మాటకూ శ్రుతిలయలున్నాయి..
Published Saturday, 25 May 2019ఉత్తమ సంగీత సంప్రదాయ సంగీత ప్రమాణాలకు సాహిత్య విలువలకు ఆకాశవాణియే కొలమానంగా భావించే రోజుల్లో జరిగిన సంఘటనలు, తీపి జ్ఞాపకాలు ఎప్పుడూ మరువలేను. ప్రజలతో సంబంధం కలిగిన ప్రసార మాధ్యమాలకూ, ఇతర సంస్థలకూ తేడా ఎప్పుడూ వుంటుంది.
చూడతగినవీ, చూడవలసినవీ వాటితోబాటు, చూడకూడనివీ, చూస్తే జుగుప్స కలిగించే వాటిని కూడా చూసేందుకు అలవాటు పడిన వారు, బుద్ధిగా కూర్చుని శ్రద్ధగా, ఈ వేళ రేడియో వినటం చాలా కష్టసాధ్యమైన విషయం. కారణం మీకు తెలియనిది కాదు. టీవీ చానళ్లు పుట్టగొడుగుల్లా వెల్లివిరియడమే. రేడియోలో పనిచేసి రేడియోనే విమర్శిస్తున్నా ననుకోకండి. యధార్థమే.
వినతగినదై, ఒక్కసారి విన్నంత మాత్రాన ‘ఆహా! ఇన్నాళ్లూ తెలియదే?’ ఈ విషయం తెలుసుకోగలిగిన అదృష్టం కలిగిందనే భావనే వుంటే వాళ్లను వినకుండా ఎవరూ ఆపలేరు. శ్రవణ మాధ్యమాలైనా, దృశ్య మాధ్యమాలైనా ఒకటే. ఎవరికీ మినహాయింపుండదు. రామానంద సాగర్ ‘రామాయణ భారతాలు’ ఎటువంటి పబ్లిసిటీ ఇవ్వకపోయినా, జనం ఎలా విరగబడి చూశారో తెలుసు. ఒక్క రేడియో తప్ప మరే కాలక్షేపం లేని రోజుల్లో మధ్యాహ్నం పూట రేడియో సంక్షిప్త శబ్ద చిత్రాలు ప్రసారమవుతూండేవి. కొత్త సినిమా విడుదలైనంత కోలాహలంగా వుండేది. ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు కేంద్రంగా ‘తెలుగు విభాగం’ కొనే్నళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేది.
మద్రాసు కేంద్రం నుండి ప్రసారమయ్యే వాటికి సంచాలకులు ‘మల్లవరపు ఉమామహేశ్వర్రావు’ (ఉమ) హైదరాబాద్ నుంచి ప్రసారమయ్యే సంక్షిప్త శబ్ద చిత్రాలకు ‘వాడ్రేవు’ పురుషోత్తం, విజయవాడ నుంచి ఎ.బి.ఆనంద్, సి.రామ్మోహనరావు, నండూరి సుబ్బారావు గారలు సంచాలకులై వ్యవహరించటం నాకు తెలుసు. సినీ నటుడైన (సుత్తి) వీరభద్రరావు కూడా అప్పట్లో ఈ సంక్షిప్త శబ్ద చిత్రాల ప్రసార బాధ్యత వహించేవాడు. ఇంచుమించు ఒకేసారి ఇద్దరం రేడియోలో చేరాం. మధ్యాహ్నం 3 అయ్యిందంటే ప్రతి వీధీ ‘సినిమా డైలాగులు, పాటలతో’ రేడియోలు మారుమ్రోగిపోయేవి. క్రికెట్ కామెంటరీలు ఇప్పుడు కాఫీ హోటళ్ల దగ్గర టీవీల్లో జనం ఎలా విరగబడి చూస్తారో రేడియోలు ఒకప్పుడలా వినేవారు.
సినిమా థియేటర్‌లు ఖాళీగా వుండే సమయాల్లో రేడియో ఇంజనీర్ల సహాయంతో వెళ్లి ఎస్.పూల్ రికార్డర్స్‌లో సినిమా ఆడియో, ట్రాక్ మొత్తం రికార్డు చేసి గంటకు కుదించి ప్రసారం చేసేవారు. 1938లో మద్రాసు రేడియో కేంద్రం ప్రారంభమైంది. అక్కడి నుండి, తమిళం, తెలుగు భాషల్లో ప్రసారాలుండేవి. ఆకాశవాణిలో మొట్టమొదటి తెలుగు వాచస్పతి (ఎనౌన్సర్) మల్లంపల్లి ఉమామహేశ్వర్రావు ‘ఉమ’గా ప్రసిద్ధుడు. 1970లో నేను రేడియో వివిధభారతి సర్వీసులో చేరేనాటికే ఆయన పేరు శ్రోతలకు పరిచయమే. నాకు గురుతుల్యుడు. స్పష్టమైన ఉచ్చారణ. గంభీరమైన స్వరం. ఆకాశవాణి! కొంచెం సేపట్లో రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం... మద్రాసు కేంద్రం నుంచి రిలే’ అనగానే దడదడ లాడుతూ టైటిల్ సంగీతంతో సినిమా మొదలైతే అదో ఆనందం. ఇంట్లో రేడియోల ముందు శ్రోతలు సినిమా హాల్లో కూర్చుని చూసినట్లుగానే అనుభూతి పొందేవారు. ప్రసారమవ్వగానే రేడియో పరిచాలన ‘ఉమ’ అనగానే ఏదో ఆయనంటే ఆత్మీయ భావం తోడయ్యేది. ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అన్ని భాషల్లో ప్రసారాలూ అక్కడి నుంచే జరిగేవి. తెలుగులో మొదటి ఎనౌన్సర్ ‘ఉమ’. నాలుగు దశాబ్దాల నిర్విరామ శ్రమకు కృతజ్ఞతగా గొల్లపూడి మారుతీరావు తన డైరీలో ఈ ‘ఉమామహేశ్వర్రావు ప్రజ్ఞా ప్రాభవాలను గురించి రాయటమే’ దీనికి తార్కాణం.
మాటల్లో గంభీరత, స్పష్టత, చక్కని శ్రుతి, మాధుర్యం ఎనౌన్సర్‌కుండవలసిన లక్షణాలు. మనిషి ఎదురుగా లేకుండా కంటికి కనిపించకపోయినా గొంతు మాత్రం చెవికి ఆకర్షణగా వినాలనిపించేలా వుండాలి.
ఎనౌన్సర్ వేరు. న్యూస్ రీడర్ వేరు. చదివే విధానంలో తేడా వుంటుంది. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైన తొలి రోజుల్లో 1959లో ఎనౌన్సర్‌గా చేరి న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధుడైన ‘ఎంబెర్ మన్నార్’ ఈతరం వారెరుగరు.
విలక్షణమైన గొంతు, 20 నిమిషాల్లో చదవవలసిన వార్తల్ని పదే పది నిమిషాల్లో వేగంగా అత్యంత స్పష్టంగా చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈ అద్దంకి మన్నారు స్వగ్రామం నూజివీడు సమీపంలోని చిన్న గ్రామం కానుమోలు. రేడియోకు కొన్ని ప్రమాణాలున్నాయి. బహిరంగంగా మనం ఇష్టపడి అభిమానించి ఎన్నుకున్న రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాల్లో ‘తోలు తీస్తా, తాట తీస్తా’ లాంటి మాటలున్నా యథాతథంగా వార్తల్లో చెప్పరు. చెప్పకపోవటమే రేడియోకున్న గౌరవం. ఖండించారనో గర్హించారు అనో కొన్ని సున్నితమైన అందమైన పదాలు వాడి సరిపెట్టి, హుందాగా తప్పుకుంటారు. కల్పలత, చిత్రతరంగిణి లాంటి సినిమా పాటల కార్యక్రమాలను సమర్పించటంలో మన్నార్‌కు సాటి మరొకడు లేడనిపించుకున్న ఎనౌన్సర్ అనతికాలంలోనే న్యూస్ రీడరై, ఢిల్లీ నుంచి వార్తలు చదివేవాడు. కొన్నాళ్లు రేడియో మాస్కోలో పని చేశాడు.
ఈ తరం శ్రోతలకే కాదు. నేడు రేడియో కేంద్రాల్లో పని చేస్తున్న చాలామంది అధికారులకు కూడా అద్దంకి మన్నారును గురించి తెలియదు. అంతేకాదు. ఆనాటి సంగీత సాహిత్య కళాకోవిదులను గురించి వారు చేసిన కార్యక్రమాలను గురించి కనీసం తలవనైనా తలుచుకోరు. వార్తల ‘లైవ్’ స్టూడియోలో కూర్చుని చివరి నిమిషంలో అందే వార్తనైనా అందంగా, అనువదించేసి, తొట్రుపాటు పడకుండా ఆ వార్త చదవటం మన్నార్ ప్రత్యేకతగా చెప్పేవారు. వార్తలు చదివే వారిలో ‘నాటకీయత’ ఉండదు. ఉండకూడదు కూడా. వార్తలను ఒక ప్రవాహంలా, ధారలా, సొగసుగా, స్పష్టంగా చదివి కీర్తిని మాత్రమే సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అద్దంకి మన్నార్. డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, పింగళి లక్ష్మీకాంతం, జలసూత్రం రుక్మిణీనాథశాస్ర్తీ, ప్రయాగ నరసింహశాస్ర్తీ, గొల్లపూడి మారుతీరావు, బుచ్చిబాబు లాంటి మేధావులతో పనిచేసిన అనుభవం మన్నార్‌కున్న పెద్ద ఆస్తి. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన ఎన్నో నాటకాల్లో పాల్గొని, పేరు తెచ్చుకున్న మన్నార్ గొప్ప రంగస్థల నటుడు కూడా. ప్రజా ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా ఏ సామాజిక వర్గ ప్రజలకూ ఇబ్బంది కలిగించకుండా ఒకనాటి ప్రసార మాధ్యమం అందరి మన్ననలూ చూరగొంది. ఈనాటి పరిస్థితులు అలా లేవు. ప్రైవేటు రంగంలో నడిచే మాధ్యమాలలో పనిచేసే ప్రతి వ్యక్తీ అప్రమత్తంగా వుంటూ, ఆ సంస్థలకు, కీర్తి లభించేలా అంకిత భావంతో పని చేస్తారు. ఈవేళ ప్రభుత్వరంగ సంస్థలైన ఆకాశవాణి, దూరదర్శన్‌లు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగానే వున్నాయి. ఉద్యోగ భద్రతే లక్ష్యంగా పనిచేసేవారే ఎక్కువ. ఇంక సృజనాత్మకతకు చోటేది?