, నా అక్షరాలు
కల్పవృక్ష వేయిపడగలు భూమికా విశ్వంభరలు
పారదర్శక విశుద్ధ ధ్యానమగ్న జ్ఞానపీఠాలు.
* * *
నా అక్షరాలు
అరచేతి నవగ్రహ క్షేత్ర బలాలు
పూర్ణాయుర్దాయ కంకణరేఖలు
గురుక్షేత్ర సువర్ణ దీక్షావలయాలు
సాధనాతీర అమృత ఘడియలు
సృజన క్రియల చైతన్య స్పృహలు
ఆత్మానుభూతుల సత్యపథాలు
అవునవును, నా అక్షరాలు
మనిషి బ్రతుకున విత్తులు
మనీషి భృకుటిన మేరువులు
అన్నట్టు,
నీ తలపుల తలుపులు మూస్తేనే కదా
నా అక్షరం నీకు గవాక్షమయ్యేది.
* * *
నా అక్షరం
పొడుచుకొచ్చిన సూర్యతేజం
పడగెత్తిన సర్పనేత్రం
ఒరను చేరని కత్తి పదును
ఎగసిన కడలి సొగసు
సుడులు తిరిగిన నదీపాయ
అవును, నా అక్షరం
ఆలోచనల నిఘంటువు
సింహావలోకన సర్వస్వం.

-విశ్వర్షి 93939 33946