నిద్దుర నిరాకరించి ముద్దుగ తంబురబట్టి..
Published Saturday, 18 May 2019మదన మనోహర సుందర నారీ,
మధుర దరస్మిత నయన చకోరీ,
మందగమన జిత రాజ మరాళీ
నాట్య మయూరీ
అనార్కలీ! అనార్కలీ! అనార్కలీ’
మూడు స్థాయిల్లో శ్రుతి పక్వమైన నాదాన్ని నింపుకుని ‘శుద్ధ హిందోళ’ రాగంలో సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు గళంలో సాకీగా పాడిన మాటలు మీకు తెలుసు.
‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’ పాట మొదలవుతుంది.
‘అనార్కలి’ చిత్రంలో ఆస్థాన గాయకుడిపై చిత్రించిన పాట ప్రారంభానికి ముందు కొన్ని సెకన్లు వినిపించే తంబురా నాదం, సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. ఆ పాట రికార్డింగ్‌లో తంబురాతో సహకరించిన వ్యక్తి తాతాచారి అనే సంగీతజ్ఞుడు. మహాజ్ఞాని. సినీ నేపథ్య గాయకుడు పి.బి. శ్రీనివాస్‌కు సోదరుడు. మద్రాసులో ఉన్నప్పుడు నా గురువు వోలేటి గారికి అత్యంత సన్నిహితుడై తిరిగిన శ్రేయోభిలాషి. తరచుగా మద్రాసులో కలుసుకున్నప్పుడు ఈ రికార్డింగ్ గురించి, ఘంటసాలను గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తూంటాయి.
ఆవేళ రికార్డింగ్‌కు రెండున్నర గంటలు పట్టింది. ఫైనల్ రిహార్సల్స్ పూరె్తైన తర్వాత మైకు ముందుకు వెళ్లి సిద్ధంగా వున్న ఘంటసాలను గమనిస్తున్నాను. తంబురా మీదే అతని దృష్టి. మా చుట్టూ వాద్య బృందం, తంబురా ‘పెర్‌ఫెక్ట్’ చేసుకుని వాయిస్తున్నాను. ఘంటసాల తంబురా, నాదం శ్రద్ధగా వింటున్నాడు. ‘ఓకే. రెడీ ఫర్ రికార్డింగ్!’ అనే మాట వినబడింది. ప్రశాంతంగా ‘మదన మనోహర సుందర నారీ’ అంటూ మధ్యమంలా ఆగుతూ ఘంటసాల అందుకున్నాడు.
ఆ తర్వాత ‘మధుర దరస్మిత నయన చకోరీ’ అంటూ తారస్థాయి షడ్జంలో నిలిపాడు.
‘నాట్య మయూరీ’ అంటూ అతి తారస్థాయి మాధ్యమంలో, శ్రుతిస్థానం నిలిపిన వెంటనే ఒక్కసారి ఒళ్లు పులకరించి పోయింది. గగుర్పాటు కలిగింది. రోమాంచితమైంది. నమ్మండి. ఏమి కంచుకంఠం? ఏమా నాదం? ఘంటసాల కంఠంలో జీవ స్వరం వుందండి. అలాటి మధుర గాయకుడు ఇప్పట్లో మళ్లీ పుట్తాడా? మనం చూస్తామా? తంబురా వేశానే కానీ, ఘంటసాల గొంతులోనే తంబురా నాదముంటే అతనికి తంబురా నాదం ఎందుకు? అనేవారు తాతాచారి.
నా చిన్నతనంలో చూసిన చిత్రం ‘రాజమకుటం’. ఆ చిత్రంలో తన చిన్నాన్న ప్రచండుడి దుశ్చర్యలను గమనించిన కథానాయకుడు ఎన్టీఆర్ తన తండ్రి చిత్తరువును చూస్తూ, నిశే్చష్టుడై నిలబడ్డ సన్నివేశానికి నేపథ్యంలో కేవలం ‘తంబురా’ నాదం ఒక్కటే వినబడేలా చేశాడు మాస్టర్ వేణు. ఈ ఆలోచన రావటమే విశేషం. వౌనంగా రోదించే రామారావుకు వెనుక తంబురా ధ్వని. తంబురా నాదంలోని రుచి కొందరే అనుభవించగలరు. స్వయంభూ ధ్వనులు తంబురా నాదంలోనే వినగలం. మీకు తెలుసు.
విజయనగరం సంగీత కళాశాలలో ఘంటసాల ‘మధూకరం’ చేసుకుంటూ పట్రాయని సీతారామ శాస్ర్తీ వద్ద సంగీతాభ్యాసం చేసేవాడు. నిర్ణీత కాలంలో తన సంగీతాభ్యాసం పూర్తి కాగానే ఆ కళాశాల ప్రిన్సిపాల్ హరికథా పితామహుడైన నారాయణదాసు ఘంటసాలను అభిమానించి, గౌరవంతో బహూకరించినది ‘తంబురా’యే. కాలక్షేపానికీ, అవసరానికీ పాడే సినిమా పాటలకు సంగీత గౌరవాన్ని కల్పించిన ఘనుడు, నాదంలోని సుఖం తెలిసి, తంబురా నాద పరమార్థం తెలిసి సగర్వంగా ఫొటో తీయించుకున్న గాయకుడు ఘంటసాల.
నాద మాధుర్యం తెలిసిన వారికి మాత్రమే ఈ ధైర్యం ఉంటుంది. నిజానికి ఘంటసాల పాటల్లో కనిపించేదే సుస్వరంతో కూడిన నాదం. సంప్రదాయ సంగీత విద్వాంసుల గానానికి ‘తంబురా’ శ్రుతి తప్పనిసరి. ఏ సంగీతానికైనా తల్లి శ్రుతి. తండ్రి లయ.
శ్రుతి పక్వమైన తంబురా శ్రుతిని శ్రద్ధగా మీటి వాయించటం పెద్ద కళ. నిజానికి సుశిక్షితులైన తంబురా వాదకులే చాలా అరుదు. తంబూర వాద్యాన్ని వీణగా భావించే వారున్నారు. మాకు మా ఇంట్లో ప్రధాన శ్రుతి వాద్యం తంబురాయే. మా నాన్నగారు పాడుతూ నా 10వ యేట నుండే ‘తంబూర’ వాద్యాన్ని మీటే అలవాటు చేశారు. 1960 ప్రాంతంలో విజయవాడలో కన్నడ సేవా సంఘం వారు, కన్నడ కీర్తనల గానంలో నాకు ప్రథమ బహుమతిగా లభించిన తంబూరాయే మాకు సంగీతాభిరుచిని కలిగించింది.
నారదుని చేతిలో చిత్రకారులు వేసినది 17వ శతాబ్దపు ‘తంబురా’యే. ఒక వెదురు దండెకు చిన్న సొరకాయ (ఆనపకాయ) బుర్ర తగిలించి, తీగలు అమర్చిన వాద్యాన్ని ‘తుంబ’ అని పిలిచేవారు. అదే ‘తంబురా’గా పరిణామం చెందింది. పాటకు మధ్యస్థ తూకం తంబురా. శ్రుతి లేని పాట - మతిలేని మాట రెండూ ఒక్కటే. మనం మాట్లాడే మాటలు, లేదా పాడే పాట అందరికీ నచ్చుతుందనీ, తలకాయలూపేస్తున్నారని అనుకోవడం పొరపాటు. ‘అపస్వరాలు పాడకండి! కళ్లు పోతాయ్’ అనేవారు నా చిన్నప్పుడు. కళ్లు లేకపోతే మరొకరి కళ్లు తీసి అమర్చగలిగే అత్యంత ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చేసిన ఈ రోజుల్లో ఈ మాట లెవ్వరూ లెక్కచేయకపోవచ్చు. కానీ పక్వమైన శ్రుతి జ్ఞానాన్ని కలిగించేది మాత్రం ‘తంబురా’ నాదమే. నాదంతో నిండిన ‘తంబురా’ను ఎంపిక చేసుకోవటం, భ్రమర నాదాలు, స్వయం భూ ధ్వనులు వినబడేలా తంబురా శ్రుతి చేయటం కొందరు పేరున్న విద్వాంసుల వల్లే కాదు. అదో కళ. ప్రజ్ఞతో కూడి పరిణతి చెందిన విద్య.
వెనకటి తరంలో సద్గురువులై ప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు తమ వెంట తంబురా చక్కగా శ్రుతి చేసి, సహకరించగల సుశిక్షితులైన శిష్యుల్ని కచేరీలకు వెంట తోడుగా తీసుకుని వెళ్లేవారు. దీనివల్ల శ్రుతిజ్ఞానం, నాదానుభవంతోబాటు లోక వ్యవహారం, పది మందితో మెలిగే విధానం కూడా శిష్యులకు తెలిసిపోయేది. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌కు మైసూరు వాసుదేవాచారి శిష్యుడై అలా గురుకులవాసం చేసిన వాగ్గేయకారుడు మహారాజపురం విశ్వనాథయ్యర్‌కు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ అరియక్కుడికి కె.వి. నారాయణ స్వామి, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యానికి సుబ్రహ్మణ్యన్ అనే శిష్యుడు, సంగీత కళానిధి ఎం.ఎల్. వసంతకుమారికి శ్రీమతి సుధారఘునాథన్, చెంబై వైద్యనాథ భాగవతార్‌కు టి.వి. గోపాలకృష్ణన్, జేసుదాస్ (నేపథ్య గాయకుడు) గురుకుల వాసంలో సంగీతాభ్యాసం చేసి గాయకులై కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. శిష్యులు క్రమంగా గురువులై పోయారు. వెనుక కూర్చుని ఒకవైపు గురువుతో కంఠం కలుపుతూ, మరోవైపు తంబురా సహకారమందిస్తూ అపారమైన సంగీతానుభవాన్ని గడించటమే విశేషం. కాదు. అదొక పెద్ద వరం.
ఈవేళ మీరే సంగీత కళాశాలలో చూసినా తంబురా కనపడదు. డిప్లొమోలు పుచ్చుకున్న చాలా మందికి ఈ తంబురా నాదానుభవమే ఎరుగరు. తెలియదు. కళాశాలాధ్యాపకులకే తంబూర శ్రుతి మాధుర్యం తెలియకపోతే, విద్యార్థులకెలా తెలుస్తుంది. నిద్దురను కాస్త తగ్గించుకుని, వేకువ జామున లేచి (తామస గుణాన్ని, అజ్ఞానాన్ని దూరం చేసుకుని) మంచి నాదాన్నివ్వగల ‘తంబురా’ను చేతపట్టుకుని, నిర్మలమైన మనస్సుతో సుస్వరంతో క్రమం తప్పకుండా గానం చేసేవారికి పరమాత్ముని అనుగ్రహం లభించటంలో ఆశ్చర్యం లేదంటారు త్యాగయ్య. ఈ మాట ఆయనకే వర్తిస్తుందని సమాధానపడితే సమస్యే ఉండదు.