S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అదృష్టదేవత

‘అదృష్టం! ప్రపంచంలో అన్నిటికీ ఆధారం అదే. ఐదేళ్ల క్రితం నేను ఇక్కడి యూనివర్సిటీలో గౌరవనీయమైన ప్రొఫెసర్ని. ఈ రోజు అదృష్టదేవత చిన్నచూపు వల్ల..’ తాగి ఉన్న ప్రొఫెసర్ ఎక్కిళ్లు రావడంతో ఆగాడు.
‘మీరేం చెప్తున్నారో నాకు తెలుసు’ ఫ్రాంక్ చెప్పాడు.
ప్రొఫెసర్ జేబులోని అర్ధ డాలర్ బిళ్ల తీసి గాల్లోకి విసిరేసి పట్టుకుని అడిగాడు.
‘అచ్చా? బొమ్మా? దీన్ని టేబుల్ మీద పడేస్తే, ఎటువైపు పడుతుందో ఎవరు చెప్పగలరు? నేను చెప్పలేను. నువ్వూ చెప్పలేవు. వెయిటర్ కూడా చెప్పలేడు. మేథమెటీషియన్ ఏదైనా పడే అవకాశం సగం సగం అని చెప్తాడు. ఇదే విశ్వరహస్యం. అదృష్టం మనకి ఏం తెస్తుందో ముందుగా ఊహించలేం’
ఆయన నాణేన్ని కింద పడేస్తే అది ఓసారి ఎగిరి అంచు మీద నిలబడింది.
‘అదృష్టం! మన చుట్టూ అది పని చేస్తూ మన జీవితాలని శాసిస్తోంది. బూత్ తుపాకీ పేల్చినప్పుడు లింకన్, బూట్‌లేస్ కట్టుకోడానికి వంగి ఉంటే? తన నావలో తిరుగుబాటు జరిగినప్పుడు కొలంబస్‌కి పక్షులు కనిపించకపోతే? మనమంతా ఫార్చునా దేవతకి బాధితులం. రోమన్స్ అదృష్ట దేవతని ఆ పేరుతో పిలిచేవాళ్లు. పూర్వీకులు ఈ అదృష్ట దేవత ప్రాముఖ్యతని గ్రహించారు. ప్రతీ జూన్ ఇరవై నాలుగున ఆమె గౌరవార్థం ఓ ఉత్సవాన్ని జరిపేవారు. ఇద్దరికి చెరో వంద డాలర్లు ఇచ్చి, కొంత భూమి కొనిస్తే, ఆర్నెల్ల తర్వాత ఒకడు ఆకలి బాధకి చచ్చి కనిపించాడు. మరొకడి భూమిలో ఆయిల్ పడి పది లక్షల డాలర్లు సంపాదించాడు. వీధిలో నడిచే వ్యక్తికి బాగా డబ్బున్న పర్స్ కనిపిస్తే, మరో వ్యక్తి నెత్తి మీద ఊడిన ఇటుకరాయి పడచ్చు. అదృష్టదేవతకి చాంచల్యం ఎక్కువ. ఎవరికి తెలుసు? ఆ చాంచల్యం వల్లే ఆమె దృక్పథం మారి నీకు సంపద ఆనందాన్ని ఇవ్వచ్చు’
‘ఇది పిచ్చి’ ఫ్రాంక్ చెప్పాడు.
‘నువ్వు హేతువాదంతో మాట్లాడుతున్నావు ఫ్రాంక్. అదృష్టాన్ని ఆకర్షించే రహస్యం నేను తెలుసుకోగలిగితే నేను ఇంకేమీ కోరను. అదృష్టదేవత స్ర్తి కాబట్టి అర్థం చేసుకోవడం కష్టం’
‘నా అదృష్టాన్ని మార్చే ఓ ఆడది తారసపడినా బావుండు’ ఫ్రాంక్ గొణిగాడు.
ఫ్రాంక్ లేచి రౌలెట్ గదిలోకి వెళ్లాడు. ఆ గది రద్దీగా ఉంది. అతనికి ఎర్రటి
ఈవెనింగ్ డ్రెస్‌లోని ఒక యువతి కనిపించింది. ఆమె ఒంటి రంగు పాలరాతిలా తెల్లగా, జుట్టు బొగ్గులా నల్లగా ఉంది. ఫ్రాంక్ పక్క నించి వెళ్తూ ఆమె అతన్ని చూసి నవ్వింది. ఫ్రాంక్ చాలాకాలం తర్వాత ఓ ఆడదాని ఆకర్షణలో పడ్డాడు. ఆమెని అనుసరించాడు. ఆమె ఆ గదిలోంచి బయటికి వచ్చి ఇంకో గదిలోకి వెళ్లింది. అది ఇంకా పెద్ద గది. మూడు పెద్ద రౌలెట్ టేబుల్స్, నాలుగు పూల్ టేబుల్స్ ముందు దాదాపు ఏభై మంది దాకా ఉన్నారు. సిగరెట్ పొగ గదంతా అలముకుని ఉంది. చక్రం తిరిగే శబ్దం తప్ప గదంతా నిశ్శబ్దంగా ఉంది.
ఫ్రాంక్ ఆమెని అనుసరించి ఓ రౌలెట్ టేబుల్ దగ్గరికి వెళ్లాడు. ఖరీదైన దుస్తులు ధరించిన ధనవంతులు అతనికి దాని చుట్టూ కనిపించారు. ఓ వైపు తక్కువ చిప్స్, మరోవైపు ఎక్కువ చిప్స్ ఉన్నాయి. చక్రం తిరగడం ఆగాక ఓ దొంతరలోంచి చిప్స్ మరో దొంతరలోకి వెళ్తున్నాయి. కొందరి చిప్స్ వెయ్యి డాలర్ల పైనే ఉండి ఉంటాయని ఫ్రాంక్ అనుకున్నాడు. తెల్ల చిప్స్ ఒక డాలర్, ఎరుపు పది డాలర్లు, నీలం రంగు చిప్స్ ఇరవై డాలర్లు.
గెలుస్తున్నా, ఓడిపోయినా అందరి మొహాల్లో ఎక్సైట్‌మెంట్ కనిపిస్తోంది. ప్రతీ వారు చక్రం తిరిగినప్పుడల్లా అది ఏ సంఖ్య మీద ఆగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.
ఫ్రాంక్ ఆమె వైపు చూశాడు. ఆడకుండా ఆమె కూడా అతనిలా ఆట వైపు చూస్తోంది. కానీ ఆమెలో ఎలాంటి ఎక్సైట్‌మెంట్ లేదు. ఆమె అక్కడ ఉన్న అందరికన్నా అందగత్తె అయినా విగ్రహంలా కదలకుండా నిలబడి చూస్తున్న ఆమెని ఎవరూ గమనించడం లేదు. అసలు ఆమె అక్కడ ఉన్న స్పృహే కొందరిలో లేదు. ఆమెని చూస్తూంటే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో ముందే తెలిసినట్లుగా ఉంది. తన దగ్గర ఆఖరి చిప్ మిగిలి ఉంటే బావుండేది అని ఫ్రాంక్ అనుకున్నాడు.
అకస్మాత్తుగా ఆమె ఫ్రాంక్ వంక చూసింది. తర్వాత అతని పాదాల వైపు చూసింది. ఫ్రాంక్ కూడా ఆమె చూసిన వైపు చూస్తే తన కాళ్ల మధ్య ఓ నీలంరంగు చిప్ కనిపించింది. ఎవరో పారేసుకున్న దాన్ని అతను వంగి తీసుకున్నాడు. దాన్ని ఇరవై డాలర్లకి మార్చుకోవచ్చు.
‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్. మీ పందేలు కాయండి’ కేషియర్ గట్టిగా చెప్పాడు.
‘ఇరవై డాలర్లు దొరకడం అదృష్టం. ఆ అదృష్టం కొనసాగితే అది నలభై అవచ్చు. ఎరుపురంగు మీద పెట్టాలా? నలుపా?’ మళ్లీ ఆమె వైపు చూశాడు. ఆమెది ఎర్ర డ్రెస్ కాబట్టి ఎరుపు మీద ఉంచాలా? ఆమె కళ్లు, జుట్టు నల్ల రంగు కాబట్టి నలుపు మీద ఉంచాడు. ఐతే ఆ చిప్ అతని చేతిలోంచి దొర్లి నంబర్ ముప్పై మూడు మీద ఆగింది. అతను దాన్ని నలుపు మీదకి జరపడానికి వంగాడు. కానీ ఉద్యోగి చక్రాన్ని తిప్పేశాడు. తన అదృష్టం చేజారిందని ఫ్రాంక్ భావించాడు. చక్రంతోబాటు అందులోని వెండి బాల్ గుండ్రంగా తిరిగి తిరిగి ఆగింది.
‘ముప్పై మూడు బ్లాక్’ కేషియర్ బాల్ ఆగిన వైపు చూసి చెప్పాడు.
తను గెలిచాడు!
ఫ్రాంక్ వైపు బల్ల మీది చిప్స్‌ని కేషియర్ తోసేశాడు. ఆ విధంగా ఫ్రాంక్ అదృష్టం ఆరంభమైంది. ఎర్ర దుస్తుల్లోని ఆమె అతన్ని చూసి నవ్వింది. ఈసారి సగం చిప్స్‌ని ఎరుపు మీద ఉంచాడు. మళ్లీ గెలిచాడు. మరోసారి ఎరుపు మీద పందెం కాశాడు. మళ్లీ గెలిచాడు. వరుసగా మూడుసార్లు!
ఎర్ర గౌనులోని ఆమె ఆ టేబుల్ నించి వెళ్లిపోవటంతో ఫ్రాంక్ తన చిప్స్‌ని తీసుకుని కేషియర్‌కి ఇచ్చాడు. కేషియర్ అతనికి మూడు వేల నాలుగు వందల ఇరవై డాలర్లు ఇచ్చాడు. వాటిని జేబులో ఉంచుకుని రద్దీగా ఉన్న మనుషుల మద్య ఆమె ఎక్కడుందో తెలుసుకోడానికి వేగంగా నడిచాడు. ఆమెకి కొంత ఇచ్చి థాంక్స్ చెప్పాలని కూడా అనిపించింది. తలుపులోంచి బయటికి వెళ్తున్న ఆమెని చూసి గట్టిగా అరిచాడు.
‘ఆగండి. ఒక్క నిమిషం’
‘ఎవర్ని?’ తలుపు తెరిచిన ఉద్యోగి అడిగాడు.
‘ఇందులోంచి బయటికి వెళ్లిన ఆమెని’
‘ఎవరూ వెళ్లలేదే?’ అతను ఆశ్చర్యంగా చెప్పాడు.
ఫ్రాంక్ వేగంగా బయటికి వెళ్లాడు. ఆమె తాజా గాలి కోసం నిలబడిందని గ్రహించి చెప్పాడు.
‘్థంక్స్! మీరు నాకు అదృష్టాన్ని తెచ్చారు’
ఆమె వౌనంగా నవ్వింది.
‘ఇది మీ వంతు’ కొన్ని నోట్లని ఆమెవైపు చాపి చెప్పాడు.
ఆమె తీసుకోలేదు.
‘తీసుకోండి. మీకు చెవుడా? తీసుకోండి’
బహుశా ఆమె ధనవంతురాలై ఉండచ్చు. తనిచ్చేది చిన్న మొత్తం అవచ్చు అనుకున్నాడు. ఐతే ఉంగరాలు కానీ, ఆభరణాలు కానీ ఆమె ఒంటి మీద లేవు. ఆమె కదలగానే ఆమెని అనుసరించాడు. ఆమె ఆశ్చర్యంగా అతను బస చేసిన హోటల్‌లోకే వెళ్లింది. అతని మురికి గదిలోకి అతన్ని అనుసరించింది.
అప్పటికే ఫ్రాంక్‌కి ఇరవై నాలుగ్గంటలుగా నిద్రలేదు. తరచూ ఆల్కహాల్ కూడా తాగుతున్నాడు. కూర్చోకుండా టేబుల్స్ దగ్గర నిలబడే చూస్తున్నాడు. దాంతో అతను నిద్రని ఆపుకోలేక పోయాడు. ఎంత ప్రయత్నించినా మెలకువగా ఉండలేకపోయాడు.
* * *
రాత్రంతా అతను ఆమె ఒళ్లో తల పెట్టుకుని నిద్రపోయి ఉంటాడు. ఆమె నిద్రపోకుండా అలా కూర్చుని ఉండి ఉంటుంది. ఎందుకంటే, ఉదయం అతనికి మెలకువ వచ్చినప్పుడు ఆమె అతన్ని చూసి నవ్వింది. అతను గడ్డం గీసుకుని స్నానం చేసి వేరే దుస్తులు తొడుక్కునే దాకా అతని వంక నవ్వుతూ చూస్తూనే ఉంది. ఆమెని పలకరించినా జవాబు చెప్పలేదు. నవ్వుతూ అతని కోసం వేచి ఉంది. అతను కోటు తొడుక్కుని, టోపీ పెట్టుకుని ఆమెతో చెప్పాడు.
‘పద. నాకు ఆకలిగా ఉంది’
ఎప్పటిలా ఫ్రాంక్ డాలర్ లంచ్ హాల్‌లోకి వెళ్లబోయి, తన జేబులో మూడు వేలు ఉన్నాయని గుర్తొచ్చి మెయిన్‌రోడ్‌లోని ఖరీదైన రెస్ట్‌రెంట్‌కి వెళ్లాలనుకున్నాడు. కానీ తన వొంటి మీద దుస్తుల్ని చూస్తే లోపలికి అనుమతించరు అనిపించింది.
‘ఒక్క నిమిషం. నేను షాపింగ్ చేయాలి’ ఆమెతో చెప్పాడు.
ఆమె నవ్వి లేచి ఉంది. అతని పాతిక డాలర్ల టోపీతో సహా రెడీమేడ్ దుస్తులు, కొత్త బూట్లని నూట ముప్పై డాలర్లకి కొన్నాడు. సేల్స్‌మేన్ ఫ్రాంక్‌తో మర్యాదగా ప్రవర్తించాడు. కానీ ఆమెని పట్టించుకోలేదు. తర్వాత రెస్ట్‌రెంట్‌లోని వెయిటర్ కూడా ఒకే మెనూ కార్డుని ఒకే గ్లాసులో నీళ్లని ఇచ్చాడు తప్ప ఆమెని పట్టించుకోలేదని గుర్తించాడు. ఆమెకి మెనూ కార్డుని ఇవ్వబోతే ‘ఏం తినను’ అన్నట్లుగా తలని అడ్డంగా ఊపింది. దాంతో అతను ఒక్కడే తిన్నాడు. మాట్లాడని, నిద్రపోని, తినని ఆమె తన దగ్గరే ఉంది. తన జేబులో మూడు వేల డాలర్ల దాకా ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? ఆమె తనకి అదృష్టాన్ని తెచ్చింది. కానీ కొంత చెడ్డతనం కూడా ఉండి ఉండాలి. తను ఇబ్బందిలో పడే ముందే ఆమెని వదిలించుకోవడం మంచిది అనుకున్నాడు. ఆమె అతన్ని చూసి నవ్వింది. ఫ్రాంక్ ఈసారి నవ్వలేదు. లేచి రెస్ట్‌రెంట్‌లోంచి బయటికి వెళ్తూంటే ఆమె అతన్ని అనుసరించింది. సాధారణంగా ఉదయం పార్క్‌లోని బెంచ్ దగ్గరికి వెళ్తూంటాడు. కానీ ఆ రోజు ఆ పార్కుని దాటి అవతలికి వెళ్లాలనుకున్నాడు. ఆమె అతని చేతిని పట్టుకుని ఆపింది. చూస్తే ఆమె ఓ షాపు పేరుని చదువుతోంది. అక్మే మెటల్ ప్రొడక్ట్స్ కంపెనీ. ఇంకొక బోర్డుని కూడా ఆమె చూస్తోంది. మెన్ వాంటెడ్.
అతను ఇంకో అడుగు వేయబోతే ఆమె అతన్ని ఆపింది. చేత్తో ఆ బోర్డునే చూపించింది. ఆమె ఉద్దేశం ఏమిటి? వెళ్లి ఉద్యోగం అడగమనా? అడగచ్చు. తను ఉద్యోగం చేసింది ఆ పరిశ్రమలోనే. కానీ ఆమెకిది ఎలా తెలుసు? తన జేబులో అంత డబ్బుండగా తను ఉద్యోగంలో చేరతాడని ఎలా అనుకుంది. ఫ్రాంక్ తల అడ్డంగా ఊపాడు.
ఆమె గట్టిగా అతని చేతిని పట్టుకుని నవ్వుతూనే ఉంది.
‘సరే. ప్రయత్నం చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు’
ఆమె తల ఊపి తలుపు బయట ఆగిపోయింది. అతను లోపలికి వెళ్తూంటే ఆమె మళ్లీ నవ్వింది.
లోపలికి వెళ్లిన ఫ్రాంక్ కూడా గట్టిగా నవ్వాడు. ఆ షాప్‌కి వెనక తలుపు ఉంది. అందులోంచి జారుకోవాలని అనుకున్నాడు. ఆ షాప్‌లోని ఒకతను ఫ్రాంక్‌ని చూసి అడిగాడు.
‘నువ్వు మెకానిక్‌వా? మెటల్ వర్కర్‌వా?’
‘కోర్ మేకర్’ ఫ్రాంక్ యాంత్రికంగా చెప్పాడు.
‘ఐతే అప్లికేషన్‌ని నింపు. ఆర్డర్ ఉంది. అనుభవం గల వర్కర్స్ ఈ ఊళ్లో దొరకరని మా బాస్ ఏడుస్తున్నాడు’
తనకి తెలియకుండానే అతను ఇచ్చిన పెన్ను, అప్లికేషన్ ఫాంలని అందుకున్నాడు.
అకస్మాత్తుగా ఆ షాప్‌లోకి ఇద్దరు ముఖాలకి ముసుగుతో వచ్చి రివాల్వర్స్ చూపించి అరిచారు.
‘చేతులెత్తండి. కదలకండి’
అంతా చేతులెత్తారు.
‘వెంటనే గోడ వైపు ముఖం పెట్టి నించోండి’
ఫ్రాంక్ తన ముందు గోడకీ, తనకీ అడ్డుగా ఉన్న ఇనుప తీగల చెత్త డబ్బాని కాలితో తన్నాడు. అది వెళ్లి ఓ దొంగ చేతికి తగిలింది. అదే సమయంలో బేలన్స్ తప్పిన ఫ్రాంక్ కింద పడబోతూ ఊతం కోసం చాపిన చెయ్యి సమీపంలోని ఇంకో దొంగ మెడని పట్టుకుంది. మొదటి దొంగ చేతిలోంచి జారిపడ్డ రివాల్వర్ కాళ్ల దగ్గర కనపడగానే వంగి అందుకున్నాడు. రివాల్వర్ పిడితో ఇద్దరు దొంగల నెత్తి మీద బాదాడు. షాప్‌లోని ఉద్యోగి అలారం బటన్‌ని నొక్కాడు.
తర్వాత అరగంట అక్కడ పోలీసులతో పత్రికా విలేఖరులతో హడావిడిగా గడిచింది. అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేకుండా మర్నాటి నించి ఉద్యోగంలో చేరమని అక్కడికి వచ్చిన దాని యజమాని ఫ్రాంక్‌ని కోరాడు. ఫ్రాంక్ వెనక గుమ్మంలోంచి వెళ్లాలన్న సంగతి మర్చిపోయి వచ్చిన గుమ్మంలోంచి బయటికి వెళ్లాడు. అతని కోసం వేచి ఉన్న ఆమె అతన్ని చూసి నవ్వింది.
ఇందాక ప్రొఫెసర్ చెప్పినట్లు అంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. రౌలెట్ చక్రం తన పందెం కాసిన స్థానంలో ఆగడం, వేస్ట్ బాస్కెట్‌ని తన్నడం, తను ఆ దొంగ మెడని పట్టుకోవడం, ఉద్యోగం రావడం అంతా అదృష్టం వల్లే జరిగింది అనుకున్నాడు.
ఆమె నవ్వి నడుస్తూ తనని అనుసరించమని సైగ చేసింది. అతను ఓ సూట్‌కేస్‌ని కొనుక్కుని ఫర్నిష్డ్ సింగిల్ బెడ్‌రూం హోటల్ గదిని నెలకి రెండు వందల డాలర్లకి అద్దెకి తీసుకున్నాడు. బెల్ బాయ్ ఆమెని పలకరించనే లేదు. వాడికి అర డాలర్ టిప్ ఇచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఆమె నిశ్చలంగా నిలబడి నవ్వుతూ అతని వంకే చూడసాగింది. పాల రాతి నించి చెక్కిన విగ్రహంలా కనురెప్పలు కూడా ఆర్పడంలేదు.
‘ఇక్కడే ఉండు. నేను వెళ్లి పేపర్ కొని తెస్తాను’
ఆమె నవ్వింది తప్ప అతన్ని ఆపలేదు. హోటల్ బార్‌లోకి వెళ్లి విస్కీని ఆర్డర్ చేశాడు. అది రుచిగా ఉంది. మరో పెగ్ కూడా తీసుకున్నాడు.
మూడో పెగ్ తాగాక కానీ అతని ఆ ఎర్ర దుస్తుల్లోని ఆమె అదృష్ట దేవత అన్నది తట్టలేదు. కానీ ప్రొఫెసర్ చెప్పినట్లు నిజంగా అదృష్ట దేవతలు ఉంటారా? కానీ ఆయన చెప్పినట్లు కొందరు ఏది చేపట్టినా విజయమే. కొందరికి అపజయమే. అదృష్ట దేవత తన పక్షాన ఉంది. మరో పెగ్ తాగుతూ తనకి ఏమేమి కావాలో ఆలోచించాడు. ఇంగ్లీష్ కార్లు, అడవిలో ఇల్లు, చేపలు పట్టడానికి ప్రైవేట్ సరస్సు, బంగారు జుట్టుగల ప్రేయసి. ఎదురుగా సన్నగా, పొడుగ్గా ఉన్న బంగారు జుట్టు యువతి నోట్లో సిగరెట్‌తో కనిపించింది. బహుశా అదృష్ట దేవతే ఈమెని కావాలని తన కోరిక తెలిసి పంపిందేమో! అంతే అయుంటుంది.
‘మీరు నాతో కలిసి తాగుతారా?’ ముందుకి వంగా మర్యాదగా అడిగాడు.
ఆమె అంగీకరించింది. ఆమె పేరు మార్గాట్. మార్గరెట్ కాదు. మార్గాట్. టి. సైలెంట్. మార్గో అనాలి.
గదిలోని అదృష్ట దేవత ఏమీ తినలేదు అని గుర్తొచ్చింది. బహుశా అదృష్టం ఏమీ ఖర్చు చేయకుండా ఉచితంగా వస్తుంది అనుకుంటా. తనని అదృష్టం ఎలా వరించిందో ఫ్రాంక్ ఉత్సాహంగా మార్గోకి చెప్పాడు. తన గదికి ఆమెని ఆహ్వానించాడు. వెయిటర్ సగం మిగిలిన బాటిల్‌ని కవర్లో వేసిచ్చాడు. ఫ్రాంక్ తూలుతూండటంతో ఆమె దాన్ని పట్టుకుంది. తలుపు తెరిచి లోపలికి వెళ్లబోయే ముందు ఆమెని బయట ఉండమని లోపలికి వెళ్లాడు. ఎర్ర గౌన్‌లోని ఆమె ఇంకా ఉంది. అతన్ని చూసి నవ్వింది. తను వెళ్లినప్పటి నించి ఆమె అంగుళం కూడా కదల్లేదని గ్రహించాడు.
‘్థంక్స్! ఇంక నువ్వు వెళ్లు. లేదా ఆమె నిన్ను చూస్తుంది. మాకు ఏకాంతం కావాలి. అర్థమైందా?’
ఆమె విననట్లుగా అలాగే కూర్చుంది. అతను ఆమెని బలవంతంగా పైకెత్తి తలుపులోంచి బయటికి తోశాడు. ఓ విగ్రహాన్ని బయటికి నెడుతున్నట్లుగా అతనికి అనిపించింది. ఆమె అతని వంక మామూలుగా చూసింది. కానీ ఈసారి నవ్వలేదు. అతను చిన్నగా నవ్వి తోస్తూ చెప్పాడు.
‘వెళ్లు. రేపు ఉదయం మళ్లీ రా’
ఆమె వెళ్లిపోయింది.
మార్గని లోపలికి వస్తూ అడిగింది.
‘ఎవరితో మాట్లాడుతున్నావు? నీలో నువ్వా?’ అతను జవాబు చెప్పలేదు.
తను పిచ్చివాడు అనుకోకూడదని తను గెల్చుకున్న డబ్బు కట్టలని చూపించాడు. ఆరు పెగ్గులు తాగడంతో అతను ఆ రాత్రి కూడా మెలకువగా ఉండలేకపోయాడు.
* * *
ఫ్రాంక్‌కి ఉదయం మెలకువ వచ్చింది. మార్గో లేదు! డబ్బూ లేదు! సూట్‌కేస్ కూడా లేదు. నేల మీద పడి ఉన్న కోటు జేబులో డాలర్ ముప్పై ఐదు సెంట్లు మాత్రం కనిపించాయి.
హోటల్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు.
‘మీరు తక్షణం గదిని ఖాళీ చేయాలి. గత రాత్రి మీరు పక్క గదిలోని వాళ్లని బాగా డిస్టర్బ్ చేశారు’
‘ఐతే నాకు రిఫండ్ ఇవ్వండి’
‘పోలీసుల్ని పిలుస్తాను. జైలు పక్షి పోలీసుల్ని చూడదల్చుకోడు’ మేనేజర్ అసహనంగా చెప్పాడు.
హేంగోవర్‌తో తల పగులుతూంటే ఫ్రాంక్ గదిలోంచి కిందకి వెళ్లాడు. టీ పాయ్ మీది దినపత్రికలో ‘దొంగతనాన్ని నివారించిన మాజీ ఖైదీ’ అనే హెడ్‌లైన్ కనిపించింది. పత్రికా విలేఖరులలోని ఒకరు పాత దినపత్రికలు తిరగేసి ఈ సంగతి కనుక్కున్నాడు. ఇంక తనకి ఉద్యోగం ఉండదని గ్రహించాడు. ఉన్నదంతా మార్గో దోచుకెళ్లింది. అదృష్టం తన వైపుంటే మళ్లీ ఇవాళ కూడా కొంత గెలుచుకోగలడు.
కానీ అదృష్ట దేవత వెళ్లిపోయింది!
ఫ్రాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి గత రాత్రి ఎర్ర దుస్తుల్లోని ఆమె ఎటు వెళ్లిందో చూశారా అని అడిగాడు. ఆమెని ఫ్రాంక్ తప్ప ఎవరూ చూడకపోవడంతో అంతా అతన్ని పిచ్చివాడిగా భావించారు. ఆమె మొదట కలిసిన బార్‌కి, తనతో తిరిగిన ప్రతీ ప్రదేశానికి వెళ్లి చూశాడు. ఎవరూ ఆమెని చూడలేదని చెప్పారు.
ప్రొఫెసర్ ఆమెని ఏమని చెప్పాడు? ఫార్చునా. చంచలమైన దేవత. చాంచల్యం ఆమెలో కాదు. తనలోనే ఉంది. ఓ బంగారు జుట్టుగల దొంగ వ్యామోహంలో పడి ఆమెని పంపించేశాడు. ఫ్రాంక్ ఆ రోజంతా అన్ని వీధులూ ఎర్రగౌనులోని ఆమె కోసం వెదికాడు. ఎక్కడా కనపడలేదు. అతని కాళ్లు అలసటతో నొప్పులుగా ఉన్నాయి. చీకటి పడుతోంది. అతను నీరసంగా నడుస్తూంటే కొద్ది దూరంలోని ఓ తలుపులోంచి ఎవరో వస్తూ కనపడ్డారు. ఆమె ఎర్ర గౌనులోని అదృష్ట దేవతలా తోచింది. ఆమె వెంట పరిగెత్తుకెళ్లాడు.
ఆమె మార్గో. తన డబ్బుతో జూదం ఆడి పోగొట్టుకొని బయటికి వచ్చింది. అతన్ని చూసి పారిపోబోయింది.
* * *
ప్రొఫెసర్ మళ్లీ తారసపడగానే ఫ్రాంక్ ఫార్చునా గురించి గబగబ చెప్పాడు. తాగి లేని ప్రొఫెసర్ చెప్పాడు.
‘నేనేం చెప్పలేదే? భ్రమ. అదంతా నీ మనసులో ఉంది. బాగా నమ్మింది నిజంలా మనసు భ్రమింపజేస్తుంది’
‘కానీ మీరే అదృష్ట దేవత గురించి నాకు చెప్పారు’ ఫ్రాంక్ చెప్పాడు.
‘ఆ రాత్రి తాగి ఏం వాగానో నాకు గుర్తు లేదు’ ప్రొఫెసర్ గ్లాస్‌ని కిందపెట్టి తలుపు గుమ్మం వైపు చూస్తూ చెప్పాడు.
‘ఒక్క క్షణం. ఆమె ఎవర్ని పిలుస్తోంది?’
‘అక్కడ ఎవరూ లేరు’ ఫ్రాంక్ అటువైపు చూసి చెప్పాడు.
‘ఐతే ననే్న పిలుస్తోంది’ చెప్పి ప్రొఫెసర్ బార్ స్టూలు మీంచి దిగి తూలుతూ తలుపు వైపు నడిచాడు.
ఓ నిమిషంపాటు ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా చేతులు, పెదవులు కదలడం చూశాడు. తర్వాత సరే అన్నట్లుగా తల ఊపి తలుపు తెరిచి పట్టుకున్నాడు. తర్వాత ఆమెతో కలిసి బయటికి నడిచాడు. బహుశా ఎర్ర గౌనులోని ఆమై ఉండచ్చు. అందుకనే తనకి కనపడలేదు. కొత్త మిత్రుడికి ఆమె సహకరించచ్చు. మనిషి నించి మనిషికి జలుబు అంటినట్లుగా తన నించి భ్రమ అంటుకుని ఉండచ్చు. ఇదంతా తమ ఊహే అయుండచ్చు. ఫ్రాంక్ అంతా భ్రమ అనే నమ్మాడు. ఐతే ఏది నమ్మాలో అతనికి ఓ పట్టాన బోధపడలేదు.
తలుపు తెరుచుకుని యూనిఫాంలోని పోలీసులు వచ్చి చెప్పేదాకా ఫ్రాంక్ తను బంగారు జుట్టు గల మార్గోని చంపడం భ్రమే అని భావించాడు.

(రాబర్ట్ బ్లాక్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి