సుస్వర భావుకుడు
Published Saturday, 4 May 2019పడవ నడపవోయ్
పూల పడవ నడపోయ్
ఎత్తుగ తెరచాప నెత్తి
గట్టిగ చుక్కాని పట్టి!
ఒరగనీక సురగనీక తరగలపై తేలిపోవ॥
ఎప్పుడో ఐదారు దశాబ్దాల నాటి ఆకాశవాణి రికార్డులలో పి.బి.శ్రీనివాస్ పాడిన చక్కని పాట.
రేడియో బాగా బతికిన నాటి రోజులలో ట్రాన్స్‌స్క్రిప్షన్ సర్వీస్ రికార్డ్‌గా ఆ రోజుల్లో తరచు ప్రసారమై శ్రోతలకు గుర్తుండి పోయిన పాట.
భీంపలాస్ రాగంలో కంపోజ్ చేసుకుని పాడాడు. మద్రాసు రేడియో కేంద్రంలో లైట్ మ్యూజిక్ యూనిట్ అని పిలువబడే సమర్థులైన వాద్య బృందంతో రికార్డైన అపురూపమైన లలిత గీతం. విజయవాడకు రేడియో కేంద్రం అప్పటికింకా రాలేదు.ప్రముఖులు పాడిన లలిత గీతాలన్నీ అక్కడే రికార్డు అయ్యేవి. ఈమని శంకరశాస్ర్తీ, టి.ఆర్.పాప, ఎల్.కృష్ణన్, ఘంటసాల వెంకటేశ్వరరావు, మల్లిక్ వంటి పాత తరం కంపోజర్లు, ప్రాణం పెట్టి పాటలు చేసేవాళ్లు. సంప్రదాయ సంగీత జ్ఞానం తెలిసి పాడే స్థాయిలోనే వుండేది. ఆనాటి లలిత గీతాలు సంగీతం విషయంలో సమర్థులైన సంగీతజ్ఞులే ఆకాశవాణిలో కొన్ని ఉన్నత ప్రమాణాలను నిర్దేశించి కాపాడుతూ వచ్చారు. మద్రాసు సంగీత వాతావరణం చూసిన కొత్తల్లో పి.బి.శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. నేనెక్కడ సంగీత కచేరీ పాడినా, విధిగా వచ్చి కూర్చుని విని మరీ వెళ్లేవాడు. సినీ రంగంలో నేపథ్య గాయకుడై వేలాది పాటలు పాడి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్‌కు క్రమంగా ఎందుకో సంప్రదాయ సంగీతం మీద మక్కువ అమితంగా ఏర్పడింది. నిరంతర పరిశోధనాశీలి. మైలాపూర్, హోటల్ వుండగా ఓ సాయంత్రం నెమ్మదిగా అడుగులేసుకుంటూ గదిలోకి వచ్చి కూర్చుని బాబూగారూ! 72 మేళకర్త రాగాల్లో ఏయే రాగానికి ఏయే స్వరమో తెలియటానికి డైమండ్ కీ ఒకటి కనిపెట్టానని చూపించాడు. తెలుగు వారికి దీని గురించి ఎక్కువ తెలియదు. ఇతర దేశాల్లో దీనికి ఎక్కువ ప్రచారం జరిగింది. ఆశ్చర్యం.
‘సువర్ణాంగి’ అనే రాగం ఎందుకో శ్రీనివాస్‌కు చాలా ఇష్టం. చిన్న కాగితంపై రెండు పాదాల శ్లోకం రాసి కచేరీ చేస్తున్న నాకు పంపించి ‘సువర్ణాంగి’లో పాడమన్నాడు.
వీణ విద్వాంసుడు ఈమని శంకరశాస్ర్తీ ఢిల్లీ వెళ్లకముందు మద్రాసులో కొనే్నళ్లు జెమినీ చిత్ర నిర్మాణ సంస్థలో పనిచేసేవారు.
ఎనిమిది భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట శ్రీనివాస్.
గజల్ తరహాలో ఓ పాటకు శంకరశాస్ర్తీ సంగీతం సమకూరిస్తే శ్రీనివాస్ గ్రామఫోన్ రికార్డు ఇచ్చాడు.
కన్నడ రాజ్‌కుమార్‌కు నేపథ్యం పాడే అవకాశం కలిగించినది సంగీత దర్శకుడు జి.కె.వెంకటేష్. రెండు వందలకు పైగానే పాడాడు. మేమిద్దరం అభిమానించే ఉర్దూ గాయకులు ఇద్దరు- మెహదీ హసన్, గులామాలీ. మా స్నేహం గట్టిపడటానికి కూడా ఘజల్ సంగీతమే. ఘజల్ పిచ్చి ఎక్కువై ఉర్దూ భాష నేర్చుకుని కొన్ని వేల ఘజళ్లు స్వయంగా రాశాడు. ఒక పెద్ద ఇపి రికార్డిచ్చాడు.
శ్రీనివాస్‌కు సోదరుడుగా భావించబడే సమీప బంధువు తాతాచారి అనే గొప్ప సంగీతజ్ఞుడు.
మద్రాసు రేడియో కేంద్రంలో నిలయ విద్వాంసునిగా కొనే్నళ్లు పనిచేసి ఆ తర్వాత మైలాపూర్‌లోని భారతీయ విద్యాభవన్‌లో సంగీతం బోధించేవాడు. వోలేటి గారికి ప్రియ మిత్రుడు. ఇటు శ్రీనివాస్, అటు తాతాచారి మధ్య నేను చెప్పుకున్న సంగీత విషయాలనేకం!
ఎప్పుడు కలిసి మాట్లాడినా పొరబాటున కూడా సినిమా పాటల ప్రసక్తి తెచ్చేవాడు కాదు.
నిర్దిష్ట పద్ధతిలో నేర్చుకోకపోయినా కర్ణాటక సంగీత సంప్రదాయమంటే ఎంతో గౌరవాభిమానాలుండేవి. ఎంతో పరిశోధన చేశాడు కూడా. నవనీత సుధ అనే నూతన రాగాన్ని సృష్టించాడు.
‘న’ అంటే నవరస కన్నడ
‘వ’ -వసంత
‘నీ’ -నీతిమతి
‘త’ - తపస్విని
‘సు’ -సువర్ణాంగి
‘మ’ -మలయ మారుతం
‘సు’ -సునాద వినోదిని
‘్ధ’ - ధన్యాసి
ఇలా 8 రాగాల్లోని తొలి అక్షరాలను తీసుకుని చేసిన నూతన రాగం పాడి వినిపించాడు కూడా.
తెలుగు, సంస్కృతం, కన్నడ, మలయాళాది భాషల్లో ఎన్నో భక్తిగీతాలు, స్తోత్రాలూ పాడారు.
శ్రీనివాస్ గాత్ర మాధుర్యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ నేపథ్య గాయకుడుగా ఎంతో కీర్తిప్రతిష్ఠలు తెచ్చుకున్న మీకు సంప్రదాయ సంగీతం పట్ల ఇంత మోజు ఎలా ఏర్పడిందని ఓ రోజు అడిగాను.
పాటలన్నీ క్షణకాలమే బాగుంటాయి. మరుక్షణం మరో గాయకుడి పాట వింటే నా పాట వెనక్కు పోవచ్చు. లేదా అంతకంటే బాగుండవచ్చు. చెప్పలేం.
దక్షిణాది విద్వాంసులను ఆదరించే వాతావరణం ఇక్కడ ఉంది. విని ఆనందించగలిగే సంగీత రసికులున్నారు. కాబట్టి ఈ మాత్రమైనా మంచి సంగీతం వినటానికి నోచుకున్నాం.
చూడండి! సినిమా సంగీత ప్రమాణాలు దిగజారిపోయాయి. ఎలా పాడినా ఫరవాలేదు అనే స్థాయికి దిగిపోతున్నారు. సినిమా వలలో విలవిల్లాడిపోతున్నారు. వలలో పులి చిక్కిని, పిల్లి చిక్కినా ఒక్కటే. అందులో నుండి బయటపడటానికి నాకే చాలాకాలం పట్టింది. షోరూంలో పెట్టిన బొమ్మల్లాంటివి సినిమాలు - ఎప్పుడో చెప్పిన శ్రీనివాస్ మాటలు నేను మర్చిపోలేదు.
నెత్తి మీద మైసూర్ దర్బార్ టోపీ చొక్కా జేబులో పట్టగలిగినన్ని రంగురంగుల పెన్నులతో ఠీవిగా కచేరీ హాలులో ప్రవేశించేవాడు. ఒకవైపు కచేరీ వింటూ మరోవైపు కూడా తెచ్చుకున్న బ్యాగ్‌లోంచి నాలుగు కాగితాలు తీసి తన కవితా హృదయాన్ని అక్షరబద్ధం చేసి, గానం చేసిన విద్వాంసులను అభినందించి, అవకాశముంటే నాలుగు మాటలు ఆ విద్వాంసుని గురించి మాట్లాడి, చేతులో తాను రాసిన కవితా మాలికను ఆ విద్వాంసుడి చేతికివ్వటం, నేనెన్నోసార్లు గమనించాను.
తను పాడిన పాటల్ని గురించి ఎప్పుడూ ప్రస్తావించేవాడు కాదు. కానీ ఘంటసాల పాటల్లోని ఒదుగులను గురించి బాగా మెచ్చుకునేవాడు. పి.బి.శ్రీనివాస్, జానకి కలిసి పాడిన ఆదిశంకరాచార్య స్తోత్రాలన్నీ ప్రసిద్ధమైనవే.
సినిమా వాసన లేకుండా స్వచ్ఛంగా పాడగలిగిన లలిత సంగీత గాయకులలో శ్రీనివాస్ ముఖ్యుడు. అగ్రగణ్యుడు. చక్కని సంగీతానికి వుండవలసిన స్వచ్ఛమైన స్పందన కలిగిన శ్రీనివాస్ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.
ఓసారి ఘంటసాలను గురించి చెప్తూ, ఘంటసాల వంట చేయటం నలభీమ సమానులండోయ్! మీకు తెలుసా? అన్నాడు నవ్వుతూ. విజయనగరంలో ద్వారం వెంకట స్వామినాయుడు గార్ని కలిసి వయొలిన్ నేర్చుకునే కోరికను వ్యక్తపరిస్తే -నాయనా! నీ గొంతు చాలా బాగుంది. గాత్రమే సాధన చెయ్యమని ప్రోత్సహించటమే ఆయనకు వరమైందని చెప్తూ, కొసమెరుపు ఏమంటే - 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో బాపూజీ పిలుపునకు ఆకర్షించబడి బహిరంగ సభల్లో ఉద్వేగంగా పాడేవారు. చెరసాల జీవితం గడిపిన రోజుల్లో మోపర్రు దాసనే హరికథకునితో మైత్రి లభించింది. హరికథా గానంలోని మెళకువలు కూడా నేర్చుకున్నారు. ఘంటసాల పాడిన సాంధ్యశ్రీ పద్యాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది. సినిమా పాటలు పాడాలనే వీరావేశం కలిగిన వర్థిష్ణు గాయకులు కొందరు ఘంటసాల పాటలని అలాగే అనుకరిస్తూ పాడి వినిపించినప్పుడల్లా- ‘ఇంత భయంకరంగా పాడుతున్నానా ఏమిటి చెప్మా’ అనుకునేవారట.