S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాట వినని ఫలితం

ఆ రోజు పోస్ట్ వచ్చిన ఉత్తరం దయానిధి మాస్టారి మనసుని పెద్దగాయమే చేసింది. పడకకుర్చీలో కూర్చున్న ఆయన చేతిలో రెపరెపలాడుతున్న ఉత్తరంలాగే ఆయన మనసు కూడా రెపరెపలాడసాగింది. ఏమిటో వెధవబుద్ధి. లోకంలో ఎవరు ఎలా పోతే మనకెందుకు అనుకోలేకపోతున్నాడు తను. తెలుసున్నవాడు, తన దగ్గర చదువుకున్నవాడు, తన మాట వింటాడు, తన అభిమానాన్ని పొందినవాడు, తనని అభిమానించేవాడు.. ఇన్ని అనుకుని సలహా ఇచ్చాడే తప్ప మరో ఉద్దేశంతోనూ కాదు. కానీ శేఖరం లా చేస్తాడని కలనైనా ఊహించలేదు.
ఎదుటి మనిషికి సలహా ఇవ్వాలని ప్రతి మనిషికి ఎప్పుడు అనిపిస్తుంది అసలు? తనూ అదే విషయంలో దెబ్బ తిని, అనుభవాలు రుచి చూసి రాటుతేలాకనే కదా.. నిలువెల్లా ‘నా’ అనే స్వార్థం ఉన్నవాడెవడూ ఎదుటివాడికి సలహాలు సూచనలు ఇవ్వడు. వాడే తెలుసుకుంటాడులే అనివదిలేస్తాడు. ఇంకా చెప్పాలంటే వాడు కూడా బొక్కబోర్లాపడి దెబ్బ తిన్నాకా చూసి నవ్వుకుంటాడు. ‘ఇలా జరుగుందని నాకెప్పుడో తెలుసు’ అని పుండుమీద కారం చల్లినట్లు మాట్లాడతాడు. తనకు ఏ కోశానా అలాంటి బుద్ధి లేదు. నిజానికి తాను ఇచ్చిన సలహా చాలా చిన్న విషయం. తాను అందరిచేతా మంచివాడు, కష్టజీవి, ఉత్తమ ఉపాధ్యాయుడు అనిపించుకున్నాడు. ఇక విద్యార్థినిలయితే తమ తండ్రికి చెప్పుకోలేని ఎన్నో సమస్యలు తనకు చెప్పుకుని బాధపడేవారు. తన పరిధిలో పరిష్కరించలేనివాటికి ఓదార్చేవాడు. ‘ఇలా చేస్తే నీ ఇబ్బంది తొలగుతుందేమో చూడు’ అని పరిష్కరించగలిగేవాటికి సూచనలు ఇచ్చేవాడు. వాళ్ళు వాటిని పాటించి ‘మీవల్లే మేమిపుడు ప్రశాంతంగా చదువుమీద దృష్టి కేంద్రీకరించగలుగుతున్నాం’ అంటే ఎంతో ఆనందం అనిపించేది.
తన గురించి అన్నీ తెలిసినాయన అయి ఉండి కూడా శేఖరం వాళ్ళనాన్న అలా తనకు ఉత్తరం రాయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ఆయన మళ్లీ ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళజోడు సర్దుకుని చదవసాగాడు.
‘‘పూజ్యులైన దయానిధి మాస్టారికి,
శేఖరం వాళ్ళ నాన్న (పరమ్రహ్మం) నమస్కరించి రాయునది. ఉభయకుశోపరి. మావాడికి ఉద్యోగం వచ్చింది. ఆ విషయం తమకు తెలియజేశాడు. నాకు వాడు ఒక్కడేకొడుకు. వాడి జీతం అంతా అమ్మ నాన్నలకు, అంటేమాకు ఇచ్చెయ్యకుండా కొంత తీసి దాచుకోమన్నారట. ఆవిధంగా వాడిలో స్వార్థబుద్ధి ప్రవేశపెట్టి, వాడిని మాకు కాకుండా చెయ్యడంలో మీ ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు.
పెళ్లికాని మగపిల్లల దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలవుతారని మీకు తెలియంది కాదు. మీరు చాలా మంచివారనుకున్నాను. ఇలా ఒక కుటుంబంలో వ్యక్తుల మధ్య స్వార్థపు ఆలోచనలు రావడం వలన ఆ కుటుంబ పర్యవసానం భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీ చుట్టుప్రక్కల కుటుంబాలలో మీరు గమనించే ఉంటారు. మీరు చేసిన ఈ పనివల్ల ఎందుకో మీ పట్ల వున్న నా గౌరవం కొంచెం తగ్గిందని మాత్రం చెప్పగలను. ఇలా రాసినందులకు అన్యధా భావించకండి. సెలవు.
నమస్కారాలతో - పరబ్రహ్మం’’
దయానిధి మాస్టారికి గతమంతా గుర్తుకొచ్చింది.
తానూ లెక్కల మాస్టారిగా వున్న సమయంలో పరబ్రహ్మంగుంటూరు జిల్లా నుంచి బదిలీ మీద ఈ ఊరొచ్చాడు. అతను అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. దాని బ్రాంచి ఈ ఊర్లో ఉండటంతో ఇక్కడకు ట్రాన్స్‌ఫర్ చేశారు. తెలిసిన బంధువుల సహాయంతో పిల్లల చదువు ఏ పాఠశాలలో బాగుంటుందో తెలుసుకుని తమ పాఠశాలలో జాయిన్ చేశాడు. అప్పటికి శేఖరం ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ అక్క తమ్మిది చదువుతోంది. క్రమశిక్షణ, వినయ విధేయతలు ఎవరు చెడగొట్టాలని చూసినా తన పని ఏమిటోతాను చూసుకోవడం, ఉపాధ్యాయులపట్ల గౌరవంగా మసలుకోవడం- ఇవన్నీ శేఖరాన్ని మంచి విద్యార్థిగా నిలబెట్టాయి. ఇల్లు దొరక్కపోవడంతో అనుకోకుండా తమ ఇంటి పక్క వాటా ఖాళీ అవడంతోవ అందులోకి వచ్చారు. అయిదు సంవత్సరాలు హాయిగా జరిగిపోయాయి. చేరిన నెల్లాళ్ళకే వాళల్ళు తమ కుటుంబ స్నేహితులుగా కలిసిపోయారు.
ఇంటర్ పూర్తయ్యాక శేఖరానికి గుంటూరులో ఇంజనీరింగ్ సీట్ రావడంతో మళ్లీ వాళ్ల ఫ్యామిలీ గుంటూరు వెళ్లిపోయింది. పరబ్రహ్మం కూడా ప్రయత్నం చేసుకుని అక్కడికే ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.
ఈ సెల్‌ఫోన్‌లు, వాట్స్‌అప్‌లు, ఫేస్‌బుక్‌లు పుణ్యమా అని శేఖరం టచ్‌లోనే ఉన్నాడు. వాళ్ళ అక్కకు డిగ్రీ పూర్తి అయ్యాక మేనమామనిచ్చి పెళ్లిచేయడంతో వాళ్ళూ గుంటూరులోనే స్థిరపడ్డట్టుగా శేఖరం వల్లనే తెలిసింది.
సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన శేఖరం తనకు క్యాంపస్ సెలక్షన్ వచ్చింది అని ఆగస్టు ఫస్ట్ తేదీన డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పాడు.
పక్కన టీపాయ్ మీద వున్న సెల్‌ఫోన్ తీసుకుని శేఖరానికి తనకి జరిగిన వాట్సాఫ్ చాట్ చదవసాగాడు దయానిధి.
***
‘‘జీతం ఎంత వస్తుందయ్యా..’’
‘‘అసలు ఇరవై అయిదు వేలు సర్. కటింగ్స్ పోను ఇరవై రెండు చేతికి వస్తుంది సర్. ఇరవై రెండులో నేను పదివేలు నా ఖర్చులకు ఉంచుకుని మిగితాది నాన్నగారికి పంపిస్తాను సర్’’
‘‘ఒక పని చెయ్యి. నాన్నగారికి పది పంపి, నువ్వు పనె్నండు ఉంచుకో. నువ్వన్నట్టుగా పదివేలు నీ ఖర్చులకు ఉంచుకుని, మిగతా రెండు వేలు నీ శాలరీ అకౌంట్‌లోనే వన్ ఇయర్ ఆర్.డి ఓపెన్ చెయ్యి. ఈ విషయం నీకు తప్ప ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు?’’
‘‘పెళ్లి నాలుగేళ్ళ తర్వాత సర్. అప్పటివరకు లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి సర్, మీరు పూర్తిగా చెప్పండిసర్’’
‘‘గుడ్. అలా వన్ ఇయర్ అయ్యేసరికి నీ దగ్గర వడ్డీతో సహా ఇరఐదు వేలు పోగవుతుంది. దాన్ని మూడు సంవత్సరాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వెయ్యి. మళ్లీ అదేవిధంగా కొనసాగించు. మళ్లీవన్ ఇయర్ అయ్యాక ఈసారి దాన్ని రెండేళ్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వెయ్యి’’
‘‘ఓహో.. మూడో ఇయర్ కూడా అలాగే చేసి ఒక ఇయర్‌కి ఫిక్స్‌డ్ వెయ్యాలి. ఈ మూడేళ్ళ ఫిక్స్‌డ్ డిపాజిట్లనీ నాలుగోఏడాది చివరకొచ్చే మొత్తంతో కలపాలి’’’.
‘‘వెరీ గుడ్. నువ్వు నా శిష్యుడవయ్యా. ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ దగ్గర లక్షపైనే ఉంటుంది. ప్రాణంమీదకు వస్తే తప్ప తీయకూడదు. నీ దగ్గర ఆ మొత్తం ఉందని నీకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. ఆఖరికి మీ తల్లిదండ్రులకు కూడా. పనికిమాలిన స్నేహితులు అస్తమానూ అప్పులు అడుగుతూ ఉంటారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు వద్దు. పెట్టుకోకు.
ఎందుకు చెబుతున్నానంటే, ఈ లోకంలో బతకడానికి కావలసిన కనీస అవసరాలు తిండి, గూడు, గుడ్డ. అవి కావాలంటే డబ్బు వుండాలి. రేపు ఏదో అనుకోని ఖర్చు రావచ్చు. ఆరోజు నీకు అర్జంటుగా ఒక లక్ష కావాల్సి వస్తుంది. ఏ స్నేహితుడిని అడిగినా ఐదో పదో అంటే సర్దుతాము గానీ లక్ష లేదని ఇవ్వరు. ఉన్నా ముఖం చాటేస్తారు. లేదా వడ్డీ అంటారు. అదే నేను చెప్పినట్టు చేసావనుకో, నువ్వు ఎవరినీ అడిగి లేదు అనిపించుకోనక్కర్లేదు. పైగా నా వెనక ఒక లక్ష ఉంది అనే ఆత్మస్థయిర్యం నిన్నుమరింత కష్టపడే పనిచేసేలా చేస్తుంది. ఏమంటావ్?’’
‘‘మీకు చాలా థాంక్స్ సర్. ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం మీ దగ్గర చదువుకున్న ఒక విద్యార్థికి ఆత్మీయతతో ఇలా చెప్పగలగడం చాలా ఆనందంగా ఉంది సర్. అందుకే మీరంటే నాకు ఇష్టం సర్’’
‘‘కబుర్లు చెప్పడం, నాలా సలహాలు ఇవ్వడం చాలా తేలిక. ఇది వాస్తవ రూపం దాల్చిన నాడు నాకు చెప్పు. అపుడు నిజంగా సంతోషిస్తాను’’.
‘‘మీరే చూస్తారుగా సర్’’
***
ఆశ్చర్యంగా మరునాడు మా ఇద్దరి మొత్తం సంభాషణ మళ్లీ టెస్ట్ మెసేజ్‌గా వచ్చింది దయానిధికి.
‘‘అదేంటయ్యా’’ ఇందులో మీ అక్క నెంబర్ ఉందేంటి?’’ అడిగాడు దయానిధి.
‘‘ఇదంతా మా అక్కడు పంపాను సర్. సార్ సలహాబాగుంది. అని అమ్మకు చూపిస్తుంటే మా నాన్నగారు వచ్చి చూసారు సర్’’
‘‘నేను ఎవరికీ తెలియకూడదు అన్నానుగా’’
‘‘మా ఇంట్లో నలుగురి మధ్య ఏ రహస్యాలు ఉండవు సర్. ఐయామ్‌ఇ సారీ సర్. ఈ విషయం మీకు ముందుగా చెప్పకపోవడం నా తప్పే సార్’’.
దాని పర్యవసానంగానే పరబ్రహ్మంగారి దగ్గరనుంచి వచ్చిన ఉత్తరం.
ప్రస్తుతానికి శేఖరం తానే రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతీరోజూ శుభోదయం, శుభరాత్రి సందేశాలు పంపుతూనేన్నాడు. అతను చాట్ చెయ్యడానికి ప్రయత్నించినా తానూ రిప్లై ఇవ్వకపోవడంతో అతనూ తగ్గించాడనే చెప్పాలి.
శేఖరం అక్క వివాహ శుభలేఖను భార్యాభర్తలిద్దరూ స్వయంగా వచ్చి ఇచ్చి వెళ్లినా ఎందుకో తనకు వెళ్లాలనిపించక వెళ్లలేదు. శుభకాంక్షలు పంపాడు అంతే.
సుమారు పధ్నాలుగు నెలల తరువాత పరబ్రహ్మానికి కారు ప్రమాదంలవో కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయని శేఖరం మెసేజ్ పెట్టాడు. బాగుండదని దయానిధి కనకదుర్గ దర్శనం చేసుకుని ఆ కుంకుమ, ప్రసాదం తీసుకుని గుంటూరు శేఖరం ఇంటికి వెళ్లాడు.
‘‘రండి మాస్టారు. ఎంతో శ్రమపడి వచ్చారు. రండి.. రండి’’ సాదరంగా ఆహ్వానించారు దయానిధిని చూస్తూనే ఆహ్వానించారు పరబ్రహ్మం దంపతులు. తానే స్వయంగా పరబ్రహ్మం నుదుట బొట్టు పెట్టి అమ్మవారి ప్రసాదం తినిపించాడు దయానిధి.
భార్యాభర్తలిద్దరూ వారం రోజుల క్రితం ఒక పెళ్లికి వెళ్లి వస్తుంటే ఎవరో కారువాడు వెనకనుంచి వేగంగా ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో పరబ్రహ్మం భార్య ఎగిరి దారిపక్కన ఒతె్తైన గడ్డితో వున్న పొదలో పడటంవల్ల కముకు దెబ్బలు మాత్రమే తగిలాయి గానీ, డ్రైవ్ చేస్తున్న పరబ్రహ్మంగారిని బైక్‌తో సహా ఇరవై మీటర్లుదూరం ఈడ్చేయడంతో ఆయనకు కాలు, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయట. మొత్తం లక్షకు పైగా అయిందట. మరో మూడు నెలలు రెస్ట్ తీసుకుంటే మామూలుగా నడవవచ్చని, అయితే మరో ఏడాది వరకు బైక్ డ్రైవ్ చెయ్యకూడదని డాక్టర్లు చెప్పారట. అమ్మాయి అల్లుడు దగ్గరలోనే ఉండటంతో రోజూ అమ్మాయి భర్త ఆఫీసుకు వెళ్ళగానే వచ్చి సాయంకాలం వరకూ ఉండి వెళ్తుందట.
‘‘శేఖరం ఎలా ఉన్నాడండీ’’ అడిగాడు దయానిధి.
‘‘వాడికసలు రెస్ట్ లేదు సర్. ఉదయం ఏడు గంటలకు వెళ్లినవాడు రాత్రి పది దాటాకా వస్తాడు. వచ్చాకా మళ్లీ లాప్‌టాప్‌లో ఏదో పనిచేస్తూ ఏ రెండింటికో పడుకుంటాడు సర్. చెబితే వినడు. ఏమైనా అంటే అప్పులు తీరాలిగా నాన్నా.. అంటాడు. ఆనాడు మీరు సలహా ఇచ్చినట్టుగ చేసి ఉంటే బాగుండేది. మిమ్మల్ని చిన్నబుచ్చుతూ ఉత్తరంరాసిన నా అవివేకాన్ని మన్నించండి’’ అంటూ వాపోయాడు పరబ్రహ్మం.
‘‘శేఖరాన్ని అడిగానని చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను’’ వారెంత బ్రతిమాలినా ఉండకుండా ఇంటికి చేరుకున్నాడు.
నాలుగు రోజుల్లో శేఖరం నుంచి ఉత్తరం వచ్చింది. చదవసాగాడు దయానిధి.
‘‘పూజ్యులైన మాస్టారికి, మీ శిష్యుడు శేఖరం హృదయ పూర్వక నమస్కారాలు.
‘దు’రాలోచనకీ, ‘దూ’రాలోచనకి అర్థం చేసుకుంటే చాలా తేడా ఉంటుందని మీరు ఒకసారి క్లాసులో చెప్పారు. మీరు ‘దూ’రాలోచనతో చెప్పిన మంచి విషయాన్ని నేను ‘దు’రాలోచన చేయబట్టే ఈ రోజు దాని ఫలితం అనుభవిస్తున్నాను సర్. నేను సంపాదన మొదలెట్టాక మీ సూచన పాటించకుండా నేను నా ఖర్చులకు సరిపడా డబ్బు ఉంచుకుని మిగతా జీతం అమ్మకు పంపుతూ మీరు చెప్పినట్టుగా కనీసం రెండువేలు దాచమని కోరాను.
‘నిన్ను ఇంజనీరింగ్ చదివించినందుకు, అక్కకు పెళ్లిచేసినందుకు, ఎంతో ఖర్చు అయింది. అవన్నీ మీ నాన్న ఉద్యోగంలో లోన్‌లు పెట్టి ఖర్చుపెట్టారు. ఇపుడు ఆ డబ్బు కట్టకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అయినా డబ్బు ఎలా దాయాలో మాకు తెలుసు’’ అని అమ్మ చెప్పింది సర్. వాళ్ళు నిజంగా రెండు వేలు దాస్తున్నారనుకున్నాను. కానీ వాళ్ళ అప్పులు వాళ్లు తీర్చుకుంటున్నారని అర్థం అయింది. జీతం వచ్చిన మొదటినెల నుంచి మీరు చెప్పినట్టుగా దాచినా నా దగ్గర ఇరవై ఐదువేలు ఉండేవి. నా వంతు సాయం చేసినట్టూ ఉండేది. నాన్నగారి ఆపరేషన్‌కు లక్షా పదమూడు వేలు అయింది. ఈ డబ్బంతా మళ్లీ బయట వడ్డీకి తెచ్చారట.
మనిషి ఎంత సంపాదించినా ఏదో అవసరం వస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ పని జరగాలన్నా డబ్బే ముఖ్యం కాబట్టి. అందుకే ఎన్ని ఖర్చులున్నా సంపాదించిన దాంట్లో పదోవంతు మీ పేర దాచుకోండి. అని మీరెంతోమందికి చెప్పగా విన్నాను. నిజంగా అది పాటించిన వారందరూ అదృష్టవంతులు సర్.
పెద్దల మాట చద్దిమూట అని ఎందుకంటారో ఇపుడు నాకు బాగా అర్థం అయింది. అందుకే రోజు ఆఫీసు సాయంత్రం ఆరు గంటలకే అయిపోయినా మరో మూడు గంటలు హోమ్ ట్యూషన్స్ చెబుతూ మరో ఎనిమిదివేలు అదనంగా సంపాదిస్తూ కష్టపడుతున్నాను సర్. ఈవిషయం ఇంట్లో తెలియదు. ఆ డబ్బు నా పేరుమీదుగా రెండు నెలల నుంచి ఆర్‌డి కడుతున్నాను సర్. ఇపుడు నా దగ్గర నా కష్టార్జితం పదహారు వేలకుపైగా ఉంది సర్. ఇలా నా వివాహం అయ్యేంతవరకు కష్టపడతాను సర్. మీ మాట వినని ఫలితంగా ఇది నాకుగా నేను విధించుకున్న శిక్ష సర్.
ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్చే ముందు ‘మావాడి జీవితానికి పునాది మీరే వెయ్యాలి’ అనే తల్లిదండ్రులు ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు వాడు ప్రయోజకుడు అయ్యాక వాడిని అలా తయారుచేసిన గురువు ఇచ్చిన సలహాను పాటించకపోవడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాదు సర్. ఏది ఏమైనా మిమ్మల్ని కించపరుస్తూ నాన్నగారు మీకు రాసిన ఉత్తరానికి నేను క్షమార్పణ చెప్పుకుంటున్నాను సర్. త్వరలో మిమ్మల్ని కలుస్తాను సర్. ఎప్పటిలా నాతో చాట్ చేస్తూ మీ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా నా ప్రార్థన సర్.
నమస్కారాలతో
మీ శిష్యుడు శేఖరం
శేఖరానికి తన పట్ల గల గురుభక్తికి తేలికపడిన మనసుతో ఆశీర్వదించాడు దయానిధి.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-కొత్తపల్లి ఉదయబాబు 9441860161,, 9533756075